Pages

Thursday, 10 September 2015

వేమన శతకము - 3

అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన
దొడ్డవారి నెల్లఁ దొలఁగఁ జేయుఁ
జెప్పుఁ దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||తేలికబుద్ధి గల అల్పునకు అధికార మిచ్చినచో, గొప్పవారినందరను తొలగించివేయును. వారి గొప్పదనమును గాని, వారివల్ల జరుగు మంచినిగాని గుర్తింపలేడు. చెప్పులు కొరికెడి అలవాటు ఉన్న కుక్క చెఱకు రసములోని మాధుర్యము నెట్లు గ్రహింపగలదు?

*******************************************************************************************  21

అల్పుడైనవాని కధిక భాగ్యము గల్గ
దొడ్డవారిఁ దిట్టి త్రోలఁ గొట్టు
అల్పజాతి మొప్పె అధికుల నెఱుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| నీచుడైన వానికి ఎక్కువ సంపద కలిగినచొ, మంచి వారినందరిని దూరముగా తరిమివేయును. అల్పజాతిలో పుట్టిన మూర్ఖుడు గొప్పవారి గుణములనెట్లు తెలిసోగలుగును?

*******************************************************************************************  22

ఎద్దుకైనఁ గాని యేడాది తెలిపిన
మాట దెలిసినడచు మర్మమెఱిగి
మెప్పె తెలియలేడు ముప్పదేండ్లుకు నైన
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| జ్ఞానము లేని పశువునకైనను ఒక్క యేడు శిక్షణనిచ్చి చెప్పినచో మన మనసులోని భావమును గ్రహించి మాట ప్రకారము నడచును. కాని మూర్ఖుడైనవాడు ముప్పదియేండ్లు శిక్షణనిచ్చినను మనసు నెఱిగి ప్రవర్తింపలేడు. (వాని కెంత చెప్పినను వ్యర్థమని తాత్పర్యము.)

*******************************************************************************************  23

ఎలుకతోలు దెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపెగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||ఎలుకతోలు సహజముగా నల్లగానుడును. దానిని దెచ్చి సంవత్సరము పాటు ప్రతిదినము ఉతికినను దానికి నలుపురంగు పోయి తెల్లబడదు. ప్రాణము లేని కొయ్య బొమ్మను దెచ్చి కొట్టినంత మాత్రమున అది మాటలాడునా? (అనగా దేని స్వభావము అది విడువదని యర్థము. "స్వభావో దురతిక్రమః")

*******************************************************************************************  24

పాము కన్న లేదు పాపిష్ఠిజీవంబు
అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాంపు ఘనులెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కనబడిన వారిని కాటువేసి తన విషముతో చంపెడిపాము గూడ సరియైనవాడు పట్టి శిక్షణ యిచ్చినచో చెప్పినట్లు వినును. కాని దుర్మార్గుని దుర్గుణములు మాంపి సద్గుణములు నేర్పు మహాత్ములెవ్వరును ఇంతవరకు భూమిమీద పుట్టలేదు.

*******************************************************************************************  25

వేముపాలుపోసి ప్రేమతోఁ బెంచినఁ
జేదువిరిగి తీపి చెందఁబోదు
ఓగు నోగె కాక యుచితజ్ఞ డెట్లౌను
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| వేప చెట్టును ప్రేమచూపి పాలు పోసి పెంచినను చేదు రుచి పోయి తీయగా మారదు. అట్లే చెడ్డవాని కెన్ని యుపకారములు చేసినను హితబోధలు చేసినను చెడ్డవాడుగానే యుండునుగాని మంచిచెడ్డలు గ్రహించు ఉత్తముడు కాలేడు.

*******************************************************************************************  26

ముష్టి వేప చెట్లు మొదలంట ప్రజలకుఁ
బరగ మూలికలకుఁ బనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచు డెందులకౌను?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ముష్టి చెట్లును, వేప చెట్లును చేదుగానున్నను మందులకును, మూలికలుగాను ఉపయోగించును. దయాదాక్షిణ్యములు లేని రాతి గుండె గల దుర్మార్గుడు ఎవరి కెందుకు ఉపయోగించును?

*******************************************************************************************  27

పాలుఁబంచదార పాపర పండ్లలో
చాలఁ బోసి వండఁ జవికి రాదు,
కుటిల మానవులకు గుణమేల కలుగురా!
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చాల చేదుగా నుండు పాపరపండ్లలో పాలు పంచదార పోసి యెంత కమ్మగా వండుదమన్నను చేదే తప్ప మంచి రుచిరాదు. అట్లే వంకర బుద్ధిగల దుర్మార్గులలో మంచి గుణములెట్లు కలుగును? (వానిని మార్చుట యెవ్వరి తరముగాదని యర్థము).

*******************************************************************************************  28

పాల నీడిగింటఁ గ్రోలుచు నుండెనా
మనుజులెల్లఁ గూడి మద్య మండ్రు,
నిలువఁ దగని చోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఈడిగవానింటఁ గూర్చుండి పాలు త్రాగినను, చుట్టు నున్న మనుష్యులు మద్యము త్రాగినట్లే చెప్పుకొందురు. అందుచేతనే మనము ఉండకూడని ప్రదేశములలో కనబడినచో అపనిందల పాలు కావలసి వచ్చును.

*******************************************************************************************  29

కాని వాని తోడఁ గలసి మెలగుచునున్నఁ
గానివాని వలెనె కాంతు రతని
తాడి క్రిందఁ బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| యోగ్యతలేని నీచ మానవునితో గలిసి తిరుగుచున్నచో వాని నెవ్వరైనను నీచుడుగానే జమకట్టుదురు. మంచివానినిగా తలపరు. తాటిచెట్టు క్రింద నిలువబడిన పాలు త్రాగినను కల్లు త్రాగినట్లే యనుకొందురు.

*******************************************************************************************  30