Pages

Monday, 30 September 2013

కాషాయ రంగు ప్రయోజనాలు (Benefits of Orange Colour)



భారతీయ సంస్కృతిలో కాషాయ రంగుకి అత్యంత ప్రత్యేకత ఉంది. భారతీయ యతులు, వేదాంతులు కాషాయంబరాలను ధరిస్తారు. కాషాయ వర్ణమంటే అగ్ని వర్ణం. కాషాయ వస్త్రధారియైనవాడు తన శరీరాన్ని అంతే ఆత్మను దహించివేశాడని సూచింపబడుతుంది. తన శరీరమును త్యాగంచేసి, సత్యబలి పీఠానికి సమర్పించుకుని, సమస్త ప్రాపంచిక వాంఛలను దగ్ధం చేశాడని అర్థం. సమస్త ప్రాపంచిక వాసనలు, ప్రాపంచిక తృష్ణలు జ్ఞానాగ్నిజ్వాలల్లో ఆహుతి అయ్యాయని అర్థం.

ఈ అగ్నివర్ణం ఒక దృష్ట్యా మరణాన్ని, వేరొకదృష్ట్యా జీవనాన్ని సూచిస్తుంది. అగ్నిలో జీవ ఉంది. నిత్యచైత్యన ఉంది. శక్తి ఉంది. అగ్నిలో కర్మశక్తి కూడా ఉంది. అరుణ వర్ణ రంజితమయిన కాషాయం సమస్త పశువాంఛలు, స్వార్థవాసన, అగ్నిలో ఆహుతి చేయబడ్డాయని సూచిస్తుంది. మరోవైపు ఆ స్థానం నుండి నవచైత్యనం, నవజ్వాల, నవశక్తి, నవజీవనం ఉదయించిందని సూచిస్తుంది.

కాషాయంబరానికి ద్వందార్థమున్నది. అది అహంకార మరణాన్ని, ఆత్మా చైత్యనమయిన నవ జీవనాన్ని రెంటినీ సూచిస్తుంది. హిందువులు జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తారు. జ్ఞానాగ్నిలో సమస్త ప్రాపంచిక మాలిన్యాలు దహింపబడతాయి. దివ్యాగ్ని, జ్ఞానజ్వాల ప్రజ్వలించాలనేదే కాషాయవర్ణ సందేశం.

మహాసాధుమూర్తి, భారతీయ సనాతన సన్యాసి పుంగవుడు, యావత్ప్రపంచంలో ఎకైక మహాస్వామి అనాది కాశాయంబరదారి సూర్యభగవానుడు. ఉదయ సూర్యుడు. ప్రతిదినం ఉదయ సూర్యుడు అపర సంయాసిలాగా కాషాయవర్ణ వేషంతో మనకు సాక్షాత్కరిస్తాడు. ఈ సాధు పుంగవుడు తన ఉదయారుణ కిరణాలతో సమస్త ప్రకృతిని కాషాయ వర్ణ రంజిటంగా త్యాగశీలిని చేసి, తన బంగారు కాంతులతో ప్రజ్వలింపజేసి, సంధ్యారుణ కాంతులతో మరల త్యాగాభావాన్ని ప్రకృతికి పులుముతాడు. ఇదే హైందవ సన్యాసుల కాశాయంబరధారణలోని విశేషం.

అసలు మన సంస్కృతిలో రంగులకు విశేష ప్రాధాన్యత ఉంది. దానిలో ఎంతో నిగూఢమయిన అర్థం కూడా ఉంటుంది. ఉదాహరణకు పెళ్లి సమయంలో వధూవరులు తెల్లని వస్త్రాలనుధరించాలనే నియమాన్నే తీసుకుంటే, పెళ్లిపీతల మీదకు వచ్చేటప్పుడు వధూవరులు వస్త్రాలు తెల్లగా ఉంటాయి. పెళ్లి తంతు ముగిసే సమయానికి ఆ కొత్త దంపతుల వస్త్రాలు పలు రంగుల సమ్మిళితమయి మనకు కనబడుతుంది. దానర్థం ఆ దంపతుల జీవిం పంచ రంగులమయమయి ఆనందంగా సాగాలనేది ఆ ఏర్పాటు ద్వారా మన పెద్దలు చెప్పదలచుకున్న విషయమని భావించవచ్చు.

ఇంట్లో ఇల్లాలు ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకున్నా, నుదిటిపై ఎర్రటి కుంకుమను తీర్చి దిద్దుకున్నా, చేతులకు రకరకాల గాజులను అలంకరించుకున్నా, ప్రతి విషయం రంగుల ద్వారా ఒక విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంటుంది.

ఇక మన పండుగలు తీసుకుంటే ప్రతి పండుగ ఇక రంగుక కథాకళే. సంక్రాంతి పండుగనాడు ఇంటి ముందు తీర్చిదిద్దే రంగు రంగుల రంగేళిలు, పండుగ రోజున ధరించే రంగురంగుల వస్త్రాలు, ఇక హోలీ పండుగ నాడు చల్లుకునే రంగునీళ్ళు అంటూ మన భారతీయుల జీవనమంతా రంగులమయంగానే సాగుతుంటుందని చెప్పొచ్చు.

ఇక భారతీయ సాధు, యుతులంటే ఆధ్యాత్మిక భావనామయమైన విషయంతో    వస్త్రధారణను కావించారు. అంతేగాని కడుపు కక్కుర్తి కోసం, రైళ్ళలో టిక్కెట్లు లేకుండా ప్రయాణము చేయడం కోసం కాషాయం ధరించిన క్షుద్ర భిక్షుకులు కారు. త్యాగం, చైతన్యము మూర్తీవభించిన అగ్నిరూపమయినదే కాషాయ వర్ణము. అందుకే కాశాయానికి అంట ప్రాధాన్యత. ఎంతయినా అగ్నిరూపుడు సూర్యుడు ధరించే రంగు కదా!