Pages

Monday, 13 January 2014

భోగి పండుగ--విశేషాలు (Importence Of Bogi Festival )

చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పర్వాలలో భోగి ఒకటి. తెలుగువారి ఇతర పండుగలవలె ఇది తిథి ప్రధానమైన పర్వం కాదు.ఈ పండుగ దక్షిణాయనానికి ఆఖరురోజు,అలాగే ధనుర్మాసానికి కూడా చివరి రోజు.


రైతులకు పంటలన్నీ ఈ పండుగ నాటికి దాదాపు ఇంటికి వచ్చేస్తాయి.రైతులకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి కావలసిన విశ్రాంతి దొరుకుతుంది.చేతికొచ్చిన పంటను అనుభవానికి తెచ్చుకుని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలుకలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి అని వచ్చిందేమో ! భోగికి ఆ పేరు రావడానికి ఇంకో విధంగా గూడా చెబుతారు. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్ లో విష్ణుచిత్తుడు అనే పరమ భాగవతోత్తముడు, ఆయనకు తులసివనంలో లభించిన గోదాదేవి అనే కూతురు.గోదాదేవి శ్రీరంగంలోని శ్రీరంగనాథున్ని తప్ప మానవమాత్రులెవరినీ వివాహం చేసుకోనని తండ్రితో చెప్పింది.

తన కోరికను నెరవర్చుకోవడానికి ద్వాపరంలో శ్రీకృష్ణుణ్ణి పొందడానికి గోపికలు నోచిన కాత్యాయనీ వ్రతం మాదిరి తను కూడా చేయప్రారంభిస్తుంది.ఆమె రోజుకొక పాశురంతో(పద్యం) స్వామిని అర్చించేది.తర్వాత నివేదన చేసేది.ఆ మాసం రోజులు నెయ్యిని,పాలను వర్జించి పొంగలిని మాత్రమే స్వీకరించేది.అలా నెలరోజులు ముప్పై పాశురాలతో అర్చించింది. ఆ ముప్పై పాశురాల గ్రంథామే "తిరుప్పావై" .

తిరుప్పావై రచన పూర్తి అయిన ముప్పైయ్యవనాడు శ్రీ రంగనాథుడు ప్రత్యక్షమై ఆమెను తప్పక వివాహం చేసుకుంటానని ఆమెకు మాట ఇస్తాడు.శ్రీరంగం రావలసినదని ఆహ్వానిస్తాడు. గోదాదేవి తనకు భగవంతుడు చెప్పిన మాటను తండ్రికి చెప్పి తండ్రితో శ్రీరంగం చేరుకుంటుంది. అశేష ప్రజానీక సమక్షంలో ఆమెను శ్రీ రంగనాథునకిచ్చి వివాహం జరిపిస్తారు. వివాహ కార్యక్రమం పూర్తికాగానే ఆమె గర్భాలయంలోకి వెళ్ళి స్వామి వారి శేషతల్పం ఎక్కి స్వామివారి పాదాలు సమీపించి స్వామివారిలో ఐక్యమవుతుంది.

ఇంతటి మహిమగల విషయం జరిగిన పుణ్యదినం ,పండుగదినం భోగి. గోదాదేవికి అంతటి భోగభాగ్యం కూర్చిన ఆనాడు అప్పటినుంచి జనసామాన్యానికి కూడా సమస్త భోగభాగ్యాలు ఇచ్చేరోజు భోగి పండుగ అయింది.

వామనమూర్తి పాదాల క్రింద బలి చక్రవర్తి అణగిన దినంగా కొందరు చెబుతారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో వామన నామ స్మరణము,బలి చక్రవర్తి ప్రస్తుతి చేయడం ఆచారంగా ఉంది.

భోగినాడు తెల్లవారుఝామునే చేచి, అభ్యంగన స్నానం చేయాలి. చంటిపిల్లలకు భోగిపీడ తొలగడానికి కేవలం తలంటుతోనే గాక మధ్యాహ్నం భోగిపళ్ళు కూడా పోస్తారు.ఈ భోగిపళ్ళు పోయడమన్నది పిల్లలకు దృష్టి పరిహారార్థం చేసే కర్మగా కనిపిస్తుంది.

చిన్నపిల్లలకు కొత్తబట్టలు తొడిగి పీట మీద కూర్చోబెడతారు.రేగుపళ్ళు, పైసలు,చెరకు ముక్కలు, బంతిపూలు కలిపి తలమీదనుంచి పోస్తారు.ఇలా చేయడంవల్ల ఆ పిల్లలకు ఆయుర్వృద్దికరమై ఉంటుందని తెలుగు తల్లుల నమ్మిక.
భోగినాడు తెల్లవారుఝామునే భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ధనుర్మాసం నెలరోజులు ఆడపిల్లలు ముగ్గుల్లో పెట్టిన గొబ్బెమ్మలను,ఇంటిలోని పనికిరాని వస్తువులను వేస్తారు.