దిక్కులేని వారి దీనత బాపిన
పురుషుడిహమునందె పూజ్యుడగును
పరమునందువాని భాగ్యమేమనవచ్చు?
విశ్వదాభిరామ వినుర వేమ!
తా||దిక్కులేని వారిని ఆదుకున్నచో మనిషికి ఈలోకములో మంచి గౌరవము లభించును. మరి పరలోకమునందు వేరే చెప్పాలా? అనగా పరలోకములో గూడా గొప్ప పూజ్యుడగునని భావము.
******************************************************************************************* 111
ఆడితప్పువారలభిమాన హీనులు
గోడెఱుఁగని కొద్దివారు
కూడి కీడు సేయఁగ్రూరుండు తలపోయు
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| క్రూరులు మంచివారివలె నటిస్తారు. ఆత్మాభిమానమును వదలి, మంచి, చెడులను తెలుసుకోక, అసత్య నడవడికతో మెలగుతారు. జ్ఞానశూన్యులై యితరులను హింసిస్తూ ఉంటారు. వారి స్వభావమే అలాంటిది.
******************************************************************************************* 112
మాటఁజెప్ప వినని మనుజుఁడు మూర్ఖుఁడు
మాట విన్న నరుఁడు మానుఁడగును
మాట వినగఁ జెప్ప మానుట కూడదు
విశ్వదాభిరామ వినుర వేమ!
తా||ఇతరులు చెప్పిన మాటలు విననివాడు, అందలి మంచి, చెడులను గ్రహింపనివాడు మూర్ఖుడు. ఉత్తముడైన వాడు ఇతరుల మాటలను పూర్తిగా విని మంచి చెడ్డలను నిర్ణయించుకొనును.
******************************************************************************************* 113
శాంతమె జనులను జయమునొందించును
శాంతముననె గురుని జాడ తెలియు
శాంత భావమహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| శాంతముతో దేనినైనను సాధింపవచ్చును. గురువులు శాంత స్వభావముతో గొప్పవారిగా పరిణమింపబడుతున్నారు. శాంతముయొక్క గొప్పతనమింతింతయని చెప్పనలవికాదు.
******************************************************************************************* 114
వాక్కువలనఁగలుగు పరమగు మోక్షంబు
వాక్కువలనఁగలుగు వరలు ఘనత
వాక్కువలనఁగలుగు నెక్కుడైశ్వర్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ!
తా||మోక్షము, గొప్పదనము, ఐశ్వర్యము మన వాక్కువలననే ప్రాప్తించును. అందుచే చక్కగా మాట్లాడుట నేర్చుకొనవలెను.
******************************************************************************************* 115
మాటలాడఁగల్గు మర్మములెఱిగిన
పిన్నపెద్దతనము లెన్నవలదు
పిన్నచేతి దివ్వె పెద్దగా వెలుగదా?
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| మాట్లాడుట కూడ ఒక కళయే. మాట్లాడే నేర్పు వస్తే పిన్నలైనా, పెద్దలైనా యొకటే. పిల్లల చేతిలోని దీపం మాత్రం పెద్దగా వెలుగుట లేదా? అనగా ప్రకాశించును కదాయని యర్థము.
******************************************************************************************* 116
హీనుడెన్ని విద్య లిల నభ్యసించిన
ఘనుడు గాఁడు మొఱకు జనుఁడెగాని
పరిమళములు గార్దభముమోయ ఘనమౌనె
విశ్వదాభిరామ వినుర వేమ!
తా||మూర్ఖుడు ఎన్ని విద్యలు నేర్చిననూ గొప్పవాడు కాలేడు. సువాసన గల వస్తువులను మోసినంతమాత్రాన గాడిద గొప్పదౌతుందా? (అవదు అని భావము)
******************************************************************************************* 117
తనువులస్థిరమని ధనములస్థిరమని
తెలుపగలడు తాను తెలియలేడు
చెప్ప వచ్చుఁబనులు చేయుట కష్టమౌ
విశ్వదాభిరామ వినుర వేమ!
తా||ఈ శరీరము, ధనము అస్థిరములని ఢాంభికముగా పైకి చెప్పవచ్చునేమో గాని, తెలిసియుండియూ తానావిధముగా నడుచుకొనలేడు. చెప్పుట తేలికయేగాని చేయుట కష్టము.
******************************************************************************************* 118
కొండగుహలన్నునఁ గోవెలలందున్న
మెండుగాను బూది మెత్తియున్న
దుష్టబుద్ధులకును దుర్బుద్ధి మానునా?
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| చెడ్డవారు కొండగుహలలో నున్ననూ, దేవాలయాలలో నున్ననూ, ఎక్కువుగా విభూతి పెట్టుకొన్ననూ వారి చెడ్డ బుద్ధి మానుతుందా? (మారదుయని భావము).
******************************************************************************************* 119
చదువులన్ని చదివి చాల వివేకియై
కలుష చిత్తుడైన ఖలుని గుణము
దాలి గుంటఁనక్క తలఁచిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| ఎంత చదువు చదివి, ఎంత విద్వాంసుడైననూ దుష్టుడైనచో అతని మంచిబుద్ధి కొంతకాలమే యుండును. అది ఎట్లన దాలిగుంటలో నున్నంత సేపే కుక్కకు మంచిబుద్ధి ఉంటుంది. బయటకు వస్తే మరల మాములే.
******************************************************************************************* 120