శౌర్య ధైర్యములను సంతరించి
పూర్ణభావమరయ బొందుచునుందురు
విశ్వదాభిరామ వినుర వేమ!
తా||విజ్ఞానులు తమకాలమును వ్యర్థముగా వెళ్ళబుచ్చక ధైర్యసాహసములతో సంపూర్ణ జ్ఞానమును పొందుదురు.
******************************************************************************************* 141
జాతి నీతి వేఱు జన్మంబదొక్కటి
అరయఁదిండ్లు వేఱెయౌనుగాక
దర్శనములు వేఱు దైవమౌ నొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ!
తా||మనజాతులు, తిండ్లు, పద్ధతులు వేరైననూ మానవ జాతి అంతా ఒక్కటే. దైవశాస్త్రములు ఎన్నివున్నా దైవము మాత్రము ఒక్కటే.
******************************************************************************************* 142
బహుళ కావ్యములను బరికింపఁగా వచ్చు
బహుళ శబ్ద చయముఁ బలుక వచ్చు
సహన మొక్కటబ్బఁ జాలకష్టంబురా
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| ఎన్ని కావ్యములను చదివినా, ఎన్ని శబ్దములనుత్పత్తిచేసినా సహనగుణము అలవడుట చాలకష్టము. సహనము కలవాడే జ్ఞాని. సహనము వలన సమస్త కార్యములు సాధింపవచ్చును.
******************************************************************************************* 143
అప్పులేనివాడే యధిక సంపన్నుడు
తప్పులేనివారు ధరణిలేరు
గొప్పలేని బుద్ధి కొంచమై పోవురా
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| అప్పులు చేయని వాడె గొప్ప భాగ్యవంతుడు. తప్పు చేయని వారు ధరణిలో లేరు. అప్పుచేయుట గొప్ప తప్పు. దాని వలన గౌరవము నశించును, అందరిలోనూ చులకనయిపోదురు.
******************************************************************************************* 144
అపదందుఁజూడు మారయ బంధుల
భయమువేళఁజూడు బంటుతనము
పేదపడ్డ వెనుక బెండ్లము మతిజూడు
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| మన కష్టాలలో పాలు పంచుకున్న వారే నిజమైన బంధువులు. భయభ్రాంతులను విడి ధైర్యముతో నుండువాడే శూరుడు. పేదరికంలోగూడా గౌరవించునదియే నిజమైన భార్య.
******************************************************************************************* 145
గుణగణంబు లెల్లఁ గుచ్చితమునుబొంద
తగిలి భ్రమకుఁ జిక్కి దండధరునిఁ,
దోడితెచ్చుఁ గదర తొలగింప కున్నను
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| చెడ్డగుణముల వలన ఆపదలు వచ్చును. పాపము సంభవించును. మోసము, అన్యాయము, మొదలగు చెడ్డగుణములను విడనాడాలి. లేకున్నచో మనకు ఆపదలు సంభవించును.
******************************************************************************************* 146
ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
నిశ్చలముగ దృష్టి నిలిపెనేని
అతడునీవె సుమ్మి యనుమానమేలరా
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| మనస్సును ఆత్మయందే ఉంచి చలించని ఏకాగ్రతతో వీక్షించినచో మోక్షము నొందగలరు. గురోపదేశమువల్లనే నిది సాధ్యపడును.
******************************************************************************************* 147
గురువుతానయినను హరునితాఁ జూపును
బ్రహ్మలోకమితడు పాఱఁజూపు
శిష్యునరసితట్టి చీకటిఁబాపురా
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| నిజమైన గురువు శిష్యునికి బ్రహ్మలోకమును, శ్రీహరినికూడా చూపించగలడు. శిష్యుని భజముతట్టి ధైర్యసాహసములను నేర్పుతూ అతని అజ్ఞానంధకారమును తొలగించును.
******************************************************************************************* 148
ఇహపరంబులకును నిదిసాధనంబని
వ్రాసి, చదివి, విన్నవారికెల్ల
మంగళంబు లొనరు మహిలోనిది నిజము
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| ఇట్లు నీతిమార్గమును బోధించు ఈ శతకము, ధర్మార్థకామమోక్షములనెడి పురుషార్థములు సాధించుటకు సాధనమై, వ్రాసినవారికిని, చదివినవారికిని, విన్నవారికిని గూడ ఇహపరలోక సౌఖ్యములను సర్వశుభములను ఇచ్చును.
******************************************************************************************* 149
"లోకా సమస్తా స్సుఖినో భవంతు"