Followers

Saturday, 16 November 2013

మహాభారతం – గొప్పతనం(Greatnes Of Maha Bharatham)



మహాభారతం భారతీయులకు ఎందుకు ఆదర్శగ్రంథంగా, గొప్ప గ్రంథంగా వెలుగొందుతోంది అని అనడానికి నన్నయ్య చెప్పిన ఈ పద్యం చక్కటి సమాధానం. వ్యాకరణ శాస్త్రం, మంత్రశాస్త్రం, రాజనీతి, వ్యవహార ధర్మాలు ఆపద్ధర్మ, మోక్ష ధర్మాలు, తత్వ విషయాలు, పురాణ ఆధార కథలు ఇలా ఎన్నెన్నో ఈ గ్రంథంలో ఇమిడి ఉన్నాయి. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుంచి మహాభారతం భారతావనిలో భాసిల్లుతోంది. కావ్యాలు, నాటకాలులాంటి వాటికే కాక లలిత కళలకు కూడా మహాభారతం కల్పవృక్షంలాంటిది. కాళిదాసు మహకవి రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకానికి, మాఘకవి రచించిన శిశుపాల వథకు ఈ మహాభారతం ఆధారం. హర్షుడు విద్వదౌషధంగా రచించిన నైషధం కావ్యానికి, కూడా మహాభారతమే ఆధారం. ఇలా మహాభారతం భారతీయుల జీవితాలలో ఒక అంతర్వాహిని అయింది. భారతదేశంలోని ప్రాచీన భాషలన్నీ భారతాన్ని ఆశ్రయించుకునే ఆ భాషలలో కావ్యాలను ఏర్పరుచుకున్నాయి. మహారాష్ట్ర భాషలో యోగేశ్వరుడైన జ్ఞానదేవుడి దగ్గర నుంచి ముక్తేశ్వరుడు, మోరోపంతు, వామన పండితుడు, రఘనాథ పండితుడు తదితర మహాకవులు, పండితులంతా తమ కావ్య ప్రతిభను వెల్లడించటానికి భారతాన్నే ఆశ్రయించారు. ఆంధ్రజాతికి జ్ఞానజ్యోతులను అందించటానికి నన్నయ, తిక్కన, ఎర్రన సంస్క్రత మహాభారతాన్ని ఆంధ్రీకరించారు. రాజకీయ భావ ప్రచారాలకు స్వాతంత్రోద్యమ కాలంలో భారతదేశ గొప్పతనాన్ని వివరించి చెప్పి భారతీయులను స్వాతంత్రోద్యమం వైపు మరల్చటానికి ఆనాటి కవులకు, రచయితలకు, నాయకులకు కూడా మహాభారత కథలే పవిత్ర ఆయుధాలయ్యాయి. పామర జనానికి నీతులను సులభంగా బోధించే శక్తి మహాభారత కథల్లో ఉంది. విశ్వవిజేత అలెగ్జాండర్‌ భారతదేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనటానికి అప్పటి రాజులు శకట వ్యూహాన్ని పన్నారు. ఈ శకట వ్యూహ రచన మహాభారతంలోనిదే. చిన్న పిల్లల దగ్గర నుంచి స్త్రీలు, పురుషులు, వృద్ధులు వరకు ఎవరెవరు ఏఏ సమయాల్లో ఎలాంటి పనులను చేయాలన్నా నిర్ణయాన్ని అన్ని వర్ణాల వారు పాటించాల్సిన ధర్మాలను మహాభారతం వివరిస్తుంది. జ్ఞానదేవుడి అడుగుజాడల్లో ఆధ్యాత్మిక చైతన్యానికి బాటలు వేస్తూ దేశంలో, సమాజంలో స్వధర్మం నశిస్తున్న సమయంలో జాతికి సన్మార్గాన్ని సూచించిన గోస్వామి తులసీదాసు, సూరదాసులాంటి మహానుభావులకు మహాభారతమే ప్రధాన ఆధారంగా నిలిచింది. భరతమాత దాస్య విముక్తి కోసం శంఖారావం చేసిన లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ ప్రవచించిన కర్మయోగానికి కూడా మహాభారతం అందులోని భగవద్గీత కేంద్రబిందువుగా కనిపిస్తుంది. మనిషి జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలన్నింటినీ భారత కథలు స్పృశిస్తుంటాయి. ఆనాడెప్పుడో వ్యాసభగవానుడు చెప్పిన ప్రతి అక్షరం మానవాళికి ఒక్కొక్క వెలుగు దివ్వెగా తనవంతు పనిగా ధర్మమార్గాన్ని సూచిస్తూనే ఉంది. కొంత మంది మహాభారత మంటే కేవలం కౌరవ, పాండవ, యుద్ధ కథగా భావిస్తుంటారు. వ్యాసభారతాన్ని ఒక్కసారి అవగతం చేసుకుంటే ఆ భావన ఉండదు. మనిషికి కావాల్సినవన్నీ వివరించి చెప్పే పవిత్ర గ్రంథంగా మహాభారతం మానవాళి మనుగడ ఉన్నంత వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. సంస్కృత భాషలో ఉన్న వ్యాసభారతాన్ని తెలుగులో నన్నయ ఆది, సభాపర్వాలు అరణ్యపర్వంలో సగభాగం వరకు అనువదించాడు. తిక్కన విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలు అనువదించాడు. నన్నయ ఆంధ్రీకరించంగా మిగిలిన అరణ్య పర్వ శేషభాగాన్ని ఎర్రన ఆంధ్రీకరించి తెలుగు జాతికి మహోన్నత సేవచేశారు.

Popular Posts