గణపతి ఐదవ అవతారము: లంబోదరావతారము
ధ్యానశ్లోకం: లంబోదరావతారో వై క్రోధాసుర నిబర్హణ:,
శక్తిబ్రహ్మాఖుగ: సద్యత్ తస్య ధారక ఉచ్యతే.
ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: శ్రీ విష్ణువు మొహినిగా అవతరించినపుడు భగవాన్ శివుడు మోహితుడయ్యెను. అపుడు కామారి ఐన శివతేజస్సునుండి నల్లనిరంగులో ఒక రాక్షసుడు ఆవిర్భవించెను. ఆ రాక్షసుడు శుక్రాచార్యునియొద్దకురాగా, శుక్రాచార్యుడు క్షణము ధ్యానించి ఆ రాక్షసునికి క్రోధాసురుడు అని పేరుపెట్టెను. పిదప శంబరదైత్యుని కుమార్తైన `ప్రీతి 'ని ఇచ్చి వివాహంచేసాడు. గురువుగారియొద్ద సూర్యమంత్రాన్ని తీసుకుని క్రోధాసురుడు తపస్సు చేయసాగాడు. దానిఫలితంగా సూర్యునినుండి అనేకవరములుపొంది విజయగర్వంతో శుక్రాచార్యునియొద్దకురాగా, క్రోధాసురుని `ఆవేశపురాని 'కి రాజుగా పట్టాభిషిక్తునిచేసెను. వరబలగర్వంతో క్రోధాసురుడు అన్ని లోకాలని ఆక్రమించసాగాడు. చివరకు సూర్యునిపై కూడా దండెత్తేడు. వరమిచ్చినకారణంగా సూర్యుడుకూడా తనలోకంవిడిచిపెట్టవలసివచ్చింది. అప్పుడు దేవతలందరూ గణేశునికై ఆరాధనలు చేసేరు. అంతట గణేశుడు `లంబోదరావతారం'తో వారికి ప్రత్యక్షమై అభయాన్నిచ్చాడు. దేవసేనలు తనతోరాగా క్రోధాసురునిపై యుద్ధానికి బయలుదేరి అనేక రాక్షస సేనలను సంహరించెను. పిమ్మట లంబోదరునకు, క్రోధాసురునికి భీకరయుద్ధంజరిగింది. లంబోదరుని ప్రతాపానికి నిలువలేక క్రోధాసురుడు లంబోదరును పాదాలపైపడి రక్షించమనివేడుకొనెను. సహజంగా కృపామూర్తి అయిన లంబోదరుడు క్రోధాసురుని క్షమించెను. అంతట క్రోధాసురుడు శాంతుడై, అధోలోకాలకుపోయి శాంతజీవనం గడపసాగాడు. దేవతలందరూ లంబోదరుని స్తుతించి వారివారి నెలవులకు వెళ్ళారు. మనము కూడా లంబోదరుని అనుగ్రహంతో క్రోధాసురున్ని జయిద్దాం. ...
"శ్రీ లంబోదరాయ నమ:"