శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా,కుమారుని వదలి ఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే "శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద"ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగరూపంలో ఆవిర్భవించాడని మరోకథనం.
కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దరుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే
కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంతరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణ కథనం. సీతారాముల రామసహస్రలింగం, సీతాసహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య,ఆచార్యనాగార్జునుడు, కృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు.