పరమేశ్వరునికి స్మశానమంటే అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం –పుష్కరం – కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం – శ్రీశైలం – దారుకావనం. వీటన్నికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం – ఎడారి – పాలంపీఠం – అరణ్యం అంటూ ఐదు ఒకేచోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని.
పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు. ఈ నలుగురు కూడా శివభక్తులే. ఇదిలా ఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్నా దూషణాసురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ,అందరినీ హింసిస్తూండేవాడు. ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని,అతని సైన్యాన్ని భస్మం చెసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.