“ఐదోతనం” కోసం శ్రావణ శుక్రవారం పూజ చేయడం వలన మంచి ఫలితాలు చేకూరుతాయి
శ్రావణ శుక్రవారం పూట మహిళలు అమ్మవారిని నిష్ఠతో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఆ రోజున దుర్గాదేవిని ఆలయాల్లో సందర్శించుకునే వారికి పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.
శ్రావణ శుక్రవారం ఉదయమే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని, పసుపు, కుంకుమలు, పుష్పాలతో దివ్యసుందరంగా అలంకరించుకోవాలి. మహిళలు అమ్మవారి ఫోటోకు గానీ, ప్రతిమకు గానీ మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను సమర్పించాలి. అనంతరం చక్కెర పొంగలి, అటుకుల పాయసంను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
పూజకు పిమ్మట మాంగల్యసూత్రములోని పసుపు తాడును మార్చుకోవడం చేస్తే ఐదోతనం ప్రాప్తించి సుఖసంతోషాలతో జీవిస్తారని పండితులు అంటున్నారు. అంతేగాకుండా శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని వారు చెబుతున్నారు.
అందుచేత శ్రావణ శుక్రవారం అమ్మవారి దేవాలయాలను సందర్శించడం శ్రేయస్కరం. ఇంకా మహిళలు పసుపు, కుంకుమలను ముత్తైదువులకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.