Followers

Wednesday, 7 January 2015

ఆది వైద్యులు - ధన్వంతరీ



‘ వైద్యో నారాయణో హరిః ’ అని అన్నారు. వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని, అనుభవజ్ఞుడైన వైద్యుని ‘ అపర ధన్వంతరి ’ అని మన వాళ్ళు పోగడుతుంటారు.

శ్రీమద్భాగవతం ధన్వంతరిని “దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రని కళ్ళతో, పసుపువర్ణదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకొని దర్శనమిస్తూంటారు” అని వర్ణించింది. ఇలా పలు పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమధనం ద్వార ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.

రాక్షసులు  పెట్టే  బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనము చేస్తే ఫలితము ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాలసముద్రములో వేసి, మందరపర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా, కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, ముందుగా హాలాహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠములో ధరించాడు. అనంతరం కామధేనువు, ఉచ్చైశ్శ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి కన్య ఉద్భవించారు.

ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృతకలశం ధగధగలాదుతోంది.

ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది.

ఇక, విష్ణుధర్మోత్తరపురణం, ఒక చేతిలో అమృతకలశం, మరొక చేత వనమూలికలు పట్టుకొని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనములికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భావించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో,శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులలో జలగన్ఉ అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.

దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటూ సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపములో జన్మించిన ధన్వంతరి దేవ లోకంలోని వైద్యవిధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానోకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాసపర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి దక్ష పామును పట్టుకుని ఓ మంత్రమును పఠించడంతో, ఆ మంత్రప్రభావానికి దక్ష పాము మూర్ఛ పోయింది. ఈ విషయాన్ని గురించి విన్న పాములరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్ని వేల పాములను ధన్వంతరి శిష్యులపైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్చపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన సిష్యులనంతా మూర్ఛ నుండి తెరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోను చేయగా, ధన్వంతరితో పాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధనవంతరావిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.

ఇలా ధన్వంతరి గురించి అనెక్ పురాణకథలను వింటూంటాం. శస్త్ర చికిత్సలో (ఆపరేషన్స్) ఉద్దండుడైన దివోదాసు ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.

శ్రీధన్వంతరి మూలమంత్రం

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ

ధన్వాతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ

సర్వరోగ నివారనాయ త్రైలోక్య పతయే త్రైలోక్యవిధయే

శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప

శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా

Popular Posts