సుశ్రుతుడు శస్త్రచికిత్స నిపుణుడైతే చరకుడు ఆయుర్వేద వైద్యుడు. ఏ రోగికి ఏ మూలిక తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడు. ఆయన శాస్త్ర చికిత్సావిధానాల్లో అనేక అద్భుతాలు చేశాడు.
ఈయన గర్బస్థశిశువు పెరుగుదల గురించి, మానవ శరీర నిర్మాణము గురించి స్పష్టమైన వివరాలు అందించాడు. వాత, పిత్త, కఫములను అనుసరించి చరకుడు శరీరంలోని ఆరోగ్యస్థితిని అంచనా వేసేవాడు. అదేవిధంగా రోగాలను నిర్థారించడమే కాదు, వాటికి తగిన చికిత్సా పద్ధతులను సూచించడంలో కూడా ఘటికుడు చరకుడు. ఈయన వృద్ధాప్యాన్ని వెన్నక్కి మళ్లించే మూలికలను కూడా అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.
ఆయనచే విరచితమైన ‘చరక సంహితి’లో పలు విధాలైన మూలికల వివరాలను, చికిత్సా విధానాలను చూడొచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో చరకుడు వైద్యం చేసేందుకు లోహథాతువులను, జంతు సంబంధ పదార్థాలను కూడా ఉపయోగించేవాడట. మందులు ఉపయోగించే పద్ధతిని అనుసరించి చరకుడు ఆయా మందులను 50 రకాలుగా విభజించాడు. మందులను పొడిరూపంలో, జిగురుగా, ద్రవరూపంలో తాయారు చేసిన చరకుడు ఆ మందులను ఉపయోగించాల్సిన విధానాన్ని గురించి చాల వివరంగా పేర్కొన్నాడు.