Followers

Friday, 29 May 2015

తిరుప్పావై 22వ రోజు పాశురము


22వ రోజు - అనన్య గతిత్వం

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము

అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్

మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుతూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవవల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచిపోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉందట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచింది. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తుపట్టేసరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. "ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కాన ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్" ఏక ఛత్రాధిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒక నాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.

మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్నా అనుకుంటావా చుట్టూ ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతికితే వాడికి గతి ఉండనే ఉండదు.

"అంగణ్ మా ఞాలత్తరశర్” ఈ అందమైన భూమి మీద అబిమాన పంగమాయ్ వందు” అభిమానాలను వదులుకొని వచ్చి “నిన్ పళ్ళికట్టిల్ కీరే” నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలే మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాలపై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పదసన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మనలాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకొని రావాలనంటే అది కష్టం, కాని తరించాలి అంటే ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.

“శంగమ్ ఇరుప్పార్ పోల్” అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లాఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. “వందు తలై ప్పెయ్-దోమ్” ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి, మాకు ఎంతలా ఉపకారం చేసావు, మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేషాన్ని తగ్గించి నీ పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం.

ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, “కింగిణివాయ్ చ్చేయ్ద” చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆనేత్రాలని “తామరై ప్పూప్పోలే” పద్మాల్లా “శెంగణ్ శిఱుచ్చిఱిదే” అందముగా, మెల్లి మెల్లిగా “యెమ్మేల్” మాపై “విరయావో” ప్రసరించేట్టు చెయ్యి. “తింగళుమ్” చంద్రుడి చల్లటిచూపులాగా “ఆదిత్తియనుమ్” సూర్యుడి కాంతివలె “ఎరుందాఱ్పోల్” ఇద్దరూ కలిసి నట్లుగా ఉంది, ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేషించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి “ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం” అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.

తప్పు తప్పు “అంగణ్ ఇరండుం” ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు, “కొండు ఎంగళ్మేల్” వాటిని మాపై పడేట్లు చెయ్యి. “నోక్కుదియేల్ ఎంగళ్మేల్” ఆచూపులు మాపై పడితే “శాపం ఇరింద్” మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్శతో పోయింది - మాకూ నీ పాద స్పర్శ కావాలి, చంద్రపుష్కరిణిలో స్నానం ఆడితే దక్షుడికి శాపం పోయింది - మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణిలో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది - మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి. “చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన” నీ చూపు నాపై పడిందయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

Popular Posts