Google+ Followers

Followers

Sunday, 27 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభైయ్యవ అధ్యాయం


           ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభైయ్యవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అస్తిః ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యౌ భరతర్షభ
మృతే భర్తరి దుఃఖార్తే ఈయతుః స్మ పితుర్గృహాన్

కంసునికి ఇద్దరు భార్యలు అస్తి ప్రాప్తి అని. వారు కంసుడు చనిపోయిన తరువాత తండ్రి ఐన జరాసంధుని వద్దకు వెళ్ళారు

పిత్రే మగధరాజాయ జరాసన్ధాయ దుఃఖితే
వేదయాం చక్రతుః సర్వమాత్మవైధవ్యకారణమ్

తన తండ్రి ఐన జరాసంధునికి తమకు వైధవ్యం ఎలా వచ్చిందో చెప్పారు. అది విన్న అతనికి కోపం పగా కలిగాయి,

స తదప్రియమాకర్ణ్య శోకామర్షయుతో నృప
అయాదవీం మహీం కర్తుం చక్రే పరమముద్యమమ్

అసలు భూమండలములో యదుకులం లేకుండా చేస్తాను అని

అక్షౌహిణీభిర్వింశత్యా తిసృభిశ్చాపి సంవృతః
యదురాజధానీం మథురాం న్యరుధత్సర్వతో దిశమ్

23 అక్షుహిణీల సైన్యం తీసుకుని మధుర పురి నాలుగు దిక్కులా వచ్చాడు

నిరీక్ష్య తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరమ్
స్వపురం తేన సంరుద్ధం స్వజనం చ భయాకులమ్

జరాసంధుని వలన అందరూ భయపడుతున్నారని గ్రహించిన కారణ మానుషుడైన భగవానుడు

చిన్తయామాస భగవాన్హరిః కారణమానుషః
తద్దేశకాలానుగుణం స్వావతారప్రయోజనమ్

ఆ ప్రదేశములో కాలములో ఏమి చేయాలో తెలిసిన కృష్ణుడు ఈ భూమికి  భారముగా ఉన్న సైన్యాన్ని వధిస్తాను

హనిష్యామి బలం హ్యేతద్భువి భారం సమాహితమ్
మాగధేన సమానీతం వశ్యానాం సర్వభూభుజామ్

అతను చక్రవర్తి కాబట్టి సామంతరాజుల నుంచి తెచ్చిన సైన్యం మొత్తం వధిస్తాను.

అక్షౌహిణీభిః సఙ్ఖ్యాతం భటాశ్వరథకుఞ్జరైః
మాగధస్తు న హన్తవ్యో భూయః కర్తా బలోద్యమమ్

రథములూ అశ్వములూ గజములూ పదాతి (చతురంగ బలమును) బలాలను చంపుతాను. వాన్ని మాత్రం చంపను. మళ్ళీ సైన్యాన్ని పూంచి వస్తాడు

ఏతదర్థోऽవతారోऽయం భూభారహరణాయ మే
సంరక్షణాయ సాధూనాం కృతోऽన్యేషాం వధాయ చ

నా అవతారం ఇందుకే కదా. భూభారాన్ని తగ్గించి సాధు జనులను రక్షించుట, సాధేతరులను శిక్షించుట.
అధర్మాన్ని నశింపచేయడానికీ ధర్మాన్ని రక్షించడానికీ నేనీ శరీరాన్ని భరిస్తూ ఉన్నాను

అన్యోऽపి ధర్మరక్షాయై దేహః సంభ్రియతే మయా
విరామాయాప్యధర్మస్య కాలే ప్రభవతః క్వచిత్ఏవం ధ్యాయతి గోవిన్ద ఆకాశాత్సూర్యవర్చసౌ
రథావుపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ

ఇలా పరమాత్మ ఆలోచిస్తూ ఉండగా ఆకాశమునుండి రెండు రథములు ఆయుధములతో సారధులతో వచ్చాయి. అవి పురాణకాలం నుండీ ఉన్నవే

ఆయుధాని చ దివ్యాని పురాణాని యదృచ్ఛయా
దృష్ట్వా తాని హృషీకేశః సఙ్కర్షణమథాబ్రవీత్

బలరామునితో వెంటనే కృష్ణుడు "చూశారా యాదవులకు ఎంత కష్టం వచ్చిందో"

పశ్యార్య వ్యసనం ప్రాప్తం యదూనాం త్వావతాం ప్రభో
ఏష తే రథ ఆయాతో దయితాన్యాయుధాని చ

ఆ కష్టాన్ని తొలగించడానికి మీకు రథమూ ఆయుధాలూ వచ్చాయి. అది అదిరోహించి శత్రువులను సంహరించి మనవారి కష్టాలను తొలగించండి

ఏతదర్థం హి నౌ జన్మ సాధూనామీశ శర్మకృత్
త్రయోవింశత్యనీకాఖ్యం భూమేర్భారమపాకురు

సాధువులకు హితం కలిగించడమే మన కర్తవ్యం. 23 అక్షౌహిణీల సైన్యాన్నీ వధించి  భూభారం తగ్గించాలి

ఏవం సమ్మన్త్ర్య దాశార్హౌ దంశితౌ రథినౌ పురాత్
నిర్జగ్మతుః స్వాయుధాఢ్యౌ బలేనాల్పీయసా వృతౌ

వీరిద్దరూ రథములదిరోహించి పురమునుండి బయటకు వెళ్ళారు. చాలా కొద్ది సైన్యం తీసుకు వెళ్ళారు

శఙ్ఖం దధ్మౌ వినిర్గత్య హరిర్దారుకసారథిః
తతోऽభూత్పరసైన్యానాం హృది విత్రాసవేపథుః

దారుకుడు అనే సారధితో కలసి స్వామి పాంచ జన్యాన్ని ఊదాడు కృష్ణుడు. శత్రు సైన్యానికి వణుకు పుట్టింది. జరాసంధుడు అపుడు కృష్ణున్ని చూచి

తావాహ మాగధో వీక్ష్య హే కృష్ణ పురుషాధమ
న త్వయా యోద్ధుమిచ్ఛామి బాలేనైకేన లజ్జయా
గుప్తేన హి త్వయా మన్ద న యోత్స్యే యాహి బన్ధుహన్

పురుషాధమా నీవు చాలా చిన్న పిల్లవాడవు. నీతో యుద్ధం చేయాలంటే నాకే సిగ్గుగా ఉంది. బంధువులను చంపిన నీతో నేను యుద్ధం చేయను

తవ రామ యది శ్రద్ధా యుధ్యస్వ ధైర్యముద్వహ
హిత్వా వా మచ్ఛరైశ్ఛిన్నం దేహం స్వర్యాహి మాం జహి

బలరామా నీకు యుద్ధం చేయాలని ఇష్టం ఉన్నచో యుద్ధం చేసి నా ఆయుధములతో చంపబడి స్వర్గానికి వెళ్ళు, లేదంటే నన్నే చంపు.

శ్రీభగవానువాచ
న వై శూరా వికత్థన్తే దర్శయన్త్యేవ పౌరుషమ్
న గృహ్ణీమో వచో రాజన్నాతురస్య ముమూర్షతః

నిజముగా బలవంతుడు గర్వించరూ, మాటలతో సమయాన్ని వృధా చేయరు.. వారు పౌరుషాన్ని చూపుతారు. చావు కోరి బాధపడుతున్న వారి మాటలను నేను లెక్కించనులే.

శ్రీశుక ఉవాచ
జరాసుతస్తావభిసృత్య మాధవౌ మహాబలౌఘేన బలీయసావృనోత్
ససైన్యయానధ్వజవాజిసారథీ సూర్యానలౌ వాయురివాభ్రరేణుభిః

ఇలా జరాసంధుడు గొప్ప సైన్యాన్ని తీసుకుని వారిని చుట్టుముట్టాడు. సూర్యున్నీ అగ్నిహోత్రున్నీ ఎలా ఐతే దుమ్ముతో వాయువు చుట్టుముడుతుందో అలా.

సుపర్ణతాలధ్వజచిహిత్నౌ రథావ్
అలక్షయన్త్యో హరిరామయోర్మృధే
స్త్రియః పురాట్టాలకహర్మ్యగోపురం
సమాశ్రితాః సమ్ముముహుః శుచార్దితః

బలరామ కృష్ణుల రథాలను పూర్తిగా కప్పేసారు. అందరూ తమ తమ భవనాల నుండి చూస్తూ ఉన్నారు గానీ కృష్ణ బలరాములు కనపడకపోయేసరికి వారు భయపడ్డారు

హరిః పరానీకపయోముచాం ముహుః శిలీముఖాత్యుల్బణవర్షపీడితమ్
స్వసైన్యమాలోక్య సురాసురార్చితం వ్యస్ఫూర్జయచ్ఛార్ఙ్గశరాసనోత్తమమ్

పరమాత్మ బాణ వర్షముతో శత్రు సైన్యాన్ని పీడించి శాంఖం అనే ధనువుతో నారి సంధించి బాణ వర్షాన్ని కురిపించాడు. రథాలనూ ఏనుగులనూ గుర్రములనూ ఇతర బలములనూ అన్నీ వధిస్తున్నాడు

గృహ్ణన్నిశఙ్గాదథ సన్దధచ్ఛరాన్
వికృష్య ముఞ్చన్శితబాణపూగాన్
నిఘ్నన్రథాన్కుఞ్జరవాజిపత్తీన్
నిరన్తరం యద్వదలాతచక్రమ్

నిర్భిన్నకుమ్భాః కరిణో నిపేతురనేకశోऽశ్వాః శరవృక్ణకన్ధరాః
రథా హతాశ్వధ్వజసూతనాయకాః పదాయతశ్ఛిన్నభుజోరుకన్ధరాః

కుంభస్థలాలు పగిలిన ఏనుగులు కంఠాలు తెగిన గుర్రాలు కూలిపోయిన రథములూ, ఇలా నాలుగు రకములుగా ఉన్న సైన్యం కొట్టబడుతున్నది

సఞ్ఛిద్యమానద్విపదేభవాజినామఙ్గప్రసూతాః శతశోऽసృగాపగాః
భుజాహయః పూరుషశీర్షకచ్ఛపా హతద్విపద్వీపహయ గ్రహాకులాః

ఇలా ఇద్దరూ కలసి జరాసంధుని సైన్యాన్ని హరిస్తుండగా బుద్ధి మంతులకు సంతోషం కలిగింది.

కరోరుమీనా నరకేశశైవలా ధనుస్తరఙ్గాయుధగుల్మసఙ్కులాః
అచ్ఛూరికావర్తభయానకా మహా మణిప్రవేకాభరణాశ్మశర్కరాఃప్రవర్తితా భీరుభయావహా మృధే మనస్వినాం హర్షకరీః పరస్పరమ్
వినిఘ్నతారీన్ముషలేన దుర్మదాన్సఙ్కర్షణేనాపరీమేయతేజసా

బలం తదఙ్గార్ణవదుర్గభైరవం దురన్తపారం మగధేన్ద్రపాలితమ్
క్షయం ప్రణీతం వసుదేవపుత్రయోర్విక్రీడితం తజ్జగదీశయోః పరమ్

క్షణ కాలములో వారి సైన్యాన్ని వసుదేవ పుత్రుడు క్షయింపచేసాడు. సంకల్పముతోనే అనంత కోటి బ్రహ్మాండాలని లయం చేసే పరమాత్మకు ఇది గొప్ప విషయం కాదు

స్థిత్యుద్భవాన్తం భువనత్రయస్య యః
సమీహితేऽనన్తగుణః స్వలీలయా
న తస్య చిత్రం పరపక్షనిగ్రహస్
తథాపి మర్త్యానువిధస్య వర్ణ్యతే

ఒక మానవుడిగా చేసే పనిని చూస్తే ఆశ్చర్యం గొలుపుతుంది.

జగ్రాహ విరథం రామో జరాసన్ధం మహాబలమ్
హతానీకావశిష్టాసుం సింహః సింహమివౌజసా

ఇలా జరాసంధుడు ఏ రథములో వచ్చాడో ఆ రథం కూలగొట్టాడు అశ్వాలనూ గజాలనూ చంపాడు. జరాసంధున్ని బలరాముడు గట్టిగా పట్టుకున్నాడు.

బధ్యమానం హతారాతిం పాశైర్వారుణమానుషైః
వారయామాస గోవిన్దస్తేన కార్యచికీర్షయా

వారుణ పాశములతో చంపుదామని బలరాముడు భావిస్తే గోవిందుడు ఆపాడు. వాడితో చేయవలసిన పని చాలా ఉన్నందున ఆపాడు

సా ముక్తో లోకనాథాభ్యాం వ్రీడితో వీరసమ్మతః
తపసే కృతసఙ్కల్పో వారితః పథి రాజభిః

బలరాముడు జరాసంధున్ని విడిచిపెట్టాడు.

వాక్యైః పవిత్రార్థపదైర్నయనైః ప్రాకృతైరపి
స్వకర్మబన్ధప్రాప్తోऽయం యదుభిస్తే పరాభవః

సిగ్గుపడి, జరాసంధుడు, బలరామ కృష్ణులను వధించడానికి ఘోరమైన తపస్సు చేస్తాను అనుకొని వెళ్ళాడు. సామంతరాజులు అడ్డుపడి, నీకు కావలసిన బలాన్ని మళ్ళీ మేము ఇస్తాము బలరామ కృష్ణుల మీదకు యుద్ధానికి వెళ్ళమని ప్రోత్సహించారు. ఈ మాటలతో జరాసంధుని మనసు మారి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు

హతేషు సర్వానీకేషు నృపో బార్హద్రథస్తదా
ఉపేక్షితో భగవతా మగధాన్దుర్మనా యయౌ

మనకర్మ వలన మనం ఓడాము. వారి అదృష్టం ఉండి వారు గెలిచారు అని సామంతరాజులు నచ్చజెప్పారు జరాసంధునికి. దుఃఖముతో తన దేశానికి జరాసంధుడు వెళ్ళాడు

ముకున్దోऽప్యక్షతబలో నిస్తీర్ణారిబలార్ణవః
వికీర్యమాణః కుసుమైస్త్రీదశైరనుమోదితః

కృష్ణుడు మాత్రం విహారయాత్రకు వెళ్ళి వచ్చినట్లుగా ఏ మాత్రం సైన్యం తరగకుండా ఎలా వెళ్ళాడో అలా వచ్చాడు

మాథురైరుపసఙ్గమ్య విజ్వరైర్ముదితాత్మభిః
ఉపగీయమానవిజయః సూతమాగధవన్దిభిః

సూతులు మాగధులూ వందులూ అందరూ స్వామిని మహావీరుడని స్తోత్రం చేసారు, దుందుభులు మోగాయి, దారులలో సుగంధ ద్రవ్యాలు కట్టీ జండాలు కట్టీ స్వస్తి పుణ్యాహవచనాలు చేసి, స్త్రీలు పుష్పమాలలనూ అక్షతలనూ పెరుగునూ చల్లీ, మంగళ వాద్యాలు మోగుతుండగా కృష్ణునికి స్వాగతం చెప్పారు.ఇలా సైన్యాన్ని ఓడించి వారి ధనం తీసుకు వచ్చి రాజుకు సమర్పించాడు

శఙ్ఖదున్దుభయో నేదుర్భేరీతూర్యాణ్యనేకశః
వీణావేణుమృదఙ్గాని పురం ప్రవిశతి ప్రభౌ

సిక్తమార్గాం హృష్టజనాం పతాకాభిరభ్యలఙ్కృతామ్
నిర్ఘుష్టాం బ్రహ్మఘోషేణ కౌతుకాబద్ధతోరణామ్

నిచీయమానో నారీభిర్మాల్యదధ్యక్షతాఙ్కురైః
నిరీక్ష్యమాణః సస్నేహం ప్రీత్యుత్కలితలోచనైః

ఆయోధనగతం విత్తమనన్తం వీరభూషణమ్
యదురాజాయ తత్సర్వమాహృతం ప్రాదిశత్ప్రభుః

ఏవం సప్తదశకృత్వస్తావత్యక్షౌహిణీబలః
యుయుధే మాగధో రాజా యదుభిః కృష్ణపాలితైః

ఈ రీతిలో జరాసంధుడు అంతే అక్షౌహిణీలు గల సైన్యాన్ని తీసుకుని కృష్ణుని మీదకు యుద్ధానికి వచ్చాడు.

అక్షిణ్వంస్తద్బలం సర్వం వృష్ణయః కృష్ణతేజసా
హతేషు స్వేష్వనీకేషు త్యక్తోऽగాదరిభిర్నృపః

అష్టాదశమ సఙ్గ్రామ ఆగామిని తదన్తరా
నారదప్రేషితో వీరో యవనః ప్రత్యదృశ్యత

ఇలా పదిహేడు సార్లు యుద్ధమైంది. పదిహేడుసార్లు యుద్ధములోనూ జరాసంధుని సైన్యం వధించబడింది

రురోధ మథురామేత్య తిసృభిర్మ్లేచ్ఛకోటిభిః
నృలోకే చాప్రతిద్వన్ద్వో వృష్ణీన్శ్రుత్వాత్మసమ్మితాన్

పద్దెనిమిదవ సారి యుద్ధం జరిగే ముందు నారదుడు కాలయవనుడి వద్దకు వెళ్ళాడు: జరాసంధుడు పదిహేడుసార్లు కృష్ణుని చేతిలో ఓడిపోయాడు. నీవు జరాసంధుడికి మిత్రుడవై ఉండి కూడా నీ సైన్యాన్ని పంపలేదంటే నీకు కృష్ణుడంటే భయం అని అందరూ అంటున్నారు, నిజమేనా? అని అడుగగా, కృష్ణుని గురించి నారద మహర్షి చెప్పగా సైన్యం తీసుకుని కాలయవనుడు జరాసంధుడు యుద్ధానికి రాక ముందే మొత్తం మధురా నగరాన్ని ఆక్రమించాడు. మూడు కోట్ల ంలేచ్చ సైన్యముతో ఆక్రమించాడు మధురా నగరాన్ని.
మధురా నగర వాసుల యొక్క వీరత్వాన్ని విని ఉన్నాడు అంతకు మునుపే

తం దృష్ట్వాచిన్తయత్కృష్ణః సఙ్కర్షణ సహాయవాన్
అహో యదూనాం వృజినం ప్రాప్తం హ్యుభయతో మహత్

అది చూసిన సంకర్షణుడు "ఎంత కష్టం వచ్చింది యాదవులకు. రెండు పక్కల నుండీ ఆపద వచ్చింది"

యవనోऽయం నిరున్ధేऽస్మానద్య తావన్మహాబలః
మాగధోऽప్యద్య వా శ్వో వా పరశ్వో వాగమిష్యతి

మేమిద్దరం కాలయవనుడితో పోరాడుతుండగా వాడు వస్తే నగరాన్ని వాడు ఆక్రమించి మా బంధువులను తీసుకు వెళతాడు. శత్రువులకు అందనటువంటి కొత్త దుర్గాన్ని ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేసిన తరువాత కాలయవనుడిని చంపవచ్చనుకొని, సముద్రున్ని పన్నెండు యోజనాల స్థలం అడిగి, విశ్వకర్మ చేత నగరాన్ని నిర్మించి, ఈ నగరములో ఉన్నవారిని అందరినీ ఆ నగరానికి తరలించాడు, వారికి తెలియకుండానే.

ఆవయోః యుధ్యతోరస్య యద్యాగన్తా జరాసుతః
బన్ధూన్హనిష్యత్యథ వా నేష్యతే స్వపురం బలీ

తస్మాదద్య విధాస్యామో దుర్గం ద్విపదదుర్గమమ్
తత్ర జ్ఞాతీన్సమాధాయ యవనం ఘాతయామహే

ఇతి సమ్మన్త్ర్య భగవాన్దుర్గం ద్వాదశయోజనమ్
అన్తఃసముద్రే నగరం కృత్స్నాద్భుతమచీకరత్

దృశ్యతే యత్ర హి త్వాష్ట్రం విజ్ఞానం శిల్పనైపుణమ్
రథ్యాచత్వరవీథీభిర్యథావాస్తు వినిర్మితమ్

సురద్రుమలతోద్యాన విచిత్రోపవనాన్వితమ్
హేమశృఙ్గైర్దివిస్పృగ్భిః స్ఫటికాట్టాలగోపురైః

రాజతారకుటైః కోష్ఠైర్హేమకుమ్భైరలఙ్కృతైః
రత్నకూతైర్గృహైర్హేమైర్మహామారకతస్థలైః

వాస్తోష్పతీనాం చ గృహైర్వల్లభీభిశ్చ నిర్మితమ్
చాతుర్వర్ణ్యజనాకీర్ణం యదుదేవగృహోల్లసత్

ఈ నగరానికి శోభగా ఇంద్ర లోకములో ఉండే (ఇంద్ర సభకు సుధర్మ అని పేరు) సుధర్మను తీసుకు వచ్చాడు. ఇంద్రుడు పారిజాతాన్ని పంపాడు,

సుధర్మాం పారిజాతం చ మహేన్ద్రః ప్రాహిణోద్ధరేః
యత్ర చావస్థితో మర్త్యో మర్త్యధర్మైర్న యుజ్యతే

ఆ సభలో ఉన్నంత సేపు మానవుడు మానవ ధర్మాలు (ఉచ్చ్వాస నిశ్వాసలనూ, కాలు నేలకు అంటడం) మొదలైనవి ఉండవు

శ్యామైకవర్ణాన్వరుణో హయాన్శుక్లాన్మనోజవాన్
అష్టౌ నిధిపతిః కోశాన్లోకపాలో నిజోదయాన్

వరుణుడు చక్కని చెవులున్న నల్లటి గుర్రాలను తెల్లటి గుర్రాలనీ పంపించాడు
కుబేరుడు అష్ట సిద్ధులనూ నవ నిధులనూ పంపాడు

యద్యద్భగవతా దత్తమాధిపత్యం స్వసిద్ధయే
సర్వం ప్రత్యర్పయామాసుర్హరౌ భూమిగతే నృప

వాళ్ళు వాళ్ళు వారి వారి అధికారానికి రావడానికి స్వామి వారికి ఇచ్చినదే వారు తిరిగి స్వామికి ఇచ్చారు

తత్ర యోగప్రభావేన నీత్వా సర్వజనం హరిః
ప్రజాపాలేన రామేణ కృష్ణః సమనుమన్త్రితః
నిర్జగామ పురద్వారాత్పద్మమాలీ నిరాయుధః

తన యోగ ప్రభావముతో అందరినీ తీసుకు వెళ్ళి ప్రజా పాలన చేస్తూ నగరానికి రక్షగా బలరామున్ని ఉండమని చెప్పి తానొక్కడూ నిరాయుధుడై యుద్ధానికి పద్మ మాల వేసి యవనుడి మీదకు వెళ్ళాడు

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై తొమ్మిదవ అధ్యాయం

              ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై తొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
స గత్వా హాస్తినపురం పౌరవేన్ద్రయశోऽఙ్కితమ్
దదర్శ తత్రామ్బికేయం సభీష్మం విదురం పృథామ్

అకౄరుడు స్వామి యొక్క ఆజ్య్నానుసారం హస్తినకు వెళ్ళి దృతరాష్టౄన్నీ భీష్మున్నీ కుంతినీ అందరినీ దర్శించాడు

సహపుత్రం చ బాహ్లీకం భారద్వాజం సగౌతమమ్
కర్నం సుయోధనం ద్రౌణిం పాణ్డవాన్సుహృదోऽపరాన్

ద్రోణాచార్యుడూ మొదలైన వారినీ అశ్వద్ధామనూ దుర్యోధనున్నీ కర్ణున్నీ ధర్మరాజునూ ఇతర మిత్రులనూ కలసి, అందరూ బాగున్నరా అని కుశల వార్తలు అడిగి, వారిచే అడిగించబడి

యథావదుపసఙ్గమ్య బన్ధుభిర్గాన్దినీసుతః
సమ్పృష్టస్తైః సుహృద్వార్తాం స్వయం చాపృచ్ఛదవ్యయమ్

ఉవాస కతిచిన్మాసాన్రాజ్ఞో వృత్తవివిత్సయా
దుష్ప్రజస్యాల్పసారస్య ఖలచ్ఛన్దానువర్తినః

కొన్ని నెలలు అక్కడ ఉండి బయలుదేరాడు. అలా ఉంటే కానీ వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్న విషయం తెలుస్తుంది (వృత్తవివిత్సయా -రాజు యొక్క నడవడి తెలియగోరి).
రాజుగారికి మూడు విశేషణాలు వేశాడు. దుష్ట సంతానం గలవాడూ, కొద్ది జ్ఞ్యానం కలవాడు, దుష్టుల ఇష్టమును అనుసరించేవాడు. ఇలాంటి రాజు యొక్క స్వభావాన్ని తెలుసుకుందామని

తేజ ఓజో బలం వీర్యం ప్రశ్రయాదీంశ్చ సద్గుణాన్
ప్రజానురాగం పార్థేషు న సహద్భిశ్చికీఋషితమ్

పాండవులలో ఏమేమి ఉన్నాయో కంటే, పాండవులకు అపకారం చేయాలని దృతరాష్ట్ర పుత్రులు ఎందుకు కోరుతున్నారో తెలుసుకున్నాడు. తమలో లేనివి పాండవులలో ఉన్నాయి, ఓజః బలం వీర్యం తేజస్సు ఇలాంటివి ఎన్నో సద్గుణాలున్నాయి. ప్రజలందరూ వారి యందు అనురాగముతో ఉన్నారు. వారి దగ్గర ఉన్న మంచి గుణాలూ, వారికి మీద ప్రజలకు ఉన్న అనురాగం సహించరానిదిగా ఉంది కౌరవులకు

కృతం చ ధార్తరాష్ట్రైర్యద్గరదానాద్యపేశలమ్
ఆచఖ్యౌ సర్వమేవాస్మై పృథా విదుర ఏవ చ

దృతరాష్ట్ర పుత్రులు పాండు పుత్రులకు విషం పెట్టుట మొదలైన పనులు ఏమేమి చేసారో విదురుడు, కుంతీ అకౄరునికి చెప్పారు. కుంతికి అన్నగారు అకౄరుడు.

పృథా తు భ్రాతరం ప్రాప్తమక్రూరముపసృత్య తమ్
ఉవాచ జన్మనిలయం స్మరన్త్యశ్రుకలేక్షణా

తన పుట్టిల్లు జ్ఞ్యాపకం చేసుకుని కళ్ళవెంబడి నీళ్ళు రాగా కుంతీ దేవి

అపి స్మరన్తి నః సౌమ్య పితరౌ భ్రాతరశ్చ మే
భగిన్యౌ భ్రాతృపుత్రాశ్చ జామయః సఖ్య ఏవ చ

మమ్ము ఎపుడైనా అమ్మా నాన్నలూ అన్నలూ జ్ఞ్యాపకం చేసుకుంటున్నారా. చెల్లేళ్ళూ మేనళ్ళుల్లు దగ్గర  బంధువులూ

భ్రాత్రేయో భగవాన్కృష్ణః శరణ్యో భక్తవత్సలః
పైతృష్వస్రేయాన్స్మరతి రామశ్చామ్బురుహేక్షణః

భక్తుల యందు వాత్సల్యం కలవాడు, శరణు వేడిన వారిని రక్షించేవాడు ఐన భగవానుడైన కృష్ణుడూ, బలరాముడు మేనత్త పిల్లలను జ్ఞ్యాపకం చేసుకుంటున్నారా

సపత్నమధ్యే శోచన్తీం వృకానాం హరిణీమివ
సాన్త్వయిష్యతి మాం వాక్యైః పితృహీనాంశ్చ బాలకాన్

తోడేళ్ళ మధ్య ఉన్న లేడి పిల్లల్లాగ శత్రువుల ఇంట ఉన్నాము. తండ్రి లేని పిల్లలు వారు, భర్త లేని దాన్ని ఐన నాకూ, మా యోగ క్షేమాలు కృష్ణ బలరాములు చూస్తారా

కృష్ణ కృష్ణ మహాయోగిన్విశ్వాత్మన్విశ్వభావన
ప్రపన్నాం పాహి గోవిన్ద శిశుభిశ్చావసీదతీమ్

చిన్న చిన్న పిల్లలతో ఉన్నాను, బాధపడుతున్నాను, నిన్నే శరణు వేడాను గోవిందా, నన్ను నీవు కాపాడవలసింది

నాన్యత్తవ పదామ్భోజాత్పశ్యామి శరణం నృణామ్
బిభ్యతాం మృత్యుసంసారాదీస్వరస్యాపవర్గికాత్

మానవులకు నీ పాద పద్మము కంటే మరొక రక్షకం నేను చూడలేదు. మృత్యువనే సంసారం నుండి బయలు పడాలని కోరేవారికీ పరమాత్మ మోక్షాన్ని పొందగోరేవారికీ నీ పాదపద్మం తప్ప వేరే రక్షకం నాకు కనపడలేదు.

నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే
యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గతా

కృష్ణా, సత్వాది గుణములు లేనివాడా, సకల జగత్తూ వ్యాపించి ఉన్నవాడా, యోగీశ్వరుడువూ, యోగమువూ నీవే. నిన్నే శరణు వేడుతున్నాను

శ్రీశుక ఉవాచ
ఇత్యనుస్మృత్య స్వజనం కృష్ణం చ జగదీశ్వరమ్
ప్రారుదద్దుఃఖితా రాజన్భవతాం ప్రపితామహీ

నీ పితామహుల తల్లి ఇలా చెప్పి బాగా ఏడిచింది. ఆమె ఎంతటి దుఃఖాన్ని పొందిందో అంతటి దుఃఖాన్నీ విదురుడూ అకౄరుడూ పొందారు.

సమదుఃఖసుఖోऽక్రూరో విదురశ్చ మహాయశాః
సాన్త్వయామాసతుః కున్తీం తత్పుత్రోత్పత్తిహేతుభిః

కుంతిని వారిరువురూ ఓదార్చారు. వారి పిల్లలనూ, వారి పుట్టుకనూ, వారి తేజస్సునూ గుర్తు చేస్తూ ఆమెకు ధైర్యం చెప్పారు. దేవతలు నీ వెంట ఉంటారు ఎపుడూ  అని చెప్పారు.

యాస్యన్రాజానమభ్యేత్య విషమం పుత్రలాలసమ్
అవదత్సుహృదాం మధ్యే బన్ధుభిః సౌహృదోదితమ్

వెళ్ళే ముందు అకౄరుడు దృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. తన పిల్లల మీద అతి ప్రేమతో ఉన్న దృతరాష్ట్రునితో అందరి సమక్షములో ఇలా మాట్లాడాడు

అక్రూర ఉవాచ
భో భో వైచిత్రవీర్య త్వం కురూణాం కీర్తివర్ధన
భ్రాతర్యుపరతే పాణ్డావధునాసనమాస్థితః

నీవు కురువులకు కీర్తి పెంచేవాడవు. నీ తమ్ముడైన పాండు రాజు మరణించిన తరువాత నీవు ఆ సింహాసనములో కూర్చున్నావు ( నీ స్థానం తాత్కాలికమే. పాండవులు పెద్దవారవగానే వారికి రాజ్యం ఇవ్వాలి. గుడ్డివారికి రాజ్యాధికారం  ఉండదు. అందుకే పాండురాజునకు రాజ్యం వచ్చింది)

ధర్మేణ పాలయన్నుర్వీం ప్రజాః శీలేన రఞ్జయన్
వర్తమానః సమః స్వేషు శ్రేయః కీర్తిమవాప్స్యసి

రాజైన వాడు భూమిని ఎపుడూ ధర్మముగా పరిపాలించాలి,శీలముతో ప్రజలను రంజింపచేయాలి. తనవారిలో ఇతరులతో సమునిగా ఉండాలి. అలా ఉన్న రాజుకు శ్రేయస్సూ కీర్తీ లభిస్తుంది.

అన్యథా త్వాచరంల్లోకే గర్హితో యాస్యసే తమః
తస్మాత్సమత్వే వర్తస్వ పాణ్డవేష్వాత్మజేషు చ

ఇంకో తీరుగా ప్రవర్తిస్తే అందరి చేతా నిందించబడతావు, నరకానికి వెళతావు. నీ కొడుకుల విషయములో పాండవుల విషయములో సమముగా ప్రవర్తించు.

నేహ చాత్యన్తసంవాసః కస్యచిత్కేనచిత్సహ
రాజన్స్వేనాపి దేహేన కిము జాయాత్మజాదిభిః

నావారు అనుకుని నీ కొడుకులను ప్రేమిస్తున్నావు. ప్రపంచములో ఎవరితో ఎపుడూ మనం మిక్కిలి కలసి ఉండుట కుదరదు. ప్రపంచములో ప్రతీ ప్రాణికీ అన్నిటికంటే ఇష్టమైనది తన శరీరం. అంత బాగా ఇష్టపడే శరీరముతోనే ఎక్కువకాలం ఉండము. అలాంటిది శరీరముతో వచ్చేవాటితో చాలా కాలం ఉండగలం అనుకోవడం సరి కాదు. నీవారు నీకెంత అశాశ్వతమో పాండవులు కూడా నీకు అంతే అశాశ్వతం. అలాంటపుడు ఇద్దరిపట్లా సమానముగా ఉంటూ మంచివాడిగా పేరు తెచ్చుకో.

ఏకః ప్రసూయతే జన్తురేక ఏవ ప్రలీయతే
ఏకోऽనుభుఙ్క్తే సుకృతమేక ఏవ చ దుష్కృతమ్

నీ వెంట కౌరవులూ రారు, పాండవులూ రారు. నీకున్న పేరు మాత్రమే నీ వెంట వస్తుంది. తనతోనే తాను ఎక్కువ కాలం కలసి ఉండలేడు.భార్యా పిల్లలతో కలసి ఉంటాడా ఎవడైనా. ఒక్కడిగా పుడతాడు, ఒక్కడిగా చస్తాడు. తాను చేసిన పుణ్యాన్ని తానే అనుభవిస్తాడు. తాను చేసిన పాపాన్ని కూడా తానే అనుభవిస్తాడు.
మన సుకృత దుష్కృతాలు మనం ఒంటిగానే అనుభవించాలి.

అధర్మోపచితం విత్తం హరన్త్యన్యేऽల్పమేధసః
సమ్భోజనీయాపదేశైర్జలానీవ జలౌకసః

నీది కాని సొమ్మును నీవు అధర్మముగా సంపాదిస్తే దాన్ని ఇంకొకరు అపహరిస్తారు. అధర్మముగా సంపాదించడం బుద్ధి హీనులు చేసే పని. నీది కాని వస్తువు నీ దగ్గర ఉండదు.
చేపలు నీళ్ళలో ఉంటాయి. నీళ్ళలో ఉన్న చేపలు, తమకు ఆహారముగా నీటిలో ఉన్న పదార్థాలని తింటాయి. ఆ పదార్థాలతో బాటు తాము ఏ నీటిలో ఉన్నాయో ఆ నీటిని కూడా తాగుతాయి. కొన్నాళ్ళకు తాము ఉండడానికే చోటు ఉండవు. అధర్మముగా సంపాదించడం అంటే మన ఇంటిని మనమే కొల్లగొట్టుకుంటున్నాం అని అర్థం.

పుష్ణాతి యానధర్మేణ స్వబుద్ధ్యా తమపణ్డితమ్
తేऽకృతార్థం ప్రహిణ్వన్తి ప్రాణా రాయః సుతాదయః

తన బుద్ధి బలముతో అధర్మముతో ఎవరిని పోషిస్తారో అటువంటి జ్ఞ్యానం లేని వాన్నీ, కృతార్థుడు కాని వాన్ని, ప్రాణములూ ధనమూ పుత్రాదులూ బయటకు వెళ్ళగొడతారు.

స్వయం కిల్బిషమాదాయ తైస్త్యక్తో నార్థకోవిదః
అసిద్ధార్థో విశత్యన్ధం స్వధర్మవిముఖస్తమః

ఎవరిని పోషించడానికి నీవు అధర్మం ఆచరించావో అలాంటి వారిచేత నీవు విడువబడతావు. కానీ వారిని పోషించడానికి చేసిన అధర్మం మాత్రం తోడుగా వస్తుంది.
వారు అర్థకోవిదులు కారు. తెలిసినవారు, తాను వెళ్ళేప్పుడు ఏది వెంట వస్తుందో దాన్ని పెంచుకుంటారు. దారాపుత్రాదులను పెంచితే వారు  విడిచిపెడతారు, వారిని దేనితో పోషిస్తామో అవి వెంట వస్తాయి.,
అనుకున్నదాన్ని సాధించలేక చీకటిలోపడి తన ధర్మాన్ని తాను ఆచరించలేకపోతాడు

తస్మాల్లోకమిమం రాజన్స్వప్నమాయామనోరథమ్
వీక్ష్యాయమ్యాత్మనాత్మానం సమః శాన్తో భవ ప్రభో

కలలో వచ్చిన మాయ కోరిక వంటిది ఈ లోకం. అటువంటి దాన్ని విడిచిపెట్టు.
మనసుతో మనసుని (బుద్ధిని )నిగ్రహించుకుని  శాంతముగా ఉండవలసినది. అని చెప్పగా

ధృతరాష్ట్ర ఉవాచ
యథా వదతి కల్యాణీం వాచం దానపతే భవాన్
తథానయా న తృప్యామి మర్త్యః ప్రాప్య యథామృతమ్

అకౄరా నీవు మంగళకరమైన చాలా మంచి మాటను చెబుతున్నావు. అమృతం పొందినవాడు  ఎలా తృపి పొందడో నీ మాట విన్న నేను తృప్తి పొందలేకున్నాను.

తథాపి సూనృతా సౌమ్య హృది న స్థీయతే చలే
పుత్రానురాగవిషమే విద్యుత్సౌదామనీ యథా

నీవు చెప్పినవన్నీ నాకు తెలుసు. కాని ఆ పరమాత్మ మంచి ఏదీ నా హృదయములో నిలవకుండా చేస్తున్నాడు. అందులో సత్యమూ ధర్మమూ ఉండుటలేదు. నా మనసు మొదట నుండీ పుత్రుల అనురాగముతో వైషమ్యాన్నే పొందింది. మెరుపు తీగలాగ వినే వన్నీ చంచలముగా వెళ్ళిపోతూ ఉంటాయి

ఈశ్వరస్య విధిం కో ను విధునోత్యన్యథా పుమాన్
భూమేర్భారావతారాయ యోऽవతీర్ణో యదోః కులే

ఐనా పరమాత్మ అనుకున్న దాన్ని ఎవరు మార్చగలరు. ఎలాగా భూభారం తొలగించడానికి పరమాత్మ పుట్టనే పుట్టాడు.

యో దుర్విమర్శపథయా నిజమాయయేదం
సృష్ట్వా గుణాన్విభజతే తదనుప్రవిష్టః
తస్మై నమో దురవబోధవిహారతన్త్ర
సంసారచక్రగతయే పరమేశ్వరాయ

పరమాత్మ ఎవరి ఊహకూ అందనంతటి తన మాయతో ఈ ప్రపంచాన్ని, రజస్ సత్వాది గుణాలను సృష్టించి అందులో ప్రవేశించి జగత్తును నడిపిస్తున్నాడు. ఏ మాత్రమూ అర్థం కాని విహారం ప్రధానముగా ఉండే గతి ఐన పరమేశ్వరునికి నా నమస్కారం.

శ్రీశుక ఉవాచ
ఇత్యభిప్రేత్య నృపతేరభిప్రాయం స యాదవః
సుహృద్భిః సమనుజ్ఞాతః పునర్యదుపురీమగాత్

ఈ ప్రకారముగా అకౄరుడు అతని అభిప్రాయాన్ని విని, మిత్రుల ఆజ్ఞ్యను పొంది యదు పురిని చేరాడు

శశంస రామకృష్ణాభ్యాం ధృతరాష్ట్రవిచేష్టితమ్
పాణ్దవాన్ప్రతి కౌరవ్య యదర్థం ప్రేషితః స్వయమ్

దృతరాష్ట్రుని చర్యలను వివరించాడు. ఏ పాండవుల గురించి కృష్ణుడు పంపాడో ఆ పాండవుల గురించి కౌరవులు ఏమనుకుంటున్నారో ఏమి చేయాలనుకుంటున్నారో వివరించాడు.

                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఎనిమిదవ అధ్యాయం

                    
                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఎనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ విజ్ఞాయ భగవాన్సర్వాత్మా సర్వదర్శనః
సైరన్ధ్ర్యాః కామతప్తాయాః ప్రియమిచ్ఛన్గృహం యయౌ

తనని ఆశ్రయించిన వారి ఆర్తిని నాశనం చేసే కృష్ణుడు తాను నగరములోకి ప్రవేశించిన వెంటనే అడిగిన వెంటనే కాదనకుండా అంగరాగమును సమర్పించి తన భక్తిని చాటుకున్నది త్రివక్ర. ఆమెను అనుగ్రహించ దలచుకున్నాడు కృష్ణుడు. (కృష్ణునికి మధురా నగరములో ఎటువంటి ఇబ్బందీ రాకుండా తాను అనుకున్నది అనుకున్న విధముగా జరగడానికి, అన్ని కార్యాలు సాధించడానికి కారణం కుబ్జను సత్కరించడం వలననే అనీ ఇటువంటి సత్కారం రాముడు మందరకు చేయనందునే రామునికి కష్టం వచ్చింది అని ఒక రసోక్తి. రామావతారములో తాటకిని చంపడానికి రాముడే వెళి చంపవలసి వచ్చింది. కృష్ణుని దగ్గరకు ఎవరెవరు వధించబడాలో (ఒక్క కంసుడు తప్ప) వారే వచ్చారు. వేదాంత పరమైన అర్థం తీసుకుంటే కుబ్జ స్వామి వారి వనమాల్గా చెబుతారు. అందులో ఉండే ఐదు రకాల పుష్పాలు సుదాముడుగా పుట్టాయి. అందుకే స్వామికి పుష్పాలు ఇచ్చాడు. వనమాల వలన వక్షస్థలానికి రాసిన గంధం కనపడకుండా పోతుంది. అందుకే వనమాల అంస ఐన కుబ్జ గంధాన్ని అందించింది. )
నిన్ను నేను విడిచిపెట్ట దలచుకోలేదు అని కుబ్జ బలరాముడు చూస్తుండగా మరలా వస్తానని చెప్పాడు కృష్ణుడు.
తన కోసం కుబ్జ పరితపిస్తున్నదన్న విషయాన్ని సర్వాత్మ (అందరికీ ఆత్మ ఐన) ఐన, అన్నీ చూచేవాడూ, అన్నీ తెలిసిన వాడైన కృష్ణుడు తెలుసుకున్నాడు. ఆమెకు ప్రీతిని కలిగించగోరి ఆమె ఇంటికి వెళ్ళాడు

మహార్హోపస్కరైరాఢ్యం కామోపాయోపబృంహితమ్
ముక్తాదామపతాకాభిర్వితానశయనాసనైః
ధూపైః సురభిభిర్దీపైః స్రగ్గన్ధైరపి మణ్డితమ్

కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందిన దాసి కాబట్టి ఆమె ఇంటిలో మహా శ్రీమంతుల ఇళ్ళలో ఎలాంటి వస్తువులు ఉండాలో అలాంటి సంపదలతో నిండి ఉన్నది. మనకున్న నాలుగు పురుషార్థాలలో ఆమె కామ ఉపాయాన్నే వ్యాపింపచేసే అలంకారాలు ఉన్నాయి. హారములతో ముత్యములతో వితానములూ శయనాసములూ ధూప దీప అనేకమైన సుగంధములు పుష్పమాలలూ కలిగి ఉన్నాయి

గృహం తమాయాన్తమవేక్ష్య సాసనాత్సద్యః సముత్థాయ హి జాతసమ్భ్రమా
యథోపసఙ్గమ్య సఖీభిరచ్యుతం సభాజయామాస సదాసనాదిభిః

పరమాత్మే వెతుక్కుంటూ రాగా ఆయనను చూచి తొట్రు పడుతూలేచి , ఆసన అర్ఘ్య పాద్యాలలతో తన చెలికత్తెలల్తో సహా ఆమె ఆయనను అర్చించినది

తథోద్ధవః సాధుతయాభిపూజితో న్యషీదదుర్వ్యామభిమృశ్య చాసనమ్
కృష్ణోऽపి తూర్ణం శయనం మహాధనం వివేశ లోకాచరితాన్యనువ్రతః

ఆయన ఉద్ధవునితో కలిసి వచ్చాడు. ఆమె అతనితో పాటు ఉద్ధవునికి కూడా ఉన్నతాసనాన్ని చూపిస్తే పరమ భక్తాగ్రేసుడు కాబట్టి ప్రభువు ముందరా పెద్దల ముందరా ఉన్నతాసనములో కూర్చోరాదు కాబట్టి, ఆసనాన్ని వద్దూ అనకూడదు కాబట్టి, వారి మాట తిరస్కరించకుండా తన స్వరూపానికి భంగం రాకుండా ఆ ఆసనాన్ని చేత్తో స్పృశించాడు. భూమి మీదనే కూర్చున్నాడు.
పరమాత్మ లౌకికమైన ఆచారములను అనుసరించి,

సా మజ్జనాలేపదుకూలభూషణ స్రగ్గన్ధతామ్బూలసుధాసవాదిభిః
ప్రసాధితాత్మోపససార మాధవం సవ్రీడలీలోత్స్మితవిభ్రమేక్షితైః

చూడటానికి ఇది కుబ్జా కృష్ణుల శృంగారమును చెప్పినట్లుగా  ఉంటుంది. కుబ్జ కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళడానికి తనను తాను సిద్ధం చేసుకున్నది.
ఈ తొమ్మిదీ కూర్చుకుని పరమాత్మను చేరింది. జీవుడు పరమాత్మను చేరాలంటే నవ విధ భక్తులను ఆశ్రయించే తీరాలి. ఇది జీవాత్మా పరమాత్మ యొక్క అనుభవమే. వాసుదేవుడొక్కడే పురుషుడు. మనమందరమూ స్త్రీలమే. స్త్రీప్రాయం ఇతరత్ సర్వం. సర్వ దర్శి ఐన పరమాత్మకు ఏ ఏ రకముల కైంకర్యము చేయాలనూకొని జీవుడు పరమాత్మ వద్దకు వచ్చాడో నవ విధ భక్తులతో పరమాత్మను చేరిన నాడు మన చేత అన్ని కైంకర్యములనూ మననుండి స్వీకరిస్తాడు.
స్నానమూ గంధమూ చక్కని వస్త్రాలూ ఆభరణాలూ పూలమాలలూ తాంబూలమూ సుధా మొదలైన వాటిని సేవించి తనను తాను చక్కగా అలంకరించుకుంది. శరీరాన్ని బాగా అలంకరించుకుంది (ఆత్మను అలంకరించుకున్నది)
పరమాత్మను చేరుకున్నది. సిగ్గూ విలాసమూ పరిహాసము వీటితో కలసిన చూపులతో

ఆహూయ కాన్తాం నవసఙ్గమహ్రియా విశఙ్కితాం కఙ్కణభూషితే కరే
ప్రగృహ్య శయ్యామధివేశ్య రామయా రేమేऽనులేపార్పణపుణ్యలేశయా

ఇంత గంధం అర్పించడం వలన పొందిన అంత పుణ్యం కలిగిన దానితో స్వామి రమించాడు. కొంచెముగా గంధమిచ్చింది. మనం మనదీ అనుకున్నదాన్ని పరమాత్మకు అర్పించడం కంటే పుణ్యం ఇంకోటి లేదు. దాని విలుల్వ ఇంతా అని మనం చెప్పలేము. ఆకలితో మాడుతున్నా సరే కుచేలుడు అటుకులు తినలేదంటే ఆ అటుకులు తినరానివిగా ఉన్నాయి. పిల్లలుకూడా తినడానికి పనికి రావని తినని అటుకులను ఇవ్వగా పరమ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కృష్ణుడు.

సానఙ్గతప్తకుచయోరురసస్తథాక్ష్ణోర్
జిఘ్రన్త్యనన్తచరణేన రుజో మృజన్తీ
దోర్భ్యాం స్తనాన్తరగతం పరిరభ్య కాన్తమ్
ఆనన్దమూర్తిమజహాదతిదీర్ఘతాపమ్

ఎన్నో లక్షల కోట్ల జన్మలు తపస్సు చేసి కూడా సంపాదించలేని పరమాత్మ పాద రజస్సును తన శిరస్సునా వక్షస్థలములోనూ నింపుకున్నది. ఆ పాద రజస్సును వక్షస్థలములో దాచుకుని ఇన్ని రోజులూ (తాను కృష్ణ పరమాత్మను కలసినప్పటినుంచీ) తాననుభవించిన పరమాత్మ వియోగ తాపాన్ని విడిచిపెట్టింది

సైవం కైవల్యనాథం తం ప్రాప్య దుష్ప్రాప్యమీశ్వరమ్
అఙ్గరాగార్పణేనాహో దుర్భగేదమయాచత

ఎవరిచేతా పొంద శక్యం కాని కైవల్యనాథుడూ పరమేశ్వరుడైన స్వామిని అంగరాగముతో అంగరాగము అర్పించి ఆయనతో సమాగమం కోరుకుంది అదృష్టహీనురాలు. సాంసారికమైన సమాగమాన్ని కోరింది.

సహోష్యతామిహ ప్రేష్ఠ దినాని కతిచిన్మయా
రమస్వ నోత్సహే త్యక్తుం సఙ్గం తేऽమ్బురుహేక్షణ

ఒక సారి సమాగమం ఐపోయిన తరువాత మళ్ళీ అడిగాడు స్వామి ఇంకేమి కావాలి అని. ఇంకో వారం పాటు నాతోనే ఉండమని కోరింది. పరమాత్మ ఎదురుగా ఉన్నా మనం సంసారాన్నే కోరుత్న్నామంటే ఆ మాయను దాటలేము.

తస్యై కామవరం దత్త్వా మానయిత్వా చ మానదః
సహోద్ధవేన సర్వేశః స్వధామాగమదృద్ధిమత్

ఆమె అడిగిన వరాన్ని ఆమెకు ఇచ్చి మళ్ళీ ఉద్ధవునితో తన ఇంటికి బయలు దేరాడు

దురార్ధ్యం సమారాధ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరమ్
యో వృణీతే మనోగ్రాహ్యమసత్త్వాత్కుమనీష్యసౌ

ఈమె దుర్బుద్ధి కలది. ఎన్ని రకాల దాన తప హోమ అర్చన జపాదులతో ఆరాధించ శక్యం కాని పరమాత్మను అంత గంధం అర్పించి ఆరాధించిన కుబ్జ మనసు దేని గురించి ఉబలాటపడుతుందో దాన్ని కోరింది. సత్వ గుణము లోపించింది.
బ్రహ్మ వైవర్తములో హరి వంశములో పాద్మ పురాణములోను చెబుతారు: వీరిద్దరి సమాగమం వలన ఉపశ్లోకుడనే ఆయన పుట్టి నారద మహర్షి వలన పాంచరాత్ర ఆగమాన్ని మనకు అందిస్తాడు. ఈ విధముగా కృష్ణుడు పాంచరాత్ర ఆగమాన్ని ఉద్ధరించడానికే కుబ్జతో (మన బాషలో చెప్పడానికి) రమించాడు. రామాయణములో ఉన్న శూర్పణఖే కుబ్జగా అవతరించింది. రామావతారములో రాముని మాత్రమే కోరినందుకు, అలా కోరకుండా అమ్మవారితో ఉన్న స్వామివారిని ఆరాధించే విధానాన్ని పొందుపరచే ఉత్తమ గ్రంధాన్ని రచించేవాడిని నీ నుండి పుత్రినిగా పొందుతానని సంకల్పించి తపస్సు చేసింది. ఆమె కుబ్జగా జన్మించింది.

అక్రూరభవనం కృష్ణః సహరామోద్ధవః ప్రభుః
కిఞ్చిచ్చికీర్షయన్ప్రాగాదక్రూరప్రీయకామ్యయా

వెంటనే కృష్ణుడు అకౄరుని ఇంటికి వెళ్ళాడు. కొంచెం అకౄరినికి ప్రీతి చేయగోరి తన పని కూడా నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు

స తాన్నరవరశ్రేష్ఠానారాద్వీక్ష్య స్వబాన్ధవాన్
ప్రత్యుత్థాయ ప్రముదితః పరిష్వజ్యాభినన్ద్య చ

తన బంధువైన స్వామికి ఎదురేగి ఆలింగనం చేసుకుని అభినందించి బలరామ కృష్ణులకు నమస్కారం చేసాడు వారు చేత నమస్కరించబడ్డాడు

ననామ కృష్ణం రామం చ స తైరప్యభివాదితః
పూజయామాస విధివత్కృతాసనపరిగ్రహాన్

ఆసన అర్ఘ్య పాద్యాలతో పూజ పూర్తి ఐన తరువాత కాళ్ళు కడిగి ఆ తీర్థాన్ని నెత్తిన ధరించి

పాదావనేజనీరాపో ధారయన్శిరసా నృప
అర్హణేనామ్బరైర్దివ్యైర్గన్ధస్రగ్భూషణోత్తమైః

శుభ్రమైన వస్త్రములూ గంధములూ ఆభరణములూ సమర్పించి శిరస్సుతో నమస్కరించి

అర్చిత్వా శిరసానమ్య పాదావఙ్కగతౌ మృజన్
ప్రశ్రయావనతోऽక్రూరః కృష్ణరామావభాషత

అతని పాదలని ఒడిలోపెట్టుకుని తుడుస్తూ వినయముతో వంగిన వాడై రామ కృష్ణులతో ఇలా అంటున్నాడు

దిష్ట్యా పాపో హతః కంసః సానుగో వామిదం కులమ్
భవద్భ్యాముద్ధృతం కృచ్ఛ్రాద్దురన్తాచ్చ సమేధితమ్

స్వామీ అదృష్టం బాగుండి మీరు కంసుని చంపి, అతని వలన బాధపడిన మీ కులాన్ని ఉద్ధరించారు

యువాం ప్రధానపురుషౌ జగద్ధేతూ జగన్మయౌ
భవద్భ్యాం న వినా కిఞ్చిత్పరమస్తి న చాపరమ్

ఇది మీకు పెద్ద కార్యం కాదు. మొత్తం జగత్తునకు మీరే కారణం, మీరే జగద్స్వరూపులు, జగత్తునకు ప్రధానపురుషులు
మీరు లేకుండా ఈ జగత్తులో పెద్దా చిన్నా అంటూ ఏదీ ఉండదు. మీకంటే వేరే ఎక్కువదీ తక్కువదీ లేదు


ఆత్మసృష్టమిదం విశ్వమన్వావిశ్య స్వశక్తిభిః
ఈయతే బహుధా బ్రహ్మన్శ్రు తప్రత్యక్షగోచరమ్

అష్ట శక్తులతో నీవు ప్రపంచాన్ని సృష్టించి అందులో ప్రవేశించి కనపడకుండా ఉన్న మీరు కనపడే రూపాలతో నానా శక్తులనూ సాక్షాత్కరింపచేసి అన్నిరూపాలలో మీరే ఉండి పరిపాలిస్తారు

యథా హి భూతేషు చరాచరేషు మహ్యాదయో యోనిషు భాన్తి నానా
ఏవం భవాన్కేవల ఆత్మయోనిష్వాత్మాత్మతన్త్రో బహుధా విభాతి

ఈ పంచభూతాలూ మీ నుండే పుట్టాయి (తామస అహంకారం) , ఇన్ని రూపాలుగా ఒకటే భాసిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా కొంచెం ఉన్నది చాలా ఉన్నట్లుగా, ఒకటి వేయిగా వేయి ఒకటిగా కనపడుతుంది. స్థూల సూక్ష్మాలుగా కనపడుంతుంది
పరమాత్మ ఐన నీవుకూడా నీవే కారణముగా వేటి వేటిని సృష్టించావో వాటిలో నీవు ప్రవేశిస్తావు. నీవు ప్రతీ వస్తువులోపలా వున్నావు, ప్రతీ వస్తువునీ నీలో ఉంచున్నావు
తాను అనుకున్న రూపం ధరించి  తాను అనుకున్నపని చేస్తాడు
సృజస్యథో లుమ్పసి పాసి విశ్వం రజస్తమఃసత్త్వగుణైః స్వశక్తిభిః
న బధ్యసే తద్గుణకర్మభిర్వా జ్ఞానాత్మనస్తే క్వ చ బన్ధహేతుః

సృష్టిస్తావు రక్షిస్తావు సంహరిస్తావు. నీవు ఒకడివే ఐనా రజోగుణాన్ని తీసుకున్నపుడు బ్రహ్మగా తమోగుణాన్ని తీసుకున్నపుడు రుద్రునిగా సత్వ గుణం తీసుకున్నపుడు విష్ణువులా ఉంటావు. ఏ గుణముతో ఏ పని చేసినా ఏ రూపముతో ఎందులో ప్రవేశించినా వాటితో నీవు బంధించబడవు. నీకు ఏ గుణమూ లేదూ, అంటదు.
నీకు ఎటువంటి మమకారమూ ఉండదు. జ్ఞ్యానం ఉన్నటువంటి వారికి బంధం అనేది ఉండదు

దేహాద్యుపాధేరనిరూపితత్వాద్భవో న సాక్షాన్న భిదాత్మనః స్యాత్
అతో న బన్ధస్తవ నైవ మోక్షః స్యాతామ్నికామస్త్వయి నోऽవివేకః

వారు వేరు వీరు వేరు అని అనుకోవడానికి, అటువంటి భేధాన్ని చెప్పేది శరీరం. అటువంటి శరీరాన్ని తీసి పక్కన పెడితే ఉన్నదంతా ఆత్మే. దేహం అనేది ఉపాధి. ఆ ఉపాధి ఎప్పుడూ ఉండేది కాదు. అలాగే పంచభూతాలు ఎపుడూ ఉండేవి కాదు.
పుట్టుకా సంసారమూ, మనకున్న భేధమూ అటువంటిది కాదు. నీకు బంధము లేదు. బంధము లేదు కాబట్టి మోక్షమూ లేదు.
బంధ మోక్షములు లేవనడానికి కోరికా అవివేకమూ (విడమరచి చూడలేకపోవుట ) లేదు. శరీరాన్నే ఆత్మా అనుకోవడం వలననే బంధం వస్తున్నది. శరీరం కంటే విడిగా ఆత్మను చూడగలుగుట వివేకం.

త్వయోదితోऽయం జగతో హితాయ యదా యదా వేదపథః పురాణః
బాధ్యేత పాషణ్డపథైరసద్భిస్తదా భవాన్సత్త్వగుణం బిభర్తి

ప్రాచీన వేద మార్గం పాప చిహ్నములు గలవారి మార్గముతో బాధించబడినపుడల్లా నీవు ఆ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వస్తావు. ఈ ప్రపంచం కాపాడడానికి నీవు సత్వగుణం స్వీకరించి వస్తావు

స త్వమ్ప్రభోऽద్య వసుదేవగృహేऽవతీర్ణః
స్వాంశేన భారమపనేతుమిహాసి భూమేః
అక్షౌహిణీశతవధేన సురేతరాంశ
రాజ్ఞామముష్య చ కులస్య యశో వితన్వన్

ఈ పని చేయడానికే వసుదేవుని ఇంటిలో భూ భారాన్ని తొలగించడానికి వేంచేసారు. కొన్ని వందల అక్షౌహిణీల సైన్యాన్ని నశింపచేసి ,ఆ సైన్యం ఉన్న రాజులను కూడా నశింపచేసి భూభారాన్ని నశింపచేసి మీ వంశానికి కీర్తిని పెంచుతావు. 18*23 అక్షౌహిణీల సైన్యాన్ని జరాసంధుడు తెస్తాడు. భారతములో పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం.
రాక్షసుల అంశలో పుట్టిన రాజుల సైన్యాన్ని హతమార్చి యదుకుల కీర్తిని విస్తరింపచేస్తూ

అద్యేశ నో వసతయః ఖలు భూరిభాగా
యః సర్వదేవపితృభూతనృదేవమూర్తిః
యత్పాదశౌచసలిలం త్రిజగత్పునాతి
స త్వం జగద్గురురధోక్షజ యాః ప్రవిష్టః

నా ఇల్లు ఎంతో పుణ్యం చేసుకుని ఉంది ఈ నాడు. సర్వ దేవ మూర్తి పితృ దేవ మూర్తి ఐన పరమాత్మ, నీ పాద తీర్థం మూడులోకాలనూ పావనం చేస్తుంది.
అటువంటి నీవు ఏ మా ఇంటిలోకి ప్రవేశించావో అటువంటి మా ఇల్లు పావనమైనది.

కః పణ్డితస్త్వదపరం శరణం సమీయాద్
భక్తప్రియాదృతగిరః సుహృదః కృతజ్ఞాత్
సర్వాన్దదాతి సుహృదో భజతోऽభికామాన్
ఆత్మానమప్యుపచయాపచయౌ న యస్య

ఏమాత్రం తెలిసిన వారైనా నీ కంటే వేరేవాడిని శరణు వేడుతాడా. నీవు భక్తులకు ప్రియుడవు, వారి ప్రియమైన మాటలను ఆదరించినవాడవు, నిరంతరం క్షేమాన్ని ఆశించేవాడవు (సుహృత్ - ప్రత్యుపకారాన్ని ఆశించకుండా, ఎదుటివాడు అపకారం చేసినా ఉపకారం చేసేవాడు సుహృత్)
కోరినవారికి అన్ని కోరికలూ ఇస్తావు, నిన్ను కూడా నీవు ఇచ్చుకుంటావు. అలా ఇచ్చుకున్నా నీకు హెచ్చు తక్కువ భావాలు లేవు

దిష్ట్యా జనార్దన భవానిహ నః ప్రతీతో
యోగేశ్వరైరపి దురాపగతిః సురేశైః
ఛిన్ధ్యాశు నః సుతకలత్రధనాప్తగేహ
దేహాదిమోహరశనాం భవదీయమాయామ్

నా అదృష్టం బాగుండి నా కంటికి నీవు కనపడ్డావు. యోగీశ్వరుల చేత కూడా నీ స్థానం అందబడదు.
నీ మాయను నీవే చేధించు, దాని వలనే సుతా కలత్రా ఆప్త గేహ దేహ ఇలాంటి ఆరిటితో కలిగే దాన్ని నీవే చేదించు

ఇత్యర్చితః సంస్తుతశ్చ భక్తేన భగవాన్హరిః
అక్రూరం సస్మితం ప్రాహ గీర్భిః సమ్మోహయన్నివ

ఇలా అకౄరునిచేత స్తోరం చేయబడి తన చిరునవ్వుతో ఆయనను మోహింపచేస్తూ

శ్రీభగవానువాచ
త్వం నో గురుః పితృవ్యశ్చ శ్లాఘ్యో బన్ధుశ్చ నిత్యదా
వయం తు రక్ష్యాః పోష్యాశ్చ అనుకమ్ప్యాః ప్రజా హి వః

మీరు చాలా పెద్దలు, మాకు పిన తండ్రివి, కొనియాడదగిన వారు, మేము మీచేత రక్షించబడ దగైన వారము, మేము భృత్యులము  మీరు ప్రభువులు.

భవద్విధా మహాభాగా నిషేవ్యా అర్హసత్తమాః
శ్రేయస్కామైర్నృభిర్నిత్యం దేవాః స్వార్థా న సాధవః

లోకములో ఉత్తండైన వారు మీలాంటి వారిని, పూజించదగిన వారిని సేవించాలి, పూజకు యోగ్యులు మీ వంటి వారు. దేవతలందరూ స్వార్థపరులు. నీలాంటి వారిని సేవిస్తే ఫలితం వస్తుంది. నిజముగా శ్రేయస్సు కావాలి అనుకున్న వారు మీ వంటి వారిని సేవించాలి.

న హ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః
తే పునన్త్యురుకాలేన దర్శనాదేవ సాధవః

నీరుగా ఉండే తీర్థాలు గానీ, మట్టితో తిలతో ఏర్పడిన దేవతలు తొందరగా తరింపచేయరు. ఎంతో కాలం సేవిస్తే కానీ వారు పవిత్రులను చేయరు. మహానుభావులను ఒక్క సారి చూస్తే చాలు, అన్ని పాపాలూ పోతాయి. పవిత్రులైన భగవత్ దర్శనం చాలు.

స భవాన్సుహృదాం వై నః శ్రేయాన్శ్రేయశ్చికీర్షయా
జిజ్ఞాసార్థం పాణ్డవానాం గచ్ఛస్వ త్వం గజాహ్వయమ్

మీరు నాకు ఇష్టులు పెద్దలు శ్రేయోభిలాషులు. నాకు కావలసిన ఒక శ్రేయస్సును మీ వద్ద పొంద గోరి మీ వద్దకు వచ్చాను.
దృతరాష్టృడు తన పుత్రులతో సమానముగా పాండవులను చూచుట లేదని తెలిసింది. అది తెలుసుకుని రావలసినది.

పితర్యుపరతే బాలాః సహ మాత్రా సుదుఃఖితాః
ఆనీతాః స్వపురం రాజ్ఞా వసన్త ఇతి శుశ్రుమ

తండ్రి చనిపోయిన తరువాత తల్లితో బాటుగా పిల్లలను తన నగరానికి తీసుకు వచ్చాడని విన్నాము. ఈ సోదరుని పుత్రులలో అంబికా పుత్రుడు (దృతరాష్టృడు) దోష దృష్టితో చూస్తున్నాడు. దుష్టులైన అతని పుత్రుల వశములో గుడ్డివాడై పడి ఇద్దరి మీద సమానముగా ఉండలేకపోతున్నాడని విన్నాము.

తేషు రాజామ్బికాపుత్రో భ్రాతృపుత్రేషు దీనధీః
సమో న వర్తతే నూనం దుష్పుత్రవశగోऽన్ధదృక్

గచ్ఛ జానీహి తద్వృత్తమధునా సాధ్వసాధు వా
విజ్ఞాయ తద్విధాస్యామో యథా శం సుహృదాం భవేత్

నాయనా వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకో. మంచో చెడో అక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకుని వచ్చాక మనవాళ్ళకు ఎలా మేలు జరుగుతుందో ఆ పని మనం చేద్దాము.

ఇత్యక్రూరం సమాదిశ్య భగవాన్హరిరీశ్వరః
సఙ్కర్షణోద్ధవాభ్యాం వై తతః స్వభవనం యయౌ

ఈ ప్రకారముగా అకౄరున్ని ఆజ్ఞ్యాపించి బలరామ ఉద్ధవులతో కలసి పరమాత్మ తన ఇంటికి తాను వెళ్ళాడు

                                                                 సర్వం శ్రీకృష్ణార్పణమసు 

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఏడవ అధ్యాయం

         

  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఏడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తం వీక్ష్య కృషానుచరం వ్రజస్త్రియః
ప్రలమ్బబాహుం నవకఞ్జలోచనమ్
పీతామ్బరం పుష్కరమాలినం లసన్
ముఖారవిన్దం పరిమృష్టకుణ్డలమ్

ఉద్ధవుడు కూడా కృష్ణుడిలాగే ఉంటాడు. పీతాంబరధారి ఆజానుబాహుడు పద్మాక్షుడు పద్మాల ధరించిన వాడు, మణి కుండలాలు ప్రకాశించే ముఖ పద్మం పవిత్రం ఐన చిరునవ్వుతో శుభముగా కనపడుతున్నాడు

సువిస్మితాః కోऽయమపీవ్యదర్శనః
కుతశ్చ కస్యాచ్యుతవేషభూషణః
ఇతి స్మ సర్వాః పరివవ్రురుత్సుకాస్
తముత్తమఃశ్లోకపదామ్బుజాశ్రయమ్

గోపికలందరు ఎవరితను, కృష్ణుడిలాగే ఉన్నాడు , అవే ఆభరణాలు అదే రూపముతో ఉన్నాడు. అని ఉత్సాహం కలవారై

తం ప్రశ్రయేణావనతాః సుసత్కృతం సవ్రీడహాసేక్షణసూనృతాదిభిః
రహస్యపృచ్ఛన్నుపవిష్టమాసనే విజ్ఞాయ సన్దేశహరం రమాపతేః

అందరూ వెళ్ళి అతని చుట్టూ చేరగా, వారు ఆయనను సత్కరించి ఒక ఉన్నత ఆసనములో కూర్చోబెట్టి స్త్రీ సహజమైన చిరునవ్వుతో సిగ్గుతో
ఇలా అడిగారు. సింహాసనములో కూర్చోబెట్టగానే కృష్ణుడు పంపిన సందేశాన్ని తీసుకుని వచ్చిన వాడని తెలుసుకున్నాడు

జానీమస్త్వాం యదుపతేః పార్షదం సముపాగతమ్
భర్త్రేహ ప్రేషితః పిత్రోర్భవాన్ప్రియచికీర్షయా

మనకు బాగా కావలసిన వాడు మనకు దూరముగా వెళ్ళిపోతే వారు పంపినవారు మన దగ్గరకు సందేశం ఇవ్వడానికి వస్తే ఉండే అక్కసు ఇక్క్కడ కనపడుతుంది మనకు
నీవు కృష్ణుడి సేవకుడవు  అని మాకు తెలిసింది. అతను పంపితేనే వచ్చినట్లున్నావు. తల్లి తండ్రుల క్షేమం తెలుసుకోవాలని పంపినట్లుంది.

అన్యథా గోవ్రజే తస్య స్మరణీయం న చక్ష్మహే
స్నేహానుబన్ధో బన్ధూనాం మునేరపి సుదుస్త్యజః

అది కాకుంటే వ్రేపల్లెలో అంతకన్నా ఆయన గుర్తుంచుకోవలసిన వారెవరున్నారు. తల్లి తండ్రుల మీద మునులకు కూడా ప్రేమ ఉంటుంది.

అన్యేష్వర్థకృతా మైత్రీ యావదర్థవిడమ్బనమ్
పుమ్భిః స్త్రీషు కృతా యద్వత్సుమనఃస్వివ షట్పదైః

సహజముగా ఉండే ప్రేమ తల్లీ తండ్రుల మీద ఉంటుంది. తక్కిన వారి మీద అవసరం ఎంత వరకో అంత వరకే ప్రేమ ఉంటుంది
మగవారికి ఆడ వారి మీద ప్రేమ పూల మీద తుమ్మెదలకు ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది (మకరందం ఎంత వరకూ ఉంటుందో పూవు మీద అంతవరకూ ప్రేమ ఉంటుంది)

నిఃస్వం త్యజన్తి గణికా అకల్పం నృపతిం ప్రజాః
అధీతవిద్యా ఆచార్యమృత్విజో దత్తదక్షిణమ్

ఎవరెవరు ఎవరెవరిని ఎంతవరకూ వాడుకొని వదిలిపెడతారో ఇందులో చెప్పబడుతుంది. ఇవి సార్వకాలిక సత్యాలు
వేశ్యలు విటులను డబ్బు ఐపోగానే విడిచిపెడతారు
ప్రజలు సమర్ధుడు కాని రాజుని విడిచిపెడతారు
శిష్యులు చదువు ఐపోయిన తరువాత గురువును విడిచిపెడతారు
దక్షిణ ఇచ్చేదాకే యజమాని వద్ద ఋత్విక్కులు ఉంటారు

ఖగా వీతఫలం వృక్షం భుక్త్వా చాతిథయో గృహమ్
దగ్ధం మృగాస్తథారణ్యం జారా భుక్త్వా రతాం స్త్రియమ్

పళ్ళు ఉన్నంత వరకే పక్షులు ఆ చేట్టు మీద ఉంటాయి
అతిథులు ఇంటిలో భోజనం చేసే దాకే ఉంటారు
మృగములో కాలిపోయిన అడవిని వదలిపెడతారు
జారుడు తన ప్రియురాలిని అనుభవించేందవరకే వాడుకుంటాడు

ఇతి గోప్యో హి గోవిన్దే గతవాక్కాయమానసాః
కృష్ణదూతే సమాయాతే ఉద్ధవే త్యక్తలౌకికాః

పైకి మాత్రం కృష్ణుడి పేరు చెప్పకున్నా వాకూతో మనసుతో శరీరముతో నోటితో ఆయననే స్మరిస్తూ కృష్ణుడి దూత వచ్చాడనీ, ఆయనతో ఎలా మాట్లాడాలో కూడా తెలియక లౌకిక ధర్మాన్ని కూడా వదలిపెట్టారు.

గాయన్త్యః ప్రీయకర్మాణి రుదన్త్యశ్చ గతహ్రియః
తస్య సంస్మృత్య సంస్మృత్య యాని కైశోరబాల్యయోః

కృష్ణుడి చేతలు తలచుకుంటూ ఏడుస్తూ సిగ్గు విడిచిపెట్టి స్వామి యొక్క బాల్య కిశోర చేష్టలు తలచుకుంటూ ఇలా అన్నారు
దీన్ని భ్రమర సందేశం అంటారు. కృష్ణుడితో మాట్లాడవలసిన మాటలన్నీ తుమ్మెదతో మాట్లాడుతున్నారు. ఇవి కూడా భాగవతములో నిత్య పారాయణం చేసుకోవాలి. అపుడు చాలా కాలం తెలియకుండా తప్పిపోయిన వారు తప్పక వచ్చి కలుస్తారు.  ఒక ప్రియుడు ఇంకొంక ప్రియురాలి వద్దకు వెళ్ళిరాగా ఆ ప్రియురాలి వద్దకు వెళ్ళి వచ్చిన గుర్తులు కనపడుతున్నాయి. అపుడు ఆ ప్రియురాలు ఎలా మాట్లాడుతుందో ఇలా ఉంటుంది

కాచిన్మధుకరం దృష్ట్వా ధ్యాయన్తీ కృష్ణసఙ్గమమ్
ప్రియప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్

గోప్యువాచ
మధుప కితవబన్ధో మా స్పృశఙ్ఘ్రిం సపత్న్యాః
కుచవిలులితమాలాకుఙ్కుమశ్మశ్రుభిర్నః
వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం
యదుసదసి విడమ్బ్యం యస్య దూతస్త్వమీదృక్

కపట బంధువా నా పాదాన్ని ముట్టుకోకు. సవతి యొక్క వక్షస్థలములో అలంకరించబడిన కుంకుమ తాకిన నీ చేతులతో నా కాళ్ళు ముట్టుకోకు.
ఆ మధుపతి వారి వారి ప్రియురాళ్ళ అనుగ్రహాన్ని పొందనీ  నాకెందుకు. నీలాంటి వాడు దూతగా ఉన్నాడంటే అతను చాలా మంచివాడే.

సకృదధరసుధాం స్వాం మోహినీం పాయయిత్వా
సుమనస ఇవ సద్యస్తత్యజేऽస్మాన్భవాదృక్
పరిచరతి కథం తత్పాదపద్మం ను పద్మా
హ్యపి బత హృతచేతా హ్యుత్తమఃశ్లోకజల్పైః

ఒక్క సారి అదరామృతాన్ని పానం చేయించి మళ్ళీ వదలిపెట్టివెళ్ళాడు. ఇలాంటి వంచకుడి పాదపద్మాన్ని ఆమె (లక్ష్మీ దేవి) ఎలా సేవిస్తున్నది. అనవసరముగా ఆయన గురించి మంచి వారంతా చాలా చెప్పారు. అది  విని ఉంటుంది. అతను ఎలాంటి వాడో ఆమెకు తెలిసి ఉండదు.

కిమిహ బహు షడఙ్ఘ్రే గాయసి త్వం యదూనామ్
అధిపతిమగృహాణామగ్రతో నః పురాణమ్
విజయసఖసఖీనాం గీయతాం తత్ప్రసఙ్గః
క్షపితకుచరుజస్తే కల్పయన్తీష్టమిష్టాః

ఆరు పాదములు గల తుమ్మెద (ఇదంతా శ్రీవైష్ణవ సాంప్రదాయానికి మకుటాయమానం. ఆరు పాదములు గలది ద్వయమంత్రం. ద్వయ మంత్రం నిరంతరం పరమాత్మ పాద పద్మాలనే గుర్తుచేస్తుంది. మొట్టమొదట స్వామిని పట్టునుకునేది అమ్మవారే. లక్ష్మీ దేవికి కూడా పరమాత్మ యందు మనసు కలగాడనికి భాగవతులు గానం చేసిన భగవంతుని కళ్యాణ గుణములే కారణం. ఇక పామరులు పరమాత్మను గానం చేయకుండా ఎలా ఉంటారు. షట్పదీ అంటే ద్వయమంత్రం).
ఆరు పాదములు గల తుమ్మెద నీవు పరమాత్మను గానం చేస్తున్నావు. ఇల్లూ వాకిలీ లేని మా ముందర గానం చేస్తే ఏమి లాభం. నగరములో నాగరిక స్త్రీల దగ్గర గానం చేయి. మాకు ఇల్లూ వాకిలీ లేదు (పరమాత్మను నమ్ముకున్న వారికి ఇల్లూ వాకిలీ ఎలాగా ఉండదు. స్వామి కృప లభించినవారి సంపద అంతా స్వామి హరిస్తాడు. పరమాత్మ తప్ప మరి ఏదీ లేని వాళ్ళం అని అర్థం)
వారు ఎపుడు రమిస్తున్నాడో వారికి ఈ విషయం (కృష్నపరమాత్మ దొతను ఇంకొకరి వద్దకు పంపించాడన్న మాట వింటే) వారు కూడా ఆయనను బయటకు పంపించివేస్తారు. వారి దగ్గరకే వెళ్ళి గానం చేయి

దివి భువి చ రసాయాం కాః స్త్రియస్తద్దురాపాః
కపటరుచిరహాసభ్రూవిజృమ్భస్య యాః స్యుః
చరణరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా
అపి చ కృపణపక్షే హ్యుత్తమఃశ్లోకశబ్దః

మూడు లోకాలలో ఆయన పొందలేని స్త్రీ అంటూ ఉంటుందా. ఎంత కపటముగా నవ్వుతారు. కనుబొమ్మలు కదిలిస్తూ నవ్వే ఆ కపట నవ్వు చూస్తే ఎవరైనా ఆయనతో ప్రేమల్తో పడిపోకుండా ఉంటారా. ఆయన పాద పారగాన్ని లక్ష్మీ దేవే ధరిస్తుంది అంటే ఇంక మేమెంత.
దిక్కు లేని వారు ఆయనను ఉత్తముల చేత గానం చేయబడే వాడా అని పిలుస్తారా. కేవలం ఉత్తమ శ్లోకుడు అన్న శబ్దం మాత్రం మిగిలింది. అటువంటి వారు మాకెందుకు. భక్తుల చేత గానం చేయబడతాడన్న పేరే ఆయనకు కీర్తి. పరమ భాగవతోత్తముల వలననే భగవంతునికి కీర్తి

విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాతుకారైర్
అనునయవిదుషస్తేऽభ్యేత్య దౌత్యైర్ముకున్దాత్
స్వకృత ఇహ విషృష్టాపత్యపత్యన్యలోకా
వ్యసృజదకృతచేతాః కిం ను సన్ధేయమస్మిన్

నీవు కృష్ణుని వలన కోపించిన ఆడువారిని ఎలా ఓదార్చాలో బాగా నేర్చుకున్నావు. వాటిని నీవు వదలిపెట్టు. అతని కోసం మేము భరతలనూ ఇల్లనూ సోదరులనూ అందరినీ వదలిపెట్టి వచ్చాము. అందరినీ మేము వదలిపెట్టి వస్తే ఆయన మమ్ము వదలివెళ్ళాడు

మృగయురివ కపీన్ద్రం వివ్యధే లుబ్ధధర్మా
స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానామ్
బలిమపి బలిమత్త్వావేష్టయద్ధ్వాఙ్క్షవద్యస్
తదలమసితసఖ్యైర్దుస్త్యజస్తత్కథార్థః

వేటగాడు మృగమును మాటు వేసి గొయ్యి తవ్వి ఎలా పడేస్తాడో ఆయన కూడా మమ్ము వేటాడి ఆయన బంధములో పడేసాడు
నల్ల ప్రేమలు చాలు. (నల్లని వాని ప్రేమ చాలు - అసితం అంటే నలుపు). అతని ప్రేమ వద్దనుకున్నా ఆయన కథ మాత్రం మేము విడిచిపెట్టలేకున్నాము. ఆయన కథా విశేషాలు వదలిపెట్టరానివి. ఆయనను మరచిపోదామన్నా ఆయన కథలను మరువలేకున్నాము

యదనుచరితలీలాకర్ణపీయూషవిప్రుట్
సకృదదనవిధూతద్వన్ద్వధర్మా వినష్టాః
సపది గృహకుటుమ్బం దీనముత్సృజ్య దీనా
బహవ ఇహ విహఙ్గా భిక్షుచర్యాం చరన్తి

ఈ తుమ్మెద యొక్క ఝంకార నాదాలని హాస విలాసాలను చూచి ఇంక ఇక్కడ మేమెందుకని పక్షులన్నీ చెట్లు వదలి వెళ్ళిపోతున్నాయి. తుమ్మెద యొక్క దూర్త చేష్టలను చూచి 'ఏకాంత రామలైనా పక్షులన్నీ చెట్లు వదలివెళ్ళిపోతున్నయి. భగవంతుని కథలను వినీ గానం చేసి, గానం చేసిన వాటిని వినీ, సంసారులు అందరూ వారి ఇళ్ళను విడిచి వెళుతున్నారు అని దీని భావం. కృష్ణుని ఆచరణమూ లీలలను తమ చెవులకు అమృత బిందువుల వలె విని ఆస్వాదించుట వలన అన్ని ద్వంద్వములనూ తోసి,, అన్నీ విడిచిపెట్టి ఇంటినీ కుటుంబాన్నీ అన్నీ విడిచిపెట్టి వారు దీనులై పక్షులవలె వారు కూడా భిక్షుకులు అవుతున్నారు. ఒక సారి పరామాత్మ యొక్క ఏ ఒక్క చిన్న కథా అమృతం చెవిలో పడగానే రాగ ద్వేషాది ద్వంద్వాలను వదలిపెట్టి ఇల్లు వదలి సన్యాసులవుతున్నారు. తుమ్మెదలు కూడా రకరకాల పుష్పాలలో మకరందాన్ని ఆస్వాదించడానికి అలవాటుపడి, ఆ తుమ్మెదల కమ్మని ఝంకారాన్ని విని ఆ పద్మాలు కూడా వాటి శోభనూ గృహకృత్యాలనూ వదలిపెట్టాయి. పక్షులు కూడా ఈ చెట్టునుండి ఆ చెట్టుకూ తిరుగ్తున్నాయి భిక్షుకులలాగ. ఈ పక్షులు చెట్లని వదలి వేరే చెట్లకు వెళుతున్నాయి అనడములో భిక్షుకులే పక్షులు లాగ వెళుతున్నారు అని అర్థం. వాక్యము వ్యంగ్యమూ కలసి ఉన్నాయి ఇందులో. గోపికలు ఒక్క సారి కృష్ణ పరమాత్మ వేణు గానములో ఒక్క అంసం వింటే భర్తలనూ పుత్రులనూ సోదరులనూ బంధువులనూ అన్నీ వదలిపెట్టి ఆయన దగ్గరకే ప్రేమ భిక్ష కోసం తిరుగుతారు.

వయమృతమివ జిహ్మవ్యాహృతం శ్రద్దధానాః
కులికరుతమివాజ్ఞాః కృష్ణవధ్వో హరిణ్యః
దదృశురసకృదేతత్తన్నఖస్పర్శతీవ్ర
స్మరరుజ ఉపమన్త్రిన్భణ్యతామన్యవార్తా

వాడు కపటి. ఆ కపటి మాటలు విని నిజం అనుకున్నాము. కులికరుతం : వేటాడే వాడు ఏ పక్షులను వేటాడ దలచుకుంటాడో చెట్టు చాటున దాక్కుని ఆ పక్షి గొంతుతో అరుస్తాడు. అది విని వేరే పక్షులన్నీ మా పక్షికి ఆపద వచ్చిందేమో అని వస్తాయి. అపుడు వేటగాడు వల వేసి వాటిని పడతాడు. దీన్ని కులికరుతం అంటారు. గోపికలు కూడా అతని చేష్టలు నిజం అని నమ్మి మోసపోయారు. ఇక ఇతరుల సంగతి ఏమని చెప్పాలి. ఇతరులు మోసపోరా.

ప్రియసఖ పునరాగాః ప్రేయసా ప్రేషితః కిం
వరయ కిమనురున్ధే మాననీయోऽసి మేऽఙ్గ
నయసి కథమిహాస్మాన్దుస్త్యజద్వన్ద్వపార్శ్వం
సతతమురసి సౌమ్య శ్రీర్వధూః సాకమాస్తే

ఇన్ని తప్పులు చేసి మళ్ళీ ఆయన ఇంకా మిమ్ము పంపాడా మా ప్రియ సఖుడు. చెప్పు ఇంకేమైనా మిగిలి ఉందా. ఇంకేమి కావాలి నీకు.
మళ్ళీ మమ్ములనూ జంటగా (రెండవ వారిగా) పంపుతావా (సవతిగా పంపుతావా). వక్షస్థలములో నిరంతరం ఆమె కూర్చునే ఉన్నది కదా.

అపి బత మధుపుర్యామార్యపుత్రోऽధునాస్తే
స్మరతి స పితృగేహాన్సౌమ్య బన్ధూంశ్చ గోపాన్
క్వచిదపి స కథా నః కిఙ్కరీణాం గృణీతే
భుజమగురుసుగన్ధం మూర్ధ్న్యధాస్యత్కదా ను

ఇపుడు మథురా పురములో ఉన్నాడా ఆయనా? తల్లి తండ్రులనూ బంధువులనూ జ్ఞ్యాపకం ఉంచుకున్నాడా. మా గురించి ఎపుడైనా మాట్లాడతాడా. ఆయన గంధము చేత సుగంధమైన భుజాన్ని మా శిరస్సున ఎపుడు ధరిస్తామో.

శ్రీశుక ఉవాచ
అథోద్ధవో నిశమ్యైవం కృష్ణదర్శనలాలసాః
సాన్త్వయన్ప్రియసన్దేశైర్గోపీరిదమభాషత

అది చూచిన ఉద్దవుడు. కృష్ణుని యందు వీరికి ఎంత ప్రేమ ఉంది. వారిని ఓదారుస్తూ ఇలా అంటున్నాడు

శ్రీద్ధవ ఉవాచ
అహో యూయం స్మ పూర్ణార్థా భవత్యో లోకపూజితాః
వాసుదేవే భగవతి యాసామిత్యర్పితం మనః

అమ్మా, మీరు ఎంత మహానుభావురాళ్ళు, మీరు పరిపూర్ణార్థులు, మీకు కావలసినది ఏమీ లేదు. మిమ్ము లోకాలన్నీ పూజిస్తాయి. ఆయనను కాదు మిమ్ము పూజిస్తాయి.
పరిపూర్ణముగా మీ మనసును భగవానునికే అర్పించారు

దానవ్రతతపోహోమ జపస్వాధ్యాయసంయమైః
శ్రేయోభిర్వివిధైశ్చాన్యైః కృష్ణే భక్తిర్హి సాధ్యతే

పరమాత్మ యందు భక్తి కలగాలంటే దానమూ వ్రతమూ తపమూ హోమమూ స్వాధ్యాయమూ జపమూ చేయాలి. అలాంటి పరమాత్మ యందు మీరు సాటి లేని భక్తి కలిగి ఉన్నారు.

భగవత్యుత్తమఃశ్లోకే భవతీభిరనుత్తమా
భక్తిః ప్రవర్తితా దిష్ట్యా మునీనామపి దుర్లభా

మీరు చూపే భక్తి మునులకు కూడా లభించదు.

దిష్ట్యా పుత్రాన్పతీన్దేహాన్స్వజనాన్భవనాని చ
హిత్వావృనీత యూయం యత్కృష్ణాఖ్యం పురుషం పరమ్

మీరు పుత్రులనూ భర్తలనూ దేహములనూ తనవారినీ సంపదలనూ అన్ని వదలిపెట్టి కృష్ణున్ని సేవించారు. సకల వేద శాస్త్ర పురాణాలు దేన్ని కలిగి ఉండాలని చెప్పారో దాన్ని మీరు పరిపూర్ణముగా పొంది ఉన్నారు

సర్వాత్మభావోऽధికృతో భవతీనామధోక్షజే
విరహేణ మహాభాగా మహాన్మేऽనుగ్రహః కృతః

కృష్ణ పరమాత్మ నన్ను పంపి నా మీద చాలా గొప్ప దయ చూపాడు. భగవంతుని ఎలా ప్రేమిస్తారో మిమ్ము చూస్తే తెలుస్తుంది. మిమ్ము దర్శింపచేయడానికి నన్ను మీ వద్దకు పంపి ఉంటాడు.

శ్రూయతాం ప్రియసన్దేశో భవతీనాం సుఖావహః
యమాదాయాగతో భద్రా అహం భర్తూ రహస్కరః

మీకు పరమ సుఖాన్ని కలిగించే పరమాత్మ పంపిన సందేశాన్ని వినండి. నేను భతృ కృత్యాన్ని రహస్యముగా చేసేవాడిని. ఆయన వార్తను మీకు చెబుతున్నాను.

శ్రీభగవానువాచ
భవతీనాం వియోగో మే న హి సర్వాత్మనా క్వచిత్
యథా భూతాని భూతేషు ఖం వాయ్వగ్నిర్జలం మహీ
తథాహం చ మనఃప్రాణ భూతేన్ద్రియగుణాశ్రయః

గోపికల్లారా మీరు నేనూ వేరుగా లేము.. మీతో నా వియోగం నాతో మీ వియోగం లేదు. ప్రాణులలో పంచభూతములు వేరూ ప్రాణులు వేరుగా ఉండనట్లుగా. నేను సర్వ భూతాంతర్యామిని. అలాంటపుడు వియోగం ఎక్కడిది.

ఆత్మన్యేవాత్మనాత్మానం సృజే హన్మ్యనుపాలయే
ఆత్మమాయానుభావేన భూతేన్ద్రియగుణాత్మనా

నేనే నాలో నన్నే సృష్టించుకుంటాను నన్నే కాపాడుకుంటాను నన్నే లయం చేసుకుంటాను.
నా యోగ మాయతో పంచ భూతాలుగా గుణాలుగా జ్ఞ్యానేంద్రియాలుగా కర్మేంద్రియాలుగా సత్వ రజస్తమో గుణాలుగా కనిపిస్తాను.

ఆత్మా జ్ఞానమయః శుద్ధో వ్యతిరిక్తోऽగుణాన్వయః
సుషుప్తిస్వప్నజాగ్రద్భిర్మాయావృత్తిభిరీయతే

ఏ గుణము లేనిదీ జ్ఞ్యాన స్వరూపంది సత్వాది గుణ రహితమైనది అన్నిటికన్నా విలక్షణం, ఏ గుణముతో అన్వయించేది కాదు ఈ ఆత్మ
జాగృత్ స్వప్న సుషుప్తీ అనే మూడు అవస్థలూ శరీరానికి గానీ ఆత్మకు కాదు. కానీ శరీరానికి ఉన్న అవస్థలు ఆత్మకు అని ఆత్మ భావిస్తుంది నా మాయతో

యేనేన్ద్రియార్థాన్ధ్యాయేత మృషా స్వప్నవదుత్థితః
తన్నిరున్ధ్యాదిన్ద్రియాణి వినిద్రః ప్రత్యపద్యత

లేచిన వారు నాకు ఇలా కల వచ్చింది అనిలేవగానే చెప్పుకుంటాడు. అలా మరణం నుండి పుట్టిన వాడు దేహం రాగానే ఉన్నవాటినన్నటినీ నాకు వచ్చాయి అని అనుకుంటాడు. దేహం రాగానే నేను మనిషినీ అనుకుంటాడు. కాబట్టి ఎవడు ఇంద్రియములను అరికట్టగలడో వాడు భగవంతుని మాయా ప్రభావాన్ని, స్వరూపాన్ని తెలుసుకోగలడు.

ఏతదన్తః సమామ్నాయో యోగః సాఙ్ఖ్యం మనీషిణామ్
త్యాగస్తపో దమః సత్యం సముద్రాన్తా ఇవాపగాః

నిద్ర లేని వాడికి కలలు రానట్లుగా. నిత్యమూ మేలుకొని ఉన్న వారికికలలు రావు. ఇంద్రియములను తన వశములో ఉంచుకున్నవారికి అనర్థాలు రావు. యోగముగానీ సాంఖ్యముగానీ ఇదే. ఇంద్రియజయమే. ఇంద్రియ జయం కంటే వేరేది ఏదీ లేదు.

అన్ని నదులకూ సముద్రం ఎలా చివరి మెట్టో తపస్సూ త్యాగమూ దమమూ సత్యమూ మొదలైనవాటిని ఇంద్రియ నిగ్రహమే చివరి మెట్టు. అది పొందకపోతే ఎన్ని తపస్సులు చేసినా ప్రయోజనం లేదు.

యత్త్వహం భవతీనాం వై దూరే వర్తే ప్రియో దృశామ్
మనసః సన్నికర్షార్థం మదనుధ్యానకామ్యయా

నేను ఇపుడు మీకు దూరముగా ఉన్నాను. నేను మీకు ప్రియుడను. మీరు కూడా నాకు ప్రియురాళ్ళు. నిరంతరం మీరు నన్ను స్మరించడానికి నేను మీ మనసుకు దగ్గరగా ఉండడానికే మీ కనులకు దూరముగా ఉన్నాను. నన్నే మీరు ధ్యానించ్డానికే అలా ఉన్నాను.

యథా దూరచరే ప్రేష్ఠే మన ఆవిశ్య వర్తతే
స్త్రీణాం చ న తథా చేతః సన్నికృష్టేऽక్షిగోచరే

దూరముగా ఉన్న ప్రియుని యందు మనసు ఉన్నట్లుగా కంటికి ఎదురుగా ఉన్న ప్రియుని మీద ఉండదు.

మయ్యావేశ్య మనః కృత్స్నం విముక్తాశేషవృత్తి యత్
అనుస్మరన్త్యో మాం నిత్యమచిరాన్మాముపైష్యథ

అన్నిటినీ వదలిపెట్టి మీ మనసును నా యందే ఉంచి ఎపుడూ నన్నే స్మరిస్తూ త్వర్గానే నన్ను చేరుకుంటారు.

యా మయా క్రీడతా రాత్ర్యాం వనేऽస్మిన్వ్రజ ఆస్థితాః
అలబ్ధరాసాః కల్యాణ్యో మాపుర్మద్వీర్యచిన్తయా

ఆ రోజు రాస గోష్ఠిలో ఎవరెవరు నన్ను చూడలేదో నాతో క్రీడించలేదో వారందరూ నన్ను తలచుకుంటూ నన్నే చేరారు. నాతో కలసి విహరించిన వారికంటే నాతో దూరముగా ఉండి నన్ను స్మరించినవారికే ముందుగా వైకుంఠప్రాప్తి లభించింది. మీకు పరమ పదం లభించడానికే నేను మీకు దూరముగా ఉన్నాను

శ్రీశుక ఉవాచ
ఏవం ప్రియతమాదిష్టమాకర్ణ్య వ్రజయోషితః
తా ఊచురుద్ధవం ప్రీతాస్తత్సన్దేశాగతస్మృతీః

కృష్ణ సందేశం ఉద్ధవుని ద్వారా విని అసలు విషయం జ్ఞ్యాపకం వచ్చి ఇలా అన్నారు

గోప్య ఊచుః
దిష్ట్యాహితో హతః కంసో యదూనాం సానుగోऽఘకృత్
దిష్ట్యాప్తైర్లబ్ధసర్వార్థైః కుశల్యాస్తేऽచ్యుతోऽధునా

అదృష్టం బాగుండి కంసుడు చనిపోయాడు. యాదవులకు పాపం చేసిన కంసుడు వధించబడ్డాడు, రాజ్యములో ఉన్న వారి బాధలు పోయాయి.

కచ్చిద్గదాగ్రజః సౌమ్య కరోతి పురయోషితామ్
ప్రీతిం నః స్నిగ్ధసవ్రీడ హాసోదారేక్షణార్చితః

కృష్ణుడు ఇపుడు అక్కడ ఉన్న పౌర స్త్రీలకు ప్రీతి కలిగిస్తున్నాడా

కథం రతివిశేషజ్ఞః ప్రియశ్చ పురయోషితామ్
నానుబధ్యేత తద్వాక్యైర్విభ్రమైశ్చానుభాజితః

ప్రేమంటే బాగా తెలిసిన వాడు , స్త్రీలకు ప్రీతి ఐన వాడు, ఇతని చేష్టలతో మాటలలతో ఇతని వలలో పడని స్త్రీలెవరుంటారు. అంత ఘాడముగా ప్రేమించే స్త్రీలు వస్తే ఈయనైనా ఎలా కాదంటాడు

అపి స్మరతి నః సాధో గోవిన్దః ప్రస్తుతే క్వచిత్
గోష్ఠిమధ్యే పురస్త్రీణామ్గ్రామ్యాః స్వైరకథాన్తరే

పరమాత్మ మమ్ములను అపుడపుడైనా తలచుకుంటున్నాడా. మేమంతా పల్లెటూరి వాళ్ళం మాకు నాగరికత తెలియదు కదా.
నాగరికత తెలిసిన స్త్రీల మధ్య ఉండి మమ్ము అపుడపుడైనా స్మరించుకుంటున్నాడా.

తాః కిం నిశాః స్మరతి యాసు తదా ప్రియాభిర్
వృన్దావనే కుముదకున్దశశాఙ్కరమ్యే
రేమే క్వణచ్చరణనూపురరాసగోష్ఠ్యామ్
అస్మాభిరీడితమనోజ్ఞకథః కదాచిత్

మెల్లెలూ మొల్లలూ సన్నజాజులూ. ఇలాంటి రకరకాల పుష్పముల శోభతో వెన్నెలతో మేము  పరమాత్మతో కలసి విహరించిన రాత్రులను స్వామి జ్ఞ్యాపకం చేసుకుంటున్నాడా. మళ్ళీ ఇక్కడకు వస్తాడా

అప్యేష్యతీహ దాశార్హస్తప్తాః స్వకృతయా శుచా
సఞ్జీవయన్ను నో గాత్రైర్యథేన్ద్రో వనమమ్బుదైః

ఇంద్రుడు మేఘములతో వనాన్ని తడిపినట్లుగా  బాధతో ఎండిపోయిన మాహృదయాలను తడపగలడా

కస్మాత్కృష్ణ ఇహాయాతి ప్రాప్తరాజ్యో హతాహితః
నరేన్ద్రకన్యా ఉద్వాహ్య ప్రీతః సర్వసుహృద్వృతః

శతృ సంహారం ఐపోయింది రాజ్యం లభించింది. ఇంక ఆయన ఎందుకు వస్తాడు
రాజు కాబట్టీ రాజ పుత్రికలను వివాహం చేసుకుని హాయిగా ఉంటాడు.

కిమస్మాభిర్వనౌకోభిరన్యాభిర్వా మహాత్మనః
శ్రీపతేరాప్తకామస్య క్రియేతార్థః కృతాత్మనః

వనాలలో ఉండే మాతో ఆయనకు ఏమి పని. ఆయన పరమాత్మ, ఆయనకంటూ ఏ కోరికలూ ఉండవు. ఆయన కొత్తగా పొందేదేదీ ఉండదు.

పరం సౌఖ్యం హి నైరాశ్యం స్వైరిణ్యప్యాహ పిఙ్గలా
తజ్జానతీనాం నః కృష్ణే తథాప్యాశా దురత్యయా

ఆశ లేకపోవడమే సౌఖ్యం అని పింగళ (అనే వేశ్య చెబుతుంది. అవధూత ఇరవై నాలుగు మంది గురువులలో ఒకరు. ) చెబుతుంది. అందరికంటే శ్రీమంతుడు లోపలే ఉంటే (హృదయములో) ఆయనను వదలి బయటి శ్రీమంతుల కోసం వెతుకుతున్నా అని అనుకుంటుంది పింగళ.
నిరాశ సుఖం అని తెలిసినా మాకింకా కృష్ణుని మీద ఆశ పోవడం లేదు. అది పోదు.

క ఉత్సహేత సన్త్యక్తుముత్తమఃశ్లోకసంవిదమ్
అనిచ్ఛతోऽపి యస్య శ్రీరఙ్గాన్న చ్యవతే క్వచిత్

అలాంటి పరమాత్మను విడిచిపెట్టాలి అని అనుకునేవాడు ఎవడు. అనిత్యమైన లక్ష్మీ దేవి కూడా స్వామిని వదలిపెట్టక ఆశ్రయించి ఉంటుంది. అలంటి స్వామిని ఎవరు కాదనుకుంటారు.

సరిచ్ఛైలవనోద్దేశా గావో వేణురవా ఇమే
సఙ్కర్షణసహాయేన కృష్ణేనాచరితాః ప్రభో

అణువణువు చూసినా ఆయనే కనపడతాడు, పర్వతాలూ గడ్డిపోచలూ గోవులూ ఏది చూసినా అయానే కనపడతాడు. ఇదంతా బలరామునితో కలసి ఆయన సంచరించిన ప్రాంతమే.

పునః పునః స్మారయన్తి నన్దగోపసుతం బత
శ్రీనికేతైస్తత్పదకైర్విస్మర్తుం నైవ శక్నుమః

ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి.
అమ్మవారి శోభను  పెంచే స్వామి యొక్క అడుగుల జాడలను చూస్తూ ఉంటే స్వామిని మరచిపోలేకపోతున్నాము.

గత్యా లలితయోదార హాసలీలావలోకనైః
మాధ్వ్యా గిరా హృతధియః కథం తం విస్మరామ హే

తీయని మాటలతో మా మనసును హరించిన స్వామిని మేము ఎలా మరచిపోతాము

హే నాథ హే రమానాథ వ్రజనాథార్తినాశన
మగ్నముద్ధర గోవిన్ద గోకులం వృజినార్ణవాత్

ఈ శ్లోకాన్ని రోజూ అనుసంధానం చేసుకుంటే సంసారములో ఏ చిక్కులూ రావు.  ఇది మంత్రం.
మనకూ లక్ష్మీ దేవికీ వ్రేపల్లెకూ నాధుడు ఆయన. అందరి ఆర్తినీ పోగొట్టే స్వామి. దుఃఖం అనే సముద్రములో ఉన్న పశువులం మేము. మమ్ము ఉద్ధరించు. ఇది  రోజు చదువుకుంటూ ఉంటే మనకు రోజూ సంసారములో ఉండే చిక్కులు రావు.

శ్రీశుక ఉవాచ
తతస్తాః కృష్ణసన్దేశైర్వ్యపేతవిరహజ్వరాః
ఉద్ధవం పూజయాం చక్రుర్జ్ఞాత్వాత్మానమధోక్షజమ్

తరువాత, వారంతా కృష్ణపరమాత్మ సందేశముతో వారి విరహ బాధ తొలగిపోగా, ఉద్ధవున్ని పూజించారు. ఉద్ధవున్ని కృష్ణ పరమాత్మగానే భావించి పూజించారు.

ఉవాస కతిచిన్మాసాన్గోపీనాం వినుదన్శుచః
కృష్ణలీలాకథాం గాయన్రమయామాస గోకులమ్

ఈ ఉద్ధవుడు కూడా కొన్ని నెలలు వారితో బాటే వారు పాడుతున్న కృష్ణ లీలలను వింటూ వ్రేపల్లెలోనే ఉన్నాడు. తాను కూడా కృష్ణ కథలను గానం చేస్తూ గోకులాన్ని ఆనందింపచేస్తూ అక్కడే ఉన్నాడు

యావన్త్యహాని నన్దస్య వ్రజేऽవాత్సీత్స ఉద్ధవః
వ్రజౌకసాం క్షణప్రాయాణ్యాసన్కృష్ణస్య వార్తయా

ఎన్ని నెలలు ఉద్ధవుడు వ్రేపల్లెలో ఉన్నాడో అన్ని నెలలూ వ్రేపల్లె వాసులకు కృష్ణ పరమాత్మ కథాలాపాలతో క్షణ కాలములా గడచిపోయాయి

సరిద్వనగిరిద్రోణీర్వీక్షన్కుసుమితాన్ద్రుమాన్
కృష్ణం సంస్మారయన్రేమే హరిదాసో వ్రజౌకసామ్

నదులనూ పర్వతములనూ లోయలనూ వనములనూ పూసినటువంటి చెట్లనూ హరిదాసుడైన ఉద్ధవుడు వ్రేపల్లె వాసులకు కృష్ణున్నే జ్ఞ్యాపకం చేయిస్తూ తిరిగాడు. వారికి కృష్ణ సాక్షాత్కారం కలిగించాడు.

దృష్ట్వైవమాది గోపీనాం కృష్ణావేశాత్మవిక్లవమ్
ఉద్ధవః పరమప్రీతస్తా నమస్యన్నిదం జగౌ

ఇలా ఉద్ధవుడు అన్ని రోజులు ఉండి కృష్ణ పరమాత్మ యందు గోపికలకున్న అనన్యమైన భక్తిని చూచి పరమ ప్రీతితో పరమానందాన్ని పొంది ఆ గోపిలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇలా చెప్పాడు

ఏతాః పరం తనుభృతో భువి గోపవధ్వో
గోవిన్ద ఏవ నిఖిలాత్మని రూఢభావాః
వాఞ్ఛన్తి యద్భవభియో మునయో వయం చ
కిం బ్రహ్మజన్మభిరనన్తకథారసస్య

ఎంత మహానుభావులు ఈ గోపికలు. దేహధారులు. ఈ గోపికలు సకల జగదంతర్యామి ఐన పరమాత్మ మీద అన్ని భావాలు నిలిపి ఉన్నవారు. సంసారం అంటే భయపడే మునులూ మేమూ ఎలాంటి భక్తి భావం కావాలి అని మేము కోరుకుంటున్నామో అలాంటి భకతి భావం కలిగి ఉన్నారు
బ్రహ్మ జన్మ ఎందుకు. ఇలాంటి జన్మ ఎత్తితే చాలు. ఇది ఉండగా ఆ బ్రహ్మపుట్టుక ఎందుకు.

క్వేమాః స్త్రియో వనచరీర్వ్యభిచారదుష్టాః
కృష్ణే క్వ చైష పరమాత్మని రూఢభావః
నన్వీశ్వరోऽనుభజతోऽవిదుషోऽపి సాక్షాచ్
ఛ్రేయస్తనోత్యగదరాజ ఇవోపయుక్తః

అడవిలో తిరిగే వారు, చూచేవారికి వ్యభిచారముతో దుష్టులుగా కనపడుతున్నారు. పరమాత్మ ఐన కృష్ణుని యందు దృఢమైన ప్రేమ భక్తి భావముతో ఉన్నారు
పరమాత్మ ఎంత దయా మయుడంటే ఏమీ తెలియకుండా సేవించినా స్వామి మోక్షన్నిస్తాడు. తెలియకున్నా వాడిన మందు (అగదరాజ) రోగాన్ని పోగొట్టినట్లుగా. మనకు ముక్తిని ప్రసాదిస్తాడు

నాయం శ్రియోऽఙ్గ ఉ నితాన్తరతేః ప్రసాదః
స్వర్యోషితాం నలినగన్ధరుచాం కుతోऽన్యాః
రాసోత్సవేऽస్య భుజదణ్డగృహీతకణ్ఠ
లబ్ధాశిషాం య ఉదగాద్వ్రజవల్లభీనామ్

గోపికలకు లభించిన ఈయోగం అమ్మవారికి కూడా లభించలేదు. ఈ అనుగ్రహం, నిరంతరం పరమాత్మనే ఆరాధించే అమ్మవారికి కూడా లభించలేదు. పారిజాత పుష్ప వాసనలు ఉన్న స్వర్గ స్త్రీలకు కూడా లభించలేదు. ఇక వేరే వారి గురించి చెప్పాలి. రాస లీలలో పరమాత్మ భుజ దండము చేత కంఠము ఆలింగనం చేసుకోబడింది. అటువంటి గోపికా స్త్రీలందరినుండి ఎలాంటి సతోషం కలిగిందో, అటువంటి సంతోషాన్ని కలిగించిన భగవానుని ప్రసాదం అమ్మవారికీ దేవతా స్త్రీలకూ లేదు.

ఆసామహో చరణరేణుజుషామహం స్యాం
వృన్దావనే కిమపి గుల్మలతౌషధీనామ్
యా దుస్త్యజం స్వజనమార్యపథం చ హిత్వా
భేజుర్ముకున్దపదవీం శ్రుతిభిర్విమృగ్యామ్

అందుకే నేనిక్కడే ఉండాలని ఉంటే ఉండనీయడు స్వామి, కానీ కనీసం వచ్చే జన్మలో ఐనా నేను ఈ బృందావనములో గోపికల పాదముల చే తొక్క పడే గడ్డిపోచలలో నేను కూడా ఒక చిన్న గడ్డిపోచ పుడితే చాలు. పొద గానీ తీగ గానీ ఒక తృణ కానీ. ప్రపంచములో విడిచిపెట్టలేని తనవారినీ ఇంటినీ సంపదనూ భావాలనూ విడిచిపెట్టి పరమాత్మ పాద పద్మాలను చేరారు. వేదవేదానతములు ఏ పరమాత్మ పాదపద్మాలను వెతుకుతున్నాయో అటువంటి పాదపద్మాలను చేరారు

యా వై శ్రియార్చితమజాదిభిరాప్తకామైర్
యోగేశ్వరైరపి యదాత్మని రాసగోష్ఠ్యామ్
కృష్ణస్య తద్భగవతః చరణారవిన్దం
న్యస్తం స్తనేషు విజహుః పరిరభ్య తాపమ్

అమ్మవారు పూజించారు అన్ని కోరికలనూ పొందిన బ్రహ్మాదులూ పూజించారు యోగీశ్వరులు పూజించారు. అటువంటి పరమాత్మ యొక్క పాదం ఆనాటి రాసలీలలో గోపికలు తమ స్తనములలో ఉంచుకుని ఆలింగనం చేసుకుని అన్ని తాపాలనూ తొలగించుకున్నారు. అటువంటి గోపికలు పాద సంచారం చేసే చోట ఒక గడ్డిపోచగా పుడితే చాలు

వన్దే నన్దవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్ష్ణశః
యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయమ్

గోపికల పాద ధూళికి నేను నిరంతరం నమస్కారం చేస్తాను. వారిచేత గానం చేయబడే పరమాత్మ కథా గానం మూడు లోకములనూ పవిత్రం చేస్తుంది. అటువంటి పాద రేనువులకు నేను నమస్కరిస్తున్నాను.

శ్రీశుక ఉవాచ
అథ గోపీరనుజ్ఞాప్య యశోదాం నన్దమేవ చ
గోపానామన్త్ర్య దాశార్హో యాస్యన్నారురుహే రథమ్

ఇలా కొంతకాలం ఉండి గోపికలు చెప్పి వారి అనుమతి పొంది, నంద గోపునికీ గోపాలురకూ చెప్పి, తాను వెళ్ళ దలచుకుని రథాన్ని అధిరోహించాడు

తం నిర్గతం సమాసాద్య నానోపాయనపాణయః
నన్దాదయోऽనురాగేణ ప్రావోచన్నశ్రులోచనాఃఅ

అలా వెళుతున్న ఉద్ధవునికి గోపికలూ నందాదులూ కానుకలిచ్చి కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని ఇలా అంటున్నారు.

మనసో వృత్తయో నః స్యుః కృష్ణ పాదామ్బుజాశ్రయాః
వాచోऽభిధాయినీర్నామ్నాం కాయస్తత్ప్రహ్వణాదిషు

మా మనసు యొక్క అన్ని ప్రవృత్తులూ పరమాత్మ పాదాలను ఆశ్రయించే ఉండాలి.
మా వాక్కులు స్వామి పేర్లనే తలచాలి, మా దేహం అతనికి వంగి సేవచేస్తూ నమస్కరిస్తూ ఉండాలి

కర్మభిర్భ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయా
మఙ్గలాచరితైర్దానై రతిర్నః కృష్ణ ఈశ్వరే

మేము ఇది వరకు ఆచరించిన అనేక కర్మల చేత ఆయాలోకాలలో తిరిగుతున్న మేము పరమాత్మ సంకల్పముతో కొన్ని ఉత్తమ కర్మలు చేసి పరమాత్మను ప్రేమించగలిగిన జన్మను పొందగలిగాము.

ఏవం సభాజితో గోపైః కృష్ణభక్త్యా నరాధిప
ఉద్ధవః పునరాగచ్ఛన్మథురాం కృష్ణపాలితామ్

కృష్ణ పరమాత్మ యందు భక్తితో గోపాలురందరూ గౌరవిస్తే కృష్ణుని చేత పాలించబడే మధురాపురికి ఉద్ధవుడు వచ్చాడు

కృష్ణాయ ప్రణిపత్యాహ భక్త్యుద్రేకం వ్రజౌకసామ్
వసుదేవాయ రామాయ రాజ్ఞే చోపాయనాన్యదాత్

వచ్చి, సాష్టాంగ పడి ఆ గోపికల భక్తి ఉద్రేకాన్ని కృష్ణునికి చెప్పాడు.
గోపికలూ గోపాలురూ ఇచ్చిన కానుకలను బలరామునికీ రాజుకూ కృష్ణుడికీ కూడా ఇచ్చాడు.

                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఆరవ అధ్యాయం


             ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఆరవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
వృష్ణీనాం ప్రవరో మన్త్రీ కృష్ణస్య దయితః సఖా
శిష్యో బృహస్పతేః సాక్షాదుద్ధవో బుద్ధిసత్తమః

ఉపనయనం చదువూ పూర్తి అయ్యాయి కృష్ణునికి. ఇక ఆ రాజ్యానికి ఒక మంచి మంత్రి కావాలి. వృష్ణి వంశానికి ఉత్తముడైన మంత్రి ఉద్ధవుడు. ఆయన సాక్షాత్ బృహస్పతి శిష్యుడు. ఉత్తమ బుద్ధిమంతుడు. యాదవులకు శ్రేష్ట్మైన మంత్రి.

తమాహ భగవాన్ప్రేష్ఠం భక్తమేకాన్తినం క్వచిత్
గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తిహరో హరిః

ఆయన కేవలం బుద్ధిమంతుడే కాక ఆయన కృష్ణ పరమాత్మకు ఏకాంత భక్తుడు. ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే కృష్ణుడు ఉద్ధవుడి చేతిని చేతిలోకి తీసుకున్నాడు

గచ్ఛోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహ
గోపీనాం మద్వియోగాధిం మత్సన్దేశైర్విమోచయ

కుబ్జ దగ్గరకు వెళ్ళబోయే ముందు తనతో చాలా కాలం ప్రాణానికి ప్రాణముగా తిరిగిన గోపికల వద్దకు తన ప్రతినిధిగా వెళ్ళమని చెప్పాడు. నంద యశోదలకు ప్రీతిని కలిగించు. నా ఎడబాటు వలన కలిగిన బాధను తొలగించు

తా మన్మనస్కా తృష్ట్ప్రాణా మదర్థే త్యక్తదైహికాః
మామేవ దయితం ప్రేష్ఠమాత్మానం మనసా గతాః
యే త్యక్తలోకధర్మాశ్చ మదర్థే తాన్బిభర్మ్యహమ్

వారు నాయందే మనసూ ప్రాణమూ ఉంచినవారు.  నా కోసమే వారు తమ దేహానికి కావలసిన సౌకర్యాలు కల్పించుకోవడం కూడా మానేసారు.
నన్నే ప్రియునిగా ఇష్టతమునిగా ఆత్మగా వారు నన్నే చేరారు.
నాకోసం అన్నీ వదిలిపెట్టిన వారినీ, అన్నీ మాని వేసిన వారినీ నేను భరిస్తాను. నాకోసం మానివేసిన పనులను నేనే చేస్తాను.

మయి తాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియః
స్మరన్త్యోऽఙ్గ విముహ్యన్తి విరహౌత్కణ్ఠ్యవిహ్వలాః

ప్రీతి పాత్రులందరిలోకల్లా ప్రీతిపాత్రునిగా నన్ను భావించి బాధపడుతున్న ఆ స్త్రీలను, ఎడబాటుతో విహ్వలులై మూర్చ పోతూ ఉన్న ఆ స్త్రీలను

ధారయన్త్యతికృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్కథఞ్చన
ప్రత్యాగమనసన్దేశైర్బల్లవ్యో మే మదాత్మికాః

నేను వస్తాను అని చెప్పినందుకు నా కోసం ఎదురుచూస్తున్న స్త్రీలను ప్రాణాలు విడువకుండా నా కోసం నిలుపుకుంటున్నారు వారు. నేను మళ్ళీ వస్తాను అని చెప్పాను వారితో. నీవు వెళ్ళి నేను ఎందుకు రాలేదో ఎపుడు వస్తానో నేను రానంతకాలం వారు ఎలా ఉండాలో నా మాటగా వారికి చెప్పి వార్ని ఓదార్చి వారి దుఃఖాన్ని తగ్గించి రా.

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్త ఉద్ధవో రాజన్సన్దేశం భర్తురాదృతః
ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నన్దగోకులమ్

ఇలా కృష్ణ పరమాత్మ సందేశాన్ని తీసుకుని ఉద్దవుడు నందగోప భవనానికి వెళ్ళాడు. (ఊరు చేరాలంటే సూర్యాస్తమములోగా చేరాలి)

ప్రాప్తో నన్దవ్రజం శ్రీమాన్నిమ్లోచతి విభావసౌ
ఛన్నయానః ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః

గోధూళి వేళ ఆవులు నడుస్తుంటే లేచిన దుమ్ముతో ఉద్దవుని రథం కనపడకుండా పోయింది.

వాసితార్థేऽభియుధ్యద్భిర్నాదితం శుశ్మిభిర్వృషైః
ధావన్తీభిశ్చ వాస్రాభిరుధోభారైః స్వవత్సకాన్

సాయం కాలం పూటా అవులూ దూడలూ ఎలా ప్రవర్తిసాయో, అలా అరుస్తూ పోరాడుతూ కోట్లాడుతూ పక్కవాటిని పొడుస్తూ ఇలాంటి చేష్టలన్నీ చేస్తూ

ఇతస్తతో విలఙ్ఘద్భిర్గోవత్సైర్మణ్డితం సితైః
గోదోహశబ్దాభిరవం వేణూనాం నిఃస్వనేన చ

అటూ ఇటూ గంతులేస్తూ ఉన్నాయి. ఆవు పాలు పితికే చప్పుడూ పిల్లన గ్రోవి చప్పుడూ కృష్ణ రామ లీలలను గానం చేస్తున్న పాటలతో

గాయన్తీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః
స్వలఙ్కృతాభిర్గోపీభిర్గోపైశ్చ సువిరాజితమ్

చక్కగా అలంకరించుకుని కృష్ణ బలరాముల చరితమును గానం చేసుకుంటూ పాలు పితుకుతున్నారు, వారి చరితాన్ని జ్ఞ్యాపకం చేసుకుంటూ మజ్జిగ చేస్తున్నారు.

అగ్న్యర్కాతిథిగోవిప్ర పితృదేవార్చనాన్వితైః
ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమమ్

వైశ్యులు కాబట్టి అగ్నినీ సూర్యున్నీ అతిథులనూ బ్రాహ్మణులను పితృ దేవతలనూ దేవతలనూ ఆరాధిస్తున్నారు.

సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితమ్
హంసకారణ్డవాకీర్ణైః పద్మషణ్డైశ్చ మణ్డితమ్

అందమైన ఆ నంద వ్రజమూ, అంతా చుట్టూ తోటలూ పూలూ తుమ్మెదలూ వాటి నాదాలు.

తమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియమ్
నన్దః ప్రీతః పరిష్వజ్య వాసుదేవధియార్చయత్

ఇలా వచ్చిన ఉద్దవున్ని నందుడు కౌగిలించుకుని ఆతిధ్యమిచ్చి కృష్ణుడే స్వయముగా వచ్చాడని భావించి పూజించాడు.

భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖమ్
గతశ్రమం పర్యపృచ్ఛత్పాదసంవాహనాదిభిః

పరమాన్న భోజనాన్ని పెట్టి పరుపు మీద కూర్చోపెట్టి పాద సేవలు చేస్తూ అలసట పోయిన తరువాత

కచ్చిదఙ్గ మహాభాగ సఖా నః శూరనన్దనః
ఆస్తే కుశల్యపత్యాద్యైర్యుక్తో ముక్తః సుహృద్వ్రతః

శూర సేనుని పుత్రుడైనా నా మిత్రుడైనా వసుదేవుడు క్షేమముగా వున్నాడా, మిత్రులందరూ బాగునారా

దిష్ట్యా కంసో హతః పాపః సానుగః స్వేన పాప్మనా
సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యః సదా

అదృష్టం బాగుండి కంసుడు తన పరివారముతో కలసి అతని పాపముతో అతను చంపబడ్డాడు. ధర్మమే స్వభావముగా గల సాధువులను నిత్యం ద్వేషిస్తూ ఉండేవాడు

అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృదః సఖీన్
గోపాన్వ్రజం చాత్మనాథం గావో వృన్దావనం గిరిమ్

కృష్ణుడు మమ్ము అసలు తలుస్తున్నాడా, నన్నూ యశోదనూ తలుస్తున్నాడా జ్ఞ్యాపకం చేసుకుంటున్నాడా
గోపాలురనూ వ్రేపల్లెనూ బృందావనాన్ని గోవులనూ గోవర్ధన పర్వతాన్నీ తలచుకుంటున్నాడా, మళ్ళీ వస్తాడా ఇక్కడకు

అప్యాయాస్యతి గోవిన్దః స్వజనాన్సకృదీక్షితుమ్
తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితేక్షణమ్

అతని చక్కని సుందరమైన ముఖాన్ని అతను వస్తేనే కదా చూడగలిగేది.

దావాగ్నేర్వాతవర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితాః
దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మనా

అతను మమ్ములను దావాగ్ని నుండీ రాళ్ళవాన నుండీ వృషభాసురుడి నుండీ కాలీయుడి నుండీ కాపాడాడు
ఇతరులెవ్వరూ దాటలేని గొప్ప ఆపదల నుండీ కష్టాల నుండీ కాపాడడు.

స్మరతాం కృష్ణవీర్యాణి లీలాపాఙ్గనిరీక్షితమ్
హసితం భాషితం చాఙ్గ సర్వా నః శిథిలాః క్రియాః

పరమాత్మ యొక్క ప్రతాపాన్ని విలాసముగా చూసే క్రీగంటి చూపునూ నవ్వునూ మాటనూ,
మేము ఉంటూ పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఇవి జ్ఞ్యాపకం రాగానే పని ఏమీ చేయలేకపోతున్నాము

సరిచ్ఛైలవనోద్దేశాన్ముకున్దపదభూషితాన్
ఆక్రీడానీక్ష్యమాణానాం మనో యాతి తదాత్మతామ్

పోనీ మరచిపోదామంటే అది అయ్యేపని కాదు. పల్లెకు పోయినా అడవులకు పోయినా (పరమాత్మ ఏ కొండ మీద పాదాలు పెట్టడో అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయని హరి వంశములో ఉంది) కృష్ణున్ని చూస్తున్నట్లే ఉంది

మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తావిహ సురోత్తమౌ
సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం యథా

ఇవన్నీ చూస్తోంటే కృష్ణ బలరాములు దేవతోత్తములే, వారే ఇక్కడ అవతరించి వచ్చినట్లున్నది.
దేవతల ప్రయోజనం నెరవేచడానికి వచ్చినట్లుంది. గర్గుడు ఆనాడే చెప్పాడు. అదే ప్రమాణం.

కంసం నాగాయుతప్రాణం మల్లౌ గజపతిం యథా
అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిపః

కంసుడిని చంపడమే అందుకు నిదర్శనం. పది వేల ఏనుగుల బలం కలవాడు కంసుడు. వాడినీ మల్లులనూ ఏనుగునూ అవలీలగా చంపాడు. ఆయుధాలు లేకుండా చంపాడు.

తాలత్రయం మహాసారం ధనుర్యష్టిమివేభరాట్
బభఞ్జైకేన హస్తేన సప్తాహమదధాద్గిరిమ్

ధనువును భంగం చేసాడు. ఆ ధనువు మూడు తాటి చెట్ల పొడుగు ఉంది. దాన్ని చెరుగు గడను ఏనుగు విరిచినట్లు అవలీలగా ఎత్తి ఒక చేత్తో విరిచాడు. గోవరథన పర్వతాన్ని ఏడు రాత్రులు ధరించాడు

ప్రలమ్బో ధేనుకోऽరిష్టస్తృణావర్తో బకాదయః
దైత్యాః సురాసురజితో హతా యేనేహ లీలయా

దేవ దానవులను ఓడించిన ప్రలంబుడూ ధేనుకుడూ తృణావర్తుడూ అరిష్టాసురుడూ బకాస్రుడూ మొదలైన రాక్షసులనూ లీలగా చంపిన కృష్ణుడు మళ్ళీ వస్తాడా

శ్రీశుక ఉవాచ
ఇతి సంస్మృత్య సంస్మృత్య నన్దః కృష్ణానురక్తధీః
అత్యుత్కణ్ఠోऽభవత్తూష్ణీం ప్రేమప్రసరవిహ్వలః

మనసులో భావాలు మెదలుచుండగా మాట్లాడి మాట్లాడి ఉత్కంఠ పెరిగి గొంతులో నీరు నిండి మాట పెగలకుండా ఐపోయి.

యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ
శృణ్వన్త్యశ్రూణ్యవాస్రాక్షీత్స్నేహస్నుతపయోధరా

నందుడికి ఈ మాత్రం మాటలు వచ్చాయి గానీ అవి అన్నీ వింటున్న యశోదమ్మకు కన్నీళ్ళు మాత్రమే వచ్చాయి

తయోరిత్థం భగవతి కృష్ణే నన్దయశోదయోః
వీక్ష్యానురాగం పరమం నన్దమాహోద్ధవో ముదా

అది చూసి ఉద్దవుడు అనుకున్నాడు. ఎంతటి ధన్యమైన జన్మ వీరిది. పరమాత్మ మీద వీరికి ఎంతటి భక్తి. ఎన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వస్తుంది.

శ్రీద్ధవ ఉవాచ
యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద
నారాయణేऽఖిలగురౌ యత్కృతా మతిరీదృశీ

ప్రాణులందరిలో మీరే ఉత్తములూ, కొనియాడదగినవారు. శ్రీమన్నారాయణుని మీద ఇంతటి ప్రేమను చూపిన మీరు ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేసుకుని ఉంటారు.

ఏతౌ హి విశ్వస్య చ బీజయోనీ రామో ముకున్దః పురుషః ప్రధానమ్
అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేశాత ఇమౌ పురాణౌ

ఈ బలరామ కృష్ణులే ప్రకృతీ పురుషులు.
ప్రపంచాన్ని సృష్టించి అందులో తాను ప్రవేశించి, అనుసరించి, అన్ని జ్ఞ్యానములనూ ప్రబోదింపచేస్తారు ఈ పురాణ పురుషులు

యస్మిన్జనః ప్రాణవియోగకాలే క్షనం సమావేశ్య మనోऽవిశుద్ధమ్
నిర్హృత్య కర్మాశయమాశు యాతి పరాం గతిం బ్రహ్మమయోऽర్కవర్ణః

స్వామి ఎంత గొప్పవాడంటే ఏ మహానుభావుని యందు ఒక్క క్షణం అంత్యకాలములో పరమాత్మయందు పరిశుద్ధమైన మనసు లగ్నం చేసుకుని అన్ని కర్మలూ పరిశుద్ధం చేసుకుని ఆయన ధామానికి వెళతారో అటువంటి పరమాత్మను మీరు ప్రతీ క్షణం ప్రతీ దినం పరిశుద్ధ భావముతో స్మరిస్తున్నారంటే మీకు కలిగే ఉత్తమ గతిని గురించి చెప్పగలిగేదేముంది.

తస్మిన్భవన్తావఖిలాత్మహేతౌ నారాయణే కారణమర్త్యమూర్తౌ
భావం విధత్తాం నితరాం మహాత్మన్కిం వావశిష్టం యువయోః సుకృత్యమ్

ఒక పని సాధించడానికి మానవ దేహం ధరించిన శ్రీమన్నారాయణుని యందు మనసు ఉంచారు. మీకు ఇంకేమి పుణ్యం కావాలి.

ఆగమిష్యత్యదీర్ఘేణ కాలేన వ్రజమచ్యుతః
ప్రియం విధాస్యతే పిత్రోర్భగవాన్సాత్వతాం పతిః

చాలా ఎక్కువ కాలం కాక ముందే ఇక్కడకు కృష్ణ బలరాములు వస్తారు
మీ ఇద్దరకూ ప్రీతిని కలిగిస్తాడు

హత్వా కంసం రఙ్గమధ్యే ప్రతీపం సర్వసాత్వతామ్
యదాహ వః సమాగత్య కృష్ణః సత్యం కరోతి తత్

రంగ మధ్యములో కంసున్ని చంపిన తరువాత మీ దగ్గరకు వచ్చి ఓదార్చి ఏమన్నాడో ఆ మాటను నిజం చేస్తాడు. కృష్ణుడు ఎపుడూ అన్న మాటను తప్పడు

మా ఖిద్యతం మహాభాగౌ ద్రక్ష్యథః కృష్ణమన్తికే
అన్తర్హృది స భూతానామాస్తే జ్యోతిరివైధసి

కృష్ణున్ని త్వరలోనే చూస్తారు. ఐనా ఆయన లేనిదెక్కడా. సకల ప్రాణుల హృదయములో అంతర్యామిగా ఉన్నాడు. జ్యోతిలా ఉన్నాడు.

న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నాప్రియో వాస్త్యమానినః
నోత్తమో నాధమో వాపి సమానస్యాసమోऽపి వా

అహంకార మమకారాలు లేని పరమాత్మకు ప్రియ్డూ అప్రియుడూ అని ఎవరూ ఉండరు. తల్లీ తండ్రీ గురువూ మొదలైన వారు మనకు.

న మాతా న పితా తస్య న భార్యా న సుతాదయః
నాత్మీయో న పరశ్చాపి న దేహో జన్మ ఏవ చ

తన వారూ శత్రువూ శరీరమూ పుట్టుకా అతని ప్రత్యేకముగా చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు.

న చాస్య కర్మ వా లోకే సదసన్మిశ్రయోనిషు
క్రీడార్థం సోऽపి సాధూనాం పరిత్రాణాయ కల్పతే

పరమాత్మ ఆటకోసం, సాధువులను రక్షించడం కోసం తాను దేహాన్ని స్వీకరించి వస్తాడు

సత్త్వం రజస్తమ ఇతి భజతే నిర్గుణో గుణాన్
క్రీడన్నతీతోऽపి గుణైః సృజత్యవన్హన్త్యజః

అతను ఎలాంటి సాత్వికాది గుణాలులేని వాడైనా మన రక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం ఆయా శరీరాలు ఆయా గుణాలతో ధరించి వస్తాడు
ఆ క్రీడలోనే ప్రపంచాన్ని సృష్టిస్తాడూ కాపాడుతాడు సంహరిస్తాడు

యథా భ్రమరికాదృష్ట్యా భ్రామ్యతీవ మహీయతే
చిత్తే కర్తరి తత్రాత్మా కర్తేవాహంధియా స్మృతః

తుమ్మెదా లేదా సాలెపురుగూ తాను చుట్టిన దారములో తానే చిక్కుతుంది, ఆ దారాన్ని తానే తినివేసి బయటకు వస్తుంది. అది అందులో ఉన్నపుడు అది బయటకు రాలేదేమో అనిపిస్తుంది. దారాన్ని సృష్టించనపుడు, ఇది దారాన్ని సృష్టిస్తుందా అనిపిస్తుంది. పరమాత్మ ప్రళయ కాలములో లేడేమో అనిపిస్తాడు. సృష్టించిన తరువాత అంతవరకూ లేని జగత్తు కనపడుతుంది. సూక్ష్మావస్థలో ఉన్న పరమాత్మే సృష్టి జరిగాక స్థూలావస్థలో ఉంటాడు. ఆయనకు అహంకార మమకారాలు లేవు.

యువయోరేవ నైవాయమాత్మజో భగవాన్హరిః
సర్వేషామాత్మజో హ్యాత్మా పితా మాతా స ఈశ్వరః

నంద యశోదల్లారా ఆయన మీకే కాదు అందరికీ ఆత్మ. అందరికీ అన్నీ ఆయనే. మీకే కాదు

దృష్టం శ్రుతం భూతభవద్భవిష్యత్
స్థాస్నుశ్చరిష్ణుర్మహదల్పకం చ
వినాచ్యుతాద్వస్తు తరాం న వాచ్యం
స ఏవ సర్వం పరమాత్మభూతః

ప్రపంచములో చూడబడినది వినబడినదీ జరిగినదీ జరగబోవునదీ గొప్పదీ పెద్దదీ చిన్నదీ అని వేటిని అనుకుంటున్నామో పరమాత్మ లేకుండా అవేవీ ఉండవు. పరమాత్మ లేకుండా ఉన్నాయని చెప్పడానికి లేదు
అతని కాని వస్తువు లేదు, అతను కానిది లేదు. ఆయన అందరివాడు. ఆయననుండే అన్నీ వచ్చాయి.అన్నిటిలోనూ ఆయన ఉన్నాడు.

ఏవం నిశా సా బ్రువతోర్వ్యతీతా నన్దస్య కృష్ణానుచరస్య రాజన్
గోప్యః సముత్థాయ నిరూప్య దీపాన్వాస్తూన్సమభ్యర్చ్య దౌధీన్యమన్థున్

ఈ విధముగా నందుడూ యశోదా ఉద్దవుడూ ముగ్గురూ మాట్లాడుతూ ఉండగానే రాత్రి గడిచింది
తెల్లవారగానే గోపికలు లేచి గృహదేవతలను పూజించి పెరుగు చిలుకుతున్నారు

తా దీపదీప్తైర్మణిభిర్విరేజూ రజ్జూర్వికర్షద్భుజకఙ్కణస్రజః
చలన్నితమ్బస్తనహారకుణ్డల త్విషత్కపోలారుణకుఙ్కుమాననాః

వారి ఆభరణాలు మణుల కాంతితో ప్రకాశిస్తున్నాయి. పెరుగు చిలకడముతో అవి చప్పుడు చేస్తున్నాయి,

ఉద్గాయతీనామరవిన్దలోచనం వ్రజాఙ్గనానాం దివమస్పృశద్ధ్వనిః
దధ్నశ్చ నిర్మన్థనశబ్దమిశ్రితో నిరస్యతే యేన దిశామమఙ్గలమ్

గోపికలు పెరుగు చిలుకుతూ పరమాత్మ నామాన్ని గానం చేస్తున్నారు, ఎలుగెత్తి పాడుతున్నారు, వారి పాట ధ్వనీ ఆభరణాల ధ్వనీ  పెరుగు చిలికే ధ్వనీ . ఈ మూడూ కలసి సకల దిక్కుల అమంగళాన్నీ తొలగిస్తున్నాయి. భగవంతుని  భక్తుల ప్రతీ మాటా అమంగళాన్ని తొలగిస్తుంది. ఈ మూడూ కలసి మున్నీరు అనవచ్చు. మున్నీరు అంటే సముద్రం. మూడు రకాల నీరు.
వారు ధరించిన ఆభరణముల ధ్వనీ అడుగుల సవ్వడీ కూడా అమంగళాన్ని తొలగిస్తుంది.
వారు చేసే ధ్వని స్వర్గం దాకా వెళ్ళింది. పాద ధ్వనీ ఆభరణముల ధ్వనీ పెరుగు చిలికే ధ్వని. ఈ మూడు ధ్వనులు కలిసి మునీరు (సముద్రం - సముద్రములో మూడు రకాల నీళ్ళు ఉంటాయి. పైనుంచి వర్ష జలం, భూమి నుంచి నదీ జలం, అడుగునుంచి ఊట జలం. ఇలా మూడూ కలిస్తే సముద్రం. ఈ వ్రేపల్లె ఒక సముద్రం. ఇక్కడ కూడా మూడు ధ్వనులు కలుస్తున్నాయి. కాలి ధ్వనీ ఆభరణుల ధ్వనీ పెరుగు చిలికే ధ్వని)
ఈ ధ్వని సకల దిక్కుల అమంగళాన్ని తొలగిస్తున్నాయి. భగవంతుని భక్తుల ప్రతీ మాటా అమంగళాన్ని పోగొడుతుంది, ప్రతీ అడుగూ అమంగళాన్ని పోగొడుతుంది. అందుకే ఆభరణాలు గానీ కొత్త వస్తువులు గానీ పెద్దల//భక్తుల చేతికిచ్చి మనం తీసుకోవడం సాంప్రదాయం. అది వస్తువులలో దోషాలను పోగొడుతుంది.

భగవత్యుదితే సూర్యే నన్దద్వారి వ్రజౌకసః
దృష్ట్వా రథం శాతకౌమ్భం కస్యాయమితి చాబ్రువన్

ఇలా పని పూర్తి అయ్యాక సూర్యోదయం అయ్యాక వారు బయటకు వచ్చి చూస్తే నందుని ఇంటిముందు ఒక బంగారు రథం కనపడింది.

అక్రూర ఆగతః కిం వా యః కంసస్యార్థసాధకః
యేన నీతో మధుపురీం కృష్ణః కమలలోచనః

మళ్ళీ కంసుని పనులు చక్కబెట్టే అకౄరుడు వచ్చాడా. అతనే పద్మాక్షుడైన కృష్ణున్ని మాకు దూరం చేసాడు

కిం సాధయిష్యత్యస్మాభిర్భర్తుః ప్రీతస్య నిష్కృతిమ్
తతః స్త్రీణాం వదన్తీనాముద్ధవోऽగాత్కృతాహ్నికః

ఇపుడు ఇలా ఉన్న మాకు కూడా బాధ కలిగించి చనిపోయిన కంసునికి ఏమి ఇంకేమి ఉపకారం చేస్తాడు. ఇలా వారు మాట్లాడుతూ ఉండగానే ఉద్ధవుడు తన నిత్య కృత్యములు ముగించుకుని ఉద్ధవుడు వచ్చాడు.
                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఐదవ అధ్యాయం

                           
                                              ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఐదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
పితరావుపలబ్ధార్థౌ విదిత్వా పురుషోత్తమః
మా భూదితి నిజాం మాయాం తతాన జనమోహినీమ్

తల్లి తండ్రులకు అసలు విషయం తెలిసింది అని తెలుసుకున్నాడు స్వామి. వీరిద్దరూ అవతార పురుషులని తల్లి తండ్రులకు తెలిసింది అని తెలుసుకుని. అది అలా వుండరాదుకాబట్టి, తన దివ్య్మైన సకల జనములను మోహింపచేసే తన మాయను వారిపై కూడా ప్రసరింపచేసాడు

ఉవాచ పితరావేత్య సాగ్రజః సాత్వనర్షభః
ప్రశ్రయావనతః ప్రీణన్నమ్బ తాతేతి సాదరమ్

మొదలు తల్లి తండ్రుల మీద తన మాయను ప్రసరింపచేసి వారిని అమ్మా నాన్నా అని పిలుస్తూ

నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కణ్ఠితయోరపి
బాల్యపౌగణ్డకైశోరాః పుత్రాభ్యామభవన్క్వచిత్

తల్లి తండ్రులతో పుత్రులు ఎలా మాట్లాడాలి, అందులో ఇంచుమించు కాలం అంతా దూరముగా ఉన్నారు. బాల్యములో కైశోరములో పౌగండ్రములో మా నుండి మీకు ఎలాంటి ఆనందం  కలగాలో అది మీకు కలగలేదు. వాటికి మేము దూరమయ్యాము.

న లబ్ధో దైవహతయోర్వాసో నౌ భవదన్తికే
యాం బాలాః పితృగేహస్థా విన్దన్తే లాలితా ముదమ్

దురదృష్టం ఆవరించిన మాకు మీ దగ్గర నివాసం కలగలేదు. కన్న తల్లి తండ్రుల దగ్గర వారింటిలో ఉండి సంతానం సహజముగా పొందవలసిన ఆనందాన్ని అదృష్టం లేని మేము పొందలేకపోయాము
సకల చరాచర జగత్తులో తల్లి తండ్రులకంటే గొప్పవారూ సేవించదగినవారూ మరొకరు లేరు.

సర్వార్థసమ్భవో దేహో జనితః పోషితో యతః
న తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యః శతాయుషా

అన్ని రకముల కార్యములనూ ఆరంభించడానికి మూలం ఐన శరీరం ఏ తల్లి తండ్రుల వలన ప్రసాదించబడినదో పోషించబడినదో, అటువంటి తల్లి తండ్రులు చేసిన దానికి ప్రత్యుపకారం నూరు సంవత్సరాలైనా చేయలేరు

యస్తయోరాత్మజః కల్ప ఆత్మనా చ ధనేన చ
వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయన్తి హి

అలా అని చెప్పి ఏమీ చేయకుండా తప్పించుకోరాదు. ఇటువంటి తల్లి తండ్రులకు వారి వృద్ధాప్యములో బతుకు తెరువు ఇవ్వాలి. సామర్ధ్యం ఉండి కూడా అలా చేయని వారికి పరలోకములో వారి మాంఅసాన్ని వారే తీసుకుని తినే శిక్ష పడుతుంది. శరీరముతో ధనముతో వారికి బతుకు తెరువు ఇవ్వని వారు వారి మాంసాన్నే భుజించే నరకములో పుడతారు.

మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతమ్శిశుమ్
గురుం విప్రం ప్రపన్నం చ కల్పోऽబిభ్రచ్ఛ్వసన్మృతః

పుత్రులైన వారు ఈ శ్లోకం రోజూ చదువుకోవాలి.
వృద్ధులైన తల్లి తండ్రులనూ, సాధ్వి ఐన (ఉత్తమురాలైన) భార్యనూ, శిశువైన పుత్రున్నీ బ్రాహ్మణుడైన గురువునూ సమర్ధుడై కూడా పోషించకుంటే వాడు శ్వాస తీస్తున్న శవము. చదువు కేవలం బతుకు తెరువుకే మాత్రం అనుకునే వారికి ఇదొక సమాధానం. మానవత్వానికి ఒక ధర్మం ఉంది.

తన్నావకల్పయోః కంసాన్నిత్యముద్విగ్నచేతసోః
మోఘమేతే వ్యతిక్రాన్తా దివసా వామనర్చతోః

ప్రతీ క్షణమూ కంసుని నుండి భయపడుతున్న మాకూ, అసమర్ధులమైన మాకు, ఇన్ని దివసాలూ వ్యర్థముగా గడచాయి మిమ్ములను అర్చించకుండా. శైశవం బాల్యం కౌమారం పౌగండ్రములో తల్లి తండ్రుల దగ్గర ఉండి వారిని సేవించకుండుటచే వ్యర్థముగా గడిచాయి

తత్క్షన్తుమర్హథస్తాత మాతర్నౌ పరతన్త్రయోః
అకుర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్దుర్హృదా భృశమ్

ఇది మా చేతులలో ఉన్న పని కాదు. మేము పరతంత్రులం. ఇంతకాలం మీకు దూరముగా ఉండి మిమ్ము సంతోషపెట్టనందుకూ, మిమ్ము సేవించనందుకూ, మావలన మీరు కష్టపడినందులకూ మమ్ము మీరు క్షమించండి.

శ్రీశుక ఉవాచ
ఇతి మాయామనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిరా
మోహితావఙ్కమారోప్య పరిష్వజ్యాపతుర్ముదమ్

ఇప్పటిదాకా వీరిద్దరినీ పరమాత్మావతారం అనుకుంటున్నవారితో ఇలా మాట్లాడేసరికి వారిని తమ తొడ మీద కూర్చోబెట్టుకుని కౌగిలించుకున్నారు.

సిఞ్చన్తావశ్రుధారాభిః స్నేహపాశేన చావృతౌ
న కిఞ్చిదూచతూ రాజన్బాష్పకణ్ఠౌ విమోహితౌ

ఆనందబాష్పాలతో వారి శరీరాలను తడుపుతూ స్నేహపాశముతో గొంతులో కూడ తడి చేరి గొంతు బొంగురుపోయి మాట పెగల్లేదు.

ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్దేవకీసుతః
మాతామహం తూగ్రసేనం యదూనామకరోన్ణృపమ్

కాల స్వరూపుడైన పరమాత్మ కాలాన్ని వ్యర్థము చేయక, రాజు లేని రాజ్యం ఉండకూడదు కాబట్టి ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి, మేము మీ సేవకులము, మమ్ము మీరు ఆజ్ఞ్యాపించండి ఏమి చేయాలో

ఆహ చాస్మాన్మహారాజ ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి
యయాతిశాపాద్యదుభిర్నాసితవ్యం నృపాసనే

మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః
బలిం హరన్త్యవనతాః కిముతాన్యే నరాధిపాః

యయాతి శాపం వలన మేము సింహాసనం మీద కూర్చుని పరిపాలించరాదు. అందుకే మిమ్ము రాజుగా చేసాము. మేము మీ బృత్యులము. మేము మీకు భృత్యులుగా ఉన్నప్పుడు దేవతలందరూ మీ ఆరాధన చేస్తారు. సామాన్యుల గురించి ఇక చెప్పేదేముంది

సర్వాన్స్వాన్జ్ఞతిసమ్బన్ధాన్దిగ్భ్యః కంసభయాకులాన్
యదువృష్ణ్యన్ధకమధు దాశార్హకుకురాదికాన్

రాజ్యములోని వారందరూ క్షేమముగా ఆనందముగా ఉండాలంటే రాజైన వాడు అంతముకుముదు ఉన్న రాజు వలన వేరే ప్రాంతాలకు విడిచి వెళ్ళిపోయిన వారుంటే వారిని పిలిపించి వారికి ఆశ్రయం కల్పించాలి. అంతకుముందు ఇల్లూ వాకిలీ ఆస్తులూ వదలి వెళ్ళిపోయినవారిని కృష్ణుడు పిలిపించి వారు వెళ్ళినపుడు వారికి ఉన్న ఆస్తిని మళ్ళీ వారికి ఇప్పించాడు.

సభాజితాన్సమాశ్వాస్య విదేశావాసకర్శితాన్
న్యవాసయత్స్వగేహేషు విత్తైః సన్తర్ప్య విశ్వకృత్

కృష్ణసఙ్కర్షణభుజైర్గుప్తా లబ్ధమనోరథాః
గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణరామగతజ్వరాః

కృష్ణ రాముల వలన అన్ని జ్వరాలూ తొలగి బలరామ కృష్ణుల వలన అన్ని కోరికలూ తీర్చుకుంటూ అన్ని బాధలూ తొలగి ఆనందముగా ఉన్నారు

వీక్షన్తోऽహరహః ప్రీతా ముకున్దవదనామ్బుజమ్
నిత్యం ప్రముదితం శ్రీమత్సదయస్మితవీక్షణమ్

ప్రతీరోజు కన్నయ్య చిన్ని ముఖాన్ని తనివి తీరా చూస్తూ మురిసిపోతున్నారు. వారి మనసు ఎపుడూ కళకళలాడుతూ ఉంటోంది. బాధలున్నా లేకున్నా ఎవరైనా దగ్గరకు వస్తే వారిని దయతో చిరునవ్వుతో మాట్లాడేవారు. చిరునవ్వు పదహారు రకాలు ఉంటుంది. ఎదుటివారిని బుట్టలో వేసే చిరునవ్వు, కోపాన్ని దాచుకుని నవ్వే చిరునవ్వు, ఏడుపును దాచుకుని నవ్వే చిరునవ్వు, ప్రతీకారాన్ని దుఃఖాన్నీ దాచుకుని నవ్వేదీ ఇలాంటివి. మనకు రోజులో ఉత్తమమైన చిరునవ్వు ఉత్తములైన వారికి రెండు గంటలు వస్తుంది.

తత్ర ప్రవయసోऽప్యాసన్యువానోऽతిబలౌజసః
పిబన్తోऽక్షైర్ముకున్దస్య ముఖామ్బుజసుధాం ముహుః

వృద్ధులూ యువకులూ బలవంతులూ ప్రతాపవంతులూ అందరూ తమ నేత్రముల డొప్పలతో పరమాత్మ ముఖపద్మాన్ని మాటి మాటికీ తాగుతూ ఆనందాన్ని పొందారు.

అథ నన్దం సమసాద్య భగవాన్దేవకీసుతః
సఙ్కర్షణశ్చ రాజేన్ద్ర పరిష్వజ్యేదమూచతుః

అపుడు బలమ్రామ కృష్ణులు నందుని వద్దకు వెళ్ళి నమస్కరించి, నందున్ని ఆలింగనం చేసుకుని, ఈ మాట చెబుతున్నారు

పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ భృశమ్
పిత్రోరభ్యధికా ప్రీతిరాత్మజేష్వాత్మనోऽపి హి

మీరు గొప్ప స్నేహముతో ప్రేమతో మమ్ము ఇంతకాలం లాలించారు. తల్లి తండ్రులకంటే మా యందు మీరు మీకంటే ఎక్కువ ప్రేమను చూపారు.

స పితా సా చ జననీ యౌ పుష్ణీతాం స్వపుత్రవత్
శిశూన్బన్ధుభిరుత్సృష్టానకల్పైః పోషరక్షణే

కన్నవారే కాదు, తన సంతానం వలే పోషించిన వారు తల్లి తండ్రులే అవుతారు. పోషించడానికి అవకాశం లేని పరిస్థితిల్లో కన్న తల్లి తండ్రుల్లా పోషించిన వారు తల్లి తండ్రులే

యాత యూయం వ్రజంన్తాత వయం చ స్నేహదుఃఖితాన్
జ్ఞాతీన్వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖమ్

నాన్న గారూ మీరు వ్రేపల్లెకు వెళ్ళండి. మేము ఇంతకాలం మమ్ము దూరముగా ఉన్నందువలన దుఃఖించిన మా బంధువ్లను ఓదార్చి వారికి సుఖ సంతోషాలనిచ్చి మళ్ళీ వస్తాము.

ఏవం సాన్త్వయ్య భగవాన్నన్దం సవ్రజమచ్యుతః
వాసోऽలఙ్కారకుప్యాద్యైరర్హయామాస సాదరమ్

ఇలా నందాదులను ఓదార్చి వారికి బంగారమూ వెండీ ఆభరణాలూ వస్త్రాలూ రత్నాలూ కానుకలుగా ఇచ్చి వారిని వ్రేపల్లెకు పంపించారు.

ఇత్యుక్తస్తౌ పరిష్వజ్య నన్దః ప్రణయవిహ్వలః
పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్వ్రజం యయౌ

ఇలా చెప్పిన తరువాత నందుడు వారిని కౌగిలిచుకుని ప్రేమతో కళ్ళు మొత్తం నిండిపోగా పోలేక పోలేక తాను వ్రేపల్లెకు వెళ్ళాడు

అథ శూరసుతో రాజన్పుత్రయోః సమకారయత్
పురోధసా బ్రాహ్మణైశ్చ యథావద్ద్విజసంస్కృతిమ్

పన్నెండవ యేట వారికి ఉపనయనాదులు జరిపించారు. ఆ సమయములో బ్రాహ్మణోత్తములకు బంగారు నూపురాలతో బంగారు బంగారు హారాలతో  గిట్టలతో బంగారు కొమ్ములతో పట్టు వస్త్రాలతో అలంకరించబడి ఉన్న గోవులను (ఎన్ని గోవులను కృష్ణ పరమాత్మ పుట్టినపుడు ఇస్తానని సంకల్పించుకున్నాడో అన్ని గోవులను ఇచ్చాడు. )

ఆనాడు కంసుని నిర్భందములో ఉన్నందున కుమారులు కలిగినా దానం చేయలేని దుస్థితిలో ఉన్నందున మనసుతో మాత్రమే సంకల్పించుకున్నాడు. వాటిని ఈనాడు ఇచ్చి ఆ బాకీ తీర్చుకున్నాడు

తేభ్యోऽదాద్దక్షిణా గావో రుక్మమాలాః స్వలఙ్కృతాః
స్వలఙ్కృతేభ్యః సమ్పూజ్య సవత్సాః క్షౌమమాలినీః

యాః కృష్ణరామజన్మర్క్షే మనోదత్తా మహామతిః
తాశ్చాదదాదనుస్మృత్య కంసేనాధర్మతో హృతాః

తతశ్చ లబ్ధసంస్కారౌ ద్విజత్వం ప్రాప్య సువ్రతౌ
గర్గాద్యదుకులాచార్యాద్గాయత్రం వ్రతమాస్థితౌ

ఇలా ఉపనయనమైన తరువాత గర్గుని వద్ద గాయత్రీ మంత్రాన్ని పొందారు

ప్రభవౌ సర్వవిద్యానాం సర్వజ్ఞౌ జగదీశ్వరౌ
నాన్యసిద్ధామలం జ్ఞానం గూహమానౌ నరేహితైః

అన్ని విద్యలకూ మూలం ఐన వారు జగన్నాధులూ, ఇతరుల వలన పొందదగిన అవసరం లేని జ్యానం కలవారైనా కూడా మానవులుగా పుట్టినందున ఆ జ్ఞ్యానాన్ని దాచుకుని

అథో గురుకులే వాసమిచ్ఛన్తావుపజగ్మతుః
కాశ్యం సాన్దీపనిం నామ హ్యవన్తిపురవాసినమ్

చదువుకోడానికి గురుకులానికి వెళ్ళారు. కాశీ నగరములో ఉండే సాందీపుని వద్దకు వెళ్ళారు

యథోపసాద్య తౌ దాన్తౌ గురౌ వృత్తిమనిన్దితామ్
గ్రాహయన్తావుపేతౌ స్మ భక్త్యా దేవమివాదృతౌ

మమ్ము శిష్యులుగా స్వీకరించవలసింది అని ప్రార్థించారు. భగవంతుడు ఎదురుకుండా ఉంటే మనమెలా భక్తి శ్రద్ధలతో సేవిస్తామో వారు గురువును అదే రీతిలో సేవించగా

తయోర్ద్విజవరస్తుష్టః శుద్ధభావానువృత్తిభిః
ప్రోవాచ వేదానఖిలాన్సఙ్గోపనిషదో గురుః

నిష్కపటమైన పరిశుద్దమైన మనసుతో గురువును అనుసరించారు. దానితో ఆ బ్రాహ్మణోత్తముడు సంతోషించి ఆరు వేదాంగాలనూ బోధించాడు, వేదాలనూ ఉపనిషత్తులనూ బోధించాడు

సరహస్యం ధనుర్వేదం ధర్మాన్న్యాయపథాంస్తథా
తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విధామ్

ధనుర్విద్యనూ, న్యాయమార్గములో ఉన్నవాటినీ, వేదాంతమూ తర్కమూ రాజనీతీ

సర్వం నరవరశ్రేష్ఠౌ సర్వవిద్యాప్రవర్తకౌ
సకృన్నిగదమాత్రేణ తౌ సఞ్జగృహతుర్నృప

సకల విద్యలనూ ప్రవర్తింపచేసేవారికి నేర్పించారు. ఒక సారి చెప్పగానే వారికి అవగతమయ్యాయి.

అహోరాత్రైశ్చతుఃషష్ట్యా సంయత్తౌ తావతీః కలాః
గురుదక్షిణయాచార్యం ఛన్దయామాసతుర్నృప

మొత్తం అరవై నాలుగు కళలనూ అరవై నాలుగు రోజులలో చెప్పాడు గురువు. ఆ గురువుగారిని గురు దక్షిణగా ఏమి ఇవ్వాలని అడిగారు. గురువుగారికి వారికి ఇష్టమైన ధనం గురు దక్షిణగా ఇవ్వాలి (శక్తి ఉంటే). 

ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం
సంలోక్ష్య రాజన్నతిమానుసీం మతిమ్
సమ్మన్త్ర్య పత్న్యా స మహార్ణవే మృతం
బాలం ప్రభాసే వరయాం బభూవ హ

వీరికున్న మానవాతీతమైన బుద్ధి వైభవాన్ని చూచి భార్యతో ఆలోచించి ప్రభాస తీర్థములో సముద్రములో పడిన తన పుత్రున్ని ఇమ్మని అడిగారు

తేథేత్యథారుహ్య మహారథౌ రథం
ప్రభాసమాసాద్య దురన్తవిక్రమౌ
వేలాముపవ్రజ్య నిషీదతుః క్షనం
సిన్ధుర్విదిత్వార్హనమాహరత్తయోః

అలాగే అని రథం ఎక్కి ప్రభాసానికి వెళ్ళారు. సముద్రం వద్దకు వెళ్ళగానే సముద్రుడు ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పి అన్ని పూజలూ చేయగా, కృష్ణుడు తన గురు పుత్రులను అడిగారు

తమాహ భగవానాశు గురుపుత్రః ప్రదీయతామ్
యోऽసావిహ త్వయా గ్రస్తో బాలకో మహతోర్మిణా

స్నానం చేస్తుండగా ఒక తరంగం వచ్చి మింగిందట, ఆ పిల్లవాన్ని ఇవ్వు.

శ్రీసముద్ర ఉవాచ
న చాహార్షమహం దేవ దైత్యః పఞ్చజనో మహాన్
అన్తర్జలచరః కృష్ణ శఙ్ఖరూపధరోऽసురః

అపుడు సముద్రుడు నేను అపహరించలేదు. ఇందులో మునిగితే ఇందులో ఉన్న పంచ జనుడు అనే శంఖ రూపములో ఉన్న రాక్షసుడు అపహరించాడు.

ఆస్తే తేనాహృతో నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః
జలమావిశ్య తం హత్వా నాపశ్యదుదరేऽర్భకమ్

వెంటనే స్వామి నీటిలో ప్రవేశించి ఆ రాక్షసున్ని సంహరించి అతని గర్భములో కుమారుడు లేకపోవడాన్ని గమనించాడు

తదఙ్గప్రభవం శఙ్ఖమాదాయ రథమాగమత్
తతః సంయమనీం నామ యమస్య దయితాం పురీమ్

అతని పొట్టలో ఒక శంఖం దొరికింది. ఆ శంఖం తీసుకుని రథం ఎక్కాడు. ఎక్కి యమలోకానికి వెళ్ళాడు

గత్వా జనార్దనః శఙ్ఖం ప్రదధ్మౌ సహలాయుధః
శఙ్ఖనిర్హ్రాదమాకర్ణ్య ప్రజాసంయమనో యమః

తెచ్చుకున్న శంఖాన్ని పూరించాడు. యమ లోకానికి వెళ్ళిన వారు కూడా పాంచజన్య శబ్దాన్ని వింటే తిరిగి వస్తారు. వైకుంఠాన్ని చేరతారు. ఆ ధ్వని వినలేకున్నా పాంచజన్యం అన్న పేరు వింటే చాలు.

తయోః సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితామ్
ఉవాచావనతః కృష్ణం సర్వభూతాశయాలయమ్

ఆ ధ్వని విన్న యముడు ఎదురు వచ్చి పూజించి

లీలామనుష్యయోర్విష్ణో యువయోః కరవామ కిమ్

ఏమి ఆజ్ఞ్య అన్ అడిగాడు

శ్రీభగవానువాచ
గురుపుత్రమిహానీతం నిజకర్మనిబన్ధనమ్
ఆనయస్వ మహారాజ మచ్ఛాసనపురస్కృతః

వాడు చేసుకున్న కర్మకు అనుగుణముగా నీవు మా గురు పుత్రున్ని ఇక్కడకు తీసుకు వచ్చినట్లు తెలుసు. నా ఆజ్ఞ్యను వహించి ఆ పిల్లవాన్ని తీసుకు రా

తథేతి తేనోపానీతం గురుపుత్రం యదూత్తమౌ
దత్త్వా స్వగురవే భూయో వృణీష్వేతి తమూచతుః

ఆ అబ్బయిని తెచ్చి ఇచ్చి ఇంకేమి ఆజ్ఞ్య అని అడిగాడు.

శ్రీగురురువాచ
సమ్యక్సమ్పాదితో వత్స భవద్భ్యాం గురునిష్క్రయః
కో ను యుష్మద్విధగురోః కామానామవశిష్యతే

కొడుకును చూసుకున్న గురువుగారు,
గురువుగారికి ప్రత్యుపకారం చాలా చక్కగా చేసావు. ఇటువంటి గురు దక్షిణ ప్రపంచములో ఎవరూ ఇచ్చి ఉండలేదు.
మీలాంటి శిష్యుడు ఉన్న గురువుకు తీరని కోరికలు ఉంటాయా

గచ్ఛతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావనీ
ఛన్దాంస్యయాతయామాని భవన్త్విహ పరత్ర చ

మీరు మీ ఇంటీకి వెళ్ళండి. మీకు పరిశుద్ధమైన కీర్తి కలుగు గాక. మీరు చదువుకున్న చదువులు పాతబడిబోకుండా ఉండాలి, ఇహ లోకములో పరలోకములో (అంటే ఆ విద్య ఏ ఒక్క నాడూ చదవబడకుండా ఉండరాదు. ఎలా ఐతే వండిన అన్నం మూడు గంటలు (ఒక ఝాము) లోపు తినాలో ప్రతీ రోజు గురువుగారు చెప్పిన పాఠాన్ని చదువుతూ ఉండాలి.)
చదువుకున్న విద్య ఒక్కరోజు ఆవృతం చేయకున్నా వ్యర్థం. శాస్త్రం అభ్యాసం చేయకా, శస్త్రం(ఆయుధం) అభ్యాసం చేయడం వలనా విషముతో సమానం అవుతుంది. అనభ్యాసే విషం శాస్త్రం.

గురుణైవమనుజ్ఞాతౌ రథేనానిలరంహసా
ఆయాతౌ స్వపురం తాత పర్జన్యనినదేన వై

ఇలా గురువుగారి ఆజ్ఞ్యను పొంది తమ నగరానికి మేఘ గంభీర ధ్వనితో రాగా వారిని చూచి

సమనన్దన్ప్రజాః సర్వా దృష్ట్వా రామజనార్దనౌ
అపశ్యన్త్యో బహ్వహాని నష్టలబ్ధధనా ఇవ

అందరూ పరమానందాన్ని పొంది అభినందించారు. అరవై నాలుగు రోజులు చూడకపోవడముతో పోయిన ధనం దొరికితే ఎలా సంతోషిస్తారో అలా సంతోషించారు.


                                               సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై నాలగవ అధ్యాయం


           ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై నాలగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఏవం చర్చితసఙ్కల్పో భగవాన్మధుసూదనః
ఆససాదాథ చణూరం ముష్ట్తికం రోహిణీసుతః

తాను అనుకున్నదాన్నే వారితో పలికించిన కృష్ణుడు చాణూరుణితో బలరాముడు ముష్టికునితో తలపడ్డారు.

హస్తాభ్యాం హస్తయోర్బద్ధ్వా పద్భ్యామేవ చ పాదయోః
విచకర్షతురన్యోన్యం ప్రసహ్య విజిగీషయా

గెలవాలనే సంకల్పముతో పరస్పరం చేతులు పట్టీ కాళ్ళు పట్టీ లాగుతున్నారు.

అరత్నీ ద్వే అరత్నిభ్యాం జానుభ్యాం చైవ జానునీ
శిరః శీర్ష్ణోరసోరస్తావన్యోన్యమభిజఘ్నతుః

అరత్నితో అరత్నినీ మోకాళ్ళతో మోకాళ్ళనీ తలని తలతో వక్షస్థలాన్ని వక్షస్థలముతో కొట్టుకున్నారు.

పరిభ్రామణవిక్షేప పరిరమ్భావపాతనైః
ఉత్సర్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరున్ధతామ్

తిప్పట విసిరివేయటం లాగడం గుంజడం పడవేయడం  లేపడం కింద పడేయడం

ఉత్థాపనైరున్నయనైశ్చాలనైః స్థాపనైరపి
పరస్పరం జిగీషన్తావపచక్రతురాత్మనః

ఇలా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ ఉంటే

తద్బలాబలవద్యుద్ధం సమేతాః సర్వయోషితః
ఊచుః పరస్పరం రాజన్సానుకమ్పా వరూథశః

బలవంతులతో బలహీనుల యుద్ధం, ఇది సరి ఐన యుద్ధం కాదు అని అక్కడ స్త్రీలు అనుకుంటున్నారు.

మహానయం బతాధర్మ ఏషాం రాజసభాసదామ్
యే బలాబలవద్యుద్ధం రాజ్ఞోऽన్విచ్ఛన్తి పశ్యతః

ఈ సభలో పెద్ద అధర్మం జరుగుతోంది. ఒకరు మహా బలవంతులు, ఒకరు చిన్నపిల్లలు, దీన్ని రాజు ఒప్పుకుంటున్నాడు, చూసేవారు కూడా కాదనట్లేదు

క్వ వజ్రసారసర్వాఙ్గౌ మల్లౌ శైలేన్ద్రసన్నిభౌ
క్వ చాతిసుకుమారాఙ్గౌ కిశోరౌ నాప్తయౌవనౌ

పర్వతాలలాగ వజ్రశరీరముతో ఉన్నారు చాణూర ముష్టికులు , యవ్వనమే రాని అతి సుకుమారమైన బలరామ కృష్ణులెక్కడా.

ధర్మవ్యతిక్రమో హ్యస్య సమాజస్య ధ్రువం భవేత్
యత్రాధర్మః సముత్తిష్ఠేన్న స్థేయం తత్ర కర్హిచిత్

ఈ సభకు అధర్మం బాగా తగులుతుంది. అధర్మం జరుగుతున్న చోట ఉండకూడదని శాస్త్రం. సభలో ఉండే దోషాలు చూచిన తరువాత బుద్ధిమంతులెవరూ అలాంటి సభలోకి ప్రవేశించకూడదు.

న సభాం ప్రవిశేత్ప్రాజ్ఞః సభ్యదోషాననుస్మరన్
అబ్రువన్విబ్రువన్నజ్ఞో నరః కిల్బిషమశ్నుతే

ఒక సారి సభలోకి ప్రవేశించిన తరువాత ఏమీ చెప్పకున్నా పాపమే చెప్పినా పాపమే. చెబితే రాజ దిక్కారం చెప్పకుంటే ధర్మ దిక్కారం

వల్గతః శత్రుమభితః కృష్ణస్య వదనామ్బుజమ్
వీక్ష్యతాం శ్రమవార్యుప్తం పద్మకోశమివామ్బుభిః

కిం న పశ్యత రామస్య ముఖమాతామ్రలోచనమ్
ముష్టికం ప్రతి సామర్షం హాససంరమ్భశోభితమ్

ఒక్కరికీ కనపడట్లేదా వారు యుద్ధం చేస్తుంటే. పరమ సుకుమారులు. పద్మం మీద మంచు బిందువులులా వారి ముఖం మీద చెమట బిందువులు వస్తున్నాయి.

పుణ్యా బత వ్రజభువో యదయం నృలిఙ్గ
గూఢః పురాణపురుషో వనచిత్రమాల్యః
గాః పాలయన్సహబలః క్వణయంశ్చ వేణుం
విక్రీదయాఞ్చతి గిరిత్రరమార్చితాఙ్ఘ్రిః

మళ్ళీ జ్ఞ్యాపకం తెచ్చుకుంటున్నారు. వ్రేపల్లెలో స్త్రీలు చాలా పుణ్యం చేసుకున్నవారు. మానవ దేహముతో పురాణ పురుషుడైన పరమాత్మ వారితో ఆడి పాడి వారించ్చిన పుష్పాలనూ పళ్ళనూ తీసుకున్నాడు. గోవులను పాలించాడు. వేణువును ఊదుతూ ఆవులను మేపుతూ, లక్ష్మి చేత శంకరుని చేతా పూజించబడే పాదపద్మములు కలవాడు.

గోప్యస్తపః కిమచరన్యదముష్య రూపం
లావణ్యసారమసమోర్ధ్వమనన్యసిద్ధమ్
దృగ్భిః పిబన్త్యనుసవాభినవం దురాపమ్
ఏకాన్తధామ యశసః శ్రీయ ఐశ్వరస్య

గోపికలు ఏ తపస్సు చేసారో. పరమాత్మ యొక్క సౌందర్యం అనే మహా సారాన్ని తమ కళ్ళతో తాగుతూ అమ్మవారి యొక్క ఏకాంత ధామాన్ని కనులారా చూచి అనురాగాన్ని వారు పొందగలిగారు

యా దోహనేऽవహననే మథనోపలేప ప్రేఙ్ఖేఙ్ఖనార్భరుదితోక్షణమార్జనాదౌ
గాయన్తి చైనమనురక్తధియోऽశ్రుకణ్ఠ్యో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమచిత్తయానాః

పిల్లల్ను పెంచే తల్లులు చేసే పనులు. దోహనం (పాలు పిండడం) అవహనన (ఒడ్లు దంచడం) మహ్దనం (పెరుగు చిలకడం) ఉపలేప (ఇల్లు అలకడం) ఆవుల యొక్క గంతులు వేయడం పిల్లల యొక్క ఏడుపులు, వారి ఒళ్ళు తుడవడం ఇల్లు కడగడం,, ఇవన్నీ చేసుకుంటూ కూడా ఏ పరమాత్మ యొక్క లీలా చరితమును అశ్రుకంఠముతో గానం చేస్తూ ఉన్నారు. ఎంత అదృష్టవంతులు.
భగవంతుని చీతమునకు వీరే వాహనాలు. భగవంతుని చిత్తములో వీరు ఉన్నారు. వీరి చిత్తములో భగవానుడు ఉన్నాడు
పరమాత్మ నామాన్ని కీర్తించుకుంటూ గృహకృత్యాలు చేయాలి. సంసారం మానవలసిన అవసరం లేదు. పరమాత్మని మనసులో ఉంచుకుని, ఆయన మీద అనురాగముతో ఆయనను గానం చేస్తూ మన పనౌలు మనం చేసుకోవాలి.

ప్రాతర్వ్రజాద్వ్రజత ఆవిశతశ్చ సాయం
గోభిః సమం క్వణయతోऽస్య నిశమ్య వేణుమ్
నిర్గమ్య తూర్ణమబలాః పథి భూరిపుణ్యాః
పశ్యన్తి సస్మితముఖం సదయావలోకమ్

గోవులను తీసుకు వెళుతున్నపుడు పొద్దున్నా, గోవులను తీసుకు వస్తున్నపుడు సాయం కాలం వేణువును గానం చేస్తుంటే విని, ఇలా వెళుతున్న వాడిని ఎంతో పుణ్యం చేసుకున్న వీరు చిరునవ్వుతో దయతో నిండి ఉన్న స్వామి ముఖాన్ని చూడగలిగారు

ఏవం ప్రభాషమాణాసు స్త్రీషు యోగేశ్వరో హరిః
శత్రుం హన్తుం మనశ్చక్రే భగవాన్భరతర్షభ

ఇలా అందరూ మాట్లాడుతుంటే, వారి బాధను తెలుసుకున్న పరమాత్మ చాణూరున్ని వధించ సంకల్పించుకున్నాడు

సభయాః స్త్రీగిరః శ్రుత్వా పుత్రస్నేహశుచాతురౌ
పితరావన్వతప్యేతాం పుత్రయోరబుధౌ బలమ్

దేవకీ వసుదేవులు కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా పుత్రుల బలం తెలియని వారై బాధపడుతున్నారు.

తైస్తైర్నియుద్ధవిధిభిర్వివిధైరచ్యుతేతరౌ
యుయుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ

మల్లయుద్ధములో ఎన్ని రకాల యుద్ధాలు ఉంటాయో అవి అన్నీ చేసారు ఉభయులూ.

భగవద్గాత్రనిష్పాతైర్వజ్రనీష్పేషనిష్ఠురైః
చాణూరో భజ్యమానాఙ్గో ముహుర్గ్లానిమవాప హ

పరమాత్మ యొక్క ముష్టిఘాతములతో పిండి  పిండి చేయబడి చాణూరుడు అలసట చెందాడు

స శ్యేనవేగ ఉత్పత్య ముష్టీకృత్య కరావుభౌ
భగవన్తం వాసుదేవం క్రుద్ధో వక్షస్యబాధత

వాడికి కోపం వచ్చి డేగలా మహావేగముగా వచ్చి కృష్ణుని వక్షస్థలములో కొట్టడానికి పిడికిలి బిగించి వచ్చాడు

నాచలత్తత్ప్రహారేణ మాలాహత ఇవ ద్విపః
బాహ్వోర్నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్హరిః

అంత బలవంతుడు అంత గట్టిగా కొడితే పూల మాల వేయబడిన ఏనుగులా చూచాడు. ఎలాగూ వాడే చేతులు అందించాడు కాబట్టి వాడి రెండు చేతులూ పట్టుకుని గిర గిరా తిప్పి

భూపృష్ఠే పోథయామాస తరసా క్షీణ జీవితమ్
విస్రస్తాకల్పకేశస్రగిన్ద్రధ్వజ ఇవాపతత్

గట్టిగా నేల కేసి కోట్టి చంపాడు. వాడు కిందపడి చచ్చాడు.

తథైవ ముష్టికః పూర్వం స్వముష్ట్యాభిహతేన వై
బలభద్రేణ బలినా తలేనాభిహతో భృశమ్

అది చూచిన బలరాముడు,అది సమ్జ్యగా భావించి ముష్టికున్ని కూడా కొట్టగా

ప్రవేపితః స రుధిరముద్వమన్ముఖతోऽర్దితః
వ్యసుః పపాతోర్వ్యుపస్థే వాతాహత ఇవాఙ్ఘ్రిపః

పెద్ద సుడిగాలికి పడిన చెట్టులా కింద పడిపోయాడు.

తతః కూటమనుప్రాప్తం రామః ప్రహరతాం వరః
అవధీల్లీలయా రాజన్సావజ్ఞం వామముష్టినా

వారి అనుచరులందరూ ఇది చూసి యుద్ధం చేయకుండా ప్రాణాలు దక్కించుకుందాం అని పారిపోయారు. అలా పారిపోతున్న వారిని పట్టుకోమని తమ వెంట ఉన్న గోపాలురకు చెప్పారు కృష్ణబలరాములు

తర్హ్యేవ హి శలః కృష్ణ ప్రపదాహతశీర్షకః
ద్విధా విదీర్ణస్తోశలక ఉభావపి నిపేతతుః

చాణూరే ముష్టికే కూటే శలే తోశలకే హతే
శేషాః ప్రదుద్రువుర్మల్లాః సర్వే ప్రాణపరీప్సవః

గోపాన్వయస్యానాకృష్య తైః సంసృజ్య విజహ్రతుః
వాద్యమానేషు తూర్యేషు వల్గన్తౌ రుతనూపురౌ

జనాః ప్రజహృషుః సర్వే కర్మణా రామకృష్ణయోః
ఋతే కంసం విప్రముఖ్యాః సాధవః సాధు సాధ్వితి

అక్కడ అంతా అరుపులూ కేకలతో నిండిపోయింది. మంగళ వాద్యాలు వాయిస్తున్నారు. బలరామ కృష్ణుల ఈ వీర కృత్యముతో కంసుడు తప్ప ప్రజలందరూ పరమానందాన్ని పొందారు.  బ్రాహ్మణులూ సాధువులూ మెచ్చుకున్నారు.

హతేషు మల్లవర్యేషు విద్రుతేషు చ భోజరాట్
న్యవారయత్స్వతూర్యాణి వాక్యం చేదమువాచ హ

మల్లులు చనిపోయారు. మిగిలినవారు పారిపోతున్నారు. కంసుడు కోపముగా మంగళ వాద్యాలను ఆపమన్నాడు. ఇలా అన్నాడు కంసుడు

నిఃసారయత దుర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్
ధనం హరత గోపానాం నన్దం బధ్నీత దుర్మతిమ్

ఈ బలరామ కృష్ణులను నగరము నుండి బయటకు వెళ్ళగొట్టండి. గోపాలుర ధనాన్ని హరించండి. నందున్ని బంధించండి

వసుదేవస్తు దుర్మేధా హన్యతామాశ్వసత్తమః
ఉగ్రసేనః పితా చాపి సానుగః పరపక్షగః

దుర్మార్గుడైన వసుదేవున్ని చంపండి. పేరుకు తండ్రి అయినా పర పక్షాన్ని ఆశ్రయించి ఉన్న ఉగ్రసేఉన్ని చంపండి

ఏవం వికత్థమానే వై కంసే ప్రకుపితోऽవ్యయః
లఘిమ్నోత్పత్య తరసా మఞ్చముత్తుఙ్గమారుహత్

ఇలా గర్విస్తున్న కంసున్ని చూచి కృష్ణుడు కోపముతో ఒక గంతుతో కంసుడి వద్దకు వెళ్ళాడు

తమావిశన్తమాలోక్య మృత్యుమాత్మన ఆసనాత్
మనస్వీ సహసోత్థాయ జగృహే సోऽసిచర్మణీ

అది చూసిన కంసుడు లేచి నిలబడ్డాడు. ఖడ్గం డాలూ తీసుకు కృష్ణుని మీదకు వచ్చాడు

తం ఖడ్గపాణిం విచరన్తమాశు శ్యేనం యథా దక్షిణసవ్యమమ్బరే
సమగ్రహీద్దుర్విషహోగ్రతేజా యథోరగం తార్క్ష్యసుతః ప్రసహ్య

అలా కత్తీ డాలూ తీసుకు తన మీదకు వస్తున్న కంసున్ని గరుత్మంతుడు పాముని పట్టుకున్నట్లుగా పట్టుకుని, మొదలు కిరీటాన్ని కిందపడేసి, ఆ పెద్ద సింహాసనం నుండి కింద పడవేసి.

ప్రగృహ్య కేశేషు చలత్కిరీతం నిపాత్య రఙ్గోపరి తుఙ్గమఞ్చాత్
తస్యోపరిష్టాత్స్వయమబ్జనాభః పపాత విశ్వాశ్రయ ఆత్మతన్త్రః

పద్మనాభుడైన, పదునాలుగు లోకాలు కడుపులో ఉన్న కృష్ణుడు కంసుని మీద పడ్డాడు.

తం సమ్పరేతం విచకర్ష భూమౌ హరిర్యథేభం జగతో విపశ్యతః
హా హేతి శబ్దః సుమహాంస్తదాభూదుదీరితః సర్వజనైర్నరేన్ద్ర

ఇలా చనిపోయిన కంసుని చుట్టూ లాగుకుని వెళ్ళాడు. ఏనుగును సింహం లాగినట్లుగా అందరూ చూస్తుండగా అందరూ హాహాకారాలు చేస్తుండగా

స నిత్యదోద్విగ్నధియా తమీశ్వరం పిబన్నదన్వా విచరన్స్వపన్శ్వసన్
దదర్శ చక్రాయుధమగ్రతో యతస్తదేవ రూపం దురవాపమాప

కంసుడు పుట్టినప్పటినుంచీ ఇప్పటిదాకా పరమాత్మను మరచిపోలేదు. తాగుతూ చెప్పుచూ నిదురపోతూ నడుస్తూ ఏమి చేసినా తన ముందర ఏ చక్రాయుధున్ని చూస్తూ ఉన్నాడో చనిపోయిన తరువాత ఆయననే పొందాడు(స్వారూప్య మోక్షం)

తస్యానుజా భ్రాతరోऽష్టౌ కఙ్కన్యగ్రోధకాదయః
అభ్యధావన్నతిక్రుద్ధా భ్రాతుర్నిర్వేశకారిణః

అతనికి ఇంకా ఎనిమిది మంది తమ్ములు ఉన్నారు. అన్నగారికి ప్రతీకారం చేద్దామని వారందరూ వచ్చారు

తథాతిరభసాంస్తాంస్తు సంయత్తాన్రోహిణీసుతః
అహన్పరిఘముద్యమ్య పశూనివ మృగాధిపః

బలరాముడు తన పరిఘను తీసుకుని వారందరినీ సంహరించాడు.

నేదుర్దున్దుభయో వ్యోమ్ని బ్రహ్మేశాద్యా విభూతయః
పుష్పైః కిరన్తస్తం ప్రీతాః శశంసుర్ననృతుః స్త్రియః

ఆకాశములో మంగళ వాద్యాలు మోగాయి, బ్రహ్మేశాది దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు, స్త్రీలూ అప్సరలసు నాట్యం చేసారు

తేషాం స్త్రియో మహారాజ సుహృన్మరణదుఃఖితాః
తత్రాభీయుర్వినిఘ్నన్త్యః శీర్షాణ్యశ్రువిలోచనాః

ఆ కంసుని యొక్క భార్యలు వక్షస్థలాన్ని శిరసునూ కొట్టుకుంటూ వచ్చారు.

శయానాన్వీరశయాయాం పతీనాలిఙ్గ్య శోచతీః
విలేపుః సుస్వరం నార్యో విసృజన్త్యో ముహుః శుచః

మాటిమాటికీ దుఃఖిస్తూ కన్నీరు విడిచిపెడుతూ "నీవు చావడం కాదు, మమ్మూ మా పిల్లలనూ చంపేసావు, మా సౌభాగ్యం మా జీవితం అంతా పోయింది, " అన్నారు

హా నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణానాథవత్సల
త్వయా హతేన నిహతా వయం తే సగృహప్రజాః

నీవు లేకుంటే ఈ నగరం కూడా మాలాగే ఏ పండుగా లేకుండా శోభించదు

త్వయా విరహితా పత్యా పురీయం పురుషర్షభ
న శోభతే వయమివ నివృత్తోత్సవమఙ్గలా

అనాగసాం త్వం భూతానాం కృతవాన్ద్రోహముల్బణమ్
తేనేమాం భో దశాం నీతో భూతధ్రుక్కో లభేత శమ్

ఏ తప్పూ చేయని ఎంతో మంది ప్రాణులకు నీవు భయంకరమైన తీవ్రమైనన్ (ఉల్బణం) ద్రోహం చేసావు.

దాని వలననే నీవీస్థితిని పొందావు. ప్రపంచములో ప్రాణులకు ద్రోహం చేసిన వాడెవడు శుభాన్ని పొందుతాడు.

సర్వేషామిహ భూతానామేష హి ప్రభవాప్యయః
గోప్తా చ తదవధ్యాయీ న క్వచిత్సుఖమేధతే

ప్రపంచములో సకల ప్రాణులకూ పుట్టుకకూ నాశానికీ స్థితికీ అన్నిటికీ ఈయనే (కృష్ణుడే) కారణం . ఇటువంటి వానికి ద్రోహం చేసిన వాడికి ఎక్కడా సుఖం ఉండదు.

శ్రీశుక ఉవాచ
రాజయోషిత ఆశ్వాస్య భగవాంల్లోకభావనః
యామాహుర్లౌకికీం సంస్థాం హతానాం సమకారయత్

మేనల్లుడు కాబట్టి, అలా ఏడుస్తున్న రాజ పత్నులను ఓదార్చి చనిపోయిన వారికి చేయవలసిన అంత్య క్రియలు దగ్గర ఉండి చేసాడు

మాతరం పితరం చైవ మోచయిత్వాథ బన్ధనాత్
కృష్ణరామౌ వవన్దాతే శిరసా స్పృశ్య పాదయోః

తల్లి తండ్రులను బంధనం నుండి విడిపించి రామ కృష్ణులు వారి పాదములను శిరస్సుతో తాకి నమస్కరించారు

దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయ జగదీశ్వరౌ
కృతసంవన్దనౌ పుత్రౌ సస్వజాతే న శఙ్కితౌ

ఇదంతా చూసిన దేవకీ వసుదేవులకు వీరిద్దరూ జగన్నాధులని తెలిసింది. వారిని గట్టిగా ఎలాంటి శంకా (కంసుడు ఏమి చేస్తాడో అన్న భయం లేకుండా) లేకుండా ఆలింగనం చేసుకున్నారు.

                                               సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts