Followers

Sunday 6 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఆరవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
ఏవం స్తుతః సురగణైర్భగవాన్హరిరీశ్వరః
తేషామావిరభూద్రాజన్సహస్రార్కోదయద్యుతిః

దేవతా గణముల చేత స్తోత్రం చేయబడిన పరమాత్మ వేయి మందిసూర్యుల కాంతి తేజస్సుతో వారికి సాక్షాత్కరించాడు. 

తేనైవ సహసా సర్వే దేవాః ప్రతిహతేక్షణాః
నాపశ్యన్ఖం దిశః క్షౌణీమాత్మానం చ కుతో విభుమ్

ఆయన కాంతి చేత అందరి కళ్ళూ మూసుకుని పోయాయి. ఆ వెలుగుకు ఆకాశాన్నీ దిక్కులనీ తమనీ కూడా చూసుకోలేకపోయారు. బ్రహ్మ రుద్రులు మాత్రం ఆయనను చూడగలిగారు.

విరిఞ్చో భగవాన్దృష్ట్వా సహ శర్వేణ తాం తనుమ్
స్వచ్ఛాం మరకతశ్యామాం కఞ్జగర్భారుణేక్షణామ్

స్వామి మరకతం వంటి నీల వర్ణం కలిగి పుండరీకాక్షుడు. 

తప్తహేమావదాతేన లసత్కౌశేయవాససా
ప్రసన్నచారుసర్వాఙ్గీం సుముఖీం సున్దరభ్రువమ్

చక్కగా బాగా కాల్చి వన్నెతెచ్చిన బంగారపు రంగు కల వస్త్రం కట్టుకుని ఉన్నవాడు. అందమైన సర్వాయవములు కలవాడు. చక్కని ముఖము మంచి కనుబొమ్మలూ మణికిరీటం కేయూరములూ మకర కుండల కాంతి శోభిస్తూ మొలత్రాడూ వలయములూ హారములూ మొదలైనవాటితో ప్రకాశిస్తూ కౌస్తుభాన్నీ వనమాలను అమ్మవారినీ ధరించి ఉన్న స్వామి

మహామణికిరీటేన కేయూరాభ్యాం చ భూషితామ్
కర్ణాభరణనిర్భాత కపోలశ్రీముఖామ్బుజామ్

కాఞ్చీకలాపవలయ హారనూపురశోభితామ్
కౌస్తుభాభరణాం లక్ష్మీం బిభ్రతీం వనమాలినీమ్

సుదర్శనాదిభిః స్వాస్త్రైర్మూర్తిమద్భిరుపాసితామ్
తుష్టావ దేవప్రవరః సశర్వః పురుషం పరమ్
సర్వామరగణైః సాకం సర్వాఙ్గైరవనిం గతైః

సుదర్శనాది ఆయుధములతో ఉన్న స్వామిని చూచి శివునితో కలిసి బ్రహ్మాదులు స్తోత్రం చేసారు. సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నారు

శ్రీబ్రహ్మోవాచ
అజాతజన్మస్థితిసంయమాయా గుణాయ నిర్వాణసుఖార్ణవాయ
అణోరణిమ్నేऽపరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే

ఆద్యంత రహితుడు, అన్ని గుణములూ ఆయనే, మోక్ష సుఖమూ ఆయనే, అణువులకు అణువు, నీ లోకం ఇంత ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు. అలాంటి నీకు నమస్కారం. 

రూపం తవైతత్పురుషర్షభేజ్యం శ్రేయోऽర్థిభిర్వైదికతాన్త్రికేణ
యోగేన ధాతః సహ నస్త్రిలోకాన్పశ్యామ్యముష్మిన్ను హ విశ్వమూర్తౌ

నీవు చూపిన ఈ రూపం తమకు శ్రేయస్సు కావాలని కోరుకున్న మహా పురుషులందరి చేత ఆరాధించబడే రూపం. వైదికముగా ఆరాధిస్తారు కొందరూ, తంత్రముగా ఆరాధిస్తారు కొందరు. నా యోగముతో మీ శరీరములో ఉండే లోక త్రయాన్ని చూస్తున్నాను.

త్వయ్యగ్ర ఆసీత్త్వయి మధ్య ఆసీత్త్వయ్యన్త ఆసీదిదమాత్మతన్త్రే
త్వమాదిరన్తో జగతోऽస్య మధ్యం ఘటస్య మృత్స్నేవ పరః పరస్మాత్

మొడటి మధ్య చివరి లోకాలు నీలోనే ఉన్నాయి. నీవే ఆది మధ్య అంతములూ. కుండకు మట్టి లాగ. కుండకూ ఆది మధ్య అంతము ఉండదు. 

త్వం మాయయాత్మాశ్రయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదనుప్రవిష్టః
పశ్యన్తి యుక్తా మనసా మనీషిణో గుణవ్యవాయేऽప్యగుణం విపశ్చితః

నీవు నీ యోగ మాయతో సకల చరాచర ప్రపంచాన్ని సృష్టించి అందులో చేరిన నిన్ను యోగము కలవారూ, జ్ఞ్యానులూ మనసుతో నిన్ను చూస్తారు. గుణముల సమూహముగా ఉన్న ప్రకృతిలో ఉన్నా నీవు అగుణుడవు. 

యథాగ్నిమేధస్యమృతం చ గోషు భువ్యన్నమమ్బూద్యమనే చ వృత్తిమ్
యోగైర్మనుష్యా అధియన్తి హి త్వాం గుణేషు బుద్ధ్యా కవయో వదన్తి

కట్టెలలో నిప్పులాగ, గోవులలో అమృతం (పాలు) లాగ, భూమిలో అన్నము లాగ, భూమిలో తవ్వితే వచ్చే నీరు లాగ, కష్టపడి ప్రయత్నిస్తేనే వచ్చే బ్రతుకు తెరువులాగ, యోగముతో నిన్ను పొందవచ్చు అని జ్ఞ్యానులు చెబుతారు

తం త్వాం వయం నాథ సముజ్జిహానం సరోజనాభాతిచిరేప్సితార్థమ్
దృష్ట్వా గతా నిర్వృతమద్య సర్వే గజా దవార్తా ఇవ గాఙ్గమమ్భః

మేము ఎంతో కాలం నుండీ నిన్ను దర్శించాలని ప్రయత్నిస్తున్నాము, దర్శించుకోగలిగాము, ఆనందించాము. దావనలములో ఉన్న ఏనుగులు గంగా జలములో మునిగితే ఎంత ఆనందం పొందుతాయో అంత అనాందం పొందాము. 

స త్వం విధత్స్వాఖిలలోకపాలా వయం యదర్థాస్తవ పాదమూలమ్
సమాగతాస్తే బహిరన్తరాత్మన్కిం వాన్యవిజ్ఞాప్యమశేషసాక్షిణః

మేము నిన్ను దేన్ని కోరి చేరామో దాన్ని నీవు ప్రసాదించు, నీవు మాలోపలా వెలుపలా ఉన్నావు. అశేష సాక్షికి ఇంకేమి చెప్పాలి. 

అహం గిరిత్రశ్చ సురాదయో యే దక్షాదయోऽగ్నేరివ కేతవస్తే
కిం వా విదామేశ పృథగ్విభాతా విధత్స్వ శం నో ద్విజదేవమన్త్రమ్

నేనూ శంకరుడూ ఇతర దేవతలూ దక్షాదులూ అగ్నికి రవ్వల లాగ నీ యొక్క అంశలము. నిప్పు నుండి రవ్వలు వచ్చినట్లుగా నీ నుండి మేము వచ్చాము. అలా ఐనప్పుడు నీకంటే వేరుగా మేము ప్రకాశించాలంటే ఎలా ప్రకాశించగలం. నిప్పు నుండి వచ్చిన రవ్వలకు ఎంత సేపు ప్రకాశం ఉంటుంది. మాకూ బ్రాహ్మణులకూ దేవతలకూ శుభమును కలిగించు

శ్రీశుక ఉవాచ
ఏవం విరిఞ్చాదిభిరీడితస్తద్విజ్ఞాయ తేషాం హృదయం యథైవ
జగాద జీమూతగభీరయా గిరా బద్ధాఞ్జలీన్సంవృతసర్వకారకాన్

బ్రహ్మాదుల చేత స్తోత్రం చేయబడి, వారి హృదయాన్ని తెలుసుకుని మేఘ గంభీర నాదముతో పలికాడు, అన్ని అవయవాలూ ముడుచుకుని చేతులు జోడించుకుని ఉన్న వారితో మాట్లాడాడు.

ఏక ఏవేశ్వరస్తస్మిన్సురకార్యే సురేశ్వరః
విహర్తుకామస్తానాహ సముద్రోన్మథనాదిభిః

ఒక్కడే ఐన పరమాత్మ దేవతా కార్యము యందు విహరించాలని అనుకున్నాడు. సముద్రాన్ని చిలుకుట పర్వతాన్ని మోయుట మొదలైన వాటిని చేయాలని అనుకున్నాడు. 

శ్రీభగవానువాచ
హన్త బ్రహ్మన్నహో శమ్భో హే దేవా మమ భాషితమ్
శృణుతావహితాః సర్వే శ్రేయో వః స్యాద్యథా సురాః

బ్రహ్మా రుద్రా దేవతలారా, నా మాటలను సావధానముతో వినండి. మీకందరికీ మేలు కలుగుతుంది. వెళ్ళండి. దైతేయులైన రాక్షసుల వద్దకు వెళ్ళి వారితో సంధి చేసుకోండి. 

యాత దానవదైతేయైస్తావత్సన్ధిర్విధీయతామ్
కాలేనానుగృహీతైస్తైర్యావద్వో భవ ఆత్మనః

ఇపుడు కాలం బాగా లేదు. కాలం బాగయ్యే వరకూ వారితో సంధి చేసుకోండి. 

అరయోऽపి హి సన్ధేయాః సతి కార్యార్థగౌరవే
అహిమూషికవద్దేవా హ్యర్థస్య పదవీం గతైః

పని ఉన్నప్పుడు శత్రువులతో ఐనా సంధి చేసుకోవాలి. పామూ ఎలుకలకు కూడా స్నేహం అవసరం. 

అమృతోత్పాదనే యత్నః క్రియతామవిలమ్బితమ్
యస్య పీతస్య వై జన్తుర్మృత్యుగ్రస్తోऽమరో భవేత్

మీరు తొందరపడి, ఆలస్యం చేయకుండా అమృతాన్ని పొందడానికి ప్రయత్నించండి. మరణించిన వాడు కూడా అది తాగితే బతుకుతాడు

క్షిప్త్వా క్షీరోదధౌ సర్వా వీరుత్తృణలతౌషధీః
మన్థానం మన్దరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్

పాల సముద్రములో అన్ని లతలూ ఆకులూ వేసి, మందర పర్వతాన్ని కవ్వం చేసుకుని వాసుకుని తాడు చేసుకుని నా సహాయముతో సముద్రాన్ని చిలకండి 

సహాయేన మయా దేవా నిర్మన్థధ్వమతన్ద్రితాః
క్లేశభాజో భవిష్యన్తి దైత్యా యూయం ఫలగ్రహాః

సోమరితనాన్ని వదలి చిలకండి. పాపం రాక్షసులకు కష్టం మాత్రం మిగులుతుంది, ఫలితం మాత్రం మీకు వస్తుంది. 

యూయం తదనుమోదధ్వం యదిచ్ఛన్త్యసురాః సురాః
న సంరమ్భేణ సిధ్యన్తి సర్వార్థాః సాన్త్వయా యథా

వారికెలాగూ ఫలితం రాదు కాబట్టి ఫలితం మీకు వచ్చేంత వరకూ వారు దేన్ని కోరినా కాదనకండి. శాంతముతో ఓదార్పుతో నెమ్మదితో పనులైనట్లు కోపముతో పనులు అవ్వవు. 

న భేతవ్యం కాలకూటాద్విషాజ్జలధిసమ్భవాత్
లోభః కార్యో న వో జాతు రోషః కామస్తు వస్తుషు

సముద్రాన్ని చిలుకుతూ ఉంటే విష జ్వాలలతో కాలకూటం వస్తుంది, దాన్ని చూసి మీరు భయపడకండి. మిగతా వస్తువులు కూడా వస్తాయి. వాటి యందు లోభము చూపకండి, కామము చూపకండి. 

శ్రీశుక ఉవాచ
ఇతి దేవాన్సమాదిశ్య భగవాన్పురుషోత్తమః
తేషామన్తర్దధే రాజన్స్వచ్ఛన్దగతిరీశ్వరః

ఈ రీతిలో దేవతలను ఆజ్ఞ్యాపించి స్వామి అంతర్ధానం చెందాడు. తన ఇష్టం ప్రకారం వచ్చేవాడు కాబట్టి అంతర్ధానమయ్యాడు

అథ తస్మై భగవతే నమస్కృత్య పితామహః
భవశ్చ జగ్మతుః స్వం స్వం ధామోపేయుర్బలిం సురాః

అంతర్ధానమైన ఆ దిక్కుకు అందరూ నమస్కరించి బ్రహ్మ రుద్రులు వారి వారి లోకాలకు వెళ్ళగా దేవతలు బలి చక్రవర్తి వద్దకు వెళ్ళారు. 

దృష్ట్వారీనప్యసంయత్తాన్జాతక్షోభాన్స్వనాయకాన్
న్యషేధద్దైత్యరాట్శ్లోక్యః సన్ధివిగ్రహకాలవిత్

దేవతలు రాగానే బలి చక్రవర్తి సైన్యం వారి మీదకు వెళ్ళింది, సంధి ధర్మం తెలిసిన బలి వారిని వారించాడు

తే వైరోచనిమాసీనం గుప్తం చాసురయూథపైః
శ్రియా పరమయా జుష్టం జితాశేషముపాగమన్

వారి చేత కాపాడబడే బలి చక్రవర్తి వద్దకు వెళ్ళిన మహామతి ఐన ఇంద్రుడు మంచి మాటలతో బలి చక్రవర్తిని ఓదార్చాడు

మహేన్ద్రః శ్లక్ష్ణయా వాచా సాన్త్వయిత్వా మహామతిః
అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్

శ్రీమన్నారాయణుడు ఏమేమి మాట్లాడమన్నాడో అవి అన్నీ చెప్పాడు

తత్త్వరోచత దైత్యస్య తత్రాన్యే యేऽసురాధిపాః
శమ్బరోऽరిష్టనేమిశ్చ యే చ త్రిపురవాసినః

అది విన్న బలి చక్రవర్తి బాగుందని అంగీక్రైంచాడు. మిగతా రాక్షసులు కూడా దానికి అంగీకరించారు. 

తతో దేవాసురాః కృత్వా సంవిదం కృతసౌహృదాః
ఉద్యమం పరమం చక్రురమృతార్థే పరన్తప

అలా పరస్పరం సంధి చేసుకుని ఒక ఒప్పందం చేసుకుని క్షీర సాగర మధనం కోసం ఉద్యమం మొదలు పెట్టారు. 

తతస్తే మన్దరగిరిమోజసోత్పాట్య దుర్మదాః
నదన్త ఉదధిం నిన్యుః శక్తాః పరిఘబాహవః

వీరూ వారూ అందరూ కలిసి మందర పర్వతాన్ని అడుగు నుంచి పెకిలించుకుని గట్టిగా అరుస్తూ పాల సముద్రములో పడవేద్దామని బయలుదేరారు. 

దూరభారోద్వహశ్రాన్తాః శక్రవైరోచనాదయః
అపారయన్తస్తం వోఢుం వివశా విజహుః పథి

అంత దూరం మోయలేకపోయారు. అలా మోయలేక దారిలో దాన్ని కింద పడవేసారు

నిపతన్స గిరిస్తత్ర బహూనమరదానవాన్
చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః

పర్వతం కిందపడుతూ ఎంతో మంది దేవ దానవులను చూర్ణం చేసింది. 

తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుకన్ధరాన్
విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజః

కొందరు పోడి ఐపోగా, కొందరు మరణించగా, కొందరు కాళ్ళూ చేతులూ పోగొట్టుకున్నారు. అది చూసి స్వామి వేంచేసి.

గిరిపాతవినిష్పిష్టాన్విలోక్యామరదానవాన్
ఈక్షయా జీవయామాస నిర్జరాన్నిర్వ్రణాన్యథా

పర్వతం పడి చనిపోయిన వారందరినీ అమృత దృష్టితో బతికించాడు, గాయం ఐన వారి గాయాలను తగ్గించాడు

గిరిం చారోప్య గరుడే హస్తేనైకేన లీలయా
ఆరుహ్య ప్రయయావబ్ధిం సురాసురగణైర్వృతః

ఎడమ చేత్తో పర్వతాన్ని లేపి గరుడుని మీద వేసాడు. తాను కూడా గరుత్మంతుని మీద ఎక్కి అందరితో కలిసి సముద్రం వద్దకు వెళ్ళాడు

అవరోప్య గిరిం స్కన్ధాత్సుపర్ణః పతతాం వరః
యయౌ జలాన్త ఉత్సృజ్య హరిణా స విసర్జితః

అక్కడకు వెళ్ళగానే ఆ పర్వతాన్ని సముద్రములో వేసాడు. అలా వేసిన తరువాత గరుత్మంతుడు శెలవు తీసుక్ని వెళ్ళిపోయాడు. 

Popular Posts