Followers

Saturday 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదకొండవ అధ్యాయం

                           
                                            ఓం నమో భగవతే వాసుదేవాయ
 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
గోపా నన్దాదయః శ్రుత్వా ద్రుమయోః పతతో రవమ్
తత్రాజగ్ముః కురుశ్రేష్ఠ నిర్ఘాతభయశఙ్కితాః

నలకూబర మణి గ్రీవులు వెళ్ళిపోయే దాకా చెట్లు పడిన శబ్దం ఎవరికీ వినరాలేదు. వారు వెళ్ళిపోయిన తరువాత చెట్లు పడిన శబ్దం విని అందరూ పరుగు పరుగున వచ్చారు.

భూమ్యాం నిపతితౌ తత్ర దదృశుర్యమలార్జునౌ
బభ్రముస్తదవిజ్ఞాయ లక్ష్యం పతనకారణమ్

ఉలూఖలం వికర్షన్తం దామ్నా బద్ధం చ బాలకమ్
కస్యేదం కుత ఆశ్చర్యముత్పాత ఇతి కాతరాః

ఆ జంట చెట్లను చూచారు. రోటికి తాడు, ఆ తాడు పొట్టకు ఉంది, రోకలిని లాగుతున్నాడు. ఇది చూచి, ఇది ఎలా జరిగింది. రోటితో కట్టి వేయబడ్డ పిల్లవాడు చెట్లని లాగలేడు. ఇదీ ఒక ఉత్పాతమేనా

బాలా ఊచురనేనేతి తిర్యగ్గతములూఖలమ్
వికర్షతా మధ్యగేన పురుషావప్యచక్ష్మహి

పక్కనే ఉన్న పిల్లలు కృష్ణుడు రోటిని లాగాడు, అందులోంచి ఇద్దరు పురుషులు వచ్చారు అని చెప్పినా వారు నమ్మలేదు.

న తే తదుక్తం జగృహుర్న ఘటేతేతి తస్య తత్
బాలస్యోత్పాటనం తర్వోః కేచిత్సన్దిగ్ధచేతసః

పిల్లవాడు చెట్లు లాగడం ఎలా సాధ్యం అవుతుంది అని వారు నమ్మలేదు.

ఉలూఖలం వికర్షన్తం దామ్నా బద్ధం స్వమాత్మజమ్
విలోక్య నన్దః ప్రహసద్ వదనో విముమోచ హ

ఈ విషయం నందుడు చూచాడు. వచ్చి ఆ తాడుని విప్పేసాడు.

గోపీభిః స్తోభితోऽనృత్యద్భగవాన్బాలవత్క్వచిత్
ఉద్గాయతి క్వచిన్ముగ్ధస్తద్వశో దారుయన్త్రవత్

గోపికలు వచ్చి పిల్లవాన్ని ఆడించారు. వారు ఆడమంటే ఆడాడు. వారు పాట పాడమంటే పాడాడు. ఒక చెక్క బొమ్మలాగ ప్రవర్తించాడు.

బిభర్తి క్వచిదాజ్ఞప్తః పీఠకోన్మానపాదుకమ్
బాహుక్షేపం చ కురుతే స్వానాం చ ప్రీతిమావహన్

ఏమైనా ఆజ్ఞ్యాపిస్తే చేసేవాడు. చెప్పులని అందించమంటే అందించేవాడు. చెంబు ఇమ్మంటే ఇచ్చేవాడు. కృష్ణుడు చప్పట్లు కొట్టగానే వారు ఇంటిపనులు మాని కృష్ణుడి వద్దకు వెళ్ళేవారు

దర్శయంస్తద్విదాం లోక ఆత్మనో భృత్యవశ్యతామ్
వ్రజస్యోవాహ వై హర్షం భగవాన్బాలచేష్టితైః

ఆ జ్ఞ్యానం ఉన్న వారకు తాను భృత్యవశ్యుడు అని చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నాడు. పరమాత్మ చిన్న పిల్లల చేష్టలతో మొత్తం వ్రేపల్లెను సంతోషింపచేసాడు.

క్రీణీహి భోః ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుతః
ఫలార్థీ ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః

ఇంతలో ఒక పళ్ళు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. కృష్ణుడు నా దగ్గర డబ్బు లేదని రెండు చేతులా ధాన్యం ఇచ్చాడు. ఆయన రెండు దోసిళ్ళ ధాన్యం ఇచ్చాడు. ఆమెను "నీ దోసిళ్ళతో ఇస్తే ఎక్కువ పళ్ళు వస్తాయి" అని రెండు దోసిళ్ళ పళ్ళను ఇమ్మన్నాడు. ఆయన చేతిలో పట్టుకున్నంత వరకే అవి ధాన్యముగా ఉన్నాయి. అవి ఆమె బుట్టలో పడగానే రత్నాలుగా మారిపోయాయి. తాను రత్నాలు ఇచ్చాడు, పళ్ళు తీసుకున్నాడు. మాకేమి కావాలో నీవే ఇవ్వు అంటే ఆయన అన్నీ ఇస్తాడు. పారతంత్ర్య బుద్ధి మనమెపుడూ కలిగి ఉండాలి అని చెప్పడానికి స్వామి ఈ లీల చేసాడు. అన్ని ఫలాలిచ్చే స్వామి ధాన్యం తీసుకుని

ఫలవిక్రయిణీ తస్య చ్యుతధాన్యకరద్వయమ్
ఫలైరపూరయద్రత్నైః ఫలభాణ్డమపూరి చ

వెళ్ళగానే పళ్ళు అమ్మె ఆమె చేతినిండా పళ్ళు పెట్టింది. ఆమె అలా పెట్టగానే ఆమె బుట్టనిండా రత్నాలు నిండాయి.

సరిత్తీరగతం కృష్ణం భగ్నార్జునమథాహ్వయత్
రామం చ రోహిణీ దేవీ క్రీడన్తం బాలకైర్భృశమ్

ఇలా పిల్లలతో ఆడుకుంటున్న కృష్ణుడిని తల్లి దగ్గరకు తీసుకుని ఎంత పిలిచినా వారు ఆటలలో పడి రావట్లేదు

నోపేయాతాం యదాహూతౌ క్రీడాసఙ్గేన పుత్రకౌ
యశోదాం ప్రేషయామాస రోహిణీ పుత్రవత్సలామ్

యశోదమ్మను పిల్లలను తీసుకు రమ్మని పంపగా

క్రీడన్తం సా సుతం బాలైరతివేలం సహాగ్రజమ్
యశోదాజోహవీత్కృష్ణం పుత్రస్నేహస్నుతస్తనీ

రా రా కృష్ణా అని పిలిచింది

కృష్ణ కృష్ణారవిన్దాక్ష తాత ఏహి స్తనం పిబ
అలం విహారైః క్షుత్క్షాన్తః క్రీడాశ్రాన్తోऽసి పుత్రక

పాలు తాగ్డదానికి రా, ఆటలు చాలు అలసి ఉంటావు. వచ్చి పాలు తాగు.నంద గోపుడు నీ కోసం ఎదురుచూస్తున్నాడు

హే రామాగచ్ఛ తాతాశు సానుజః కులనన్దన
ప్రాతరేవ కృతాహారస్తద్భవాన్భోక్తుమర్హతి

ప్రతీక్షతే త్వాం దాశార్హ భోక్ష్యమాణో వ్రజాధిపః
ఏహ్యావయోః ప్రియం ధేహి స్వగృహాన్యాత బాలకాః

ధూలిధూసరితాఙ్గస్త్వం పుత్ర మజ్జనమావహ
జన్మర్క్షం తేऽద్య భవతి విప్రేభ్యో దేహి గాః శుచిః

ఈ రోజు నీ జన్మ నక్షత్రం

పశ్య పశ్య వయస్యాంస్తే మాతృమృష్టాన్స్వలఙ్కృతాన్
త్వం చ స్నాతః కృతాహారో విహరస్వ స్వలఙ్కృతః

నీ తోటి పిల్లలను చూడు. ఇంటికి వెళ్ళారు. తల్లులు వారిని అలంకరించారు. నీవు కూడా నాతో రా

ఇత్థం యశోదా తమశేషశేఖరం మత్వా సుతం స్నేహనిబద్ధధీర్నృప
హస్తే గృహీత్వా సహరామమచ్యుతం నీత్వా స్వవాటం కృతవత్యథోదయమ్

సకల లోక జగన్నాధుడైన పరమాత్మను తన కుమారుడిగా  భావించి బలరామునితో సహా చేయిపట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళి స్నానం చేయించింది

శ్రీశుక ఉవాచ
గోపవృద్ధా మహోత్పాతాననుభూయ బృహద్వనే
నన్దాదయః సమాగమ్య వ్రజకార్యమమన్త్రయన్

వ్రేపల్లెలో ఇన్ని ఉత్పాతాలు కనపడడముతో బృందావనానికి వెళ్ళ నిశ్చయించారు పెద్దలంతా.

తత్రోపానన్దనామాహ గోపో జ్ఞానవయోऽధికః
దేశకాలార్థతత్త్వజ్ఞః ప్రియకృద్రామకృష్ణయోః

అందులో ఉన్న వారందరిలో పెద్ద వాడు ఉపనందుడు. జ్ఞ్యానములో వయసులో అధికుడు.
ఆయనకు ఏ సమయములో ఏ చోట ఏ పని చేయాలో తెలుసు. రామ కృష్ణులకు ప్రియమైన పనులు చేయడములో నేర్పరి

ఉత్థాతవ్యమితోऽస్మాభిర్గోకులస్య హితైషిభిః
ఆయాన్త్యత్ర మహోత్పాతా బాలానాం నాశహేతవః

మనవారంతా క్షేమముగా ఉండాలంటే మనం ఈ ప్రదేశాన్ని వీడాలి. మనం బాగానే ఉంటున్నాము గానీ పిల్లలకు నాశమయ్యే సూచనలు కనపడుతున్నాయి

ముక్తః కథఞ్చిద్రాక్షస్యా బాలఘ్న్యా బాలకో హ్యసౌ
హరేరనుగ్రహాన్నూనమనశ్చోపరి నాపతత్

పూతన అనే బాల గ్రహం నుండీ, బండి కింద పడే ప్రమాదాన్ని నుంచీ భగవంతుని దయ వలన క్షేమముగా పిల్లవాడు బయటపడ్డాడు.

చక్రవాతేన నీతోऽయం దైత్యేన విపదం వియత్
శిలాయాం పతితస్తత్ర పరిత్రాతః సురేశ్వరైః

సుడిగాలి కూడా కింద పడేసింది. బండ మీద పడ్డాడు. ఐన దేవతలు కాపాడుతూ ఉండటం వలన ఏమీ కాలేదు. చెట్లు మధ్య పడ్డా ఏమీ కాలేదు.

యన్న మ్రియేత ద్రుమయోరన్తరం ప్రాప్య బాలకః
అసావన్యతమో వాపి తదప్యచ్యుతరక్షణమ్

జరిగిన అన్ని ఆపదలలో పరమాత్మ వెంట ఉంటూ కాపాడాడు

యావదౌత్పాతికోऽరిష్టో వ్రజం నాభిభవేదితః
తావద్బాలానుపాదాయ యాస్యామోऽన్యత్ర సానుగాః

ఆయన సూచనగా మనను రక్షించాడు. మొత్తం అందరికీ హాని కలిగించే అపాయం రాకముందే అందరం కలసి

వనం వృన్దావనం నామ పశవ్యం నవకాననమ్
గోపగోపీగవాం సేవ్యం పుణ్యాద్రితృణవీరుధమ్

దగ్గరలోనే ఉన్న బృందావనానికి వెళదాము. అక్కడ పశువులు ఉన్నాయి బాగా.
నీరూ చెట్లూ బాగా ఉన్నాయి
గోపాలకులూ గోపీ జనం గోవులూ మూడు సేవించడానికి అనుకూలమైనవు. పవిత్రమైన గోవర్దనం కూడా అక్కడే ఉంది.

తత్తత్రాద్యైవ యాస్యామః శకటాన్యుఙ్క్త మా చిరమ్
గోధనాన్యగ్రతో యాన్తు భవతాం యది రోచతే

అనుకున్న తరువాత ఆలస్యం వద్దు.ఇవ్వాలే బయలు దేరదాము. నా మాట మీకు నచ్చితే అందరూ బళ్ళు కట్టండి

తచ్ఛ్రుత్వైకధియో గోపాః సాధు సాధ్వితి వాదినః
వ్రజాన్స్వాన్స్వాన్సమాయుజ్య యయూ రూఢపరిచ్ఛదాః

అందరూ బాగా చెప్పావని మెచ్చుకున్నారు. అందరూ వెళ్ళ నిశ్చయించుకున్నారు

వృద్ధాన్బాలాన్స్త్రియో రాజన్సర్వోపకరణాని చ
అనఃస్వారోప్య గోపాలా యత్తా ఆత్తశరాసనాః

పెద్దలూ పిల్లలూ స్త్రీలనూ బళ్ళ మీద పెట్టుకుని కౄరమృగాల నుండి రక్షణంగా బాణాలూ ఆయుధాలు తీఉస్కుని కొమ్ములు ఊదుతూ ఆయుధాలు వెంటబెట్టుకుని

గోధనాని పురస్కృత్య శృఙ్గాణ్యాపూర్య సర్వతః
తూర్యఘోషేణ మహతా యయుః సహపురోహితాః

గోప్యో రూఢరథా నూత్న కుచకుఙ్కుమకాన్తయః
కృష్ణలీలా జగుః ప్రీత్యా నిష్కకణ్ఠ్యః సువాససః

అందరూ బయలు దేరారు. కృష్ణుని లీలలు గానం చేస్తూ గోపికలు కూడా బయలు దేరారు. యశోదా రోహిణులు ఒక బండి మీద కూర్చుని రామ కృష్ణులతో కూడి వారి కథలు వింటూ

తథా యశోదారోహిణ్యావేకం శకటమాస్థితే
రేజతుః కృష్ణరామాభ్యాం తత్కథాశ్రవణోత్సుకే

వృన్దావనం సమ్ప్రవిశ్య సర్వకాలసుఖావహమ్
తత్ర చక్రుర్వ్రజావాసం శకటైరర్ధచన్ద్రవత్

అన్ని వేళలలో ఆనందం కలిగించే బృందావనానికి వెళ్ళారు. పరమాత్మఏ సర్వ కాల స్వరూపుడు
ఇళ్ళు కట్టుకునే దాకా బళ్ళతోనే అర్థ చంద్రాకారములో ఆవాసాలు ఏర్పరచుకున్నారు

వృన్దావనం గోవర్ధనం యమునాపులినాని చ
వీక్ష్యాసీదుత్తమా ప్రీతీ రామమాధవయోర్నృప

బృందావనమూ గోవర్ధన పర్వతం యమునా తీరము చూచిన రామ కృష్ణులకు ఆనందం కలిగింది.

ఏవం వ్రజౌకసాం ప్రీతిం యచ్ఛన్తౌ బాలచేష్టితైః
కలవాక్యైః స్వకాలేన వత్సపాలౌ బభూవతుః

ఈ విధముగా చిన్న పిల్లల చేష్టలతో వ్రేపల్లె వాసులకు ప్రీతి కలిగిస్తూ వచ్చీ రాని మాటలతో అందరికీ ప్రీతి కలిగిస్తూ దూడలను పోషించే వయసుకు వచ్చిన వారు అయ్యారు.

అవిదూరే వ్రజభువః సహ గోపాలదారకైః
చారయామాసతుర్వత్సాన్నానాక్రీడాపరిచ్ఛదౌ

రక రకాల ఆటలతో దూడలను తీసుకుని దగ్గరలోనే తిప్పుతూ ఉన్నారు

క్వచిద్వాదయతో వేణుం క్షేపణైః క్షిపతః క్వచిత్
క్వచిత్పాదైః కిఙ్కిణీభిః క్వచిత్కృత్రిమగోవృషైః

ఒక చోట పిల్లన గ్రోవిని మోగిస్తూ ఉన్నారు, ఒక చోట వెక్కిరించే మాటలతో, కొన్ని చోట్ల కాలి మువ్వలతో, కొన్ని చోట్ల కృత్రిమ దూడల వేషం వేసుకుని బలిసిన కోడెల్లా మల్ల యుద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల జంతువుల్లా అరుస్తూ ఉన్నారు

వృషాయమాణౌ నర్దన్తౌ యుయుధాతే పరస్పరమ్
అనుకృత్య రుతైర్జన్తూంశ్చేరతుః ప్రాకృతౌ యథా

కదాచిద్యమునాతీరే వత్సాంశ్చారయతోః స్వకైః
వయస్యైః కృష్ణబలయోర్జిఘాంసుర్దైత్య ఆగమత్

ఇలా చేస్తూ ఉంటే ఒక రాక్షసుడు దూడల్లో తానూ దూడగా వచ్చాడు. వాడే వత్సాసురుడు

తం వత్సరూపిణం వీక్ష్య వత్సయూథగతం హరిః
దర్శయన్బలదేవాయ శనైర్ముగ్ధ ఇవాసదత్

బలరామ కృష్ణులను సంహరించగోరి వచ్చాడు
ఇలా దూడ వేషములో వచ్చిన రాక్షసున్ని స్వామి గుర్తుపట్టి అన్నగారిని పిలిచాడు

గృహీత్వాపరపాదాభ్యాం సహలాఙ్గూలమచ్యుతః
భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోద్గతజీవితమ్
స కపిత్థైర్మహాకాయః పాత్యమానైః పపాత హ

పిలిచి విషయం చెప్పి కొద్దిగా నవ్వాడు. వాడు వచ్చేదాకా ఊరుకోవడం ఎందుకని, బలరాముడు వెళ్ళి దాని వెనక రెండు కాళ్ళూ, తోకా పట్టుకుని బాగా బలముగా తిప్పి దాని పక్కనే ఉన్న వెలగ చెట్టు మీద (ఆ వెలగ చెట్టు కూడా రాక్షసుడే - కపిత్థాసురుడు) వేసి కొట్టాడు. ఒకే దెబ్బకు రెండు రాక్షసులను చంపేసాడు. వత్సాసురినితో కపిథ్థాసురున్ని సంహరించాడు.
స్వామి చెరసాలలో పుట్టాడు. సంసారమనే చెరసాల. అజ్ఞ్యానమనే అర్థరాత్రిలో ఉన్నాము. భగవంతుని పిలిచేదాన్ని దేవకీ అంటారు. దేవకి అంటే భక్తి. వసుదేవుడు అంటే ఎవరికి భగవంతుడే ధనమో ఆయన వసుదేవుడు. వసుదేవుడంటే జ్ఞ్యానం. దేవకి అంటే భక్తి. వీరిద్దరినీ బంధించేవాడు కంసుడు. ఆయన అహంకారం. అహంకారం జ్ఞ్యానభక్తులను సంసారములో బంధిస్తే దాన్ని తొలగించి జ్ఞ్యాన భక్తులని ప్రకాశింపచేయడానికి కృష్ణ పరమాత్మ అవతరిస్తాడు
అవతరించిన పరమాత్మ జ్ఞ్యాన భక్తులతో ఉండడు. వీటితో ఎవరైతే భగవంతుని కోరతారో వారి వద్దకు వెళతాడు. వారే గోవులూ గోపాలురు. గోపాలురు అంటే గురువులు. గోవులు అంటే వేదాలు. గోపికలంటే ఆచార్య పత్నీ (వేదార్థాన్ని ఆచరించేవారు). పరమాత్మ వీరి దగ్గరకు వెళతాడు. అక్కడికి వెళ్ళినా ప్రకృతి సహించదు. చంపేస్తాను అంటూ వస్తుంది. పరమాత్మ నుండి దూరం చేయడానికి ప్రకృతి ప్రయత్నిస్తుంది. ప్రకృతిలో ఉన్న గొప్ప తనం ఏమిటంటే అది మనకు అహంకార మమకారాలను చూపుతుంది. పూతనకూడా రెండు స్తనములలో విషాన్ని పెట్టుకుని వచ్చింది. ఇందులో విషమే విషయములు. అహంకారం మమకారాలతో మమం శబ్ద స్పర్శాదుల విషయములను అనుభవిస్తాము. ఆ విషయములను అహంకార మమకారములనే స్తనములలో పెట్టుకుని వచ్చింది. విషము తాగితేనే చంపుతాయి. విషయములు ఆలోచిస్తే చాలు మనను చంపడానికి. తలిస్తేనే చంపుతాయి విషయాలు. విషయములనే విషాన్ని దాచుకుని ప్రకృతి వస్తే " మీరు నన్ను నా భక్తులకు దూరం చేస్తారా అని" గట్టిగా పట్టుకుని స్వామి ప్రాణాలతో సహా పాలను తాగాడు. విషయములను తాగేసాడు. ప్రకృతి మనకు అందించిన అహంకరా మమకారములనే విషయాలు మనం అనుభవిస్తే పతనమవుతాము కానీ స్వామికి అందిస్తే, నాదీ అన్న భావన తొలగిపోతే ప్రకృతి మనను ఏమీ చేయలేదు. అహంకార మమకారములతో ఏర్పడిన విషయములను కృష్ణార్పణం చేస్తే విషయములు నశిస్తాయి. ఇది పూతనా సంహారం.
శకటాసురుడు: శకటం అంటే బండి. ఈ శరీరమే బండి. దీనికీ రెండు చక్రాలు ఉంటాయి. అవే పుణ్యమూ పాపము. పరమాత్మ పాదం తగిలితే బండి తిరగబడి పుణ్య పాపాలు పోయాయి. శకటం అంటే శం కటయితి. ఉన్న సుఖాన్ని నశింపచేస్తుంది. అది మనం పోగొట్టుకోలేము. అది పరమాత్మ పాద స్పర్శ వలనే పోతుంది. ఇలా అన్నీ పోయినా మన చుట్టూ సూక్ష్మ దేహం ఆవహించి ఉంటుంది. అది సుడిగాలిలా మనను ఆవహిస్తుంది. గడ్డి మనను చుట్టు ముట్టింది. ఆహార విహారాలే మనను చుట్టుముట్టి ఉంటాయి. మనను ఎపుడూ సూక్ష్మ శరీరం మనను చుట్టే ఉంటుంది. అది పోవాలంటే పరమాత్మను గట్టిగా పట్టుకుని ఉండాలి
ఇవి పోయినా ఇంకో రెండు ఉంటాయి. కవల చెట్లు. మనలో కలిగే రెండింటికీ (సుఖ దుఃఖాలకూ లాభాలాభములకూ జయాజయములకూ) మూలం మన సంస్కారం. పూర్వ జన్మ కర్మలూ సంస్కారములూ యమలార్జునులు. పరమాత్మ అనుగ్రహం చేతనే అవి పోతాయి.
సంస్కారం పోయినా వదలక ఉండేవి రుచీ వాసనా. వెలగపండు వాసనకు గుర్తు. రుచి అంటే వత్స. దూడ ప్రతీ దన్ని నోటితో తాకి తినదగినదైతే తింటుంది. వీరే వత్సాసుర కపిత్థాసురులంటే రుచీ వాసనలు. ఇలా శరీరాన్నీ మనసునీ సంస్కారాన్ని కర్మనూ రుచీ వాసననూ పరమాత్మ మాత్రమే పొగొడతాడు. స్వామి సంకల్పించినపుడే ఇవన్నీ పోతాయి.
ఈ ఇద్దరు రాక్షసులూ పడుతూ వెలగపళ్ళు కిందకు రాల్చి పడగా, గోపాలకులు అవి ఏరుకుని తిన్నారు

తం వీక్ష్య విస్మితా బాలాః శశంసుః సాధు సాధ్వితి
దేవాశ్చ పరిసన్తుష్టా బభూవుః పుష్పవర్షిణః

దేవతలు కూడా ఇంకో ఇద్దరు రాక్షసులు చనిపోయారని బాగా చేసారని పుష్ప వర్షం కురిపించారు. బాగా చేసావని గోపాలకులు మెచ్చుకున్నారు

తౌ వత్సపాలకౌ భూత్వా సర్వలోకైకపాలకౌ
సప్రాతరాశౌ గోవత్సాంశ్చారయన్తౌ విచేరతుః

వారు దూడలను కాపడేవారు అయ్యారు. పొద్దున్నే ఫలహారం తిని దూడలను తీసుకుని అరణ్యములో తిప్పుతూ ఉన్నారు

స్వం స్వం వత్సకులం సర్వే పాయయిష్యన్త ఏకదా
గత్వా జలాశయాభ్యాశం పాయయిత్వా పపుర్జలమ్

ఇలా ఒక్కో పిల్లవాడు వారి వారి దూడలను నీళ్ళు తాగించడానికి ఒక మడుగుకు తీసుకు వెళ్లారు

తే తత్ర దదృశుర్బాలా మహాసత్త్వమవస్థితమ్
తత్రసుర్వజ్రనిర్భిన్నం గిరేః శృఙ్గమివ చ్యుతమ్

ఇలా ఎవరికి వారు తాగించారు నీళ్ళను. తాము కూడా తాగుతూ ఉన్నారు. ఇలా తాగుతూ ఉంటే ఆ సరస్సు పక్కనే పెద్ద కొంగ కనప్డింది. అది పర్వతాకారములో ఉంది. కొండ నుంచి శిఖరం జారి కింద పడినట్లు ఉంది.

స వై బకో నామ మహానసురో బకరూపధృక్
ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుణ్డోऽగ్రసద్బలీ

వాడు బకాసురుడు. వీడు పూతనకు అన్న. పూతనకు బకీ అని పేరు. వచ్చి కృష్ణున్ని మింగేసాడు

కృష్ణం మహాబకగ్రస్తం దృష్ట్వా రామాదయోऽర్భకాః
బభూవురిన్ద్రియాణీవ వినా ప్రాణం విచేతసః

ప్రాణం లేని శరీరాళ్ళాగ బలరామాది గోపాలకులు నిశ్చేష్టులయ్యారు.

తం తాలుమూలం ప్రదహన్తమగ్నివద్గోపాలసూనుం పితరం జగద్గురోః
చచ్ఛర్ద సద్యోऽతిరుషాక్షతం బకస్తుణ్డేన హన్తుం పునరభ్యపద్యత

స్వామి కూడా నోటిలోకి వెళ్ళాడు కానీ గొంతు దాకా వెళ్ళగానే ఆ కొంగకు రెండు పక్కలా నోరు మండ సాగింది. వెంటనే అది నోటిలో ఉన్న స్వామిని బయటకు పడేసి ముక్కుతో చంపుదామని మీదకు వచ్చింది

తమాపతన్తం స నిగృహ్య తుణ్డయోర్దోర్భ్యాం బకం కంససఖం సతాం పతిః
పశ్యత్సు బాలేషు దదార లీలయా ముదావహో వీరణవద్దివౌకసామ్

కంసుని స్నేహితుడైన వాడు ముక్కుతో పొడవబోతుంటే ఆ ముక్కునే పట్టుకుని ఆ రెంటినీ వేరు చేసాడు కృష్ణుడు. అహంకార మమకారాలు మనకు ఎప్పుడూ కలిసే ఉంటాయి. నాది నేను నా కోసం, తన వారి మీద కానీ తన మీద కానీ ఎక్కువ ప్రేమ ఉంది అని ఎప్పుడు తెలుసుకోవాలి. వాడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు చూస్తే తెలుస్తుంది. ఎంత ఆశగా తింటాడో వాడికి మమకార అహంకారాలు ఉన్నాయి అని అర్థం. అది దేహం మీద వారికి ఎంత మమకారం ఉందో చెబుతుంది. స్వామి అందుకే ఆ రెండు దోషాలనూ వేరు చేసాడు.
బకం అంటే ధంభం. లేని దాన్ని ఉన్నట్లు ఉన్న దాన్ని లేనట్లూ చూపేది ధంభం. ఇంద్రియాలను మూసుకుని ఇంద్రియార్థాలను తెరిచే ఉంచుతాడు (తలుస్తూ ఉంటాడు). కొంగ కూడా ఒంటికాలి మీద నిలబడి రెండు కళ్ళూ మూసుకుని ఉన్నట్లు నటిస్తూ తపస్సు చేస్తూ ఉంటుంది. అందుకే స్వామి నోరు చీల్చి కొంగను చంపివేసాడు. ఇది మన ధమంభాన్ని పోగొట్టేది
యుద్ధానికి వెళ్ళేముందు ఆయుధానికి రక్తం అంటిస్తారు. అది వీరణం అంటారు. అలాగే కంసున్ని చంపబోవుతున్నట్లు బకాసురున్ని చంపడం ద్వారా చెప్పాడు

తదా బకారిం సురలోకవాసినః సమాకిరన్నన్దనమల్లికాదిభిః
సమీడిరే చానకశఙ్ఖసంస్తవైస్తద్వీక్ష్య గోపాలసుతా విసిస్మిరే

నందమల్లికాది పుష్పాలు వర్షించారు. కొంగను చంపితే పైనుంచి పూలూ పడటం మంగళ వాద్యాలు మోగడం ఏమిటని గోప బాలకులు ఆశ్చర్యపడ్డారు. బలరామాదులు ప్రాణాలు తిరిగి వచ్చినంత ఆనందపడి కృష్ణున్ని కౌగిలించుకున్నారు. దూడలని తీసుకుని తమ నివాసానికి వెళ్ళి అందరికీ చెప్పారు.

ముక్తం బకాస్యాదుపలభ్య బాలకా రామాదయః ప్రాణమివేన్ద్రియో గణః
స్థానాగతం తం పరిరభ్య నిర్వృతాః ప్రణీయ వత్సాన్వ్రజమేత్య తజ్జగుః

శ్రుత్వా తద్విస్మితా గోపా గోప్యశ్చాతిప్రియాదృతాః
ప్రేత్యాగతమివోత్సుక్యాదైక్షన్త తృషితేక్షణాః

అది విని అందరూ ఆనందించారు. చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన పిల్లవాడిలాగ కృష్ణున్ని చూచి ఆనందించారు. దప్పిగొన్నకళ్ళకు కృష్ణున్ని చూచుట ద్వారా తృప్తి కలగచేసారు

అహో బతాస్య బాలస్య బహవో మృత్యవోऽభవన్
అప్యాసీద్విప్రియం తేషాం కృతం పూర్వం యతో భయమ్

ఇంత చిన్న వయసులో కృష్ణుడికి ఇన్ని ఆపదలు ఎలా వచ్చాయి. ఆపదలు చేయాలనుకున్నవారికే ఆపదలు కలిగాయి కానీ కృష్ణునికి ఏమీ జరగలేదు

అథాప్యభిభవన్త్యేనం నైవ తే ఘోరదర్శనాః
జిఘాంసయైనమాసాద్య నశ్యన్త్యగ్నౌ పతఙ్గవత్

ఐనా మన కృష్ణున్ని అవి ఏమీ చేయలేకపోయాయి. నిప్పుని తినాలను వచ్చిన మిడతలు నిప్పులో పడి చచ్చినట్లుగా స్వామికి ఆపదలు కలిగించడానికి వచ్చినవారు వారే చస్తున్నారు

అహో బ్రహ్మవిదాం వాచో నాసత్యాః సన్తి కర్హిచిత్
గర్గో యదాహ భగవానన్వభావి తథైవ తత్

బ్రహ్మజ్ఞ్యానులు చెప్పినవి ఎపుడూ అబద్దం కాదు కదా. గర్గుడు ముందే చెప్పాడు, చాలా ఆపదలు వస్తాయి.ఇతన్ని నమ్మిన వారు ఎలాంటి ఆపదలకూ గురికారు, ఇతను అందరినీ కాపాడతాడు అని చెప్పాడు. అవి నిజమయ్యాయి

ఇతి నన్దాదయో గోపాః కృష్ణరామకథాం ముదా
కుర్వన్తో రమమాణాశ్చ నావిన్దన్భవవేదనామ్

కృష్ణ బలరాముల లీలలనూ చేష్టలనూ మాటి మాటికీ తలచుకుంటున్న గోపికలకు గోపాలురకూ సంసార వేదన తెలియలేదు

ఏవం విహారైః కౌమారైః కౌమారం జహతుర్వ్రజే
నిలాయనైః సేతుబన్ధైర్మర్కటోత్ప్లవనాదిభిః

ఈ రీతిలో రక రకాల విహారాలతో కోతి గంతులు వేసుకుంటూ దాగుడు మూతలు ఆడుకుంటూ ఈ కౌమారాన్ని పిచుకల గూళ్ళు కట్టుకుంటూ విహరించుకుంటూ కౌమారాన్ని గడుపుతూ ఉన్నారు.

                                                    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts