ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
ఇత్థం శరత్స్వచ్ఛజలం పద్మాకరసుగన్ధినా
న్యవిశద్వాయునా వాతం స గోగోపాలకోऽచ్యుతః
ఇంత చల్లని చక్కని వాతావరణములో కృష్ణుడు కూడా ఆనందముగా ఉన్నాడు
కుసుమితవనరాజిశుష్మిభృఙ్గ ద్విజకులఘుష్టసరఃసరిన్మహీధ్రమ్
మధుపతిరవగాహ్య చారయన్గాః సహపశుపాలబలశ్చుకూజ వేణుమ్
కొత్తగా పుష్పించిన పూవులతో కూడి ఉన్న తోటలలో పూసిన పూవుల యందు మకరందాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెదలు. ఫలించిన పళ్ళ రుచిని చూచిన చిలుకలు, మధుపతి ఐన శ్రీకృష్ణుడు వనమంతా సంచరిస్తూ, పశుపాలురతో బలరామునితో కలసి వేణువుని గానం చేసాడూ
తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయమ్
కాశ్చిత్పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యోऽన్వవర్ణయన్
కృష్ణ పరమాత్మ మ్రోగించిన వేణు గానాన్ని విన్న గోపికలు ఎక్కడో ఉన్న కృష్ణ పరమాత్మను తమ ఎదురుగా చూడలేనటువంటి విరహ తాపముతో పరమాత్మను స్తోత్రం చేస్తారు. ఇది గోపికా విరహ గీతములు. పొద్దున్నే లేవగానే అనుసంధానం చేయవలసిన స్తోత్రములు ఇవి
కృష్ణ పరమాత్మ విరహముతో గోపికలు కామాతురతో ఈ గీతం పాడారు. ఒక సారి కలిసిన పరమాత్మ విడిపోతాడేమో అన్న భయమే పరమ భక్తి.
తెగని నూనె ధార లాగ నిరంతరమూ పరమాత్మ యందు ఉండే స్మృతి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మన ముందర సాక్షాత్కరింపచేస్తుంది. ఒక సారి కనపడ్డ తరువాత మళ్ళీ కనపడడేమో అన్న భయాన్ని పరమ భక్తి అంటారు.
తద్వర్ణయితుమారబ్ధాః స్మరన్త్యః కృష్ణచేష్టితమ్
నాశకన్స్మరవేగేన విక్షిప్తమనసో నృప
బర్హాపీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం
బిభ్రద్వాసః కనకకపిశం వైజయన్తీం చ మాలామ్
రన్ధ్రాన్వేణోరధరసుధయాపూరయన్గోపవృన్దైర్
వృన్దారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తిః
మన్మధ వేగముతో పారవేసుకోబడిన మనసు గల గోపికలు కృష్ణ పరమాత్మ ఎడబాటుని సహించలేకపోయారు. మగవాళ్ళు కూడా మోహించబడేంత ముద్దుగా ఉన్నాడు. శిరస్సులో నెమలిపించం. నాట్యం చేసేవాడికి ఎంత చక్కని ఆకారం ఉంటుందో అలా, రెండు చెవులలో రెండు కర్ణికా పుష్పాలను ధరించి, బంగారం వంటి పట్టు వస్త్రాన్ని ధరించాడు, మెడలో వైజయంతీ మాలను ధరించాడు. ఐదు రకముల పుష్పములను ఐదు తీరులుగా ఐదు చోట్ల వేయబడిన మాల వైజయంతీ మాల. వేణువును ఊదుతున్నాడు. వేణువులో రంధ్రాలను అధరామృతముతో నింపుతున్నాడు.
గోపికల గోపాలుర చేత గుంపులు గుంపులుగా చేరి తన చరితను గానం చేస్తుంటే తన పదముల, పాదముల స్పర్శతో ఆనందం పొందుతున్న బృందావనాన్ని స్వామి ప్రవేశించాడు
ఇతి వేణురవం రాజన్సర్వభూతమనోహరమ్
శ్రుత్వా వ్రజస్త్రియః సర్వా వర్ణయన్త్యోऽభిరేభిరే
కృష్ణ పరమాత్మ వేణు రవం చేస్తుంటే గోపికలే కాక సకల ప్రాణులూ ఆ ధ్వనిని విని సంతోషించాయి. అది విన్న వ్రజ స్త్రీలు అందరూ
అతనినీ అతని వేణు గానాన్ని వర్ణిస్తూ పాటలు పాడారు, వారిలో వారు పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నారు, క్రీడించారు
శ్రీగోప్య ఊచుః
అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః
సఖ్యః పశూననవివేశయతోర్వయస్యైః
వక్త్రం వ్రజేశసుతయోరనవేణుజుష్టం
యైర్వా నిపీతమనురక్తకటాక్షమోక్షమ్
కృష్ణ పరమాత్మను చూస్తే మాకు ఈ విషయం అర్థమయ్యింది. కనులు కలిగి ఉండుటకు ఇదే ఫలం
కళ్ళు ఉండి కూడా ఆయనను చూడకపోతే వారు కళ్ళు లేని వారితోనే సమానం.
తోటి గొల్ల పిల్లలతో గోవులతో దూడలతో కలిసి ఆ దుమ్మంతా ఒంటి మీద పడుతూ ఉంటే అడవిలో ప్రవేశిస్తున్న స్వామిని, పరత్వ సౌలభ్యాలను ఒకే సారి చూపిచే గోపయ్యను చూడాలి. పరత్వ పరాకాష్ట సౌలభ్య పరాకాష్ట ఉన్న స్వామిని చూడడం కన్న పరము మాకు తెలియదు.
బలరామ కృష్ణులిద్దరి ముఖములూ వేణువులచే సేవించబడినవు. అలా వస్తున్న స్వామి మీద కొన్ని లక్షల చూపులు పడతాయి. ప్రేమ నిండిన లక్షల చూపులు అవి. నిరంతరం వేణువు యందు అధరామృతాన్ని అందించిన, అందరి చేతా ఆస్వాదించబడుతున్న, తోటి గోపబాలురతో విహరించుచున్న, అడవి నుండి పల్లెకు వస్తున్న కృష్ణ పరమాత్మను చూడడమే ఫలము కనులు ఉన్నందుకు.
చూతప్రవాలబర్హస్తబకోత్పలాబ్జ మాలానుపృక్తపరిధానవిచిత్రవేశౌ
మధ్యే విరేజతురలం పశుపాలగోష్ఠ్యాం రఙ్గే యథా నటవరౌ క్వచ గాయమానౌ
మామిడి చిగురాకులతోటి దడకూర్చి, నెమలి పించములూ, కొన్ని పూల గుత్తులూ కలువలూ పద్మములూ వీటి మాలల చేత గుచ్చబడిన వస్త్రములతో విచిత్ర వేషముతో గోపాలకుల సభలో మధ్యన తగినంతా ప్రకాశించాడు, తెర మీద నటులు ప్రకాశించినట్లుగా గానం చేస్తూ ప్రకాశిస్తున్నారు
గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణుర్
దామోదరాధరసుధామపి గోపికానామ్
భుఙ్క్తే స్వయం యదవశిష్టరసం హ్రదిన్యో
హృష్యత్త్వచోऽశ్రు ముముచుస్తరవో యథార్యః
గోపికలకు వేణువు మీద అసూయ, గోపికలను చూస్తే వేరేవాళ్ళకు అసూయూ. ఇంతటి నేర్పరి తనం సంపాదించడానికి గోపికలు ఏమి పుణ్యం చేసారు. వ్యాసుడు భాగవతములో రాధను వేణువుగా చూపాడు (ఈ రహస్యం మనకు పాద్మ పురాణాంతర్గతమైన భాగవత మాహాత్మ్యములో ఉంది. భాగవత మాహాత్యం పాద్మములో మూడు సార్లు చెప్పబడి ఉన్నది). బ్రహ్మవైవర్తములో కృష్ణపరమాత్మ దగ్గర వేణువు లేదు. భాగవతములో రాధ లేదు. వేణువే రాధ. వ్యాసుడు రాధనే వేణువుగా మలిచాడు. వేణువు తాగగా మిగిలిన కృష్ణ అధరామృతమును గోపికలు తాగారు. వారి తాగగా మిగిలిన దాన్ని మడుగులూ సరస్సులూ తాగాయి. స్వామి వేణు గానం చేసి, దప్పి గొని, వేణువు పక్కన పెట్టి అందరూ చూస్తుండగా మడుగులో నీరు తాగుతాడు. ఎవరూ చూడనప్పుడు దూడలు చూస్తుండగా రెండు చేతులూ వెనక్కు కట్టుకుఇ ముందుకు వంగి దూడలకు నీరు తాగడం నేర్పడానికా అన్నట్లు చేయి పెట్టకుండా నోటితోనే నీరు తాగుతాడు. ఇలా కృష్ణ పరమాత్మ అధరామృతాన్ని వారు వారు పానం చేస్తూ ఉంటే చూస్తున్న వృక్షాలు వారికంటే ఎక్కువ ఆనందించాయి. ఆర్యులు (సజ్జనులు) తాము సంతోషిస్తే సంతోషించరు, ఎదుటివారు సంతోషిస్తే సంతోషిస్తారు. అలాగే చెట్లు కూడా ఉత్తములలాగ ఆనందిస్తున్నారు. అవి ఆనందబాష్పాలు రాల్చాయి
వృన్దావనం సఖి భువో వితనోతి కీఋతిం
యద్దేవకీసుతపదామ్బుజలబ్ధలక్ష్మి
గోవిన్దవేణుమను మత్తమయూరనృత్యం
ప్రేక్ష్యాద్రిసాన్వవరతాన్యసమస్తసత్త్వమ్
బృందావనం కూడా కీర్తిని వ్యాపింపచేస్తూ ఉన్నది.దేవకీ పుత్రుని పాద పద్మముల సంపద కల బృందావనం కీర్తిని వ్యాపింపచేస్తూ ఉన్నది. బృందావనములో కృష్ణ పరమాత్మ వేణువును ఊదుతున్నాడు. కమ్మని పాటకు నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యమును చూచి పర్వతములలో లోయలలో గుహల్లో ఉన్న అన్ని రకముల జీవులూ తమను తాము మరచిపోయి పులకించిపోతున్నారు.మేము (గోపికలు) అక్కడ ఉండి చూడలేకపోతున్నాము.
ధన్యాః స్మ మూఢగతయోऽపి హరిణ్య ఏతా
యా నన్దనన్దనముపాత్తవిచిత్రవేశమ్
ఆకర్ణ్య వేణురణితం సహకృష్ణసారాః
పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకైః
బుద్ధీ జ్య్నానమూ లేకున్నా ఈ ఆడ లేళ్ళు ధన్యులు. ఈ లేళ్ళు ఎంత గొప్పవంటే ఇటువంటి విచిత్ర వేషం కలిగిన పరమాత్మను కనులారా చూస్తూ ఆయన వేణుగానాన్ని వింటూ, తమ ప్రియులైన మగ లేళ్ళతో కలసి పరమాత్మను చూస్తూ ఆయన వేణు గానాన్ని వింటున్నాయి. తమకు ఇంతటి గొప్ప అదృష్టాన్ని కలిగించిన కృష్ణపరమాత్మను మరొక రకముగా పూజించే శక్తి లేదు కాబట్టి ప్రేమ నిండిన చూపుతో పూజిస్తున్నార్యి.దగ్గరకు చేరలేకున్నా ఆనందాన్ని ప్రకటింపచేయడానికి వేరే మారగములేకున్నా ప్రేమ రసం తొణికిసలాడే చూపులతో కృష్ణపరమాత్మను చూస్తున్న మగలేళ్ళతో కలసి ఉన్న ఆడలేళ్ళు చాలా అదృష్టవంతులు
కృష్ణం నిరీక్ష్య వనితోత్సవరూపశీలం
శ్రుత్వా చ తత్క్వణితవేణువివిక్తగీతమ్
దేవ్యో విమానగతయః స్మరనున్నసారా
భ్రశ్యత్ప్రసూనకబరా ముముహుర్వినీవ్యః
ఆడవారికి పండుగ కలిగించే రూపం కలవాడు కృష్ణుడు. పరమాత్మ చేత గానం చేయబడిన విచిత్ర గీతమును విని ఆకాశములో విమానాలలో విహరించే దేవతా స్త్రీలు కూడా మన్మధునిచే తొలగించబడిన బలం కలవారై సిగముడులు విడిపోతూ పూలు రాలిపోతూ ఉండగా మోహాన్ని చెందుతున్నారు
గావశ్చ కృష్ణముఖనిర్గతవేణుగీత
పీయూషముత్తభితకర్ణపుటైః పిబన్త్యః
శావాః స్నుతస్తనపయఃకవలాః స్మ తస్థుర్
గోవిన్దమాత్మని దృశాశ్రుకలాః స్పృశన్త్యః
మాకు తప్ప అందరికీ భాగ్యమే. అందరూ వింటున్నారు ఈ వేణుగానం. ఆవులు కూడా కృష్ణ పరమాత్మ ముఖం నుండి వెలువడిన వేణుగానం చేత నింపబడిన చెవులనే దొప్పలతో తాగుతూ దూడలు ఆకలై తల్లుల వద్దకు వెళుతున్నాయి. తల్లులు వేణుగానముతో ఉప్పొంగి ధారగా పాలిస్తున్నాయి. దూడలు ఆ తాగిన పాలు నోటిలోనే పెట్టుకున్నాయి.కృష్ణుని వేణు గానానికి మైమరచి నోటిలో పాల ముద్దలు పెట్టుకుని ఉన్నాయి గానీ మింగలేదు. నోటిలో ఉన్న పాలు గడ్డకట్టి పాల ముద్దలయ్యాయి.
ప్రాయో బతామ్బ విహగా మునయో వనేऽస్మిన్
కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతమ్
ఆరుహ్య యే ద్రుమభుజాన్రుచిరప్రవాలాన్
శృణ్వన్తి మీలితదృశో విగతాన్యవాచః
ఈ బృందావనములో ఉన్న పక్షులన్నీ పక్షులు కావు మునులే. దూరముగా ఉన్నవారు కనపడాలంటే ఎత్తు ఎక్కినట్లు ఈ పక్షులు చెట్ల చిటారు కొమ్మ ఎక్కి కృష్ణున్ని చూస్తున్నాయి. ఇవి పక్షులు కావు మునులే.
కనులు మూసుకోకుండా కనులు తెరుచుకుని చూస్తున్నాయి. వాటి అరుపు మానేసారు. స్వామినే చూస్తున్నాయి.
నద్యస్తదా తదుపధార్య ముకున్దగీతమ్
ఆవర్తలక్షితమనోభవభగ్నవేగాః
ఆలిఙ్గనస్థగితమూర్మిభుజైర్మురారేర్
గృహ్ణన్తి పాదయుగలం కమలోపహారాః
నదులు కూడా కృష్ణపరమాత్మ వేణు గానాన్ని విని ఆనందిస్తున్నాయి. విని ఆనందిస్తున్నట్లు గుర్తుగా పరమాత్మ వేణు గానం వినడం వలన కలిగిన మన్మధావేశములో సుడులు తిరిగి వేగం తగ్గిస్తున్నాయి. ఒక్క సారి తరంగాలతో గట్టిగా పద్మాలను కౌగిలించుకుని శ్రీకృష్ణుని పాదముల యందు కానుకలుగా ఉంచుతున్నాయి. తాము కౌగిలించుకున్న పద్మములు స్వామి పాదాలను తాకడముతో తాము కూడా స్వామిని కౌగిలించుకున్నట్లు భావించాయి.
దృష్ట్వాతపే వ్రజపశూన్సహ రామగోపైః
సఞ్చారయన్తమను వేణుముదీరయన్తమ్
ప్రేమప్రవృద్ధ ఉదితః కుసుమావలీభిః
సఖ్యుర్వ్యధాత్స్వవపుషామ్బుద ఆతపత్రమ్
మేము చేయలేని సేవలను వనకాంత (అడవి) చేస్తోంది. బలరామునితో గోపాలకులతో కలసి గోవులను ఎండలో తిప్పుతూ వేణువును ఊదుతున్న స్వామిని చూచి వీరందరికీ ప్రేమ పెరిగి తన శరీరముతో స్వామి నడిచే దారిలో పూలు పరచింది. కొమ్మలతో ఆకాశాన్ని కప్పింది. గొడుగుగా పాదుకలుగా వనకాంత కృష్ణున్ని సేవిస్తోంది. ఎంత దుర్మార్గులారు. మేము చేసుకుని మురవవలసిన సేవలను వనకాంత చేస్తోంది.
పూర్ణాః పులిన్ద్య ఉరుగాయపదాబ్జరాగ
శ్రీకుఙ్కుమేన దయితాస్తనమణ్డితేన
తద్దర్శనస్మరరుజస్తృణరూషితేన
లిమ్పన్త్య ఆననకుచేషు జహుస్తదాధిమ్
నదుల ఓడ్డులో ఉండే ఇసుక తిన్నెలనూ, అడవి స్త్రీలనూ పులిన్ద్య అంటారు. పెద్దల చేత నిరంతరం గానం చేయబడే శ్రీమన్నారాయణుడి పాద పద్మముల ఎరుపు అంటింది. కనుక స్తనముల యందు అలంకరించుకోదగిన కుంకుమ అది. పరమాత్మ ఇసుక తిన్నెల మీద నడుస్తూ ఉంటే పడుతున్న అడుగు జాడలను కింద ఉన్న చెట్ల కొమ్మలు తుడిచివేస్తున్నాయి. "కృష్ణ పాద పరాగమును మేమే తీసుకుంటాం" అన్నట్లుగా ఆ కొమ్మలు తమ మూర్ధ్న భాగాన అంటించుకుంటున్నాయి. అది మేము స్తనముల మీద ధరించకుండా చేస్తున్నాయి.
హన్తాయమద్రిరబలా హరిదాసవర్యో
యద్రామకృష్ణచరణస్పరశప్రమోదః
మానం తనోతి సహగోగణయోస్తయోర్యత్
పానీయసూయవసకన్దరకన్దమూలైః
ఈ పర్వతం కూడా చూడడానికి మగవేషములో కనపడుతున్నా, ఇది కూడా పరమాత్మకు ఉత్తమ దాసులైన అబల. రామకృష్ణుల పాద స్పర్శతో కలిగిన ఆనందముతో గోవులకూ గోపాలకురకూ మంచి నీళ్ళూ కందములూ మూలములూ మంచినీళ్ళూ ఆసనములూ పళ్ళూ పూలూ మొగ్గలూ కాయలూ ఇచ్చింది. తాను ఎవరి వలన ఆనందం పొందారో వారికి సంబందించిన వారు వస్తే అంత ఆనందమూ కలుగుతుంది.
గా గోపకైరనువనం నయతోరుదార
వేణుస్వనైః కలపదైస్తనుభృత్సు సఖ్యః
అస్పన్దనం గతిమతాం పులకస్తరుణాం
నిర్యోగపాశకృతలక్షణయోర్విచిత్రమ్
పర్వతమే కాదు ప్రతీ చెట్టూ అమ్మాయే. కొత్త కొత్త పూలు వస్తున్నాయి. శరీరం పులకించినట్లుగా. కొత్త చిగురాకులూ పూవులూ కలుగుతున్నాయి. గోవులతో కలసి ఆవులను వనానికి తీసుకు వెళుతున్న వారి యొక్క చక్కని వేణు గానముతో మంచి పాటలతో శరీరం పులకించి గమనం ఉన్నవారు కూడా గమనం మాని వేసారు. ఏ మాత్రం సంబంధం లేకున్నా ఎంతో కాలం నుంచి ఏర్పడిన పాశముతో పులకింతలు చెట్లకు కూడా కలుగుతున్నాయి.
ఏవంవిధా భగవతో యా వృన్దావనచారిణః
వర్ణయన్త్యో మిథో గోప్యః క్రీడాస్తన్మయతాం యయుః
ఇలా పరమాత్మ యొక్క రకరకాల లీలలను గానం చేస్తూ ఇళ్ళలో ఉన్న గోపికలు కూడా తన్మయ్త్వాన్ని పొందారు. నిరంతరం కృష్ణ పరమాత్మ ధ్యానము చేత వారు కూడా కృష్ణులే అయ్యారు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు