Followers

Sunday, 27 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఎనిమిదవ అధ్యాయం

                    
                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఎనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ విజ్ఞాయ భగవాన్సర్వాత్మా సర్వదర్శనః
సైరన్ధ్ర్యాః కామతప్తాయాః ప్రియమిచ్ఛన్గృహం యయౌ

తనని ఆశ్రయించిన వారి ఆర్తిని నాశనం చేసే కృష్ణుడు తాను నగరములోకి ప్రవేశించిన వెంటనే అడిగిన వెంటనే కాదనకుండా అంగరాగమును సమర్పించి తన భక్తిని చాటుకున్నది త్రివక్ర. ఆమెను అనుగ్రహించ దలచుకున్నాడు కృష్ణుడు. (కృష్ణునికి మధురా నగరములో ఎటువంటి ఇబ్బందీ రాకుండా తాను అనుకున్నది అనుకున్న విధముగా జరగడానికి, అన్ని కార్యాలు సాధించడానికి కారణం కుబ్జను సత్కరించడం వలననే అనీ ఇటువంటి సత్కారం రాముడు మందరకు చేయనందునే రామునికి కష్టం వచ్చింది అని ఒక రసోక్తి. రామావతారములో తాటకిని చంపడానికి రాముడే వెళి చంపవలసి వచ్చింది. కృష్ణుని దగ్గరకు ఎవరెవరు వధించబడాలో (ఒక్క కంసుడు తప్ప) వారే వచ్చారు. వేదాంత పరమైన అర్థం తీసుకుంటే కుబ్జ స్వామి వారి వనమాల్గా చెబుతారు. అందులో ఉండే ఐదు రకాల పుష్పాలు సుదాముడుగా పుట్టాయి. అందుకే స్వామికి పుష్పాలు ఇచ్చాడు. వనమాల వలన వక్షస్థలానికి రాసిన గంధం కనపడకుండా పోతుంది. అందుకే వనమాల అంస ఐన కుబ్జ గంధాన్ని అందించింది. )
నిన్ను నేను విడిచిపెట్ట దలచుకోలేదు అని కుబ్జ బలరాముడు చూస్తుండగా మరలా వస్తానని చెప్పాడు కృష్ణుడు.
తన కోసం కుబ్జ పరితపిస్తున్నదన్న విషయాన్ని సర్వాత్మ (అందరికీ ఆత్మ ఐన) ఐన, అన్నీ చూచేవాడూ, అన్నీ తెలిసిన వాడైన కృష్ణుడు తెలుసుకున్నాడు. ఆమెకు ప్రీతిని కలిగించగోరి ఆమె ఇంటికి వెళ్ళాడు

మహార్హోపస్కరైరాఢ్యం కామోపాయోపబృంహితమ్
ముక్తాదామపతాకాభిర్వితానశయనాసనైః
ధూపైః సురభిభిర్దీపైః స్రగ్గన్ధైరపి మణ్డితమ్

కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందిన దాసి కాబట్టి ఆమె ఇంటిలో మహా శ్రీమంతుల ఇళ్ళలో ఎలాంటి వస్తువులు ఉండాలో అలాంటి సంపదలతో నిండి ఉన్నది. మనకున్న నాలుగు పురుషార్థాలలో ఆమె కామ ఉపాయాన్నే వ్యాపింపచేసే అలంకారాలు ఉన్నాయి. హారములతో ముత్యములతో వితానములూ శయనాసములూ ధూప దీప అనేకమైన సుగంధములు పుష్పమాలలూ కలిగి ఉన్నాయి

గృహం తమాయాన్తమవేక్ష్య సాసనాత్సద్యః సముత్థాయ హి జాతసమ్భ్రమా
యథోపసఙ్గమ్య సఖీభిరచ్యుతం సభాజయామాస సదాసనాదిభిః

పరమాత్మే వెతుక్కుంటూ రాగా ఆయనను చూచి తొట్రు పడుతూలేచి , ఆసన అర్ఘ్య పాద్యాలలతో తన చెలికత్తెలల్తో సహా ఆమె ఆయనను అర్చించినది

తథోద్ధవః సాధుతయాభిపూజితో న్యషీదదుర్వ్యామభిమృశ్య చాసనమ్
కృష్ణోऽపి తూర్ణం శయనం మహాధనం వివేశ లోకాచరితాన్యనువ్రతః

ఆయన ఉద్ధవునితో కలిసి వచ్చాడు. ఆమె అతనితో పాటు ఉద్ధవునికి కూడా ఉన్నతాసనాన్ని చూపిస్తే పరమ భక్తాగ్రేసుడు కాబట్టి ప్రభువు ముందరా పెద్దల ముందరా ఉన్నతాసనములో కూర్చోరాదు కాబట్టి, ఆసనాన్ని వద్దూ అనకూడదు కాబట్టి, వారి మాట తిరస్కరించకుండా తన స్వరూపానికి భంగం రాకుండా ఆ ఆసనాన్ని చేత్తో స్పృశించాడు. భూమి మీదనే కూర్చున్నాడు.
పరమాత్మ లౌకికమైన ఆచారములను అనుసరించి,

సా మజ్జనాలేపదుకూలభూషణ స్రగ్గన్ధతామ్బూలసుధాసవాదిభిః
ప్రసాధితాత్మోపససార మాధవం సవ్రీడలీలోత్స్మితవిభ్రమేక్షితైః

చూడటానికి ఇది కుబ్జా కృష్ణుల శృంగారమును చెప్పినట్లుగా  ఉంటుంది. కుబ్జ కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళడానికి తనను తాను సిద్ధం చేసుకున్నది.
ఈ తొమ్మిదీ కూర్చుకుని పరమాత్మను చేరింది. జీవుడు పరమాత్మను చేరాలంటే నవ విధ భక్తులను ఆశ్రయించే తీరాలి. ఇది జీవాత్మా పరమాత్మ యొక్క అనుభవమే. వాసుదేవుడొక్కడే పురుషుడు. మనమందరమూ స్త్రీలమే. స్త్రీప్రాయం ఇతరత్ సర్వం. సర్వ దర్శి ఐన పరమాత్మకు ఏ ఏ రకముల కైంకర్యము చేయాలనూకొని జీవుడు పరమాత్మ వద్దకు వచ్చాడో నవ విధ భక్తులతో పరమాత్మను చేరిన నాడు మన చేత అన్ని కైంకర్యములనూ మననుండి స్వీకరిస్తాడు.
స్నానమూ గంధమూ చక్కని వస్త్రాలూ ఆభరణాలూ పూలమాలలూ తాంబూలమూ సుధా మొదలైన వాటిని సేవించి తనను తాను చక్కగా అలంకరించుకుంది. శరీరాన్ని బాగా అలంకరించుకుంది (ఆత్మను అలంకరించుకున్నది)
పరమాత్మను చేరుకున్నది. సిగ్గూ విలాసమూ పరిహాసము వీటితో కలసిన చూపులతో

ఆహూయ కాన్తాం నవసఙ్గమహ్రియా విశఙ్కితాం కఙ్కణభూషితే కరే
ప్రగృహ్య శయ్యామధివేశ్య రామయా రేమేऽనులేపార్పణపుణ్యలేశయా

ఇంత గంధం అర్పించడం వలన పొందిన అంత పుణ్యం కలిగిన దానితో స్వామి రమించాడు. కొంచెముగా గంధమిచ్చింది. మనం మనదీ అనుకున్నదాన్ని పరమాత్మకు అర్పించడం కంటే పుణ్యం ఇంకోటి లేదు. దాని విలుల్వ ఇంతా అని మనం చెప్పలేము. ఆకలితో మాడుతున్నా సరే కుచేలుడు అటుకులు తినలేదంటే ఆ అటుకులు తినరానివిగా ఉన్నాయి. పిల్లలుకూడా తినడానికి పనికి రావని తినని అటుకులను ఇవ్వగా పరమ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కృష్ణుడు.

సానఙ్గతప్తకుచయోరురసస్తథాక్ష్ణోర్
జిఘ్రన్త్యనన్తచరణేన రుజో మృజన్తీ
దోర్భ్యాం స్తనాన్తరగతం పరిరభ్య కాన్తమ్
ఆనన్దమూర్తిమజహాదతిదీర్ఘతాపమ్

ఎన్నో లక్షల కోట్ల జన్మలు తపస్సు చేసి కూడా సంపాదించలేని పరమాత్మ పాద రజస్సును తన శిరస్సునా వక్షస్థలములోనూ నింపుకున్నది. ఆ పాద రజస్సును వక్షస్థలములో దాచుకుని ఇన్ని రోజులూ (తాను కృష్ణ పరమాత్మను కలసినప్పటినుంచీ) తాననుభవించిన పరమాత్మ వియోగ తాపాన్ని విడిచిపెట్టింది

సైవం కైవల్యనాథం తం ప్రాప్య దుష్ప్రాప్యమీశ్వరమ్
అఙ్గరాగార్పణేనాహో దుర్భగేదమయాచత

ఎవరిచేతా పొంద శక్యం కాని కైవల్యనాథుడూ పరమేశ్వరుడైన స్వామిని అంగరాగముతో అంగరాగము అర్పించి ఆయనతో సమాగమం కోరుకుంది అదృష్టహీనురాలు. సాంసారికమైన సమాగమాన్ని కోరింది.

సహోష్యతామిహ ప్రేష్ఠ దినాని కతిచిన్మయా
రమస్వ నోత్సహే త్యక్తుం సఙ్గం తేऽమ్బురుహేక్షణ

ఒక సారి సమాగమం ఐపోయిన తరువాత మళ్ళీ అడిగాడు స్వామి ఇంకేమి కావాలి అని. ఇంకో వారం పాటు నాతోనే ఉండమని కోరింది. పరమాత్మ ఎదురుగా ఉన్నా మనం సంసారాన్నే కోరుత్న్నామంటే ఆ మాయను దాటలేము.

తస్యై కామవరం దత్త్వా మానయిత్వా చ మానదః
సహోద్ధవేన సర్వేశః స్వధామాగమదృద్ధిమత్

ఆమె అడిగిన వరాన్ని ఆమెకు ఇచ్చి మళ్ళీ ఉద్ధవునితో తన ఇంటికి బయలు దేరాడు

దురార్ధ్యం సమారాధ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరమ్
యో వృణీతే మనోగ్రాహ్యమసత్త్వాత్కుమనీష్యసౌ

ఈమె దుర్బుద్ధి కలది. ఎన్ని రకాల దాన తప హోమ అర్చన జపాదులతో ఆరాధించ శక్యం కాని పరమాత్మను అంత గంధం అర్పించి ఆరాధించిన కుబ్జ మనసు దేని గురించి ఉబలాటపడుతుందో దాన్ని కోరింది. సత్వ గుణము లోపించింది.
బ్రహ్మ వైవర్తములో హరి వంశములో పాద్మ పురాణములోను చెబుతారు: వీరిద్దరి సమాగమం వలన ఉపశ్లోకుడనే ఆయన పుట్టి నారద మహర్షి వలన పాంచరాత్ర ఆగమాన్ని మనకు అందిస్తాడు. ఈ విధముగా కృష్ణుడు పాంచరాత్ర ఆగమాన్ని ఉద్ధరించడానికే కుబ్జతో (మన బాషలో చెప్పడానికి) రమించాడు. రామాయణములో ఉన్న శూర్పణఖే కుబ్జగా అవతరించింది. రామావతారములో రాముని మాత్రమే కోరినందుకు, అలా కోరకుండా అమ్మవారితో ఉన్న స్వామివారిని ఆరాధించే విధానాన్ని పొందుపరచే ఉత్తమ గ్రంధాన్ని రచించేవాడిని నీ నుండి పుత్రినిగా పొందుతానని సంకల్పించి తపస్సు చేసింది. ఆమె కుబ్జగా జన్మించింది.

అక్రూరభవనం కృష్ణః సహరామోద్ధవః ప్రభుః
కిఞ్చిచ్చికీర్షయన్ప్రాగాదక్రూరప్రీయకామ్యయా

వెంటనే కృష్ణుడు అకౄరుని ఇంటికి వెళ్ళాడు. కొంచెం అకౄరినికి ప్రీతి చేయగోరి తన పని కూడా నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు

స తాన్నరవరశ్రేష్ఠానారాద్వీక్ష్య స్వబాన్ధవాన్
ప్రత్యుత్థాయ ప్రముదితః పరిష్వజ్యాభినన్ద్య చ

తన బంధువైన స్వామికి ఎదురేగి ఆలింగనం చేసుకుని అభినందించి బలరామ కృష్ణులకు నమస్కారం చేసాడు వారు చేత నమస్కరించబడ్డాడు

ననామ కృష్ణం రామం చ స తైరప్యభివాదితః
పూజయామాస విధివత్కృతాసనపరిగ్రహాన్

ఆసన అర్ఘ్య పాద్యాలతో పూజ పూర్తి ఐన తరువాత కాళ్ళు కడిగి ఆ తీర్థాన్ని నెత్తిన ధరించి

పాదావనేజనీరాపో ధారయన్శిరసా నృప
అర్హణేనామ్బరైర్దివ్యైర్గన్ధస్రగ్భూషణోత్తమైః

శుభ్రమైన వస్త్రములూ గంధములూ ఆభరణములూ సమర్పించి శిరస్సుతో నమస్కరించి

అర్చిత్వా శిరసానమ్య పాదావఙ్కగతౌ మృజన్
ప్రశ్రయావనతోऽక్రూరః కృష్ణరామావభాషత

అతని పాదలని ఒడిలోపెట్టుకుని తుడుస్తూ వినయముతో వంగిన వాడై రామ కృష్ణులతో ఇలా అంటున్నాడు

దిష్ట్యా పాపో హతః కంసః సానుగో వామిదం కులమ్
భవద్భ్యాముద్ధృతం కృచ్ఛ్రాద్దురన్తాచ్చ సమేధితమ్

స్వామీ అదృష్టం బాగుండి మీరు కంసుని చంపి, అతని వలన బాధపడిన మీ కులాన్ని ఉద్ధరించారు

యువాం ప్రధానపురుషౌ జగద్ధేతూ జగన్మయౌ
భవద్భ్యాం న వినా కిఞ్చిత్పరమస్తి న చాపరమ్

ఇది మీకు పెద్ద కార్యం కాదు. మొత్తం జగత్తునకు మీరే కారణం, మీరే జగద్స్వరూపులు, జగత్తునకు ప్రధానపురుషులు
మీరు లేకుండా ఈ జగత్తులో పెద్దా చిన్నా అంటూ ఏదీ ఉండదు. మీకంటే వేరే ఎక్కువదీ తక్కువదీ లేదు


ఆత్మసృష్టమిదం విశ్వమన్వావిశ్య స్వశక్తిభిః
ఈయతే బహుధా బ్రహ్మన్శ్రు తప్రత్యక్షగోచరమ్

అష్ట శక్తులతో నీవు ప్రపంచాన్ని సృష్టించి అందులో ప్రవేశించి కనపడకుండా ఉన్న మీరు కనపడే రూపాలతో నానా శక్తులనూ సాక్షాత్కరింపచేసి అన్నిరూపాలలో మీరే ఉండి పరిపాలిస్తారు

యథా హి భూతేషు చరాచరేషు మహ్యాదయో యోనిషు భాన్తి నానా
ఏవం భవాన్కేవల ఆత్మయోనిష్వాత్మాత్మతన్త్రో బహుధా విభాతి

ఈ పంచభూతాలూ మీ నుండే పుట్టాయి (తామస అహంకారం) , ఇన్ని రూపాలుగా ఒకటే భాసిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా కొంచెం ఉన్నది చాలా ఉన్నట్లుగా, ఒకటి వేయిగా వేయి ఒకటిగా కనపడుతుంది. స్థూల సూక్ష్మాలుగా కనపడుంతుంది
పరమాత్మ ఐన నీవుకూడా నీవే కారణముగా వేటి వేటిని సృష్టించావో వాటిలో నీవు ప్రవేశిస్తావు. నీవు ప్రతీ వస్తువులోపలా వున్నావు, ప్రతీ వస్తువునీ నీలో ఉంచున్నావు
తాను అనుకున్న రూపం ధరించి  తాను అనుకున్నపని చేస్తాడు
సృజస్యథో లుమ్పసి పాసి విశ్వం రజస్తమఃసత్త్వగుణైః స్వశక్తిభిః
న బధ్యసే తద్గుణకర్మభిర్వా జ్ఞానాత్మనస్తే క్వ చ బన్ధహేతుః

సృష్టిస్తావు రక్షిస్తావు సంహరిస్తావు. నీవు ఒకడివే ఐనా రజోగుణాన్ని తీసుకున్నపుడు బ్రహ్మగా తమోగుణాన్ని తీసుకున్నపుడు రుద్రునిగా సత్వ గుణం తీసుకున్నపుడు విష్ణువులా ఉంటావు. ఏ గుణముతో ఏ పని చేసినా ఏ రూపముతో ఎందులో ప్రవేశించినా వాటితో నీవు బంధించబడవు. నీకు ఏ గుణమూ లేదూ, అంటదు.
నీకు ఎటువంటి మమకారమూ ఉండదు. జ్ఞ్యానం ఉన్నటువంటి వారికి బంధం అనేది ఉండదు

దేహాద్యుపాధేరనిరూపితత్వాద్భవో న సాక్షాన్న భిదాత్మనః స్యాత్
అతో న బన్ధస్తవ నైవ మోక్షః స్యాతామ్నికామస్త్వయి నోऽవివేకః

వారు వేరు వీరు వేరు అని అనుకోవడానికి, అటువంటి భేధాన్ని చెప్పేది శరీరం. అటువంటి శరీరాన్ని తీసి పక్కన పెడితే ఉన్నదంతా ఆత్మే. దేహం అనేది ఉపాధి. ఆ ఉపాధి ఎప్పుడూ ఉండేది కాదు. అలాగే పంచభూతాలు ఎపుడూ ఉండేవి కాదు.
పుట్టుకా సంసారమూ, మనకున్న భేధమూ అటువంటిది కాదు. నీకు బంధము లేదు. బంధము లేదు కాబట్టి మోక్షమూ లేదు.
బంధ మోక్షములు లేవనడానికి కోరికా అవివేకమూ (విడమరచి చూడలేకపోవుట ) లేదు. శరీరాన్నే ఆత్మా అనుకోవడం వలననే బంధం వస్తున్నది. శరీరం కంటే విడిగా ఆత్మను చూడగలుగుట వివేకం.

త్వయోదితోऽయం జగతో హితాయ యదా యదా వేదపథః పురాణః
బాధ్యేత పాషణ్డపథైరసద్భిస్తదా భవాన్సత్త్వగుణం బిభర్తి

ప్రాచీన వేద మార్గం పాప చిహ్నములు గలవారి మార్గముతో బాధించబడినపుడల్లా నీవు ఆ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వస్తావు. ఈ ప్రపంచం కాపాడడానికి నీవు సత్వగుణం స్వీకరించి వస్తావు

స త్వమ్ప్రభోऽద్య వసుదేవగృహేऽవతీర్ణః
స్వాంశేన భారమపనేతుమిహాసి భూమేః
అక్షౌహిణీశతవధేన సురేతరాంశ
రాజ్ఞామముష్య చ కులస్య యశో వితన్వన్

ఈ పని చేయడానికే వసుదేవుని ఇంటిలో భూ భారాన్ని తొలగించడానికి వేంచేసారు. కొన్ని వందల అక్షౌహిణీల సైన్యాన్ని నశింపచేసి ,ఆ సైన్యం ఉన్న రాజులను కూడా నశింపచేసి భూభారాన్ని నశింపచేసి మీ వంశానికి కీర్తిని పెంచుతావు. 18*23 అక్షౌహిణీల సైన్యాన్ని జరాసంధుడు తెస్తాడు. భారతములో పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం.
రాక్షసుల అంశలో పుట్టిన రాజుల సైన్యాన్ని హతమార్చి యదుకుల కీర్తిని విస్తరింపచేస్తూ

అద్యేశ నో వసతయః ఖలు భూరిభాగా
యః సర్వదేవపితృభూతనృదేవమూర్తిః
యత్పాదశౌచసలిలం త్రిజగత్పునాతి
స త్వం జగద్గురురధోక్షజ యాః ప్రవిష్టః

నా ఇల్లు ఎంతో పుణ్యం చేసుకుని ఉంది ఈ నాడు. సర్వ దేవ మూర్తి పితృ దేవ మూర్తి ఐన పరమాత్మ, నీ పాద తీర్థం మూడులోకాలనూ పావనం చేస్తుంది.
అటువంటి నీవు ఏ మా ఇంటిలోకి ప్రవేశించావో అటువంటి మా ఇల్లు పావనమైనది.

కః పణ్డితస్త్వదపరం శరణం సమీయాద్
భక్తప్రియాదృతగిరః సుహృదః కృతజ్ఞాత్
సర్వాన్దదాతి సుహృదో భజతోऽభికామాన్
ఆత్మానమప్యుపచయాపచయౌ న యస్య

ఏమాత్రం తెలిసిన వారైనా నీ కంటే వేరేవాడిని శరణు వేడుతాడా. నీవు భక్తులకు ప్రియుడవు, వారి ప్రియమైన మాటలను ఆదరించినవాడవు, నిరంతరం క్షేమాన్ని ఆశించేవాడవు (సుహృత్ - ప్రత్యుపకారాన్ని ఆశించకుండా, ఎదుటివాడు అపకారం చేసినా ఉపకారం చేసేవాడు సుహృత్)
కోరినవారికి అన్ని కోరికలూ ఇస్తావు, నిన్ను కూడా నీవు ఇచ్చుకుంటావు. అలా ఇచ్చుకున్నా నీకు హెచ్చు తక్కువ భావాలు లేవు

దిష్ట్యా జనార్దన భవానిహ నః ప్రతీతో
యోగేశ్వరైరపి దురాపగతిః సురేశైః
ఛిన్ధ్యాశు నః సుతకలత్రధనాప్తగేహ
దేహాదిమోహరశనాం భవదీయమాయామ్

నా అదృష్టం బాగుండి నా కంటికి నీవు కనపడ్డావు. యోగీశ్వరుల చేత కూడా నీ స్థానం అందబడదు.
నీ మాయను నీవే చేధించు, దాని వలనే సుతా కలత్రా ఆప్త గేహ దేహ ఇలాంటి ఆరిటితో కలిగే దాన్ని నీవే చేదించు

ఇత్యర్చితః సంస్తుతశ్చ భక్తేన భగవాన్హరిః
అక్రూరం సస్మితం ప్రాహ గీర్భిః సమ్మోహయన్నివ

ఇలా అకౄరునిచేత స్తోరం చేయబడి తన చిరునవ్వుతో ఆయనను మోహింపచేస్తూ

శ్రీభగవానువాచ
త్వం నో గురుః పితృవ్యశ్చ శ్లాఘ్యో బన్ధుశ్చ నిత్యదా
వయం తు రక్ష్యాః పోష్యాశ్చ అనుకమ్ప్యాః ప్రజా హి వః

మీరు చాలా పెద్దలు, మాకు పిన తండ్రివి, కొనియాడదగిన వారు, మేము మీచేత రక్షించబడ దగైన వారము, మేము భృత్యులము  మీరు ప్రభువులు.

భవద్విధా మహాభాగా నిషేవ్యా అర్హసత్తమాః
శ్రేయస్కామైర్నృభిర్నిత్యం దేవాః స్వార్థా న సాధవః

లోకములో ఉత్తండైన వారు మీలాంటి వారిని, పూజించదగిన వారిని సేవించాలి, పూజకు యోగ్యులు మీ వంటి వారు. దేవతలందరూ స్వార్థపరులు. నీలాంటి వారిని సేవిస్తే ఫలితం వస్తుంది. నిజముగా శ్రేయస్సు కావాలి అనుకున్న వారు మీ వంటి వారిని సేవించాలి.

న హ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః
తే పునన్త్యురుకాలేన దర్శనాదేవ సాధవః

నీరుగా ఉండే తీర్థాలు గానీ, మట్టితో తిలతో ఏర్పడిన దేవతలు తొందరగా తరింపచేయరు. ఎంతో కాలం సేవిస్తే కానీ వారు పవిత్రులను చేయరు. మహానుభావులను ఒక్క సారి చూస్తే చాలు, అన్ని పాపాలూ పోతాయి. పవిత్రులైన భగవత్ దర్శనం చాలు.

స భవాన్సుహృదాం వై నః శ్రేయాన్శ్రేయశ్చికీర్షయా
జిజ్ఞాసార్థం పాణ్డవానాం గచ్ఛస్వ త్వం గజాహ్వయమ్

మీరు నాకు ఇష్టులు పెద్దలు శ్రేయోభిలాషులు. నాకు కావలసిన ఒక శ్రేయస్సును మీ వద్ద పొంద గోరి మీ వద్దకు వచ్చాను.
దృతరాష్టృడు తన పుత్రులతో సమానముగా పాండవులను చూచుట లేదని తెలిసింది. అది తెలుసుకుని రావలసినది.

పితర్యుపరతే బాలాః సహ మాత్రా సుదుఃఖితాః
ఆనీతాః స్వపురం రాజ్ఞా వసన్త ఇతి శుశ్రుమ

తండ్రి చనిపోయిన తరువాత తల్లితో బాటుగా పిల్లలను తన నగరానికి తీసుకు వచ్చాడని విన్నాము. ఈ సోదరుని పుత్రులలో అంబికా పుత్రుడు (దృతరాష్టృడు) దోష దృష్టితో చూస్తున్నాడు. దుష్టులైన అతని పుత్రుల వశములో గుడ్డివాడై పడి ఇద్దరి మీద సమానముగా ఉండలేకపోతున్నాడని విన్నాము.

తేషు రాజామ్బికాపుత్రో భ్రాతృపుత్రేషు దీనధీః
సమో న వర్తతే నూనం దుష్పుత్రవశగోऽన్ధదృక్

గచ్ఛ జానీహి తద్వృత్తమధునా సాధ్వసాధు వా
విజ్ఞాయ తద్విధాస్యామో యథా శం సుహృదాం భవేత్

నాయనా వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకో. మంచో చెడో అక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకుని వచ్చాక మనవాళ్ళకు ఎలా మేలు జరుగుతుందో ఆ పని మనం చేద్దాము.

ఇత్యక్రూరం సమాదిశ్య భగవాన్హరిరీశ్వరః
సఙ్కర్షణోద్ధవాభ్యాం వై తతః స్వభవనం యయౌ

ఈ ప్రకారముగా అకౄరున్ని ఆజ్ఞ్యాపించి బలరామ ఉద్ధవులతో కలసి పరమాత్మ తన ఇంటికి తాను వెళ్ళాడు

                                                                 సర్వం శ్రీకృష్ణార్పణమసు 

Popular Posts