Followers

Tuesday 8 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం తొమ్మిదవ అధ్యాయం





శ్రీశుక ఉవాచ
తేऽన్యోన్యతోऽసురాః పాత్రం హరన్తస్త్యక్తసౌహృదాః
క్షిపన్తో దస్యుధర్మాణ ఆయాన్తీం దదృశుః స్త్రియమ్

రాక్షసులు వారిలో వారు కోట్లాడుకుంటూ ఉన్నారు. దొంగల ధర్మాన్ని అనుసరించి వీరు ఉండగా ఆ స్త్రీని వీరు చూసారు

అహో రూపమహో ధామ అహో అస్యా నవం వయః
ఇతి తే తామభిద్రుత్య పప్రచ్ఛుర్జాతహృచ్ఛయాః

ఏమి యవ్వనం, హృదయం చలించి వారు ఆమెను అడిగారు

కా త్వం కఞ్జపలాశాక్షి కుతో వా కిం చికీర్షసి
కస్యాసి వద వామోరు మథ్నతీవ మనాంసి నః

పుండరీక అక్షము కల నీవు ఎక్కడి నుండి వచ్చావు మమ్ము ఏమి చేయాలనుకుంటున్నాను. ఎవరి దానవు, మేము ఇంత పెద్ద సముద్రాన్నీ చిలికితే నీవు నీ చూపులతో మా మనసులను చిలుకుతున్నావు

న వయం త్వామరైర్దైత్యైః సిద్ధగన్ధర్వచారణైః
నాస్పృష్టపూర్వాం జానీమో లోకేశైశ్చ కుతో నృభిః

నిన్ను చూస్తుంటే నీ సౌంద్ర్యం చూస్తూ ఉంటే ఇంత వరకూ ఎవరినీ వివాహం చేసుకున్నట్లు కనపడటం లేదు. సిద్ధ చారణాదులెవ్వరి చేతా లోకపాలకులచేతా నీవు తాకబడలేదు. ఇంక మానవుల గురించి ఏమి చెప్పాలి

నూనం త్వం విధినా సుభ్రూః ప్రేషితాసి శరీరిణామ్
సర్వేన్ద్రియమనఃప్రీతిం విధాతుం సఘృణేన కిమ్

దేహ ధారుల సకల ఇంద్రియములకూ మనసుకూ ప్రీతి కలగడానికి దయ గల పరమాత్మ నిన్ను పంపి ఉంటాడు.

సా త్వం నః స్పర్ధమానానామేకవస్తుని మానిని
జ్ఞాతీనాం బద్ధవైరాణాం శం విధత్స్వ సుమధ్యమే

ఒకే వస్తువుకోసం మాలో మేము పేచీ పెట్టుకుంటున్నాము. మాకు నీవు శుభాన్ని కలిగించు

వయం కశ్యపదాయాదా భ్రాతరః కృతపౌరుషాః
విభజస్వ యథాన్యాయం నైవ భేదో యథా భవేత్

మేము కశ్యపుని పుత్రులము. అన్నదమ్ములము. మాకు పౌరుషం ఎక్కువ. న్యాయబద్దహ్ముగా నీవు అమృతాన్ని పెంచు.

ఇత్యుపామన్త్రితో దైత్యైర్మాయాయోషిద్వపుర్హరిః
ప్రహస్య రుచిరాపాఙ్గైర్నిరీక్షన్నిదమబ్రవీత్

ఈ విధముగా ఆహ్వానిస్తే స్వామి కొంచెం పెద్దగా నవ్వి క్రీగంటి చూపుతో చూస్తూ

శ్రీభగవానువాచ
కథం కశ్యపదాయాదాః పుంశ్చల్యాం మయి సఙ్గతాః
విశ్వాసం పణ్డితో జాతు కామినీషు న యాతి హి

కశ్యప సంతానం ఐన మీరు ఒక వేశ్య యందు ఆసక్తి కలిగి వచ్చారా (పుంశ్యలి - పురుషుని యందు చలించేది). వేశ్యల యందు ఏ పండితుడూ నమ్మకం ఉంచడు

సాలావృకాణాం స్త్రీణాం చ స్వైరిణీనాం సురద్విషః
సఖ్యాన్యాహురనిత్యాని నూత్నం నూత్నం విచిన్వతామ్

వేశ్యల యందూ తోడేళ్ళ యందూ నక్కల యందూ స్నేహాలు అనిత్యాలు. వారికి ఏ పూటకు ఆ పూట కొత్తదనం కావాలి.

శ్రీశుక ఉవాచ
ఇతి తే క్ష్వేలితైస్తస్యా ఆశ్వస్తమనసోऽసురాః
జహసుర్భావగమ్భీరం దదుశ్చామృతభాజనమ్

పరిహాసపు మాటలతోటే వారి నమ్మకమూ మనసూ పొందింది. వారు ఆమె పరిహాసానికి గంభీరమైన భావముతో నవ్వి అమృతం పాత్రను ఇచ్చారు

తతో గృహీత్వామృతభాజనం హరిర్బభాష ఈషత్స్మితశోభయా గిరా
యద్యభ్యుపేతం క్వ చ సాధ్వసాధు వా కృతం మయా వో విభజే సుధామిమామ్

అది తీసుకుని కొంచెం చిరునవ్వుతో, " నేను చేసినది మంచి ఐనా చెడైనా మీరు ఒప్పుకుంటే పంచుతాను".

ఇత్యభివ్యాహృతం తస్యా ఆకర్ణ్యాసురపుఙ్గవాః
అప్రమాణవిదస్తస్యాస్తత్తథేత్యన్వమంసత

ఆమె మాటలను విని రాక్షసులు ఆ మాటల ప్రామాణ్యాన్ని తెలియక అలాగే అని ఒప్పుకున్నారు

అథోపోష్య కృతస్నానా హుత్వా చ హవిషానలమ్
దత్త్వా గోవిప్రభూతేభ్యః కృతస్వస్త్యయనా ద్విజైః

అందరూ ఒక రోజు  ఉపవాసం ఉండి, సముద్రములో స్నానం చేసి, హోమం చేసి, గోవులకూ బ్రాహ్మణులకూ ఇతర ప్రాణులకూ దానం చేసి, పుణ్యాహవాచనం జరుపుకుని

యథోపజోషం వాసాంసి పరిధాయాహతాని తే
కుశేషు ప్రావిశన్సర్వే ప్రాగగ్రేష్వభిభూషితాః

కొత్త వస్త్రాలు కట్టుకొని, దర్భలు ధరించి తూర్పు దిక్కు కూర్చున్నారు

ప్రాఙ్ముఖేషూపవిష్టేషు సురేషు దితిజేషు చ
ధూపామోదితశాలాయాంజుష్టాయాం మాల్యదీపకైః

దేవతలూ రాక్షసులూ ఈ విధముగా యజ్ఞ్య శాలలో కూర్చున్నారు, హోమ ధూపముతో ఆ యజ్ఞ్య శాల చుట్టుముట్టబడి ఉన్నది.

తస్యాం నరేన్ద్ర కరభోరురుశద్దుకూల శ్రోణీతటాలసగతిర్మదవిహ్వలాక్షీ
సా కూజతీ కనకనూపురశిఞ్జితేన కుమ్భస్తనీ కలసపాణిరథావివేశ

రాక్షసులు ఆమె మత్తులో అన్నీ మరచిపోయారు. మత్తు కనులు గలిగినదీ, బంగారు అందెల ధ్వనితో అంతా ధ్వనింపచేస్తూ చేతిలో కలశం పట్టుకుని యజ్ఞ్య శాలలో ప్రవేశించింది.

తాం శ్రీసఖీం కనకకుణ్డలచారుకర్ణ నాసాకపోలవదనాం పరదేవతాఖ్యామ్
సంవీక్ష్య సమ్ముముహురుత్స్మితవీక్షణేన దేవాసురా విగలితస్తనపట్టికాన్తామ్

ఆ మోహిని పరదేవత. ఆమె శ్రీ సఖి. బంగారు కుండలములూ చక్కనీ చెవులూ నాసికలతో శోభిస్తూ ఉన్నది. అత్యాశ్చర్యమైన చూపుతో అందరూ మోహాన్ని పొందారు. ఆమె రాక్షసులవైపు తిరిగింది. స్తనములకు ఉన్న ముడిని జార్చి అమృత కలశమును తీసుకుంది.

అసురాణాం సుధాదానం సర్పాణామివ దుర్నయమ్
మత్వా జాతినృశంసానాం న తాం వ్యభజదచ్యుతః

పాములకు అమృతం పోస్తే ఏమవుతుంది? దుర్నీతిని కలుగచేస్తుంది. అందుకు ఆమె రాక్షసులకు అమృతం పంచలేదు. వారు జన్మ చేతనే తామస స్వభావులు. పరమాత్మ వారికి అమృతాన్ని పంచలేదు.

కల్పయిత్వా పృథక్పఙ్క్తీరుభయేషాం జగత్పతిః
తాంశ్చోపవేశయామాస స్వేషు స్వేషు చ పఙ్క్తిషు

పరమాత వేరు వేరు పంక్తులని ఏర్పాటు చేసాడు. వారందరినీ కూర్చోపెట్టాడు వారి వారి పంక్తిలో.

దైత్యాన్గృహీతకలసో వఞ్చయన్నుపసఞ్చరైః
దూరస్థాన్పాయయామాసజరామృత్యుహరాం సుధామ్

అమృతం కలశం తీసుకుని రాక్షసుల వద్దకు వెళ్ళి చూపులతో విలాసాలతో నవ్వులతో హావ భావాలతో వారిని మోసం చేసింది. రెండు పంక్తులు చేసినపుడు రాక్షసుల పంక్తి దగ్గరగా దేవతల పంక్తి దూరముగా ఉంచింది. దూరముగా ఉన్న వారికి వార్ధక్యం మరణం తొలగించే అమృతం, దగ్గరగా ఉన్నవారికి విలాసమునూ పంచింది.

తే పాలయన్తః సమయమసురాః స్వకృతం నృప
తూష్ణీమాసన్కృతస్నేహాః స్త్రీవివాదజుగుప్సయా

స్త్రీతో వివాదం చేయరాదని రాక్షసులు, ఆమె యందు అతిప్రేమతో ఊరుకున్నారు. గొడవ పెట్టుకుంటే ఆమె మళ్ళీ చూడదని ఊరుకున్నారు.

తస్యాం కృతాతిప్రణయాః ప్రణయాపాయకాతరాః
బహుమానేన చాబద్ధా నోచుః కిఞ్చన విప్రియమ్

ఆ భయముతో ఏ ఒక్క అప్రియమైన మాటా మాట్లాడలేదు

దేవలిఙ్గప్రతిచ్ఛన్నః స్వర్భానుర్దేవసంసది
ప్రవిష్టః సోమమపిబచ్చన్ద్రార్కాభ్యాం చ సూచితః

సింహికా పుత్రుడు (ప్రహ్లాదుని మేనల్లుడ్) దేవతా వేషం వేసుకుని వారి పంక్తిలో కూర్చున్నాడు. కొద్దిగా అమృతం తాగేసాడు. చంద్ర సూర్యుల మధ్య కూర్చున్నాడు.

చక్రేణ క్షురధారేణ జహార పిబతః శిరః
హరిస్తస్య కబన్ధస్తు సుధయాప్లావితోऽపతత్

వారు సూచించగా అమృతం తాగుతున్న వాని శిరస్సును స్వామి చక్రముతో ఖండించాడు. అప్పటికే అమృతం కొంత దిగింది కాబట్టి తలా మొండెమూ ప్రాణముతో ఉన్నాయి

శిరస్త్వమరతాం నీతమజో గ్రహమచీక్లృపత్
యస్తు పర్వణి చన్ద్రార్కావభిధావతి వైరధీః

పీతప్రాయేऽమృతే దేవైర్భగవాన్లోకభావనః
పశ్యతామసురేన్ద్రాణాం స్వం రూపం జగృహే హరిః

బ్రహ్మ ఇతన్ని గ్రహముగా ఏర్పాటు చేసాడు. ప్రతీ పర్వలోనూ ఈ రాహువు సూర్య చంద్రులను తరుముతాడు. అప్పటికే ఇంచుమించు అమృతం అందరికీ పంచడం జరిగిపోయింది. ఈ సంఘటనతో అందరికీ ఈయన విష్ణువని తెలియడముతో స్వామి నిజ రూపం ధరించాడు.

ఏవం సురాసురగణాః సమదేశకాల
హేత్వర్థకర్మమతయోऽపి ఫలే వికల్పాః
తత్రామృతం సురగణాః ఫలమఞ్జసాపుర్
యత్పాదపఙ్కజరజఃశ్రయణాన్న దైత్యాః

దేవతా రాక్షసులు ఒకే దేశ కాలలలో ప్రయోజనం ఆశించి చేసినా దేవతలు అమృతాన్ని సులభముగా పొందారు పరమాత్మ పాద పద్మాలను ఆశ్రయించడం వలన.

యద్యుజ్యతేऽసువసుకర్మమనోవచోభిర్
దేహాత్మజాదిషు నృభిస్తదసత్పృథక్త్వాత్
తైరేవ సద్భవతి యత్క్రియతేऽపృథక్త్వాత్
సర్వస్య తద్భవతి మూలనిషేచనం యత్

ప్రాణం ధనం పనీ మనసూ వాక్కూ, ఇలాంటి వాటితో మానవులు తన కోసం తన వారికోసం దేన్ని కూరుస్తారో అది మంచిది కాదు. ఎందుకంటే భేధ బుద్ధి చూపారు కాబట్టి. అదే వీటిని పరమాత్మ ఆర్పణం చేస్తే మంచి అవుతుంది. దేవతలు అంతా నీదే భారం అని పరమాత్మతో అన్నారు. మనం పరమాత్మకు అర్పిస్తే పరమాత్మ తిరిగి మనకే ఇస్తాడు. పరమాత్మకు అర్పించినదే మూలనిషేచనం (చెట్టు వేరుకు నీరు పోసినట్లు)

Popular Posts