మోక్షకారణ సామగ్ర్యాం భక్తి తేవ గరీయసీ
స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే"
- శ్రీ శంకరభగవత్పాదులవారు
మోక్షమునకుండు అనేకసాధనములలో భక్తి ముఖ్యమైంది.
భక్తి అనగా నేమి?
"అనురక్తి: పరే తత్వే భక్తిరిత్యభిధీయతే" పరమాత్మునియందు అమితమైన ప్రీతే భక్తి.
భౌతిక ప్రాపంచిక విషయాలపైన ఉన్న మమతానురాగాలను ప్రేమ అని, పరమాత్మపైన ఉన్నప్రేమను భక్తీ అని అంటారు. భగవంతునిపై వుండే అనన్య ప్రేమే భక్తి. భగవదనుగ్రహం కోసం పరితపించుటయే భక్తి. పరమేశ్వురునియందు పరమ ప్రేమే భక్తి. లోపలున్న ఈశ్వరుడే శరీరము చేత పనిచేయిస్తున్నాడు, నేను నిమిత్తమాత్రుడును అన్నభావనతో సర్వకర్మలు నిర్వర్తించుటయే విశిష్ట భక్తి.
ఇందు సగుణ, నిర్గుణ భక్తులని రెండున్నాయి. ముందు సగుణ భక్తి అలవడగా, నిరంతర సాధనతో అదే నిర్గుణభక్తికి దారితీస్తుంది.
"సగుణ జ్ఞానహీనస్య న హి నిర్గుణవేదనమ్
నందిదర్శనహీనస్య యధా న శివదర్శనమ్"
నందిదర్శనం లేనిదే శివదర్శనం ఎట్లా సిద్ధింపదో, అలాగునే సగుణభక్తి లేనివారికి నిర్గుణభక్తి సాద్యం కాదు.
"త్రివిధా భక్తిరుద్దిష్టా మనోవాక్కాయ సంభవా
లౌకికీవైదికీ చాపి భవేదాధ్యాత్మికీ తధా"
మనోవాక్కయ కర్మలచే చేసెడు భక్తి మూడు విధములు. అవి లౌకికీ, వైదకీ, ఆద్యాత్మికీ అని మూడు విధములు.
అలానే సామాన్య భక్తి, మానసిక భక్తి, విశిష్ట భక్తీ అని వున్నాయి. స్నాన, ధ్యాన, సంద్యావందన, జప, హోమ, యజ్ఞా దానధర్మములు సామన్య భక్తికి చెందినవి. ఈ భక్తివలన చిత్తశుద్ధి, పుణ్యప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతాయి. కాకపొతే ఇవి నిర్దేశిత సమయాల్లో నియమనిష్టలతో కూడినవి. ఇక సర్వవేళల్లో మానసికంగా జపం, పూజ, భజన, నివేదనం, శరణాగతిలతో పరమాత్మున్ని ఆరాదించడం మానసిక భక్తి. అటుపై ఆత్మార్పణం. తనకు భగవంతునికి భేదంలేని అద్వైతస్థితిలో (తానే ఆత్మ స్వరూపంగా తెలుసుకున్నస్థితి) నిరంతరం రమించుటయే విశిష్ట భక్తి. అంటే అద్వైతానుభూతియే విశిష్ట భక్తి.