Followers

Monday, 13 January 2014

సనాతన హిందూధర్మంలో విగ్రహారాధనకి ఓ విశిష్టత ఉంది.



సనాతన హిందూధర్మంలో విగ్రహారాధనకి ఓ విశిష్టత ఉంది. పరబ్రహ్మము సర్వవ్యాపియై ఉండినను అది అవ్యక్తమై యుండిన కారణంగా భగవత్ స్వరూప నిర్ణయం కొరకు ఒక రూపం అత్యావశ్యకం. జన్మతః మానవఇంద్రియాలు స్థూలవిషయాలనే గ్రహించగలవు తప్ప సూక్ష్మవిషయాలను గ్రహించలేవన్నది యదార్ధం. ఇంద్రియాలన్నీ బయటకు తెరుచుకొని వుంటాయి. వాటిద్వారా పనిచేసేమనస్సు బహిర్ముఖంగానే వుంటుంది. అతి సూక్ష్మముగా హృదయాంతరమున వుండే ఆత్మతత్వం అర్ధంకావాలంటే మనస్సు అంతర్ముఖం కావాలి. మనస్సు అంతర్ముఖం కావాలంటే అందుకు చాలా సాధనామార్గాలను మహర్షులు సూచించారు. అందులో సామాన్యులనుకూడా భక్తిత్వం అలవర్చే ముఖ్యమైన సరళమైన మార్గం విగ్రహారాధన. భగవంతుడ్ని మనిషి గుర్తించే మొదటిస్థితి ఇదే. "పాషాణలోహ మణి మృణ్మయ విగ్రహేషు పూజా పునర్భోగకరీ ముముక్షో:" ముముక్షులకు కూడా విగ్రహారాధన ప్రయోజనకరమేనన్నది శాస్త్రవాక్యం.
ప్రధమంగా కన్నులద్వారా ఓ రూపాన్ని గ్రహించి చిత్తమందు ఆ చిత్రాన్ని ప్రతిష్టించుకొని సాధనచేయడం సాధకునికి సులభం. ఈ కారణంచే ఋషిపుంగవులు జనోపకారార్ధమై విగ్రహారాధనను తెలిపిరి. (ఉపాసకానాం కార్యార్ధం బ్రాహ్మణో రూపకల్పనా; సాధకానాం హితార్ధాయ బ్రాహ్మణో రూపకల్పనా). మన ఋషులు నిర్వికల్పసమాధిలో ఏ బ్రహ్మరూపాన్ని దర్శించారో దానిని లోకహితార్ధమై అందరూ ఆ రూపాన్ని దర్శించాలన్న తలపుతో రూపకల్పనచేశారు. ఈ విధంగా రూపకల్పన చేయబడిన విగ్రహారాధనలో వివిధ నామార్చన, మంత్ర, యంత్ర పూజాదులచే విశేషమైన దైవశక్తి ఉన్నట్లు మన శాస్త్రాలు తెలుపుతున్నాయి.
మనోధ్యాన శక్తి గల ఋషీశ్వరులు తమ హృదయములందు మానసపూజ చేయు శక్తిమంతులైనప్పటికిని మనకై పరమప్రేమతో ఈ విగ్రహారాధన తెలియజేశారు. 
చంచలమైన మనస్సుని నియంత్రించి ఒకే వస్తువుపై కేంద్రీకరించడం ఆధ్యాత్మికసాధకుని మొదటలక్షణం. మనో నిగ్రహంకై సహాయపడేది దైవవిగ్రహారాధన. దైవప్రతిరూపంగా విగ్రహంను భావనాపూర్వకంగా ఆరాదిస్తాడు భక్తుడు. దీనివలన పరమాత్మయందు గురి ఏర్పడి క్రమేపి పరమాత్మజ్ఞానం అలవడుతుంది.
"సురూపాం ప్రతిమాం విష్ణో: ప్రసన్నవదనేక్షణాం / 
తామర్చయేత్ తాం యజే త్తాం విచింతయేత్ //
ప్రశస్తమైన రూప, ముఖ, ప్రసన్న నేత్రములుగల విష్ణు రూపంగల ప్రతిమను ఆరాధించి, ధ్యానించాలి.

సగుణరూపారాధన లేనిదే నిర్గుణరూపారాధన సాద్యంకాదు. మనస్సు శుద్ధమై, స్థిరమై, ఏకాగ్రమై అంతర్ముఖమై ఆత్మయందు నిలబడే నిర్గుణోపాసన సగుణోపాసన వలనే సిద్ధిస్తుంది. 

అర్చాదౌ అర్చయేత్ తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ /
యావత్ న వేద స్వహృది సర్వ భూతేష్వవస్థితమ్ //
                                                                 - శ్రీమద్భాగవతం 
ప్రతీ ఒక్కరి  హృదయంలో ప్రకాశిస్తున్న నన్ను సాక్షాత్కారించుకునే వరకూ అంతా తమ తమ విధులను నిర్వర్తిస్తూ, సర్వభూతాలలో లయుడై ఉన్న నన్ను విగ్రహరూపంలో పూజింతురు గాక! 

విగ్రహాదిపూజలు అష్టవిధములుగా భాగవత ఏకాదశ స్కంధమందు ఉద్ధవులవారికి శ్రీకృష్ణ పరమాత్ములవారు ఇలా వివరించారు -
శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతీ /
మనోమయీ మణిమయీ ప్రతిమాష్టవిధా స్మృతా //
శిలావిగ్రహం, దారువు, లోహం, చిత్రం, దర్పణ లిఖితం, మృత్తిక, మనః కల్పితం, రత్న నిర్మితం లని ప్రతిమలు ఎనిమిది విధములుగా ఉన్నవి. 
అలానే 'యో యో యాంయాం తనుం భక్త్యా శ్రద్ధయార్భితు మిచ్ఛతి' (యే రూపమున భక్తిశ్రద్ధలతో అర్చింపచూస్తారో అట్టి రూపములయందు తానుండి వారిభక్తిని స్థిరం చేస్తాను) అని ఉద్దవునుతో కృష్ణపరమాత్మ అంటారు.

లోకశ్రేయస్సు కాంక్షించిన శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవునితో ఇలా అన్నట్లు బ్రహ్మాండపురాణం నందు ఉన్నది -
"బ్రహ్మా! నేను లోకంలో విహరింపగోరుచున్న. నీవు చేసిన సృష్టిలో సామాన్యజనులు పరవ్యూహవిభవావతార తత్వాన్ని గ్రహించలేని జడులు కావున ధర్మ సంరక్షణార్ధం, లోక సంరక్షణార్ధం నేను అర్చావతార స్వరూపుడనై విగ్రహరూపందాల్చి విహరింపగోరుచున్నాను".

విగ్రహారాధన విశిష్టమైనది కాకపొతే శ్రీరాముడు రామలింగేశ్వర ప్రతిష్ట, సీతమ్మవారు సైకత లింగ ప్రతిష్ట ఎందుకు చేసి పూజిస్తారు? వ్యాసులవారు కాశీ యందు సహస్రలింగములను ప్రతిష్టించి ఎందుకు పూజించారు? కపిల, నారద, వసిష్ట, భరద్వాజ, అగస్త్య, భ్రుగు పరుశురాములు మొదలగు మహర్షులు శివకేశవుల ఆలయములను స్థాపించి ఎందుకు పూజించినట్లు? 
ఆధ్యాత్మికం అన్నది భక్తి, నమ్మకంలమీదే ఆధారపడివుంటుంది. మార్కండేయుడు శివలింగం నందు పరమేశ్వరుడు ఉన్నాడని నిశ్చలభక్తితో పూజించి మృత్యుంజయుడు కాలేదా? ప్రహ్లాదుడు ఎందెందు చూసిన భగవంతుడు వుంటాడని తన అచంచల నమ్మకంతో నిరూపించలేదా? భద్రాచలమందు విగ్రహారాధనతో రామదాసు తరించలేదా? తిరుపతియందు శ్రీవేంకటేశ్వరుని విగ్రహాన్నికాంచి అన్నమయ్య ముక్తిని పొందలేదా? అలానే శ్రీవేంకటేశ్వరుని పాదారవిందసన్నిధి యందు శ్రీ తరికొండ వెంగమాంబ, హత్తిరాంభావాజీ వారు స్వామిని సేవించగా, స్వామి ప్రత్యక్షమై అభయమొసగలేదా? 

Popular Posts