లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఎప్పుడుపడితే అప్పుడు తలవెంట్రుకలను, గోళ్ళను తీయరాదు. దంతాలతో గోళ్ళను కొరకరాదు.ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, చేతి గోళ్ళను తినువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు - వీరు శీఘ్రముగా వినాశము పొందుదురు.ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.దీర్ఘకాలము బతుకకోరువాడు కేశములను, భస్మమును, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.
రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).ఎప్పుడును పాచికలు (జూదము) ఆడకూడదు. పరిహాసము కొరకు కూడా జూదము ఆడకూడదు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.రాత్రిపూట నువ్వులతో గూడిన ఏ వస్తువును భుజించరాదు. వస్తహ్రీనుడెై శయినింపరాదు. ఎంగిలితో ఎక్కడకును వెళ్ళరాదు.తడిగా నున్న కాళ్ళు గలవాడెై భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో పండుకొనరాదు.