వేంకటేశ్వరుని కళ్యాణములో అంతరార్ధం
వేంకటేశ్వరుడు ఉన్నది ఏడుకొండలమీద. ఏడుకొండలు మానవశరీరంలో ఏడు చక్రాలు. సహస్రారం మీద ఉండే ఈశ్వరుడే వేంకటేశ్వరుడు.
ఇక పద్మావతి అమ్మవారు. ముందుగా ఈ తల్లీ జననం గమనిస్తే -
నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఆకాశరాజు, ఓసారి యజ్ఞమును ఆచరింపదలచి ఆరణీనదీ తీరంలో బంగారునాగాలితో కర్షణం చేస్తూ, నవధాన్యములు చల్లుచుండగా పద్మశయ్యపై పరుండి బంగారుబొమ్మ వలె ఉన్నబాలిక కనబడగానే, అశరీరవాణి ఈ బిడ్డ నీదే, పెంచుకో అని పలికెను. పద్మావతి అన్న పేరు పద్మమునందు జన్మించినందున వచ్చింది.
అంతరంగమనే హృదయతీరంలో బంగారునాగలి అనే శుద్ధ సంకల్ఫంతో ప్రాణాయామం ద్వారా సాధన చేస్తూ, నవవిధ భక్తిమార్గములను అనుచరించగా మూలాధారపద్మమునందు ఉన్న పద్మావతి సాక్షాత్కరిస్తుంది. అంటే -
మానవశరీరంలో జగన్మాత కుండలినీరూపంలో మూలాధారంలో మూడున్నర చుట్టాలు చుట్టుకుని ఉంటుంది. ఈ మూలాధార పద్మమునుండి ఉద్భవించిన కుండలినీశక్తియే పద్మావతీదేవి. ఈ పారమార్ధిక అంతరార్ధతత్త్వమును అందరూ గ్రహించలేరు కాబట్టి సర్వశక్తిమయి జగన్మాత అందరూ ఆరాధించడానికి అనువుగా దాల్చిన భౌతికరూపం పద్మావతి. ఇది సూచించడానికే ఇక్కడ కూడా అమ్మ ఏడుకొండలకు మూలంలో వెలిసింది. ప్రాణాయామం అనే సాధన ద్వారా మూలాధారపద్మచక్రమందున్న పద్మావతి అంటే కుండలినీశక్తి జాగృతమై భక్తిమార్గంలో ఊర్ధ్వముఖంగా పయనిస్తూ, ఆ మార్గంలో ఉన్న మిగిలిన చక్రాలను (అన్ని చక్రాలు పద్మావతి స్థానములైన పద్మాలే) అధిరోహిస్తూ, సహస్రారం మీదున్న పరమాత్మ వెంకటేశ్వరునిని యందు లయించడమే కళ్యాణం.
ప్రతినిత్యం తన కళ్యాణం ద్వారా ఇస్తున్న ఆత్మజ్ఞాన సందేశమిదే.