Followers

Thursday 31 July 2014

8. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం

 

     ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడా పిలుస్తుంటారు. త్ర్యంబకేశ్వరుడు స్వయంభువుడు. అమ్మవారు త్ర్యంబకేశ్వరి. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు. ఆ స్థానంలో రుబ్బురోలు లోపలిభాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు తిమూర్త్యాత్మకంగా, త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది. వనవాసంలోనున్న శ్రీరామచంద్రులవారు సీతా, లక్ష్మణ సేమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా, లంకేశ్వరుని సోదరి శూర్పణక శ్రీరాముని కామించాగా, అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు. శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు ‘నాసిక్’గా పిలువబడుతోంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్యసమేతంగా తపస్సు చేస్తున్న సమయం. జనహితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు. గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు. ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి. మునుల పన్నాగం ఫలించింది. గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు.  వెయ్యేళ్ళు శివుని ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి. గౌతమ మునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా ‘గౌతమీనది’ అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా ‘గోదావరి’ అని ప్రఖ్యాతి చెందింది. ఈ పుణ్య గోదావరీ నది దీనజనోద్ధరణ నిమిత్తమై దారణా, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతీ, శబరిప్రాంతాలలో ప్రవహిస్తూ, దక్షిణ వాహినిగా మారి సుమారు 900 కి.మీ. ప్రయాణం చేసి మహరాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది. గౌతమీనది పుట్టిన త్ర్యంబకంలో స్వయంభువునిగా వెలసిన స్వామి, భక్తులను తన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు.

Popular Posts