Followers

Sunday, 13 July 2014

కర్మకు, జన్మకు సంబంధం ఏమిటి?


మనకు ఏదైనా చెడు జరిగితేనో లేదా దక్కవలసినది దక్కకపోతేనో ‘‘ఏం చేస్తాం నా కర్మ’’ అని సరిపెట్టుకుంటాం. ఇంతకూ కర్మ అంటే ఏమిటి? కర్మ అనే సంస్కృతపదం ‘కృ’ అనే ధాతువు నుంచి పుట్టింది. కర్మ అంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ చేసినది అని అర్థం. పూర్తయిన పనిని కర్మ అని, పూర్తి కాకుండా ఇంకా జరుగుతుంటే దానిని ‘క్రియ’ అనీ అంటాం. కర్మ మంచి పని కావచ్చు, చెడ్డపని కావచ్చు లేదా మంచిచెడుల మిశ్రమం కావచ్చు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కర్మకు, జన్మకు అవినాభావ సంబంధం ఉంది

ఇతరులకి
ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషీ చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది.

‘ఈ ప్రపంచంలో ప్రతి జీవీ జన్మించడానికి కారణం, ఆ జీవి అంతకు మునుపు చేసిన కర్మఫలాలే. చెడు కర్మకు ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకు ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవీ జన్మని తీసుకుంటుంది’.

ఉదాహరణకు ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎంతోమందిని హత్య చేసి ఉండవచ్చు లేదా ఎందరి మరణానికికో కారణం అయి ఉండవచ్చు లేదా ఆలయాలు కట్టించి ఉండవచ్చు. ఎన్నో మంచి పనులు చేసి ఉండవచ్చు.

ఈ రెండు కర్మల ఫలితాలను అనుభవించడానికి సరిపడే కాలం లేదా ఆయుష్షు అతనికి ఈ జీవితంలో మిగలలేదు. దాంతో అతను అనుసరించిన ఈ కర్మలను అనుభవించడానికి తప్పకుండా మరో జన్మ పొందాల్సి ఉందనేది సత్యం. మంచి, చెడు కర్మల ఫలితాలను అనుభవించేది వాటిని చేసేవాడే కనుక, దుష్టకర్మలు చే సేవాడు తనకు తనే శత్రువు, సుకర్మలు చేసేవాడు తనకి తనే మిత్రుడు.

మానవులకి సుఖదుఃఖాలని కలిగించే కర్మలు సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మ లని మూడు రకాలు.సంచిత కర్మ: ఒక జీవి అనేక జన్మల్లో చేసిన కర్మలన్నీ పోగయిన నిధిని సంచిత కర్మ అంటారు. సంచిత కర్మంటే అంబుల పొదిలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న బాణంలాంటిది.
ఆగామి కర్మ: వర్తమానకాలంలో మన జీవనయానంలో తప్పనిసరిగా చేయవలసిన కర్మలన్నమాట. అంటే ఈ జన్మలో చేసే కొత్త కర్మలన్నింటినీ ఆగామి కర్మలంటారు.

ప్రారబ్ధ కర్మ: పరిపక్వానికి అంటే ఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలోని కర్మలని ఆగామి కర్మలంటారు. దీనిని వింటి నుంచి వదిలిన బాణంతో సమానంగా యోగశాస్త్రం చెప్పింది. ఉదాహరణకి పోలీసులకి చిక్కి, శిక్ష అనుభవిస్తున్న నేరం చేసిన దొంగ.
మనం చేసే కర్మ చెడుదా? మంచిదా? అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది.

ఇతరులకి ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషీ చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకుని దానికి సరిపడే కష్టాలని అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునే కంటే తెలివైన జీవి ముందుగానే అది తెలియజేయకుండా పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతుంది. ఇదే కర్మప్రయోజనం. 

Popular Posts