Followers

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం-44 శ్రీ రాముని తపస్సు

గంధ మాదన పర్వతం లో ఉన్న ఆంజనేయుడు ఒక సారి శ్రీ రామ సందర్శనార్ధం అయోధ్యకు వచ్చాడు .రామునికి నమస్కారం చేసి ,ఎదురుగా నిలబడ్డాడు .రాముడు కుశల ప్రశ్నలు వేసి క్షేమ సమాచారాలను తెలుసుకొన్నాడు .”హనుమా ! ఇంత కాలానికి మేము జ్ఞాపకం వచ్చామా ?ఏమి చేస్తున్నావు ?”అని అడిగాడు .అప్పుడు హనుమ వినయం తో ”సీతా రాముల స్వరూపాలు నా హృదయ పీథం మీద కొలువై ఉంటె నేను మిమ్మల్ని మరవటం ఉంటుందా స్వామీ ?నాప్రతి రోమం లో, ప్రతి రక్త కణం లో మీ నామమే ప్రతిధ్వనిస్తుంది .నేను ఒక సారి హిమాలయానికి వెళ్లాను .అక్కడి వారు నేను రావణాదులను సంహరించడం లో పాపం మూట కట్టుకోన్నానని ,అందుకని హిమాలయానికి వచ్చే అర్హత పోగొట్టు కొన్నానని శివుని దర్శించి పాప రహితుడనై రమ్మని వారందరూ నాతో చెప్పారు .అది విని నేను నర్మదా నది దక్షిణ తీరం లో తపస్సు చేయటం ప్రారంభించాను .నామొర ఆలించి సర్వ శుభంకరుడు శంకరుడు ప్రత్యక్ష మైనాడు .నన్ను అనుగ్రహించాడు .అక్కడ నుండే ఇక్కడికి సరాసరి వస్తున్నాను ”అని చెప్పాడు .
మారుతి మాటలు విన్న శ్రీ రాముడు ఆలోచనా మగ్నం అయ్యాడు .మనసు లో వితర్కించు కొన్నాడు .”నేను వేలాది రాక్షస గణాలను చంపాను కదా ఎంతో పాపం నేనూ మూట కట్టుకొనే ఉంటాను .కనుక నేను కూడా మహేశ్వరుని తపస్సు చేసి ,పాప ప్రక్షాళనం చేసు కొంటాను ”అని నిశ్చయించు కొన్నాడు .లక్ష్మనాదులను ,పరివారాన్ని వెంట తీసుకొని నర్మదా నది దక్షిణ ప్రాంతం చేరాడు .అక్కడ అనుకూల మైన ఒక చోట నిశ్చల మనస్సు తో శివుని కోసం తీవ్ర తపస్సు చేశాడు .సదా శివుని మంత్రాన్ని జపించాడు .లక్ష్మణుడు కూడా నర్మద కు దగ్గర లో ఉన్న జ్యోతిష్మతీ పురం లో ఉండిశ్రీ రామునికి కావలసిన సేవలు చేస్తున్నాడు .అన్నదమ్ములు ఇద్దరు శివ లింగాలను ప్రతిష్టించి ,త్రి సంధ్యలలో అభిషేకిస్తూ ధ్యానిస్తూ జపిస్తున్నారు .ఇలా ఇరవైనాలుగు సంవత్సరాలు వారు శివ ధ్యాన యోగం లో గడిపారు .చివరికి శివుడు ప్రత్యక్షమై వారి ని పాప విదూరులను చేసి మనోభీష్టాన్ని నేర వేర్చాడు .
రామ లక్ష్మణులు తపస్సు చేస్తున్నారన్న వార్త దేశమంతా పాకి పోయింది .మహర్షి గణం అంతా అక్కడికి చేరారు .వాళ్ళంతా ఒక చోట నర్మదా నది ఒండ్రు మట్టి తో శివ లింగాన్ని చేసి మట్టి కుండలతో నర్మదా నదీ జలాలతో అభిషేకిస్తున్నారు .అది క్రమంగా కుంభా కారం గా పెరిగి పోయింది .ఈ విధం గా నర్మదా నది ఒడ్డున మూడు లింగాలు ఉన్న చోటు ”కుమ్భేశ్వర స్తానం ”అని ప్రసిద్ధి చెందింది .అదే శ్రీ హనుమంతేశ్వరం కూడా .రామ లక్ష్మణులు తమను చూడ వచ్చిన మును లందరినీ కుశల ప్రశ్న లతో క్షేమ సమాచారాలను తెలుసు కొని ,వినమ్రంగా నమస్కరించారు .వారి అనుమతి పొంది మళ్ళీ అయోధ్యా నగరానికి వెళ్లారు .శ్రీరామ లక్ష్మణులు ప్రతిష్టించిన రెండు లింగాలు ,మహర్షులు చేసిన కుమ్భేశ్వరలింగం లను మూడింటిని నర్మదా నదీ జలాలతో అభిషేకించి ,పూజించిన వారికి అనుకొన్న కార్యాలన్నీ నిర్విఘ్నం గా నేర వేర్తాయి .సర్వ సుఖాలు కలుగుతాయి .
సశేషం –

Popular Posts