Followers

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –48 హనుమ భోజన కధ


సీతా సాధ్వి కి హనుమ మీద అమిత పుత్ర వాత్సల్యం ఉంది .తనను మళ్ళీ శ్రీ రాముని సన్నిధికి చేర్చినది మారుతి యే ననే నమ్మకం ఆమెది .ఆ సంజీవ రాయుడే లేక పోతే తన దుర్గతికి నిష్కృతి ఉండేది కాదను కొనేది .ఇప్పుడు ఆమె అయోధ్యా నగరానికి మహా రాణి .పుత్ర వాత్సల్యం తో అతన్ని విందుకు ఆహ్వా నించ దలచి శ్రీ రామునికి తెలిపింది .దానికి రాముడు  ”సీతా ! ఆంజనేయునికి తృప్తిగా భోజనం పెట్ట గలవా .అతడు రుద్రుడు .బాగా ఆలోచించి ఏర్పాట్లు చేసుకో ”అని ముందే హెచ్చరించాడు .జానకీ దేవి హనుమ ను మహా వీరుని గా ,అధ్యాత్మ చింతనా పరుని గా భావించింది కాని ,రుద్రాంశ సంభూతుడు అన్న విషయాన్ని మరిచి పోయింది .
ఏర్పాట్లన్నీ చక్కగా చేసింది .నోరూరించే పిండి వంటలు తయారు చేసింది .హనుమ ను ఆహ్వానించింది .అతడు సమయానికి వచ్చాడు .విస్తరి ముందు హాయిగా కూర్చున్నాడు .అన్ని పదార్ధాను సీతా దేవి యే వడ్డించింది .వడ్డిం చినవి ,వడ్డించి నట్లు తినేస్తున్నాడు మారుతి .ఒకే పదార్ధాన్ని అనేక సారులు అడిగి వడ్డింప జేసుకొని లాగించేస్తున్నాడు .వండిన వన్నీ ”స్వాహా ”చేశేశాడు .దిక్కు తోచ లేదు సీతమ్మకు .తృప్తి గా తిన కుండా హనుమ విస్తరి   ముందు నుంచి లేచే సూచన ఆమెకు కనిపించ లేదు .అప్పుడు ఆమె కు తన భర్త, హనుమ రుద్రావతారం అని చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చింది .వెంటనే మనస్సు లో శ్రీ రాముని ధ్యానించి,నమస్కరించింది .హనుమ వెనుక నుంచొని శివ పంచాక్షరి ”ఓం నమశ్శివాయ ”ను జపిస్తూ శివున్ని కాసేపు ధ్యానించింది .మహా రుద్రావతారు డైన శివాత్మజుడైన హనుమ తన రుద్రా రూపాన్ని సీతా మాతకు చూపించి ,కడుపు నిండిన వాడి లాగా జుర్రున త్రేపుతూ ,విస్తరి ముందు నుంచి లేచాడు . .ఆంజనేయుని  శివావతారాన్ని  అప్పుడామెదర్శించి ఆనందించింది .,అప్పటి దాకా హనుమ పై ఉన్న సాధారణ దృష్టి మారి పోయి, విశేష గౌరవ దృష్టి తో చూడటం మొదలు పెట్టింది .
                      అవిసె చెట్టు ప్రసాదం 
సీతా రాములు శత కంథరాక్షస సంహారం చేసి,అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఏకాదశీ పర్వదినం .ఏకాదశీ వ్రతాన్నిశ్రద్ధతో  నిర్వహించి ,మర్నాడు ద్వాదశి పారాయణ చేశారు .ద్వాదశి ఘడియలు దాటి పోకుండా విందు భోజనానికి ఏర్పాట్లు జరిగాయి .రాముని సోదరులు ,అనేక మంది రాజులూ ,విభీషణుడు మున్నగు వారు ,సుగ్రీవాదులు అందరు ఉచిత స్తానాల్లో భోజనాలకు కూర్చున్నారు .అందరికి బంగారు ఆకులలో వడ్డన జరిగింది .భోజనం తిన టానికి ముందు అందరు పరిశేచనం (నీటిని విస్తరి చుట్టూ మంత్ర పూతం గా తిప్పటం )చేస్తున్నారు .అప్పుడు హనుమ ఒక్క ఉదుటున శ్రీ రాముని సమీ పించి నమస్కరించి ,”రాజా రామా ! భక్త పరాదీనా !ఈ దాసుడిది ఒక విన్నపం ఉంది .ఆలించు .మొదట గా మీరు భోజనం చేసిన తరువాత మా వానర జాతి అంతా మీ ప్రసాదం గా భుజించ టానికి అనుజ్న నివ్వండి .”అని ప్రార్ధించాడు .ఇందులో ఏదో అంత రార్ధం ఉండి  ఉంటుందని ,లేక పోతే ఇలాంటి కోరిక కోరడని గ్రహించాడు రాముడు .”సరే అలానే కానిద్దాం ”అన్నాడు రామాదులు ,మహర్షులు తృప్తిగా భోజనం చేశారు .
హనుమ, శ్రీ రాముని బంగారు విస్తరి లో తినగా మిగిలిన  పదార్ధాలతోఒక ముద్ద ను ఒక గిన్నె లో ఉంచుకొని ,  ,దాన్ని దగ్గర లో ఉన్న ఒక అవిసె చెట్టు దగ్గరకు చేరి కింద ఉంచాడు .అవిసె పూలను కోసి, ఒక చోట చేర్చాడు .హనుమ ఎంచేస్తాడో చూడటానికి రాముని తో సహా అందరు కుతూహల పడుతున్నారు .అప్పుడు మారుతి సుగ్రీవాది వానర వీరు లందరినీ తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు .వారంతా బిల బిల లాడుతూ చేరుకొన్నారు .శ్రీ రాముని ప్రసాదం అని చెప్పి ఆ గిన్నే లోని దానిని ఒక ముద్ద గా చేసి దానితో పాటు అవిసె పువ్వును ఒక్కక్క వానరుని చేతి లో ఉంచాడు .  దానిని ”రామార్పణం ”అని అనుకొంటూ కళ్ళకు అద్దుకొని ప్రసాదం గా భుజించమని కోరాడు .అందరు హనుమ చెప్పి నట్లే చేశారు .అందరు తిన్న తరువాత మారుతి, తాను కూడా దాన్ని అవిసె పువ్వు తో సహా ప్రసాదం గా కళ్ళకు అద్దు  కొని తిన్నాడు .ఇంత మంది వానరులకు ఆ కాస్త ప్రసాదమే,ఆ కాసిని అవిసె పూలే  అవ్యయం గా సరిపోయాయి .
అప్పుడు శ్రీ రాముడు హనుమ చెంత కు చేరి ” వాయు నందనా !ఇప్పుడు నువ్వు చేసిన ఈ కృత్యం వల్ల ద్వాదశి పారాయణ సమగ్రం గా ,సంతృప్తి గా సంపూర్ణం అయింది .ద్వాదశి వ్రతానికి గొప్ప సార్ధకత లభించింది .కనుక ఇప్పటి నుడి ప్రతి నెలలో వచ్చే రెండు ద్వాదశి తిధులలో ఈ అవిసె వృక్షానికి చెందిన పూలను ,కాయలను ,పత్రా లను భోజన పదార్ధాలుగా ఉపయోగించిన వారికి సకల సుఖ శాంతులు లభిస్తాయి వారందరూ నాకు అత్యంత ఆత్మీయులవుతారు .”అని వరం ఇచ్చాడు .అప్పటి నుండి అవిసె చెట్టు విష్ణు ప్రీతీ కరమైనది గా భావిస్తున్నారు .దాని ఆకులు కాయలు పూలను భక్తీ తో ద్వాదశి నాడు భుజిస్తారు .అవిసె కు ”అగస్త్య  ”అనే పేరు ఉంది .ఆకాశం లో అగస్త్య నక్షత్ర దర్శనం నాడు అవిసె బాగా పూస్తుంది .అవిసె ను ”అగిసే” అనీ కొన్ని చోట్ల పిలుస్తారు .అవిసె చెట్టు మహాత్మ్యాన్ని అందరికి తీలియ జేసిన ఘనత హనుమదే .
సశేషం 

Popular Posts