Followers

Sunday 14 June 2015

ప్రయాణాలు చేసే ముందు చదవవలసిన శ్లోకం



సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క రథ సారధి మరియు సలహాదారుడు. అతనికి వ్యాస మహర్షి ఇచ్చిన వరం వలన దూరంగా జరిగే సంఘటనలను దగ్గరగా చూడగల శక్తి (ఒక విధంగా 'దివ్య దృష్టి' లేదా 'దూర దృష్టి') ఉంది. అతడు కురుక్షేత్రం లో జరుగుతున్న సంగ్రామమును, కృష్ణార్జునుల మధ్య "భగవద్గీత" రూపంలో జరిగిన సంభాషణను అంధుడైన ధృత రాష్ట్రునకు కళ్ళకు కట్టినట్లు చెప్పసాగాడు. కురు పితామహుడైన భీష్ముడు ధర్మ సందేహ నివృత్తికోసం సమీపించిన ధర్మ రాజుకు సమాధానాన్ని "విష్ణు సహస్రనామం" రూపం లో వివరిస్తాడు.ఈ స్తోత్రంలోని ఫలశ్రుతి లో సంజయుడు కృష్ణార్జునుల గొప్పతనాన్ని ఈ శ్లోక రూపంలో వివరిస్తాడు. 
        మా అమ్మ నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కడకైనా దూర ప్రయాణం అవుతూ ఉంటే ఎప్పుడూ ఈ శ్లోకం గుర్తు చేసేది. ఒక సారి అమెరికా వచ్చినపుడు నాకు ఒక కాయితం మీద ఈ శ్లోకం వ్రాసి ఇచ్చింది. "ఎక్కడకైనా వెళ్ళే ముందు ఈ శ్లోకం చదువుకోరా, శుభం కలుగుతుంది" అని చెప్పింది మా అమ్మ.

సంజయ ఉవాచ:
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 
తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ

ప్రతి పదార్థము: 
యత్ర = ఎక్కడ; యోగేశ్వరః = యోగులకే యోగియైన, యోగేశ్వరుడైన; కృష్ణః = కృష్ణుడు; యత్ర = ఎక్కడ; పార్థో = పార్థుడు / అర్జునుడు; ధనుర్ధరః = ధనుర్దారియైన; తత్ర = అక్కడ; శ్రీ = సిరి; విజయః = విజయము; భూతిః = ఐశ్వర్యము; నీతిః = నీతియును; మతిః = అభిప్రాయము; ధృవా = స్థిరముగా; మమ = నా యొక్క.

తాత్పర్యము:  సంజయుని పలుకులు: "ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ఎక్కడ ధనుర్దారియైన అర్జునుడు ఉందురో, అక్కడ సిరి, విజయము, ఐశ్వర్యము, నీతి స్థిరముగా ఉండునని నా యొక్క అభిప్రాయము" అని సంజయుడు చెప్పెను. 

Popular Posts