Followers

Thursday, 10 September 2015

వేమన శతకము 13


చంప గూడదెట్టి జంతువునైనను
చంపవలయు లోక శత్రుగుణము
తేలుకొండిఁగొట్టఁదే లేమి చేయురా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||మనము ఏ జంతువును చంపరాదు. ఈ లోకములోనున్న హింసాప్రవృత్తిని తొలగించాలి. మనము చెడ్డబుద్ధిని విడనాడాలి. తేలుకొండిని తీసివేసినంత మాత్రాన తేలేమి చేయును? దాని యందలి విషగ్రంధిని తొలగించాలి కదా!.

*******************************************************************************************  121

దొడ్డవాఁడననుచు దొరల దగ్గఱఁజేరి
చాడి చెప్పు పాపజాతినరుడు
చాడి జెప్పువాడు సాయుజ్యమొంధునా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చెడ్డవాడు ప్రభువుల నాశ్రయించి యితరులపై చాడీలు చెప్పి మెప్పు పొందుతాడు. చాడీలు చెప్పే దుష్టబుద్ధికి ముక్తి ప్రాప్తించునా! ప్రాప్తించదని భావము.

*******************************************************************************************  122

ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి?
బుద్ధిలేని బిడ్డ పుట్టియేమి?
సద్గుణంబులేని చదువది యేలరా?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఓర్పులేని భార్య, సద్బుద్ధిలేని పుత్రుడు, సద్గుణము లేని చదువు నిష్ప్రయోజనము.

*******************************************************************************************  123

తనువు తనువటంచుఁ దపియింత్రు జనులారా!
తనువులస్థిరమని దలపరాదె?
తనువు కానఁబడమిఁ దలగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చనిపోయే శరీరముపై మోహమెందుకు? తనువు లేనిచో మోక్షంకలగదా? కలుగునని భావము.

*******************************************************************************************  124

మాటలోనివాని మహిమఁదాఁదెలియక
మాటఁదెలియలేక మమతఁజిక్కె
మాటతెలిసెనేని మహితుఁడు యోగియౌ
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| గురువు చెప్పిన మాటలను వినాలి. అందలి గొప్పతనమును దెలుసుకోవాలి. మాటయొక్క స్వభావము తెలియక మమతకు లొంగిపోరాదు.

*******************************************************************************************  125

మత్సరంబు మదము మమకారమనియెడి
వ్యసనములను దగిలి మసలబోక
పరులకుపకరించి పరముండవగుపొమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మమకారము, గర్వము, ప్రేమ యనెడి వ్యసనములకు దూరముగానుండుము. చెడ్డవ్యసనములను దరిజేరనీయక పరుల కుపకారము చేయువాడె బ్రహ్మస్వరూపుడు.

*******************************************************************************************  126

ఆకు వక్క సున్నమది మూడు వన్నెలు
నేకమైన చోటఁదాకు నెఱుపు
సోఁకి త్రిగుణమట్లు శోభించు పరమాత్మ
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| వేరువేరు రంగులున్న ఆకు, వక్క, సున్నము కలిసినచో కంటికింపైన మరియొక ఎరుపురంగు వచ్చును. అలాగే సత్త్వ, రజస్తమోగుణములనియెడి త్రిగుణములు కలిసినచో అచట పరమాత్మ ప్రకాశించును.

*******************************************************************************************  127

గురుని నిందజేసి గుట్టెఱుంగనివాడు
యముని బాధనొందు గ్రమముగాను
తేనెలోని యీగ తెఱగున నగునయా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| గురునింద పనికిరాదు. గురునినింద చేయువాడు యమబాధలు పడతాడు. తేనెలోని పడ్డ ఈగవలె గిలగిలలాడతాడు. కనుక గురువులను నిందింపరాదు.

*******************************************************************************************  128

ఛాత్రధర్మమెఱిఁగి చక్కని భక్తితో
గురుని సేవచేయఁగుదిరినపుడె
సర్వమర్మములును జక్కగా విడిపోవు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| విచక్షనాజ్ఞానముతో గురుశిష్య సంబంధమునెఱుగవలెను. గురువు నెట్లు సేవించవలెనో తెలిసినపుడే నిశ్చలభక్తి యలవడును. సర్వసందేహములు తీరును. జ్ఞానసముపార్జనకు గురుసేవ యొక్కటే మార్గము.

*******************************************************************************************  129

భక్తియున్న చోట బరమేశ్వరుండుండు
భక్తిలేని చోట పాపముండు
భక్తికలుగువాడు పరమాత్ముడగునయా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| భక్తియున్న చోట దేవుడుండును. భక్తిలేని చోట పాపముండును. భక్తిగలవాడే పరమాత్మునితో సమానుడు కాగలడు. కావున ప్రజలందరూ భక్తిమార్గము నవలంబించవలెను.

*******************************************************************************************  130

Popular Posts