Followers

Thursday, 10 September 2015

వేమన శతకము - 4


తామసించి చేయఁదగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమె యగును
పచ్చికాయఁ దెచ్చి పడవేయ ఫలమౌనె?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా||" ఆలస్యం అమృతం విషం" అని ఏ పనిని అదను పదను దాటిపోయిన తరువాత చేయరాదు. దానివలన ప్రయోజనము ఉండదు. అట్లని తొందరపడి కూడ ఏపని చేసినను అది వికటించును గాని ఫలించదు "సహసా విదధీత న క్రియాం"

*******************************************************************************************  31

కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమునను మిగుల గోడు గల్గు
కోపమడచెనేని కోరిక లీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కోపమున్న వాడెంత గొప్పవాడైనను తేలికకగా చూడబడును. ఆ కోపము గొప్పదనమును తగ్గించును. ఆ కోపము వలననే తనకు దాను హాని కలిగించుకొనును. "కామ ఏషః క్రోధ ఏష రజోగుణసముద్భవః" అని గీత. కామక్రోధములు మహాపాపిష్ఠివి. మహాశత్రువులు గూడ. అట్టి కోపము నణచుకొని శాంతుడైనచో ఆతని కోరికలన్నియు సిద్ధించును.

*******************************************************************************************  32

నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగుఁ బట్టు
బయట గుక్క చేత భంగపడును
స్థానబలముగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| నీళ్ళలోనున్నప్పుడు మొసలి యేనుగునైనను లోపలికి లాగివేయును. బయటనున్నచో కుక్క గూడ దానిని పీకి వేయును. అనగా ఆ ముసలి కుక్కను గూడ ఏమియు చేయలేదని భావము. నీళ్ళలో నున్నప్పుడు మొసలికి స్థానబలమున్నది కావున ఆ బలము వచ్చినది కాని అది సహజమైన బలము కాదు.

*******************************************************************************************  33

నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బయట మూరెడైనఁ బారలేదు
స్థానబలముగాని తన బలిమిగాదయా
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| చేప నీళ్ళలో ఎంతదూరమైనను సునాయాసముగా పరుగెత్తును. అదే నేలమీద పడినచో మూరెడు కూడ ముందుకు సాగలేదు. అదంతయు స్థానమువలన కలిగిన బలముగాని సహజముగా కలిగిన బలము కాదు.

*******************************************************************************************  34

నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగఁ బ్రాకు
బయట మూరెడైనఁ బారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| పడవ, నీళ్లమీదనైనచో ముందుకు కుదుపులు గూడ లేకుండ చక్కగా సాగిపోవును. నేలమీదనైనచో మూరెడు దూరము గూడ ముందుకు సాగదు. అట్లే ఎంతటి ప్రజ్ఞావంతుడైనను తగిన స్థానములో ఉన్నప్పుడు రాణించినట్లు పరస్థానములలో రాణింపడు.

*******************************************************************************************  35

కులము లేనివాడు కలిమిచే వెలయును
కలిమి లేనివాడు కులము దిగును
కులము కన్న భువిని కలిమి యెక్కువసుమీ
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కులము తక్కువవాడు ధనుము సంపాదించి దానితో గొప్పవాడగును. ఉత్తమ కులములో పుట్టినవాడైనను ధనము లేనిచో వాని కులము అధమస్థానమునకు దిగిపోవును. కావున లోకములో కులముకంటెనుకలిమియే ప్రథానము. అదియున్న వానికి అన్నియు ఉన్నట్లే.

*******************************************************************************************  36

కులము గలుగువాడు గోత్రంబు గలవాడు
విద్యచేత విఱ్ఱవీగు వాడు
పసిడి గలుగువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మంచి కులములో బుట్టినవాడు, వంశగౌరవముగలవాడు, చదువుకొన్న చదువుతో గర్వపడువాడు, వీరందరును ఐశ్వర్యములుగలిగిన వానికి బానిస కొడుకులు. అనగా పైవారందరును ధనవంతుని ఆశ్రయించి బ్రతుక వలసిన వారే. వారికి బ్రతుకులేదని భావము.

*******************************************************************************************  37

కనియుఁగాన లేడు కదలుప డానోరు
వినియు వినగలేడు విస్మయముగ
సంపదగలవాని సన్నిపాతం బిది
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| కంటితో చూచుచున్నను నిజము గ్రహింపలేడు; నోరున్నను మధురముగా ప్రియముగా మాటలాడడు. చెవులతో వినుచుండి కూడ లోకధర్మములను గ్రహింపడు. సంపదలు గలవానికి గలుగు ఆశ్చర్యకరమైన రోగమిది.

*******************************************************************************************  38

ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగుఁ దా నెచ్చటికి నేగు
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| మనుష్యుడు తాను పుట్టిన సమయములో ఈ లోకములోనికి ఏమి తెచ్చుకొనుచున్నాడు? చనిపోవునప్పుడు తానేమి పట్టుకొని పోవును? ధనము లెచ్చటికి బోవునో తానెచ్చటికి బోవునో యెవ్వడెరుగును? ఈ కనబడున దంతయు శాశ్వతమని భ్రమించి ఆశలతో కాలము గడుపువాని బ్రతుకంతయు వ్యర్థము.

*******************************************************************************************  39

తను వదెవరి సొమ్ము తనదని పోషింప
ద్రవ్యమెవరిసొమ్ము దాచుకొనగాఁ
బ్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| తనదని పోషించుకొనుచున్న ఈ శరీర మెవ్వరిది? వాని సొంతమా? కాలము తీరినచో మరి దీనిని విడిచి పెట్టిపోవునేమి? ధనములన్నియు తనవని దాచుకొనునే? తాను పోవునపుడు వెంట దీసికొని పోవునా? పోనీ ప్రాణము తనదా? దానిని పారిపోకుండ పట్టి నిలుపగలడా?.

*******************************************************************************************  40

Popular Posts