Followers

Tuesday 17 December 2013

గణపతి ఏడవ అవతారము: విఘ్నరాజ అవతారము


గణపతి ఏడవ అవతారము: విఘ్నరాజ అవతారము

ధ్యానశ్లోకం: విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్యతే, 
మమతాసుర హంతా స విష్ణుబ్రహ్మేతి వాచక:. 

`శ్రీ గణేశుని విఘ్నరాజావతారము విష్ణు బ్రహ్మగా ప్రసిద్ధికెక్కింది. ఆదిశేషవాహనంగా వచ్చి మమతాసురుని సంహరించే అవతారం' 

ఎన్నో అంతరార్ధాలతో కూడుకున్న కధ: ఒకానొకప్పుడు భగవతి పార్వతీదేవి ఆమె సఖులతో మాటలాడుతూ నవ్వగా.. ఆమె నవ్వునుండి ఒక పురుషాకృతి ఆవిర్భవించింది. అది చూస్తూ ఉండగానే పర్వతాకారమైనది. దానికి పార్వతీ దేవి మమతాసురుడు అని పేరుపెట్టి, అతనిని గణేశుని స్మరించవలసినదిగా ఆఙ్ఞాపించెను. పార్వతీదేవి అతనికి గణేశ షడక్షరీ మంత్రాన్ని ఉపదేసించెను. మమతాసురుడు తల్లి పార్వతీదేవికి నమస్కరించి తపస్సుకై అరణ్యమునకు వెళ్ళెను. అక్కడ అతను శంబరాసురుణ్ణి కలిసెను. శంబరాసురుడు మమతాసురునికి సమస్త ఆసురీవిద్యలను నేర్పెను. దానితో మమతాసురునికి అన్ని రాక్షస శక్తులు ప్రాప్తమయ్యేయి. అప్పుడు శంబరాసురుడు విఘ్నరాజుని ఉపాసించమని మమతాసురుని ఆదేశించెను. మమతాసురుడు అక్కడికక్కడే కూర్చుని విఘ్నరాజుకై కఠోర తపస్సు ప్రారంభించెను. కేవలము వాయువునే ఆహారంగా తీసుకుంటూ విఘ్నరాజుని ధ్యానిస్తూ జపిస్తూ తపస్సుచేయుచుండెను. అంతట విఘ్నరాజు ప్రత్యక్షంకాగా, మమతాసురుడు, "ప్రభూ! మీరు నాకు ప్రసన్నులైతే ఈ సమస్త బ్రహ్మాండ ఆధిపత్యాన్ని ప్రసాదించండి. యుద్ధంలో నాకు ఎప్పుడూ విఘ్నాలు రాకూడదు. భగవానుడైన శివుడైనా సరే నన్ను జయించలేకుండుగాక" అని కోరెను. ఈ వరములు దుస్సాధ్యములైనప్పటికీ తప:ప్రభావంవలన విఘ్నరాజు ప్రసాదించెను. వరములుపొంది మమతాసురుడు, శంబరుని వద్దకు వెళ్ళెను. శంబరుడు ఎంతో సంతోషించి తన రూపవతి ఐన కూతురు "మోహిని " ని ఇచ్చి మమతాసురునికి వివాహము చేసెను. ఈ విషయము తెలుసుకున్న శుక్రాచార్యుడు మమతాసురుని రాక్షస రాజుగా ప్రకటించెను. ఒకరోజు శుక్రాచార్యునితో మమతాసురుడు తను విశ్వవిజేత కావలెనని, అందుకు యుద్ధము చేసెదనని చెప్పెను. అంతట శుక్రాచార్యుడు సరేనని ఆశీర్వదించి, విఘ్నరాజు వలన వరములను పొందితివి కనుక అతనితో యుద్ధమునకు పోవలదని హెచ్చరించి పంపెను. తన వరదర్పంతో అన్ని లోకములనూ జయించి, దేవతలను బంధించి `ధర్మాచరణము ' అనే మాట ఎక్కడా లేకుండా చేసెను. పిమ్మట అందరు దేవతలూ కష్టనివారణ కొరకు విఘ్నరాజుని పూజించిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత వారికి విఘ్నరాజు ప్రకటితమై వారికి అభయమిచ్చెను. శేషవాహనారూఢుడై విఘ్నరాజు అవతరించి నారదుని దూతగా మమతాసురునియొద్దకు పంపెను. నారదుడు, శుక్రాచార్యుడు కూడా మమతాసురునితో విఘ్నరాజుకి శరణువేడవలసినదిగా చెప్పెను. అహంకారంతో మమతాసురుడు వారి మాటలను పెడచెవినపెట్టి యుద్ధమునకు వచ్చెను. శ్రీ విఘ్నరాజు తన యొక్క కమలమును రాక్షస సేన మధ్యలొ వేసెను. దాని వాసనతో సమస్త అసుర సేనలు మూర్ఛపోయి శక్తిహీనులయ్యాయి. అప్పుడు మమతాసురుడు భయముతో వణకుతూ విఘ్నరాజుని పాదములపై పడి శరణువేడెను. అంతట విఘ్నరాజు మమతాసురుని క్షమించి అధోలోకాలకు పంపివేసెను. దేవగణములు ముక్తిపొంది ప్రసన్నములాయెను. అన్ని వైపులా ధర్మము స్థాపించబడెను. 

మనము కూడా శెషవాహనారూఢుడైన శ్రీ విఘ్నరాజుని శరణుపొంది మమతాసురుని బారినుంది విముక్తి పొందెదము గాక. శ్రీ శేషవాహనారూఢాయ విఘ్నరాజాయ నమ:.

Popular Posts