శ్రీశుక ఉవాచ
శ్రుత్వేహితం సాధు సభాసభాజితం మహత్తమాగ్రణ్య ఉరుక్రమాత్మనః
యుధిష్ఠిరో దైత్యపతేర్ముదాన్వితః పప్రచ్ఛ భూయస్తనయం స్వయమ్భువః
రాజసూయములో అగ్ర పూజ పొందిన పరమాత్మ చరిత్రను నారదుని వలన విని సంతోషించి మళ్ళీ ఇలా అడిగాడు.
శ్రీయుధిష్ఠిర ఉవాచ
భగవన్శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనమ్
వర్ణాశ్రమాచారయుతం యత్పుమాన్విన్దతే పరమ్
సనాతన ధర్మాన్ని నేను వినాలనుకుంటున్నాను. దీని వలననే జీవుడు పరమ పదాన్ని పొందుతాడు.
భవాన్ప్రజాపతేః సాక్షాదాత్మజః పరమేష్ఠినః
సుతానాం సమ్మతో బ్రహ్మంస్తపోయోగసమాధిభిః
నీవు బ్రహ్మపుత్రుడవు. బ్రహ్మపుత్రులందరిలో బ్రహ్మగారికి నీవి ఇష్టుడవు. తపో యోగ సమాధులు నీవు బాగా ఆచరించి బ్రహ్మగారి ప్రీతిని పొందావు
నారాయణపరా విప్రా ధర్మం గుహ్యం పరం విదుః
కరుణాః సాధవః శాన్తాస్త్వద్విధా న తథాపరే
ఎవరు పరమాత్మ యందు నిశ్చలమైన భక్తి భావం కలిగి ఉంటారో వారే బ్రాహ్మణులు. అలాంటి వారే పరమ రహస్యమైన ధర్మాన్ని తెలుస్తారు. అలాంటి వారు దయ కలిగి ఉంటారు, సాధువులూ శాంత స్వభావులు, నీవంటి వారు.
శ్రీనారద ఉవాచ
నత్వా భగవతేऽజాయ లోకానాం ధర్మసేతవే
వక్ష్యే సనాతనం ధర్మం నారాయణముఖాచ్ఛ్రుతమ్
సకల లోకముల ధర్మానికి ఆధారమైన పరమాత్మకు నమస్కారం చేసి నారాయణనుని ముఖము నుండి విన్న సనాతనధర్మం గురించి చెబుతాను.
యోऽవతీర్యాత్మనోऽంశేన దాక్షాయణ్యాం తు ధర్మతః
లోకానాం స్వస్తయేऽధ్యాస్తే తపో బదరికాశ్రమే
ధర్మప్రజాపతికి దక్షుని పుత్రిక అయిన మూర్తికీ, నర నారాయణులుగా పుట్టి బదరికాశ్రమములో తపస్సు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన నాకు అన్ని ధర్మాలూ వివరించారు
ధర్మమూలం హి భగవాన్సర్వవేదమయో హరిః
స్మృతం చ తద్విదాం రాజన్యేన చాత్మా ప్రసీదతి
పరమాత్మ అన్ని ధర్మాలకూ మూలం. ఆయనే సర్వ వేద మయుడు, సర్వ దేవ మయుడు. అలాంటి మహానుభావున్ని స్మరిస్తే మనసు ప్రసన్నమవుతుంది, ఆత్మ దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది
సత్యం దయా తపః శౌచం తితిక్షేక్షా శమో దమః
అహింసా బ్రహ్మచర్యం చ త్యాగః స్వాధ్యాయ ఆర్జవమ్
సన్తోషః సమదృక్సేవా గ్రామ్యేహోపరమః శనైః
నృణాం విపర్యయేహేక్షా మౌనమాత్మవిమర్శనమ్
అన్నాద్యాదేః సంవిభాగో భూతేభ్యశ్చ యథార్హతః
తేష్వాత్మదేవతాబుద్ధిః సుతరాం నృషు పాణ్డవ
శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేః
సేవేజ్యావనతిర్దాస్యం సఖ్యమాత్మసమర్పణమ్
నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః
త్రింశల్లక్షణవాన్రాజన్సర్వాత్మా యేన తుష్యతి
ధర్మమంటే ఈ ముప్పై లక్షణాలు. అన్ని వర్ణాల వారికీ ఇదే ధర్మం. సత్యం దయ తప(శరీరం మనసు అదుపులో ఉంచుకోవడం) శౌచం తితీక్ష ఈక్ష(పరిశీలన) శమం దమం (ఇంద్రియ నిగ్రహం) అహింస (మాటతో పనితో మనసుతో హింసించకుండుట) బ్రహ్మచర్యం త్యాగం స్వాధ్యాయం(పెద్దలు చెప్పినది చేయుట) ఆర్జవం (కపటం లేకుండా ఉండుట) సంతోషం (దొరికిన దానితో సంతోషం) సుఖ ధుఃఖాలను సమముగా చూచుట, సేవ, గ్రామ్య(తుచ్చమైన) సుఖాలను మెల్లగా విడిచిపెట్టాలి, వాడు గొప్ప వీడు తక్కువ అన్న విపర్యయ జ్ఞ్యానం తొలగించుకోవాలి, మౌనం, ఆత్మ విమర్శనం, మన దగ్గర ఉన్న అన్నం జలం సంపద మన చుట్టూ ఉన్నవారికి అర్హతను బట్టి సమముగా పంచాలి, మనకంటే ఇతర భూతములను మనలాగ చూడాలి.
పరమాత్మ కథలను వినడం కీర్తించడం స్మరించడం, పెద్దల యొక్క ఆకారాన్ని స్మరించాలి, సేవించాలి పూజించాలి వినయం దాస్యం సఖ్యం ఆత్మ సమర్పణం. ఇది మానవులకు ఉత్తమ ధర్మం. వర్ణాశ్రమాలతో సంబంధం లేకుండా అందరూ ఆచరించ వలసిన ధర్మాలు ఇవి. వీటిచే భగవానుడు ప్రీతి చెందుతాడు
సంస్కారా యత్రావిచ్ఛిన్నాః స ద్విజోऽజో జగాద యమ్
ఇజ్యాధ్యయనదానాని విహితాని ద్విజన్మనామ్
జన్మకర్మావదాతానాం క్రియాశ్చాశ్రమచోదితాః
బ్రాహ్మణుడు: గర్భాదానం నుంచీ శరీర దహనం వరకూ ఏ సంస్కారం ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగితే వాడు బ్రాహ్మణుడు అని బ్రహ్మ చెప్పాడు. యజ్ఞ్యం వేదాధ్యయనం దానం బ్రాహ్మణ ధర్మాలు. జన్మతో పరిశుద్ధి కావాలి. కర్మతో పరిశుద్ధి కావాలి (పరిశుద్ధ కర్మలు చేస్తూ ఉండాలి). ఈ రెండూ జరిగితే ఆశ్రమశుద్ధి.
విప్రస్యాధ్యయనాదీని షడన్యస్యాప్రతిగ్రహః
రాజ్ఞో వృత్తిః ప్రజాగోప్తురవిప్రాద్వా కరాదిభిః
అధ్యయన అధ్యాపన యజన యాజన(యజ్ఞ్యం చేయాలీ చేయించాలి) దానం చేయడం దానం స్వీకరించడం. ఇవి బ్రాహ్మణులు చేయవలసినవి. తక్కిన వారికి చివరది లేదు (దానం స్వీకరించడం) . క్షత్రియులు అబ్రాహ్మణుల నుంచి పన్ను తీసుకుని ప్రజలను పాలించాలి
వైశ్యస్తు వార్తావృత్తిః స్యాన్నిత్యం బ్రహ్మకులానుగః
శూద్రస్య ద్విజశుశ్రూషా వృత్తిశ్చ స్వామినో భవేత్
వైశ్యులు కూడా బ్రాహ్మణ ధర్మాలను అనుసరిస్తూ అనుచరిస్తూ వ్యాపారం చేయలి. శూద్రులు బ్రాహ్మణ సేవ, క్షత్రియ సేవా చేయాలి
వార్తా విచిత్రా శాలీన యాయావరశిలోఞ్ఛనమ్
విప్రవృత్తిశ్చతుర్ధేయం శ్రేయసీ చోత్తరోత్తరా
బ్రాహ్మణుడు ఈ నాలుగు తీరులా బ్రతకచ్చు. 1. శాలీన (ధాన్యమును సంపాదించుట) 2. యాయావర 3. శిల (పొలములో పడిన ధాన్యములను ఏరుకొనుట) 4. ఊంచనం (ధాన్యము రైతులు తీసుకుని పోగా, కింద పగుళ్ళలో కొట్టినప్పుడు పడిన గింజలు ఏరుకొని అందులో ఎన్ని ఉంటే అన్ని తీస్కుని వండుకొనుట. ఆహారం మీద అస్సలు అభిరుచి లేకపోవడం), ఈ నాలుగూ బ్రాహ్మణ వృత్తులు. ఇందులో ఉత్తరోత్తరం ఉత్తమం. ఊంచనం అన్నిటికన్నా ఉత్తమం.
జఘన్యో నోత్తమాం వృత్తిమనాపది భజేన్నరః
ఋతే రాజన్యమాపత్సు సర్వేషామపి సర్వశః
తరువాతి వాడు మొదటి వాడి వృత్తిని అనాపదలో (ఆపద లేని సమయాలలో) చేయకూడదు. వేరే మార్గం లేనప్పుడు క్షత్రియుడు భిక్షాటనం చేయచ్చు, బ్రాహ్మణులు వ్యవసాయం చేయవచ్చు. బతకలేమనుకుంటే తక్కువారు పెద్దవారి వృత్తిని ఆచరించవచ్చు. రాజు తప్ప తక్కిన వారు ఆపదలలో అన్ని పనులూ చేయవచ్చు.
ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా
సత్యానృతాభ్యామపి వా న శ్వవృత్త్యా కదాచన
ఋతముఞ్ఛశిలం ప్రోక్తమమృతం యదయాచితమ్
మృతం తు నిత్యయాచ్ఞా స్యాత్ప్రమృతం కర్షణం స్మృతమ్
ఋతం అంటే ఊంచ వృత్తి, యాచించకుండా లభించేదాన్ని (సతోషముగా తమకు తాముగా ఇచ్చిన దాన్ని) అణృతం. ప్రతీ రోజు బిక్షము చేయడం మృతం. వ్యవసాయం చేయడం ప్రమృతం. వ్యాపారానికి సత్యానృతం అని పేరు. నీచులను సేవించడం కుక్క పని.
సత్యానృతం చ వాణిజ్యం శ్వవృత్తిర్నీచసేవనమ్
వర్జయేత్తాం సదా విప్రో రాజన్యశ్చ జుగుప్సితామ్
సర్వవేదమయో విప్రః సర్వదేవమయో నృపః
రాజూ బ్రాహ్మణుడు నీచ వృత్తిని చేయరాదు. సకల వేద మయుడు బ్రాహ్మణుడైతే సకల దేవ స్వరూపుడు రాజు. అందుకు వీరు నీచులను సేవించరాదు.
శమో దమస్తపః శౌచం సన్తోషః క్షాన్తిరార్జవమ్
జ్ఞానం దయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మలక్షణమ్
శమ దమః తపః శౌచం సతోషం శాంతి ఆర్జవం జ్ఞ్యానం దయ నారాయణుని యందు మనసు నిలుపుట సత్యం బ్రాహ్మణ లక్షణం
శౌర్యం వీర్యం ధృతిస్తేజస్త్యాగశ్చాత్మజయః క్షమా
బ్రహ్మణ్యతా ప్రసాదశ్చ సత్యం చ క్షత్రలక్షణమ్
ప్రసాదం అంటే అనుగ్రహం. ఈ తొమ్మిదీ క్షత్రియునికి ఉండాలి
దేవగుర్వచ్యుతే భక్తిస్త్రివర్గపరిపోషణమ్
ఆస్తిక్యముద్యమో నిత్యం నైపుణ్యం వైశ్యలక్షణమ్
ఈ ఆరూ వైశ్యుల లక్షణం. దేవతల యందూ గురువుల యందూ పరమాత్మ యందూ భక్తి ఉండాలి, బ్రాహ్మణ క్షత్రియ శూద్రుల యందు పోషణ, ధర్మార్థ కామాలను పోషించుట ఉండాలి, భగవంతుని యందూ వేదములయందూ విశ్వాసం. ప్రతీ దినం ప్రయత్న శీలత, నైపుణ్యం ఉండాలి వైశ్యులకు.
శూద్రస్య సన్నతిః శౌచం సేవా స్వామిన్యమాయయా
అమన్త్రయజ్ఞో హ్యస్తేయం సత్యం గోవిప్రరక్షణమ్
శూద్రులు వినయముగా పరిశుద్ధముగా ఉండాలి. యజమాని విషయములో కపటములేకుండా హృదయ పూర్వకముగా సేవించాలి. మంత్రములు లేకుండా మానసికమైన యజ్ఞ్యం చేయాలి. దొంగతనం చేయరాదు. సత్యం మాట్లాడాలి, గోవిప్ర రక్షణం చేయాలి.
స్త్రీణాం చ పతిదేవానాం తచ్ఛుశ్రూషానుకూలతా
తద్బన్ధుష్వనువృత్తిశ్చ నిత్యం తద్వ్రతధారణమ్
భర్తను దైవముగా భావించుట, భర్తను సేవించడములో ఆనుకూల్యత ప్రదర్శించాలి, నిత్యం భర్త యొక్క బందువుల యందు ప్రేమగా ఉండాలి, భర్త చేసిన పూజ భార్య చేయాలి. భర్త ఎవరిని ఆరాధిస్తారో వారిని ఆరాధించాలి.
సమ్మార్జనోపలేపాభ్యాం గృహమణ్డనవర్తనైః
స్వయం చ మణ్డితా నిత్యం పరిమృష్టపరిచ్ఛదా
రోజూ ఇల్లు ఊడవాలి, అలకాలి, ఇంటిలో ముగ్గులు వేయాలి, ఇంటిని అలంకరించాలి, తనను తాను అలంకరించుకోవాలి నిత్యం, పరిశుద్ధమైన వస్త్రాలు కట్టుకోవాలి
కామైరుచ్చావచైః సాధ్వీ ప్రశ్రయేణ దమేన చ
వాక్యైః సత్యైః ప్రియైః ప్రేమ్ణా కాలే కాలే భజేత్పతిమ్
చిన్న చిన్న కోరికలు కోరరాదు. క్షుద్రమైన కోరికలు కోరరాదు. భక్తితో వినయముతో కోరాలి. భర్త నొచ్చుకోకుండా మాట్లాడాలి. నిజమైన మాట మాట్లాడాలి, ప్రియమైన సత్యాన్ని మాట్లాడాలి. చెప్పే సత్యమే ప్రియముగా చెప్పాలి. ఇంద్రియ నిగ్రహముతో మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, కాలనికనుగుణముగా మాట్లాడాలి.
సన్తుష్టాలోలుపా దక్షా ధర్మజ్ఞా ప్రియసత్యవాక్
అప్రమత్తా శుచిః స్నిగ్ధా పతిం త్వపతితం భజేత్
నిత్యమూ సంతోషిస్తూ ఉండాలి. అలా అని ఏ కోరికలూ లేకుండా ఉండరాదు. తనకూ భరతకూ మేలు కలిగించే కోరిక కలిగి ఉండాలి. భర్త మనసూ బంధువుల మనసూ నొప్పించకుండా ఉండాలి. ధర్మం తెలిసినదై ఉండాలి. నిజము మాట్లాడాలి, ప్రియముగా (మనసు నొప్పించకుండా) మాట్లాడాలి. ఏమరపాటుగా ఉండాలి. పరిశుద్ధురాలుగా ఉండాలి. ఎప్పుడూ స్నేహముగా ఉండాలి.
పతితుడు కాని భర్తనే సేవించాలి. భర్త పతితుడు కాకుంటేనే భర్తను సేవించాలి. లేకుంటే అటువంటి భర్తను వదిలిపెట్టుట దోషం కాదు. మనసు నొవ్వకుండా దారికి తెచ్చేందుకు ప్రయత్నించాలి. లేకుంటే వదిలినా తప్పుకాదు.
యా పతిం హరిభావేన భజేత్శ్రీరివ తత్పరా
హర్యాత్మనా హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే
భర్తను శ్రీమన్నారాయణుడన్న భావనతో సేవిస్తే, భర్త దుర్మార్గుడైనా సరే, ఆ భార్య చేసిన సేవ వలన భర్త కూడా తరిస్తాడు.
వృత్తిః సఙ్కరజాతీనాం తత్తత్కులకృతా భవేత్
అచౌరాణామపాపానామన్త్యజాన్తేవసాయినామ్
సంకర కులానికి ఏ కులముతో సంకరము వచ్చిందో ఆ కులానికి సంబంధించిన ధర్మం ఆచరించాలి. దొంగతనం చేయకుండా పాపం చేయకుండా ఉన్నవారు, అంత్య జాతితో ఉన్నవారు, అంత్య జాతిని సేవించేవారు, అలాంటి వారికి కూడా యుగయుగాలలో వారి వారి స్వభావానికి అనుగుణముగా ధర్మ బోధించబడినది.
ప్రాయః స్వభావవిహితో నృణాం ధర్మో యుగే యుగే
వేదదృగ్భిః స్మృతో రాజన్ప్రేత్య చేహ చ శర్మకృత్
వేదమును సాక్షాత్కరించుకున్న వారు ఇహపరలోకములో సుఖం శాంతి సంపాదించడానికి ఏర్పరచారు. ధర్మాచరణ ఏ ఒక్క జాతికో ఏర్పరచినది కాదు. వేదమును సాక్షాత్కరించుకున్నవారి మాట ఇది. ఇహ పర లోకములో సుఖాన్ని కలిగించేది.
వృత్త్యా స్వభావకృతయా వర్తమానః స్వకర్మకృత్
హిత్వా స్వభావజం కర్మ శనైర్నిర్గుణతామియాత్
ప్రతీ వారు తన స్వభావానికి అనుగుణముగా విధించబడిన కర్మలు ఆచరిస్తూ ఉంటే దాని వలన శరీర మనో ఇంద్రియ బుద్ధులు శుద్ధి అవుతాయి. ఇవన్నీ శుద్ధి పొందినతరువాత త్రైగుణ్యాన్ని వదిలి నైర్గుణ్యాన్ని సాధించాలి. ఒకసారి శరీరం పొందిన తరువాత మళ్ళీ శరీరం పొందకుండా ఉండుటకు కావలసిన ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాచరణ నిర్గుణులవ్వడానికి తోత్పడాలి. తమ కర్మలు తాను చేస్తూ స్వభావజములైన కర్మలు వదిలిపెట్టి మెల్లగా నైర్గుణ్యాన్ని పొందాలి.
ఉప్యమానం ముహుః క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్
న కల్పతే పునః సూత్యై ఉప్తం బీజం చ నశ్యతి
నైర్గుణ్యం కలగడానికే గుణాలూ, కోరికలు కలగకుండా ఉండడానికే కోరికలూ ఉండాలి. ఉదాహరణకు ఒక భూమిలో పది సార్లూ ఒకే పంట వేస్తే పది సార్లూ ఒకే విధమైన పంట వస్తుందా? వేస్తూ, పండిస్తున్న కొద్దీ భూమి నిస్సారమవుతుంది. వేసిన బీజం కూడా నశిస్తుంది. అలా మారడానికి కావలసిన మానసిక స్వచ్చత సజ్జన సాంగత్యముతో సంపాదించుకోవాలి.
ఏవం కామాశయం చిత్తం కామానామతిసేవయా
విరజ్యేత యథా రాజన్నగ్నివత్కామబిన్దుభిః
ఇలా హితం సత్యం ప్రియమైన కోరికలతో కోరికలను జయించాలి. ధర్మార్థ కామములలో నైర్గుణ్యముతో ధర్మాన్ని సేవించాలన్న బుద్ధితో ధర్మానికి అడ్డురాని కామాన్ని అనుభవిస్తే కొంత కాలానికి నైర్గుణ్యం ఏర్పడుతుంది. విరక్తి పుడుతుంది. అగ్నిలో నెయ్యి వేస్తే మంట పైకి లేస్తుంది. ఒక స్థాయిలో ఉన్నంతవరకే నెయ్యి వేస్తే మంట పెరుగుతుంది. ఆ తరువాత పెరగదు.
యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యఞ్జకమ్
యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్
ఏ ఏ ధర్మాలు ఎవరెవరివిగా చెప్పామో ఆ ధర్మాలు ఎవరు ఆచరించినా వారు ఆ ధర్మానికి చెందిన వారవుతారు. బ్రాహ్మణ ధర్మాలు శూద్రునిలో కనపడితే వాడు బ్రాహ్మణుడే అవుతాడు. వారి దగ్గర ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఏ వర్ణముదో వాడు ఆ వర్ణానికి చెందినవాడవుతాడు. తనలో ఉన్న లక్షణాన్ని బట్టి వర్ణం. వర్ణాన్ని బట్టి లక్షణం కాదు. ఆ వర్ణమును ఆ లక్షణముతోటే చెప్పాలి గానీ, పుట్టుకను బట్టి కాదుa