Followers

Sunday, 2 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం



ఇది తత్వ త్రయాన్ని వివరించిన కథ. దేవతలు పరోక్ష ప్రియులు. 

ప్రాచీనబర్హిరువాచ
భగవంస్తే వచోऽస్మాభిర్న సమ్యగవగమ్యతే
కవయస్తద్విజానన్తి న వయం కర్మమోహితాః

మీరు చెప్పిన మాటలలో అంతరార్థం మాకు తెలియలేదు. కొంచెం తెలిసింది గానీ బాగుగా తెలియలేదు. మీరే ఉద్దేశ్యముతో చెప్పారో అది పూర్తిగా అర్థం కాలేదు. జ్ఞ్యానులు తెలుసుకుంటారు గానీ కర్మలచే మోహింపబడిన వారము మేము. 

నారద ఉవాచ
పురుషం పురఞ్జనం విద్యాద్యద్వ్యనక్త్యాత్మనః పురమ్
ఏకద్విత్రిచతుష్పాదం బహుపాదమపాదకమ్

పురుషుడు పురంజనుడు. పురమంటే శరీరము.
జీవుడు తనకు కావలసిన శరీరాన్ని వెతుక్కుంటాడు. తానాచరించిన కర్మకు తగిన శరీరములోకి పరమాత్మ పంపిస్తాడు. ఒక కాలి జంతువులూ, రెండు కాళ్ళూ మూడూ నాలుగు కాళ్ళూ

యోऽవిజ్ఞాతాహృతస్తస్య పురుషస్య సఖేశ్వరః
యన్న విజ్ఞాయతే పుమ్భిర్నామభిర్వా క్రియాగుణైః

పురనజనునికి ఒక మిత్రుడు అవిజ్ఞ్యాత నాముడు. ఆయన పరమాత్మ. పరమాత్మే జీవాత్మకు మిత్రుడు. ఆయన అవిజ్ఞ్యాతుడెందుకంటే ఆయన పేరూ నివాసమూ ఎవరికీ తెలీదు. నామ స్వరూప గుణ వ్యవహారాలతో ఆయన స్వరూపాన్ని తెలుసుకోలేము.

యదా జిఘృక్షన్పురుషః కార్త్స్న్యేన ప్రకృతేర్గుణాన్
నవద్వారం ద్విహస్తాఙ్ఘ్రి తత్రామనుత సాధ్వితి

ఈ పురుషుడు తానాచరించిన కర్మఫలాన్ని  ప్రకృతి యొక్క గుణాలను అనుభవించాలి అని నవ ద్వారాలు, రెండు చేతులూ కాళ్ళూ ఉన్న నగరాన్ని బాగుందనుకున్నాడు. జీవుడు మానవాకారాన్ని (పురుషాకారాన్ని మెచ్చుకున్నాడు)

బుద్ధిం తు ప్రమదాం విద్యాన్మమాహమితి యత్కృతమ్
యామధిష్ఠాయ దేహేऽస్మిన్పుమాన్భుఙ్క్తేऽక్షభిర్గుణాన్

పురంజని అనే స్త్రీ బుద్ధి. ఆమె గొప్పతనం (బుద్ధి గొప్పతనం) ఏమిటంటే నేనూ నాదీ అనే భావన బుద్ధి వలన వస్తుంది. పురుషుడు (జీవుడు) బుద్ధిని ఆశ్రయించే ఇంద్రియములతో ప్రకృతి గుణాలను అనుభవిస్తాడు. ఇంద్రియములకూ బుద్ధికీ సంబంధముంటేనే ప్రకృతి గుణాలను అనుభవించడం.

సఖాయ ఇన్ద్రియగణా జ్ఞానం కర్మ చ యత్కృతమ్
సఖ్యస్తద్వృత్తయః ప్రాణః పఞ్చవృత్తిర్యథోరగః

అమ్మాయి వెనక పదకొండు మంది స్నేహితులూ ఇంద్రియగణం. జ్ఞ్యానం కర్మచ యత్కృతం - కొన్ని జ్ఞ్యానేంద్రియాలూ కొన్ని కర్మేంద్రియాలు. రూప రస గంధ స్పర్శాదులు తెలియాలంటే ఇంద్రియాలుండాలి. తెలిసినదాన్నే ఇంకో ఇంద్రియముతో చేస్తాము. అంటే కాళ్ళూ చేతులూ పని చేయాలి. మనసుతో కలిపి పదకొండు. 
మిత్రులతో బాటు ఉన్న దాసీ గణము ఇంద్రియ వృత్తులు. వృత్తులు రెండు రకాలు. ప్రవృత్తీ నివృత్తీ (మానుట). కనులు మూసుకోవడం కూడా ఒక పనే. పదకొండు ఇంద్రియాలకూ ఇరవై రెండు మంది దాసీ జనమూ. ఐదు తలల పాము పంచ ప్రాణములు. 

బృహద్బలం మనో విద్యాదుభయేన్ద్రియనాయకమ్
పఞ్చాలాః పఞ్చ విషయా యన్మధ్యే నవఖం పురమ్

మనస్సు కర్మ జ్ఞ్యానేంద్రియాలకూ నాయకుడు. ఒక విషయాన్ని తెలియాలన్నా తెలిసిన దాన్ని చేయాలన్నా మనసే కావాలి. జ్ఞ్యాన కర్మేంద్రియాలకు అధిపతి. అందుకు అది బృహద్బలం. పఞ్చాలాః  - శబ్ద స్పర్శ రూప రస గంధములు అనే ఐదు విషయములు చాలు.  ఈ విషయాల మధ్యే తొమ్మిది ద్వారాలు ఉన్న శరీరం ఉంటుంది. 

అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిశ్నగుదావితి
ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తదిన్ద్రియసంయుతః

నవరంధ్రాలు. రెండు రెండు ద్వారాలు చెవులూ. ఆయా ఇంద్రియాలతో కలిసి ఆ ద్వారములు బయటకు వెళ్ళి బయటి వాటిని తీసుకుంటాయి

అక్షిణీ నాసికే ఆస్యమితి పఞ్చ పురః కృతాః
దక్షిణా దక్షిణః కర్ణ ఉత్తరా చోత్తరః స్మృతః

ముందర ఉండేవి ఐదు. రెండు కళ్ళూ చెఉవులూ రెండు నాసికా ద్వారాలు నోరు.  ముందర ఉండేవి ఐదు. పక్కన ఉండేవి రెండు. దక్షిణ ఉత్తర ద్వారాలు కుడి ఎడమ చెవు

పశ్చిమే ఇత్యధో ద్వారౌ గుదం శిశ్నమిహోచ్యతే
ఖద్యోతావిర్ముఖీ చాత్ర నేత్రే ఏకత్ర నిర్మితే
రూపం విభ్రాజితం తాభ్యాం విచష్టే చక్షుషేశ్వరః

కింద ద్వారాలు రెండు. 
ఖద్యోతము (ఆకాశం ప్రకాశింపచేసేవాడు) అవిర్ముఖము (తేజో ముఖి) - సుర్ర్యుడు - రెండు కన్నులు. ఇంద్రియాధిపతి రెండు కనులతో ప్రకాశింపచేసే రూపం స్వీకరిస్తాడు. అంటే వెలుగు ఉంటేనే చూడగలడు

నలినీ నాలినీ నాసే గన్ధః సౌరభ ఉచ్యతే
ఘ్రాణోऽవధూతో ముఖ్యాస్యం విపణో వాగ్రసవిద్రసః

నలినీ నాలినీ - రెండు నాసికలు. గంధాన్ని స్వీకరిస్తాయి. ఘ్రాణ ఇంద్రియము నాసిక ద్వారా గంధమును గ్రహిస్తుంది. నోరు విపణి (అంగడి). దానిలో రసాన్ని కొంటాము. ఈ వాక్కే రసాన్ని గ్రహించేది. 

ఆపణో వ్యవహారోऽత్ర చిత్రమన్ధో బహూదనమ్
పితృహూర్దక్షిణః కర్ణ ఉత్తరో దేవహూః స్మృతః

రక రకాల అన్నాన్ని స్వీకరిస్తుంది. రెండు చెవులలో దక్షిణ కర్ణం పితృహు ఎడమ చెవి దేవహు. 

ప్రవృత్తం చ నివృత్తం చ శాస్త్రం పఞ్చాలసంజ్ఞితమ్
పితృయానం దేవయానం శ్రోత్రాచ్ఛ్రుతధరాద్వ్రజేత్

ఈ రెండు ద్వారాలనుంచీ ప్రవృత్తి నివృత్తీ అనే శాస్త్రం వింటాము. పఞ్చాలసంజ్ఞితమ్ - విషయభోగాన్ని అనుభవించమనీ చెప్పినదీ, వదలమని చెప్పినదీ శాస్త్రమే. కర్తృత్వ భోక్తృత్వ జ్ఞ్యాతృత్వములను వదిలి అనుభవించమని చెబుతుంది. దీనికే పితృయానమనీ దేవ ద్వారమనీ పేరు.

ఆసురీ మేఢ్రమర్వాగ్ద్వార్వ్యవాయో గ్రామిణాం రతిః
ఉపస్థో దుర్మదః ప్రోక్తో నిరృతిర్గుద ఉచ్యతే

ఉపస్థ వలన స్త్రీ పురుష సమాగమం (వ్యవాయు). అది ఏమీ తెలియని వారు పొందే ఆనందము. ఇది దూర్మదః. ఎంత కష్టపడ్డా గానీ తొలగించలేని మదము. (బలవానిన్ద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి). మల ద్వారం న్రృతి. మలమును విడిచిపెట్టడమంటే హింస. పనికొచ్చేదిగా నోటి లోపలకు వెళ్ళి పనికి రానిదిగా బయటకు వస్తుంది.

వైశసం నరకం పాయుర్లుబ్ధకోऽన్ధౌ తు మే శృణు
హస్తపాదౌ పుమాంస్తాభ్యాం యుక్తో యాతి కరోతి చ

దీనికి లుబ్ధ అని పేరు. నోటికి కూడా లుబ్ధ అని పేరు. ఆశ ఎక్కువ. తినవలసిన దాన్ని తినకుండా ఆపలేదు. తినడానికి పడిన తొందరకన్నా ఎక్కువ తొందర మలాన్ని విడిచిపెట్టడానికి ఉంటుంది. హస్తపాదాలు గుడ్డివి. కళ్ళతో చూచినవి కాళ్ళూ చేతులూ తీసుకుంటాయి. పాదములతో వెళతాడూ, హస్తములతో చేస్తాడు.

అన్తఃపురం చ హృదయం విషూచిర్మన ఉచ్యతే
తత్ర మోహం ప్రసాదం వా హర్షం ప్రాప్నోతి తద్గుణైః

ఈ నగరములో అంతఃపురముంది. అదే హృదయం. దాని పాలకుడు మనసు. ఈ మనస్సుతో హృదయములో సంతోషం గానీ, సుఖం గానీ దుఃఖం గానీ బాధగానీ ప్రకృతి గుణములతో పొందుతాడు

యథా యథా విక్రియతే గుణాక్తో వికరోతి వా
తథా తథోపద్రష్టాత్మా తద్వృత్తీరనుకార్యతే

ఆయా గుణములచే అంటబడి ఎలా వికారం పొందుతాడో (విక్రియతే ), పొందించబడతాడో  (వికరోతి ) అలా దాని వెంట అనుసరించే ఆత్మ కూడా ఆ గుణాలు అనుభవించినట్లు అనుకరిస్తుంది. 

దేహో రథస్త్విన్ద్రియాశ్వః సంవత్సరరయోऽగతిః
ద్వికర్మచక్రస్త్రిగుణ ధ్వజః పఞ్చాసుబన్ధురః

శరీరమే రధమూ ఇంద్రియములే గుఱ్ఱాలు, సంవత్సరము వేగము. చాలా వేగముగా పోతుంది గానీ ఒక్క అడుగు కూడా ముందుకు పోదు (అగతిః)
పుణ్యమూ పాపమూ అనే కర్మలు చక్రాలు. మూడు గుణాలు ద్వజములు. ఐదు బంధాలు ఐదు ప్రాణాలు

మనోరశ్మిర్బుద్ధిసూతో హృన్నీడో ద్వన్ద్వకూబరః
పఞ్చేన్ద్రియార్థప్రక్షేపః సప్తధాతువరూథకః

మనస్సే పగ్గము. బుద్ధి సారధి. హృదయము నీడము (యజమాని కూర్చునే స్థలం) శీతోష్ణములూ సుఖ దుఃఖములూ మానావమానాలు కూబరులు. శబ్దాది విషయాలు ప్రక్షేపములు. రథానికున్న ఏడు అంచెలు సప్తధాతువులు.

ఆకూతిర్విక్రమో బాహ్యో మృగతృష్ణాం ప్రధావతి
ఏకాదశేన్ద్రియచమూః పఞ్చసూనావినోదకృత్

ఆకూతి (సంస్కారమూ వాసన) పరాక్రమం, విక్రమం (అడుగు వేయిస్తుంది). వేట అంటే ఎండమావి. పదకొండు మంది సైన్యము ఇంద్రియాలు. వినోదం కలుగుతుందని మృగాలని చంపడం పంచసూనములు (ఐదు హింసలు, ఊడవడం ఉడికించడం విసరాలి కోయాలి దంచాలి ) 

సంవత్సరశ్చణ్డవేగః కాలో యేనోపలక్షితః
తస్యాహానీహ గన్ధర్వా గన్ధర్వ్యో రాత్రయః స్మృతాః
హరన్త్యాయుః పరిక్రాన్త్యా షష్ట్యుత్తరశతత్రయమ్

చండవేగుడు సంవతస్రము. ఈ చండవేగునితోనే కాలము తెలుస్తుంది. మూడు వందల అరవై ఐదు మంది గంధర్వులు, తెల్లటి వారు పగళ్ళూ, నల్లటి వారు రాత్రులు. మూడు వందల అరవై పగళ్ళూ రాత్రులు ఒక సారి తిరిగితే ఆయువు ఒక సంవత్స్రం ఒకటి తగ్గింది. 

కాలకన్యా జరా సాక్షాల్లోకస్తాం నాభినన్దతి
స్వసారం జగృహే మృత్యుః క్షయాయ యవనేశ్వరః

కాలకన్య ముసలితనం. ప్రపంచములో ఎవ్వరూ దీన్ని అభినందించరు. యవనేశ్వరుడు మృత్యువు. ఇతను కాల కన్యను (జరా) సోదరిగా స్వీకరించాడు. 

ఆధయో వ్యాధయస్తస్య సైనికా యవనాశ్చరాః
భూతోపసర్గాశురయః ప్రజ్వారో ద్వివిధో జ్వరః

మృత్యువు సైనికులు వ్యాధులూ ఆధులు (మనోవ్యాధి). వీళ్ళే యవనులు. జ్వరములలో ఒకటి మహావేగముగా వస్తుంది ఒకటి మెలమెల్లగా వస్తుంది. 

ఏవం బహువిధైర్దుఃఖైర్దైవభూతాత్మసమ్భవైః
క్లిశ్యమానః శతం వర్షం దేహే దేహీ తమోవృతః

ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికంలనే బాధలు ఉంటాయి. ఇలాంటి రక రకముల దుఃఖములతో కష్టపడుతూ 

ప్రాణేన్ద్రియమనోధర్మానాత్మన్యధ్యస్య నిర్గుణః
శేతే కామలవాన్ధ్యాయన్మమాహమితి కర్మకృత్

ప్రాణ ఇంద్రియ మనో ధర్మాలను ఆత్మయందు ఆరోపిస్తాడు (నేను బలహీనున్నీ, నాకు కనిపించడములేదు ఇలాంటివి కొన్ని ప్రాణ ఇంద్రియ మనో ధర్మాలు). ఆత్మకే గుణమూ లేదు. చిన చిన్న కోరికలను ఆలోచిస్తూ నిద్రపోతాడు. సోమరితనమే నిష్క్రియత్వమే విరోధానికి మూలము. ఇలా అలోచిస్తూ నేనూ నాదీ అంటూ కర్మలు చేస్తూ ఉంటాడు. 

యదాత్మానమవిజ్ఞాయ భగవన్తం పరం గురుమ్
పురుషస్తు విషజ్జేత గుణేషు ప్రకృతేః స్వదృక్

ఆత్మ గురించి తెలుసుకోడూ, పరమాత్మ గురించీ తెలుసుకోడు. భగవద్స్వరూప జ్ఞ్యానము గానీ స్వస్వరూప జ్ఞ్యానము లేనప్పుడే ఈ జీవుడు గుణాలలో మునుగుతాడు. ప్రకృఇ కంటే ఆత్మ వేరు, ఆత్మకే గుణాలూ దోషాలూ లేవు

గుణాభిమానీ స తదా కర్మాణి కురుతేऽవశః
శుక్లం కృష్ణం లోహితం వా యథాకర్మాభిజాయతే

లేని గుణములను ఉన్నవీ అనుకున్నందువలన ఉన్న వాటినీ అనుకున్నవాటినీ పొందాలనుకుని పనికిరాని అవసరము లేని పనులను చేస్తుంది. సత్వమూ తాంసస్సు రజస్సులతో కూడిన పనులను ఆచరిస్తారు. ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి వాడిగా పుడతాడు.

శుక్లాత్ప్రకాశభూయిష్ఠా లోకానాప్నోతి కర్హిచిత్
దుఃఖోదర్కాన్క్రియాయాసాంస్తమఃశోకోత్కటాన్క్వచిత్

సాత్విక కర్మలు చేస్తే చంద్ర స్వర్గ మరుత్ లోకాలూ, తామసిక కర్మలు చేస్తే నరకాది లోకాలకూ వెళతారు, దుఃఖము బాగా కలిగించే పనులు ఆచరిస్తారు

క్వచిత్పుమాన్క్వచిచ్చ స్త్రీ క్వచిన్నోభయమన్ధధీః
దేవో మనుష్యస్తిర్యగ్వా యథాకర్మగుణం భవః

ఈ ఆత్మే ఒక చోట పురుషునిగా, ఇంకో చోట స్త్రీగా, ఇంకో చోట నపున్సకముగా ఉంటుంది. దేవతగా మనిషిగా పశువులుగా అదే ఆత్మ శరీరం ధరిస్తుంది కర్మను బట్టి. 

క్షుత్పరీతో యథా దీనః సారమేయో గృహం గృహమ్
చరన్విన్దతి యద్దిష్టం దణ్డమోదనమేవ వా

బాగా ఆకలిగొన్న కుక్క (సారమేయో ) ఈ ఇంటినుంచి ఆ ఇంటికీ ఆ ఇంటినుంచి ఈ ఇంటికీ పోతుంది. అన్ని ఇళ్ళలో అన్నమే దొరుకుతాయా? కొన్ని ఇళ్ళలో అన్నము తింటుంది కొన్ని ఇళ్ళల్లో దెబ్బలు తింటుంది. అలాగే మానవులు కూడా

తథా కామాశయో జీవ ఉచ్చావచపథా భ్రమన్
ఉపర్యధో వా మధ్యే వా యాతి దిష్టం ప్రియాప్రియమ్

కోరికలను మనసు నిండా నిలుపుకుని పైలోకాలూ కిందలోకాలూ తిరుగుతూ ఉంటారు. అదృష్టవశాత్తూ లభించే ప్రీతినీ అప్రీతినీ సంతోషాన్నీ దుఃఖాన్నీ పొందుతారు

దుఃఖేష్వేకతరేణాపి దైవభూతాత్మహేతుషు
జీవస్య న వ్యవచ్ఛేదః స్యాచ్చేత్తత్తత్ప్రతిక్రియా

ఆధ్యాత్మ ఆదిదైవిక ఆదిభౌతికములనే మూడు రకముల దుఃఖములలో ఒక్క దానితో కూడా జీవునికి విముక్తి కనపడదు.

యథా హి పురుషో భారం శిరసా గురుముద్వహన్
తం స్కన్ధేన స ఆధత్తే తథా సర్వాః ప్రతిక్రియాః

కష్టములొచ్చాయని వచ్చిన బాధలను తప్పించుకోజూస్తాడు. శిరస్సున ఉన్న బరువును భుజము మీదకు మార్చుకుని బరువు తగ్గిందనుకుంటాడు. అతను చేసే ప్రతిక్రియలన్నీ ఇలాంటివే. 

నైకాన్తతః ప్రతీకారః కర్మణాం కర్మ కేవలమ్
ద్వయం హ్యవిద్యోపసృతం స్వప్నే స్వప్న ఇవానఘ

ఒక కర్మకు ఇంకో కర్మ ఎప్పుడూ ప్రతీకారము కాదు. నిదురపోయిన తరువాత కల వచ్చి, కలలో నిదురపోయి అందులో ఇంకో కల వస్తే అందులో ఏ కల మంచిదంటే ఏమి చెప్తాము

అర్థే హ్యవిద్యమానేऽపి సంసృతిర్న నివర్తతే
మనసా లిఙ్గరూపేణ స్వప్నే విచరతో యథా

అర్థములు (విషయములు) లేకున్నా సంసారము పోదు. వాటిని కలిగించే వాసన అలాగే ఉంటుంది. అన్నం తిన్న నాటి కంటే అన్న తినని నాడే ఆహారం మీద మనసు ఉంటుంది. అలాగే విషములు లేకున్నప్పటికీ సంసారము పోదు. మనసుతో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురుగా లేని విషయాలని మనసుతో ఆలోచిస్తూ ఉంటాడు.

అథాత్మనోऽర్థభూతస్య యతోऽనర్థపరమ్పరా
సంసృతిస్తద్వ్యవచ్ఛేదో భక్త్యా పరమయా గురౌ

అర్థమైనటువంటి (స్వచ్చమైనటువంటి) ఆత్మకు అనర్థములు కలవడానికి కారణం మనసూ వాసనా సంస్కారము వలన కలుగుతున్నాయి. ఇది పోవాలంటే గురువు యందు పరమ భక్తి కలిగి ఉండాలి. 

వాసుదేవే భగవతి భక్తియోగః సమాహితః
సధ్రీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి

పరమాత్మ యందు భక్తి కలిగి ఉండు. చక్కని నిశ్చలమైన సావధానమైన మనసుతో చేస్తే (సధ్రీచీనేన - అన్య విషయ అప్రాపకమైన మనసుతో ), అలా ఉంటే  విరక్తిని కలిగిస్తుంది. భక్తి వైరాగ్యాన్నీ జ్ఞ్యానాన్నీ కలిగిస్తుంది. 

సోऽచిరాదేవ రాజర్షే స్యాదచ్యుతకథాశ్రయః
శృణ్వతః శ్రద్దధానస్య నిత్యదా స్యాదధీయతః

త్వరలోనే ఇలాంటి వాడికి పరమాత్మ కథలను వినాలనే కోరిక పుడుతుంది. ఇలా పరమాత్మ కథలను శ్రద్ధగా వింటున్నవాడికి శ్రద్ధా భక్తీ నిరంతరం చలించకుండా ఉంటాయి

యత్ర భాగవతా రాజన్సాధవో విశదాశయాః
భగవద్గుణానుకథన శ్రవణవ్యగ్రచేతసః

పరమాత్మ కథ యందు కోరిక కలిగితే ఎక్కడ భాగవతోత్తములు పరమాత్మ భక్తులు పరిశుద్ధ మనస్కులు, ఉంటారో వారు మనము పిలవకుండానే వేంచేస్తారు 

తస్మిన్మహన్ముఖరితా మధుభిచ్ చరిత్రపీయూషశేషసరితః పరితః స్రవన్తి
తా యే పిబన్త్యవితృషో నృప గాఢకర్ణైస్తాన్న స్పృశన్త్యశనతృడ్భయశోకమోహాః

అలాంటి వారి విషయములో మహానుభావులచేత చెప్పబడిన పరమాత్మ కథలతో, కథ అనే అమృతము యొక్క శేషము యొక్క నదులు అన్నీ చుట్టూ ప్రవహిస్తాయి. అలాంటి పరమాత్మ కథలను తృప్తి పొందక తాగుతూ ఉంటారో ఆకలీ దప్పీ దుఃఖమూ శోకమూ మోహమూ జరా స్పృశించవు. అలాంటి కథలను విన్న వారిని సాంసారిక విషయాలు స్పృశించవు. 

ఏతైరుపద్రుతో నిత్యం జీవలోకః స్వభావజైః
న కరోతి హరేర్నూనం కథామృతనిధౌ రతిమ్

వినాలని అందరికీ తెలుసుకానీ అందరూ వినలేరు. అనేక సాంసారిక బాధలతో ఉన్నవాడు ఇవేమీ చేయడు. ఆకలీ దప్పీ భయమూ మోహమూ శోకమూ సహజముగా ఉంటాయి. ఆకలి దప్పులూ మొదలైనవి తొలగిపోతోనే కథలు విందామనుకుంటాడు. ఆ కథలు వింటేనే ఆకలీ దప్పీ మొదలైనవి పోతాయి. అనుకోకుండా కథలను వినడముతో ప్రీతి కలుగుతుంది, దాని తరువాత జ్ఞ్యానమూ వైరాగ్యమూ కలుగుతాయి. అప్పుడు ఆకలీ దప్పీ కూడా పోతాయి. ప్రయత్నము లేకుండా పరమాత్మ కథలను వినడము అదృష్టమూ. అది పరమాత్మ దయకు సంకేతము. 

ప్రజాపతిపతిః సాక్షాద్భగవాన్గిరిశో మనుః
దక్షాదయః ప్రజాధ్యక్షా నైష్ఠికాః సనకాదయః
మరీచిరత్ర్యఙ్గిరసౌ పులస్త్యః పులహః క్రతుః
భృగుర్వసిష్ఠ ఇత్యేతే మదన్తా బ్రహ్మవాదినః

ఇలాంటి విశాల ప్రపంచములో పరమాత్మను మాత్రమే ధ్యానించేవారు శివుడు (ప్రజాపతిపతిః సాక్షాద్భగవాన్గిరిశో ) దక్షాది ప్రజాపతులు సనకాదులూ మరీచి అత్రి అంగీరస పులస్త్య పులహ క్రతు బృగు వశిష్ఠ నారద (నవ బ్రహ్మలు)

అద్యాపి వాచస్పతయస్తపోవిద్యాసమాధిభిః
పశ్యన్తోऽపి న పశ్యన్తి పశ్యన్తం పరమేశ్వరమ్

తపస్సుతో విద్యతో జ్ఞ్యానముతో కొంతమంది అర్థమైనా ఆచరించలేరు. చూస్తూ ఉండి కూడా గుడ్డివారవుతారు. పరమాత్మ అందరినీ చూస్తుంటాడన్న విషయం తెలిసి కూడా ఆచరణకు వచ్చేసరికి ఆ విషయం చూడలేడు

శబ్దబ్రహ్మణి దుష్పారే చరన్త ఉరువిస్తరే
మన్త్రలిఙ్గైర్వ్యవచ్ఛిన్నం భజన్తో న విదుః పరమ్

పరమాత్మ శబ్ద బ్రహ్మ. మంత్రాలనూ బీజాక్షరాలనో స్మరించి జపించి నేను పూజ చేసాను అనుకుంటారు. 

సర్వేషామేవ జన్తూనాం సతతం దేహపోషణే
అస్తి ప్రజ్ఞా సమాయత్తా కో విశేషస్తదా నృణామ్
లబ్ధ్వేహాన్తే మనుష్యత్వం హిత్వా దేహాద్యసద్గ్రహమ్
ఆత్మసృత్యా విహాయేదం జీవాత్మా స విశిష్యతే

యదా యస్యానుగృహ్ణాతి భగవానాత్మభావితః
స జహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితామ్

పరమాత్మ సహజముగా ఎవరిని అనుగ్రహిస్తాడో అటువంటి వాడు లౌకిక వైదిక విషయములో బుద్ధిని వదిలిపెడతాడు. మనకి భతీ వైరాగ్యం కలగలేదంటే అది పరమాత్మ కలిగించలేదని అర్థం. అందుకే భతి లేని వారిని చూచి జాలి పడమనీ, భగవంతున్ని ప్రార్థించమనీ పెద్దలు చెబుతారు. వేదములలో బోధించబడిన కర్మయోగములను కూడా పరమాత్మ భక్తులు ఆచరించరు. 

తస్మాత్కర్మసు బర్హిష్మన్నజ్ఞానాదర్థకాశిషు
మార్థదృష్టిం కృథాః శ్రోత్ర స్పర్శిష్వస్పృష్టవస్తుషు

కన్నులతో చెవులతో చూసి తెలుసుకునేవాటి యందు "ఇవన్నీ నాకు ప్రయోజనములూ లాభములూ" అని అనుకోకు. శ్రోత్రేంద్రియమూ త్వగ్ ఇంద్రియమూ ఇలాంటి అస్పృష్ట వస్తువులయందు మతిని విడిచిపెట్టు. వేదాలకు శ్రోత్ర స్పర్శిషు అని పేరు. వేదం బోధించే కామ్య కర్మలు చెవులకి మాత్రమే తాకుతాయి. అర్థకాశిషు - ప్రయోజనాన్ని కలిగిస్తాయి అనిపిస్తాయి. పురుషార్థములా భాసిస్తాయి. అజ్ఞ్యానాత్ అర్థకాశిషు - జ్ఞ్యానము లేనందువలన వీటిని ప్రయోజనమనిపిస్తాయి. అస్పృష్టవస్తుషు - అసలు వస్తువైన భగవంతుని తాకవు ఈ కర్మలు. 

స్వం లోకం న విదుస్తే వై యత్ర దేవో జనార్దనః
ఆహుర్ధూమ్రధియో వేదం సకర్మకమతద్విదః

తామేమి చేస్తున్నారో మరచిపోతారు. వారి లోకమేదో మరచిపోతారు. పరమాత్మ ఎక్కడుంటాడో అదే మన లోకము. జ్ఞ్యానులూ యోగులూ బుద్ధిమంతులూ ఏవి పనికి రావని వదిలేసారో (కామ్య కర్మలు) వాటినే మనము పట్టుకుని వ్రేళ్ళాడుతున్నాము. బుద్ధి అంతా పొగబారి ఉంటుంది. వేదము యొక్క అంతరార్థము తెలియని వారు వేదాన్ని సకర్మకం అని అంటారు. వేదం నైష్కర్యం. దుఃఖాన్ని కలిగించే కర్మలను చెబుతుందా? 

ఆస్తీర్య దర్భైః ప్రాగగ్రైః కార్త్స్న్యేన క్షితిమణ్డలమ్
స్తబ్ధో బృహద్వధాన్మానీ కర్మ నావైషి యత్పరమ్
తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా

ఎవరెవరు ఎలాంటి విషయాలను స్వీకరిస్తారు? స్వీకరించినవారు ఎలా ఆచరిస్తారు. నిరంతరము పరమాత్మను మాత్రమే ధ్యానించడానికి కావలసిన పుణ్యవిశేషం పరమాత్మ మాత్రమే దయ చూపి అనుగ్రహించాలి. పరమాత్మ కంటే  భిన్నమైనది ఉపాయమనుకోవడం ఉపాయ విరోధి భగవంతుని కంటే ఇతరులకు దాసులమనుకోవడం స్వరూప విరోధి భగవంతుని కంటే ఇంకొకరిని పొందాలి అనుకోవడం ప్రాప్య విరోధి. వీటిలో ఏ ఒక్కటి విరోధి వచ్చినా మిగతా రెండూ వస్తాయి. భూమండలమంతా దర్భలు పరచి యజ్ఞ్యము చేస్తే పరమాత్మను పొందరు. అలాంటి వాడు జ్ఞ్యానమును కోల్పోయి మొద్దుబారిపోతాడు. యజ్ఞ్యమనే పేరుతో జంతు వధ చేస్తున్నాడు. ఇలాంటి పని వలన పుణ్యమొస్తుందా? ఆ యజ్ఞ్యాలు చేసి "నేనిన్ని యజ్ఞ్యాలు చేసాను" అని అంటాడు. 
తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా - పరమాత్మకు సంతోషం కలిగింపచేసేదే పని, పరమాత్మయందు బుద్ధి నిలిపేదే చదువు 

హరిర్దేహభృతామాత్మా స్వయం ప్రకృతిరీశ్వరః
తత్పాదమూలం శరణం యతః క్షేమో నృణామిహ

శరీర ధారులైన జీవాత్మలకు ఆత్మ అయిన వాడు పరమాత్మ. ఆయనే ప్రధానమైన కారణం. జగత్తంతా పరమాత్మ నుండే వెలువడింది. ఆయనే శాసకుడు. ఆ పరమాత్మ యొక్క పాదమూలమే రక్షకము. పరమాత్మ పాదములను చేరితేనే క్షేమము. 

స వై ప్రియతమశ్చాత్మా యతో న భయమణ్వపి
ఇతి వేద స వై విద్వాన్యో విద్వాన్స గురుర్హరిః

మనకు నిజమైన ప్రియతముడు ఆయనే. అలాంటి వాని వలన కొద్ది భయము కూడా కలుగదు. ఎవడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు పండితుడు. ఆ పండితుడే గురువు. ఆ గురువే పరమాత్మ. (-ఉదరమంతరం కురుతే, అథతస్య భయం భవతి)

నారద ఉవాచ
ప్రశ్న ఏవం హి సఞ్ఛిన్నో భవతః పురుషర్షభ
అత్ర మే వదతో గుహ్యం నిశామయ సునిశ్చితమ్

నీకు అతి రహస్యమును చెబుతున్నాను విను. ఇది సునిశ్చితం. పరమ సిద్ధాంతం. 
వ్యాసుడు వ్యాఖ్యానం వ్రాసిన ఏకైక శ్లోకం ఇది. 

క్షుద్రం చరం సుమనసాం శరణే మిథిత్వా
రక్తం షడఙ్ఘ్రిగణసామసు లుబ్ధకర్ణమ్
అగ్రే వృకానసుతృపోऽవిగణయ్య యాన్తం
పృష్ఠే మృగం మృగయ లుబ్ధకబాణభిన్నమ్

ఒక లేడి తనకు కావలసిన పచ్చికనున్ తిందామని వెళ్ళింది. దూరముగా పచ్చిక కనపడింది. అక్కడకు వెళ్ళగా నాలుగు తోడేళ్ళు కనపడ్డాయి. వెనక్కు వెళదామంటే వేటగాడు బాణము పట్టుకుని ఉన్నాడు. ముందర సంపద ఉన్నదని చూడక పరిగెత్తితే వెనకనుంచి ఆపదలొస్తాయి. ఆ తోడేళ్ళు (వృకా) ముందర (అగ్రే )వారి ప్రాణాలతో బ్రతికేవి. ప్రాణాలకోసం ప్రాణాలు తీసేవారు - అన్సుతృప. వెనక నుంచి వేటగాడి బాణాలు తగులుతున్నాయి, ముందరనుంచి తోడేళ్ళ కోరలు తగులుతున్నాయి. కాలము వేటగాడు యముడు తోడేళ్ళు. ఆశలే బాణాలు. 
క్షుద్రమైన అల్పమైన నీచమైన దానితో సంచరించేవాడు జీవుడు. పూల వంటి సుకుమారమైనా స్త్రీలయొక్క ఆశ్రయాన్ని పొందినవారు - సుమనసాం . వారిని శరణుగా పొంది పరస్పరం కలిసి కోరిక పెంచుకున్నవారవుతారు(రక్తం). పుస్ఫాల మీద వాలిన తుమ్మెదలు (షడఙ్ఘ్రిగణం) ఝంకారం చేస్తాయి. పద్మం మీదకి మగ తుమ్మెద తనకు తానుగా రాదు. ముందు ఆడ తుమ్మెద గానం చేస్తుంది. దానికి ఆశపడి మగ తుమ్మెద వచ్చి వాలుతుంది. ప్రియురాళ్ళు మాట్లాడే తీఎయని మాటలయందు ఆశపడే చెవులు కలవాడు ఆ పద్మములో బంధించబడుతున్నాడు. పచ్చిక కోసం వెళ్ళిన లేడి కూడా బంధించబడుతోంది.

అస్యార్థః సుమనఃసమధర్మణాం స్త్రీణాం శరణ ఆశ్రమే పుష్పమధుగన్ధవత్క్షుద్రతమం
కామ్యకర్మవిపాకజం కామసుఖలవం జైహ్వ్యౌపస్థ్యాది విచిన్వన్తం మిథునీభూయ తదభినివేశిత
మనసం షడఙ్ఘ్రిగణసామగీతవదతిమనోహరవనితాదిజనాలాపేష్వతితరామతిప్రలోభితకర్ణమగ్రే
వృకయూథవదాత్మన ఆయుర్హరతోऽహోరాత్రాన్తాన్కాలలవవిశేషానవిగణయ్య గృహేషు విహరన్తం పృష్ఠత ఏవ
పరోక్షమనుప్రవృత్తో లుబ్ధకః కృతాన్తోऽన్తః శరేణ యమిహ పరావిధ్యతి తమిమమాత్మానమహో
రాజన్భిన్నహృదయం ద్రష్టుమర్హసీతి

పూల వంటి సుకుమారమైన స్త్రీ మీద కోరికతో సుఖము లాంటి దానికోసం, నాలుకకూ ఉపస్థకూ సుఖము కలిగించుటకే మనసు లగ్నం చేసి ఆరు కాళ్ళతో (ఐదు జ్ఞ్యానేంద్రియాలు మనసు) సుందరమైనటువంటి ప్రేమ కురిపించే ప్రియురాళ్ళ మాటల మీద మోజు పడతాడు. అహోరాత్రములనే తోడేళ్ళు ఆయువును హరిస్తాయి నిమిషాలూ గంటలూ పూటలూ సంవత్సరాఊ గడుస్తూ ఉన్నా గమనించము. సంసారములో సంచరిస్తూ ఉంటాడు. వెనక యముడనే వేటగాడు లొపలనుండి వేసే బాణముతో హృదయం  భిన్నమవుతుంది. ఆహారము కోసము గానీ కామము కోసము గానీ మన స్థానాన్ని విడిచి వెళ్ళరాదు

స త్వం విచక్ష్య మృగచేష్టితమాత్మనోऽన్తశ్
చిత్తం నియచ్ఛ హృది కర్ణధునీం చ చిత్తే
జహ్యఙ్గనాశ్రమమసత్తమయూథగాథం
ప్రీణీహి హంసశరణం విరమ క్రమేణ

ఈ మృగచేష్టితాన్ని జాగ్రత్తగా చూచి నీవు కూడా నీ మనసును నిగ్రహించుకో. ఇంద్రియములను జయించకుంటే ఇంద్రియములు కోరేభోగం అనుభవించకపోగా మొదటికే మోసమొస్తుంది. చెవులో అమృతమూ పాలూ నేయి పోసేలాంటి (కర్ణధునీం) కోరికలతో ఉభయభ్రష్టులవుతారు. మనసుని నిగ్రహించు. చెవులతో వినగానే విన్నదాన్ని ఫలితం కలుగుతుందని ముందుకు అడుగు వేయకు. చిత్తాన్ని నిగ్రహించుకో. గృహస్థాశ్రమాన్ని (అంగనాశ్రమం) విడిచిపెట్టు. అది చెడువారిగుంపు (అసత్త్మయూధగాధం). వారు గృహస్థాశ్రమమే మంచిదని పాటలు పాడుతూ ఉంటారు. (చెవుల్లో విన్నదీ కళ్ళతో చూసినదీ, వీటి వైపు మనసు మళ్ళకుండా ఉంటే గృహస్థాశ్రమం ఉత్తమం. త్యాగముతో ఉండాలి - తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధ్ కస్యస్విద్ధనమ్) 
సన్యాసులూ యోగులూ ఎవరిని ఆశ్రయిస్తారో అటువంటి పరమాత్మను సంతోషింపచేయి. క్రమముగా సంసారమునుండీ విరముంచుకో. గృహస్థాశ్రమాన్ని చెడగొట్టడానికి మూలము ఆశ. ఆశ చూపి భ్రష్టులని చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. వారి మాటలకు మోహం చెందితే ఉభయభ్రష్టులవుతారు. ఆశను క్రమముగా విడిచిపెట్టు. (దానము యొక్క అసలు అర్థమిదే) 

రాజోవాచ
శ్రుతమన్వీక్షితం బ్రహ్మన్భగవాన్యదభాషత
నైతజ్జానన్త్యుపాధ్యాయాః కిం న బ్రూయుర్విదుర్యది

మీరు చెప్పిన ఈ వేదాంతాన్ని (అన్వీక్షితం) నేను విన్నాను. ఈ తత్వం మా గురువులకి తెలియదు. ఈ తత్వం మా గురువులు చెప్పలేదు. తెలుసుంటే ఎందుకు చెప్పలేదు.

సంశయోऽత్ర తు మే విప్ర సఞ్ఛిన్నస్తత్కృతో మహాన్
ఋషయోऽపి హి ముహ్యన్తి యత్ర నేన్ద్రియవృత్తయః

నాకు కలిగిన పెద్ద సందేహాన్ని సులభముగా తొలగించారు. ఇంద్రియములు ప్రవర్తించకుండా ఎలా ఉండాలి. శబ్దాది విషయములు ఎదురుగా ఉండగా వాటిలో ఇంద్రియములు ప్రవర్తించకుండా ఎలా చేయాలో అన్న విషయం మీద ఋషులు కూడా మోహం పొందుతున్నారు. అది మీరు నాకు సులభముగా చెప్పారు. 

కర్మాణ్యారభతే యేన పుమానిహ విహాయ తమ్
అముత్రాన్యేన దేహేన జుష్టాని స యదశ్నుతే

ఏ శరీరముతో యాగం చేసాడో ఆ శరీరానికి స్వర్గం రావట్లేదు. వేరే శరీరాన్ని తీసుకుని దానితో స్వర్గాన్ని అనుభవిస్తాడు. అంటే ఆ స్వర్గ ఫలితం చేసిన వాడికి కాదు, వేరే దేహం తీసుకున్నాడికి. ఏ శరీరముతో మానవుడు కర్మలు చేస్తున్నాడో అది విడిచిపెట్టి వేరే శరీరముతో ఆ కర్మను అనుభవిస్తాడని వేదములో వింటున్నాము. చేసిన శరీరము వేరు అనుభవించే శరీరము వేరు. అంటే శరీరమూ ఆత్మా వేరు. ఆత్మ ఒక్కటే. కానీ ఆత్మ ఏ శరీరముతో యజ్ఞ్యం చేసిందో అదే శరీరముతో అనుభవాన్ని పొందడము లేదు. ఇంత స్పష్టముగా చెప్పినా శరీరాత్మభావాన్ని వదలలేకపోతున్నారు. 

ఇతి వేదవిదాం వాదః శ్రూయతే తత్ర తత్ర హ
కర్మ యత్క్రియతే ప్రోక్తం పరోక్షం న ప్రకాశతే

చేసిన కర్మ చేసిన వాడు లేనప్పుడు వాడికి చాటుగా ఫలితాన్ని ఇస్తుందంటే ఎలా నమ్మాలి. మనము ఉండగా ఫలితమివ్వని పని లేనప్పుడు ఎలా ఇస్తుంది. 

నారద ఉవాచ
యేనైవారభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్
భుఙ్క్తే హ్యవ్యవధానేన లిఙ్గేన మనసా స్వయమ్

నీవు దేనితో ఇక్కడ కర్మ చేస్తున్నావో దానితోటే నీవు ఫలితాన్ని అనుభవిస్తావు. శరీరము జడము ఆ శరీరముతో చేయించేది మనసు. రెండు శరీరాలలో ఉండే మనసు ఒక్కటే. అందుకే సంస్కారాలు మన్సుకు ఉంటాయి. (అందుకే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినపుడు "ఇతను మనకు పరిచయస్థుడిలా ఉన్నాడే" అనుకుంటాము) 
మనసు ఏర్పరచిన శరీరముతో (స్థూల శరీరము రావడానికి గానీ సూక్ష శరీరం రావడానికీ మనసే కారణం) 

శయానమిమముత్సృజ్య శ్వసన్తం పురుషో యథా
కర్మాత్మన్యాహితం భుఙ్క్తే తాదృశేనేతరేణ వా

మరణించేవాడు "నేను వెళుతున్నాను" అన్నాడంటే ఆ వెళుతున్నవాడు ఆత్మ. పడుకుని ఉన్న శరీరాన్ని పోతాడు గానీ, అందులో ఉన్న మనసుని విడిచిపెట్టడు. మనసుని తీసుకునే వెళతాడు. అందుకే ఏ మనసుతో యజ్ఞ్యం చేసావో ఆ మనసుతోనే ఫలితాన్ని అనుభవిస్తావు. అలాంటి దానితో గానీ మరొకదానితో గానీ అనుభవించేది శరీరముతో కాదు. 

మమైతే మనసా యద్యదసావహమితి బ్రువన్
గృహ్ణీయాత్తత్పుమాన్రాద్ధం కర్మ యేన పునర్భవః

మనసుతోటే నేనూ నాదీ ఇతనూ ఇదీ అని చెబుతాడు. శరీరముతో చేసిన కర్మను మనసు "నాదీ, నేనూ " అంటుంది. మన్సు దేన్ని నాదీ అనుకుంటున్నాడో దానితోనే మళ్ళీ పుడతాడు. శరీరములతో చేసిన అన్ని కర్మల వలన కలిగిన సంస్కారాలు మనసులో ఉంటాయి. 

యథానుమీయతే చిత్తముభయైరిన్ద్రియేహితైః
ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః

అసలు మనసనేది ఒకటి ఉందని ఎందుకనుకోవాలి? మనసు లేదూ ఇంద్రియములే చేయిస్తున్నాయంటే.  ఆ ఇందిర్యాలు అన్ని ప్రాణులకు ఉన్నాయి. మానవులందరికీ ఒకే రకమైన ఇంద్రియాలున్నాయి. మరి అందరూ ఒకే పని ఎందుకు చేయట్లేదు. అన్ని ఇంద్రియాలూ సమానమే కాబట్టి అందరు చేసే పనులూ సమానముగా ఉండాలి. అంటే ఇంద్రియముల వెనక ఎవరో ఉండి పని చేయిస్తున్నారు. కాబట్టే ఒక్కొక్కరూ ఒక్కో రకమైన పని చేస్తున్నారు. ఇంద్రియములచే చేయబడే పనులే మనసు మోహపడుతుంది. కర్మలచేతనే, ఇంద్రియ వృత్తములను బట్టీ మనసును ఊహిస్తాము. మన్సు యొక్క స్వరూపాన్ని చెప్పేది ఉభయేంద్రియములు. ఇపుడు చేసిన పనులబట్టి మనసు ఇలాంటిదీ అని ఊహించవచ్చు. దాని బట్టే ఇంతకు ముందు జన్మలలో చేసిన పనులను కూడా ఊహించవచ్చు. ఇప్పటి పనులు చిత్తాన్ని చెబుతాయి. ఇప్పటి చిత్తం పూర్వ కర్మను చెబుతుంది. మన ప్రవృత్తితో ఇది వరకు జన్మలలో చేసిన కర్మను గుర్తించవచ్చు. 

నానుభూతం క్వ చానేన దేహేనాదృష్టమశ్రుతమ్
కదాచిదుపలభ్యేత యద్రూపం యాదృగాత్మని

నీవెన్నడూ అనుభవించనిదీ చూడనిదీ చేయనిదీ నీ ఆలోచనలోకే రాదు. నీవాలోచించావంటే అలాంటి దానితో సంబంధము ఏదో ఒక జన్మలో ఉండే ఉంటుంది. సంబంధమూ సంస్కారమూ లేకుండా కొత్తగా ఆలోచన రాదు

తేనాస్య తాదృశం రాజ లిఙ్గినో దేహసమ్భవమ్
శ్రద్ధత్స్వాననుభూతోऽర్థో న మనః స్ప్రష్టుమర్హతి

ఏ ప్రవృత్తితో నీవు వ్యవహరించావో దాని సంబంధిన సంస్కారమేర్పడుతుంది. అనుభవం వలన కలిగిన సంస్కారమే ఇంకో శరీరాన్నిస్తుంది. అలాంటి సంస్కారం ఉన్నవాడికి ఆ మనసుకి దేహం కలుగుతుంది. మనసుకున్న సంస్కారముతో దేహ సంబంధమేర్పడుతుంది. ఎలాంటీ కర్మ చేస్తే అలాంటీ సంస్కారము. ఇది వరకెన్నడూ అనుభవించని విషయాన్ని మనసు సంకల్పించలేదు. ఎన్నడూ అనుభవైంచని విషయం కొత్తగా నీ మనసు సృష్టించలేదు

మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి
భవిష్యతశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః

మనిషికి పూర్వరూపాలను చెప్పేది మనసే. నవాంశం అరూఢ చక్రాన్ని కలిపితే పూర్వ జన్మలో మనమేమిటో చెప్పవచ్చు. ఏ గ్రహము మనం పుట్టినపుడూ ఏ స్థానములో  ఉందో, ఆ గ్రహం ఆస్థానములో ముంటే మన మనసు పనిచేస్తుందో , మన మనసులో ఉన్న సంస్కారాన్ని బట్టి ఆ గ్రహాలు అక్కడ చేరుతాయో కలిపితే నవాంశం. 
మన పూర్వ రూపమేమిటో మనసే చెబుతుంది. ఇది వరకు ఎలా పుట్టామో కాదు, ఇక ముందు ఎలా పుట్టబోతామో కూడా చెబుతుంది. 

అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్మనసి దృశ్యతే
యథా తథానుమన్తవ్యం దేశకాలక్రియాశ్రయమ్

ఇదివరకెన్నడూ చూడనిది నీవు అనుభవించలేవు. దేశ కాల క్రియలను బట్టి "ఫలానా పని చేసి ఉంటాడు" అని అనుకోవాలి. 

సర్వే క్రమానురోధేన మనసీన్ద్రియగోచరాః
ఆయాన్తి బహుశో యాన్తి సర్వే సమనసో జనాః

ఆయా క్రమములకనుగుణముగా అన్నీ మనసులోనే ఇంద్రియములతో చూస్తాము. ఇంద్రియములకు కనపడతాయి, ఇంద్రియములతో కనపడతాయి. ఇంద్రియములు ప్రవర్తిస్తున్నయంటే మనసు వెనక ఉండి ప్రేరేపిస్తుంది. మనసున్న వారాందరూ గుంపులు గుంపులుగా వస్తుంటారు, గుంపులు గుంపులుగా పోతుంటారు

సత్త్వైకనిష్ఠే మనసి భగవత్పార్శ్వవర్తిని
తమశ్చన్ద్రమసీవేదముపరజ్యావభాసతే

మనసును పరమాత్మ యందు సత్వగుణముతో లగ్నం చేస్తే ఈ సంస్కారములన్నీ పోతాయి చద్రుని ముందు చీకటి లేనట్లుగా. 

నాహం మమేతి భావోऽయం పురుషే వ్యవధీయతే
యావద్బుద్ధిమనోऽక్షార్థ గుణవ్యూహో హ్యనాదిమాన్

ఎప్పుడైతే పరమాత్మ దగ్గర చిత్తాన్ని చేర్చామో నేనూ నాదీ అన్న భావన తొలగిపోతుంది. పరమాత్మకీ మనకీ మధ్య అడ్డుగా ఉన్నది ఆ రెండే. 
మనసు బుద్ధి ఇంద్రియములూ ఇంద్రియార్థములూ మొదలైన ఇరవై నాలుగు తత్వముల సమూహము అనాది. ప్రకృతి లేకుండా ఉండదు. 

సుప్తిమూర్చ్ఛోపతాపేషు ప్రాణాయనవిఘాతతః
నేహతేऽహమితి జ్ఞానం మృత్యుప్రజ్వారయోరపి

నిద్రపోతున్నా మూర్చపోతున్నా పడిపోతున్నా దెబ్బలు తగిలేది దేహానికే గానీ మనసుకు కాదు. చనిపోయిన వాడు నేను చనిపోయాను అని చెప్పడు. నిదురపోయినవాడు నిద్రపోతున్నంత వరకూ నేను నిదురపోతున్నాను అని చెప్పడు. శరీరానికీ మనసుకూ సంబంధము ఉన్నంతవరకే ఆ శరీరముతో చేఇన పనులు చెప్పగలడు. శరీరము పోయిన తరువాత వచ్చే శరీరములో మనసు చేరితే అంతకు ముందు శరీరముతో చేసిన పనుల సంస్కారము మాత్రం ఉంటుంది గానీ చేసిన పనులు మాత్రం గుర్తు ఉండవు. 

గర్భే బాల్యేऽప్యపౌష్కల్యాదేకాదశవిధం తదా
లిఙ్గం న దృశ్యతే యూనః కుహ్వాం చన్ద్రమసో యథా

గర్భములో బాల్యములో ఉన్నప్పుడు కూడా ఇవే ఇంద్రియాలు ఉన్నాయి.  అదే శరీరం ఉంది. కానీ సంస్కారములో మార్పు ఉంది. ఇంద్రియములు బాగా ఎదగలేదు కాబట్టి బాల్య గర్భావస్థలో ఇంద్రియానుభవం ఉండదు. సంస్కారం ఉన్నా ఆ సంస్కారాన్ని ప్రకటించడానికి కావలసిన పని ఈ శరీరం చేయలేదు. శరీర వృద్ధి పొందినప్పుడే ఆ సంస్కారం వృద్ధి పొందుతుంది. ఆ శరీరం ఆ అవస్థలలో కనపడదు అమావాస్యలో చంద్రుడు కనపడనట్లు. చంద్రుడు అలాగే ఉన్నాడు కానీ అమావాస్య నాడు కనపడడు. ఆయా సంస్కార వృద్ధి వచ్చేవరకు అది కనపడు. 

అర్థే హ్యవిద్యమానేऽపి సంసృతిర్న నివర్తతే
ధ్యాయతో విషయానస్య స్వప్నేऽనర్థాగమో యథా

కనపడదు కాబట్టి ఆ సంస్కారము లేదు అనుకోగలమా? విషయములు లేకున్నా విషయములతో సంబంధం లేదన్నట్లు అనిపించినా సంస్కారం మాత్రం పోదు. లేని వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తాము. పడుకున్నప్పుడు చెడ్డ కలవస్తే లేని ఆపద ఉన్నట్లు అనిపించినట్లుగా లేని సంసారం ఉన్నట్లు అనిపిస్తుంది. 

ఏవం పఞ్చవిధం లిఙ్గం త్రివృత్షోడశ విస్తృతమ్
ఏష చేతనయా యుక్తో జీవ ఇత్యభిధీయతే

జీవుడంటే ఎవరు? వేటితో కలిసి ఉంటాడు. పంచభూతములూ పదకొండు ఇంద్రియములూ మూడు గుణములూ చైతన్యమూ. వీటితో కలిసి ఉంటాడు. వీటిలో కనపడేది శరీరం మాత్రమే. శరీరముతోటే తక్కిన వాటిని ఊహించాలి. శరీరమును బట్టి ఇంద్రియాలను, ఇంద్రియాలను బట్టి సంస్కారాలను, సంస్కారాలను బట్టి పూర్వ కర్మలను ఊహించవచ్చు

అనేన పురుషో దేహానుపాదత్తే విముఞ్చతి
హర్షం శోకం భయం దుఃఖం సుఖం చానేన విన్దతి

దీనితోటే శరీరాలను స్వీకరించి వదిలిపెడతాడు. హర్షమూ శోకమూ భయమూ దుఃఖమూ శరీరముతోనే ఉంటాయి. శరీరానికి అనుభూతి ఉండదు. మనసుకి క్రియా ఉండదు. మనసు అనుభవిస్తుంది. శరీరము చేస్తుంది. 

భక్తిః కృష్ణే దయా జీవేష్వకుణ్ఠజ్ఞానమాత్మని
యది స్యాదాత్మనో భూయాదపవర్గస్తు సంసృతేః

యథా తృణజలూకేయం నాపయాత్యపయాతి చ
న త్యజేన్మ్రియమాణోऽపి ప్రాగ్దేహాభిమతిం జనః

గడ్డి పరకను పట్టుకుని ఎలా పురుగు ఉంటుందో, ఇంకో గడ్డిపరక సిద్ధముగా ఉంటేనే ఆ గడ్డిపరకను వదిలి వెళుతుందో ఈ శరీరం విడిచివెళ్ళేముందు వేరే శరీరం ఉంటేనే వెళతాము, వెళ్ళేప్పుడు సంస్కారాన్ని వెంటబెట్టుకుని వెళతాము. జాతకం పూర్వ జన్మ సంస్కారానికి సూచిక. 

అదృష్టం దృష్టవన్నఙ్క్షేద్భూతం స్వప్నవదన్యథా
భూతం భవద్భవిష్యచ్చ సుప్తం సర్వరహోరహః
యావదన్యం న విన్దేత వ్యవధానేన కర్మణామ్
మన ఏవ మనుష్యేన్ద్ర భూతానాం భవభావనమ్

ఇంకో శరీరాన్ని పొందనంత వరకూ (కర్మదా వ్యవధానం - ఆచరించిన కర్మలు సంస్కారముగా మారేంతవరకూ సమయం పడుతుంది. పన్నెండు రోజులు ఈ భూ వాతావరణ పరిధిలోనే ఉంటాడు. ) ఆ పొందేదాకా మనసులోనే అన్నీ ఉంటాయి. మనసే జన్మకు కారణం. అన్ని సంస్కారాలు మనసులో నిండి ఉంటాయి. 

యదాక్షైశ్చరితాన్ధ్యాయన్కర్మాణ్యాచినుతేऽసకృత్
సతి కర్మణ్యవిద్యాయాం బన్ధః కర్మణ్యనాత్మనః

శరీరాన్ని విడిచిపెట్టినా పెట్టకున్నా ఒక సారి శరీరముతో చేఇన పనుల గురించి జీవుడు చింతిస్తూ ఉంటాడు పశువులు నెమరు వేస్తున్నట్లుగా. ధ్యానము చేయకుండా ఉంటే సంస్కారం పోతుంది. కనీ మన మనసు ధ్యానించకుండా ఉండదు. ధ్యానం వలన సంస్కారం, సంస్కారం వలన జన్మ. జన్మ వలన మళ్ళీ కర్మలు. పనులు ఉంటేనే ధ్యానము. ఈ అవిద్యలో కర్మలు చేసినందు వలన బంధించబడి బంధించబడతాడు. కర్మ - సంస్కారమూ - జన్మ. అవిద్యతో శరీరం బంధించబడుతుంది. 

అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిమ్
పశ్యంస్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయా యతః

ఈ చక్రం నీకు రాకుండా ఉండాలంటే పనులు నేను చేస్తున్నాననే భావన గానీ, పనులు నా కోసం చేస్తున్నా అన్న భావన గానీ విడిచిపెట్టు. అన్ని పనులు శ్రీమన్నారాయణునికి సమర్పించు. చేసిన పనులు తనకోసమే అని ధ్యానం చేస్తే సంస్కారం వచ్చి మళ్ళీ జన్మ వస్తుంది. జనన మరణ చక్రాన్ని దాటాలంటే పరమాత్మకోసమే అన్ని పనులూ చేయి ఎందుకంటే ప్రపంచమంతా పరమాత్మాత్మకం. సృష్టి స్థితి లయములు ఎవరివలన అవుతున్నాయో ఆయనకు అర్పించు నీవు చేసే పనులన్నీ.

మైత్రేయ ఉవాచ
భాగవతముఖ్యో భగవాన్నారదో హంసయోర్గతిమ్
ప్రదర్శ్య హ్యముమామన్త్ర్య సిద్ధలోకం తతోऽగమత్

పరమభాగవతోత్తముడైన నారదుడు జీవాత్మా పరమాత్మ స్వరూప స్వభావాలు చెప్పి ప్రాచీన బర్హితో చెప్పి తన సిద్ధలోకానికి వెళ్ళిపోయాడు

ప్రాచీనబర్హీ రాజర్షిః ప్రజాసర్గాభిరక్షణే
ఆదిశ్య పుత్రానగమత్తపసే కపిలాశ్రమమ్

నారదుడు వెళ్ళిపోయిన తరువాత తన రాజ్యాన్నీ ప్రజలనూ పరిపాలించే పనిని కుమారులకు అప్పగించి తపస్సు చేసుకోవడానికి కపిలాశ్రమానికి వెళ్ళాడు

తత్రైకాగ్రమనా ధీరో గోవిన్దచరణామ్బుజమ్
విముక్తసఙ్గోऽనుభజన్భక్త్యా తత్సామ్యతామగాత్

సావధాన చిత్తుడై శరీరసంగాన్ని విడిచిపెట్టి భక్తితో పరమాత్మ సారూప్య మోక్షాన్ని పొందాడు

ఏతదధ్యాత్మపారోక్ష్యం గీతం దేవర్షిణానఘ
యః శ్రావయేద్యః శృణుయాత్స లిఙ్గేన విముచ్యతే

నారడు ఈ ఉపాఖ్యానం పేరుతో వేదాంతాన్నే పరోక్షముగా చెప్పాడు. ఇది వినిపించినవాడికీ విన్నవాడికీ పునర్జన్మబంధముండదు 

ఏతన్ముకున్దయశసా భువనం పునానం
దేవర్షివర్యముఖనిఃసృతమాత్మశౌచమ్
యః కీర్త్యమానమధిగచ్ఛతి పారమేష్ఠ్యం
నాస్మిన్భవే భ్రమతి ముక్తసమస్తబన్ధః

ఇదంతా మనఃశుద్ధికారకం. ఇలాంటి చరితాన్ని ఎవడు వింటాడో ఎవరు చెబుతారో ఆ ఇద్దరూ పరబ్రహ్మ లోకాన్ని పొందుతారు. మళ్ళీ వారు ఈ సంసారములో సంచరించరు. వారికి అన్ని బంధాలూ తొలగిపోతాయి..

అధ్యాత్మపారోక్ష్యమిదం మయాధిగతమద్భుతమ్
ఏవం స్త్రియాశ్రమః పుంసశ్ఛిన్నోऽముత్ర చ సంశయః

ఈ ప్రకారముగా నేను విన్న ఆధ్యాత్మ పారోక్షం నీకు చెప్పాను. పురుషుడు గృహస్థాశ్రమం స్వీకరించడం వలన కలిగేవన్నీ వివరించాను.

Popular Posts