Followers

Thursday, 22 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం రెండవ అధ్యాయం


               ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం రెండవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
గోవిన్దభుజగుప్తాయాం ద్వారవత్యాం కురూద్వహ
అవాత్సీన్నారదోऽభీక్ష్ణం కృష్ణోపాసనలాలసః

పరమాత్మ రక్షణలో ఉన్న ద్వారకా నగరములోనే నారదుడు ఎక్కువ కాలం ఉన్నాడు

కో ను రాజన్నిన్ద్రియవాన్ముకున్దచరణామ్బుజమ్
న భజేత్సర్వతోమృత్యురుపాస్యమమరోత్తమైః

భగవంతుని చేత ప్రసాదించబడిన ఇంద్రియముల కల ఏ ప్రాణి మాత్రం అన్ని రకముల ఆపదల నివారకమైన, దేవతోత్తముల చే సేవించబడే పరమాత్మ పాద పద్మములను సేవించక ఉంటాడు. జీవుడు అన్ని రకములుగా ఆపదల చేత చుట్టుముట్టబడే వాడు.

తమేకదా తు దేవర్షిం వసుదేవో గృహాగతమ్
అర్చితం సుఖమాసీనమభివాద్యేదమబ్రవీత్

ఒక సారి నారదుడు వసుదేవిని ఇంటికి వెళ్ళగా ఆయనను పూజించి నమస్కరించి ఇలా అడుగుతున్నాడు

శ్రీవసుదేవ ఉవాచ
భగవన్భవతో యాత్రా స్వస్తయే సర్వదేహినామ్
కృపణానాం యథా పిత్రోరుత్తమశ్లోకవర్త్మనామ్

నీ లాంటి మహాత్ముల యాత్ర నీ కోసం కాదు సకల ప్రాణుల కళ్యాణం కోసం.
ఉత్తముల చేత కీర్తించబడే మార్గములో సంచరించే మీ యాత్ర దీనులకూ సర్వ ప్రాణులకూ శుభం కలిగించడానికే

భూతానాం దేవచరితం దుఃఖాయ చ సుఖాయ చ
సుఖాయైవ హి సాధూనాం త్వాదృశామచ్యుతాత్మనామ్

దేవతలకంటే పరమాత్మ యందు మనసు నిలిపే సజ్జనుల చరిత్రే ఉత్తమం. దేవతల చరిత్రలో సుఖమూ దుఃఖమూ ఉంటాయి. వారికి కూడా ఆనందమూ విషాదమూ ఉంటాయి. అవి వింటే మనకు కూడా ఆ రెండే కలుగుతాయి. సాధువుల చరిత మనకు సంతోషాన్ని మాత్రమే కలిగిస్తుంది. దుఃఖాన్నీ బాధౌఉ కలిగించదు. వారు సమదర్శులు.

భజన్తి యే యథా దేవాన్దేవా అపి తథైవ తాన్
ఛాయేవ కర్మసచివాః సాధవో దీనవత్సలాః

మనం దేవతలను ఏ దృష్టితో చూస్తే వారు మనౌ ఆ దృష్టితోనే చూస్తారు. వారిని ఎంత శ్రద్ధతో ఆర్భాటముతో వైభముతో పూజిస్తే, మనకు అంత వైభవం వస్తుంది. అందుకే ధనం విషయములో వంచనను వదిలిపెట్టమని చెబుతారు.
దేవతలు కర్మకు మంత్రులు. వారు మనమాచరించిన కర్మకు మాత్రమే ఫలితమిస్తారు. వారు మనం చేసిన దాన్ని బట్టే ఇస్తారు
సాధువులకు ఏమీ చేయలేనివారంటే ప్రేమ.

బ్రహ్మంస్తథాపి పృచ్ఛామో ధర్మాన్భాగవతాంస్తవ
యాన్శ్రుత్వా శ్రద్ధయా మర్త్యో ముచ్యతే సర్వతో భయాత్

మీ వద్ద నుండి భాగవత చరితను వినాలనుకుంటున్నాను
అది వింటే మానవుడు అన్ని రకముల భయముల నుండీ విముక్తి పొందుతాడు

అహం కిల పురానన్తం ప్రజార్థో భువి ముక్తిదమ్
అపూజయం న మోక్షాయ మోహితో దేవమాయయా

నేను పరమాత్మను తపస్సు  చేసి ఆరాధించాను. కానీ సంతానం కోసం సేవించాను తప్ప మోక్షం అడుగలేదు. పరమాత్మ మాయ చేత మోహించబడ్డాను

యథా విచిత్రవ్యసనాద్భవద్భిర్విశ్వతోభయాత్
ముచ్యేమ హ్యఞ్జసైవాద్ధా తథా నః శాధి సువ్రత

అన్ని రకముల భయములతో నిండి ఉన్న, ఆశ్చర్యం కలిగించే వ్యసన రూపమైన సంసారం నుండి సులభముగా విడివడే మార్గాన్ని మాకు ఉపదేశించండి.
ఇది విచిత్ర వ్యసనం. అందరూ సంసారాన్ని ఏవగించుకుంటూనే అందులో ఉంటారు.
సంసారం నుండి విడుదల పొందే మార్గాన్ని ఉపదేశించండి

శ్రీశుక ఉవాచ
రాజన్నేవం కృతప్రశ్నో వసుదేవేన ధీమతా
ప్రీతస్తమాహ దేవర్షిర్హరేః సంస్మారితో గుణైః

బుద్ధి మంతుడైన వసుదేవుని చేత అడుగబడిన నారదుడు సంతోషించి పరమాత్మ గుణములు గుర్తు  చేయబడినవాడై


శ్రీనారద ఉవాచ
సమ్యగేతద్వ్యవసితం భవతా సాత్వతర్షభ
యత్పృచ్ఛసే భాగవతాన్ధర్మాంస్త్వం విశ్వభావనాన్

నీవు చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. భాగవత ధర్మాలు, ప్రపంచానికే కళ్యాణాన్ని కలిగిస్తాయి.

శ్రుతోऽనుపఠితో ధ్యాత ఆదృతో వానుమోదితః
సద్యః పునాతి సద్ధర్మో దేవవిశ్వద్రుహోऽపి హి

అవి విన్నా చదివినా ఆదరించినా ద్యానించినా ఆదరించినా ఆమోదించినా అవి దేవతలకూ ప్రపంచానికీ ద్రోహం చేసిన వారి పాపాలను కడిగి విముక్తి కలిగిస్తుంది.

త్వయా పరమకల్యాణః పుణ్యశ్రవణకీర్తనః
స్మారితో భగవానద్య దేవో నారాయణో మమ

నీవు భాగవత ధర్మములు అడిగి ఆ ప్రశ్నతో నాకు భగవంతున్ని గుర్తు చేసావు. ఆయన పరమ మంగళ కరుడు, పవిత్రమైన వాటిని మాత్రమే వినే సజ్జనుల చేత కీర్తించబడే స్వామిని గుర్తు చేసావు

అత్రాప్యుదాహరన్తీమమితిహాసం పురాతనమ్
ఆర్షభాణాం చ సంవాదం విదేహస్య మహాత్మనః

నీవు అడిగిన ప్రశ్నకు సంబంధించిన ఇతిహాసం ఒక్టి చెబుతాను.
వృషభుని పుత్రులకూ విదేహ రాజైన జనకరాజుకీ జరిగిన సంవాదం ఇది.

ప్రియవ్రతో నామ సుతో మనోః స్వాయమ్భువస్య యః
తస్యాగ్నీధ్రస్తతో నాభిరృషభస్తత్సుతః స్మృతః

స్వాయంభువ మనువుకి ప్రియవ్రతుడు కుమారుడు, అతనికి ఆగ్నీధ్రుడు, అతనికి నాభి, అతనికి వృషభుడు, ఆ వృషభుడే వాసుదేవుని అంశ.

తమాహుర్వాసుదేవాంశం మోక్షధర్మవివక్షయా
అవతీర్ణం సుతశతం తస్యాసీద్బ్రహ్మపారగమ్

ఆయన లోకానికి మోక్ష ధర్మాన్ని వివరించాడు
అతనికి నూరు మంది కుమారులు. పరబ్రహ్మను చేర్చగలవారు

తేషాం వై భరతో జ్యేష్ఠో నారాయణపరాయణః
విఖ్యాతం వర్షమేతద్యన్ నామ్నా భారతమద్భుతమ్

వారిలో పెద్దవాడు భరతుడు.  శ్రీమన్నారాయణుని ఉత్తమ భక్తుడు. అతనిపేరుతోనే ఈ వర్షానికి భారత వర్షం అని పేరు

స భుక్తభోగాం త్యక్త్వేమాం నిర్గతస్తపసా హరిమ్
ఉపాసీనస్తత్పదవీం లేభే వై జనృనభిస్త్రిభిః

ఇటువంటి భూమితో నాకేమి లాభం. ఎంతో మంది దీన్ని అనుభవించారు. అనుకొని, తపస్సుతో శ్రీమన్నారాయణున్ని చేరాడు

తేషాం నవ నవద్వీప పతయోऽస్య సమన్తతః
కర్మతన్త్రప్రణేతార ఏకాశీతిర్ద్విజాతయః

మూడు జన్మలతో (భరత, లేడి, బ్రాహ్మణ) మోక్షాన్ని పొందాడు
భరతుడు కాకుండా మిగిలినవారు ఊర్ధ్వరేతస్కులై పరమాత్మను మాత్రమే ధ్యానించేవారు. తొమ్మిది మంది నవద్వీపాలకు అధిపతులు. కర్మ తంత్రాన్ని ఉపదేశించినవారు. ఎనభై ఒక్క మంది బ్రాహ్మణత్వాన్ని పొందారు. వీరు కాగా మిగిలిన వారు తొమ్మిది మంది మహర్షులయ్యారు

నవాభవన్మహాభాగా మునయో హ్యర్థశంసినః
శ్రమణా వాతరసనా ఆత్మవిద్యావిశారదాః

అర్థమును గురించీ పరమార్థమును గురించి బోధించేవారు, సన్యాసులు, దిగంబరులు , పరమాత్మ తత్వాన్ని వివరించడములో నిపుణులు.

కవిర్హవిరన్తరీక్షః ప్రబుద్ధః పిప్పలాయనః
ఆవిర్హోత్రోऽథ ద్రుమిలశ్చమసః కరభాజనః



త ఏతే భగవద్రూపం విశ్వం సదసదాత్మకమ్
ఆత్మనోऽవ్యతిరేకేణ పశ్యన్తో వ్యచరన్మహీమ్

ఈ తొమ్మిది మందీ సత్ అసత్ గా ఉన్న ప్రపంచం మొత్తం పరమాత్మ రూపముగానే భావించేవారు. తమ కంటే భిన్నముగా కాకుండా ప్రపంచములో పరమాత్మ అంతర్యామిగా ఉంటాడని, మొత్తం ప్రపంచాన్ని పరమాత్మగా భావిస్తూ సంచరిస్తూ ఉన్నారు

అవ్యాహతేష్టగతయః సురసిద్ధసాధ్య
గన్ధర్వయక్షనరకిన్నరనాగలోకాన్
ముక్తాశ్చరన్తి మునిచారణభూతనాథ
విద్యాధరద్విజగవాం భువనాని కామమ్

వీరు తామనుకున్న చోటికి అడ్డులేకుండా వెళ్ళగలరు. అన్ని లోకములనూ, ముక్తులై, సంసార బంధనం నుండి విడివడి సంచరిస్తూ ఉన్నారు, తాము అనుకున్న రీతిలో

త ఏకదా నిమేః సత్రముపజగ్ముర్యదృచ్ఛయా
వితాయమానమృషిభిరజనాభే మహాత్మనః

భగవత్ సంకల్పముతో విదేహ రాజైన నిమి ఆచరించే సత్రానికి వెళ్ళారు అజనాభ వర్షములో

తాన్దృష్ట్వా సూర్యసఙ్కాశాన్మహాభాగవతాన్నృప
యజమానోऽగ్నయో విప్రాః సర్వ ఏవోపతస్థిరే

పరమ భాగవతోత్తములు, సూర్య ప్రకాశముతో ఉన్నవారిని చూచి యజ్ఞ్యం చేసే వారూ చేయించే వారూ, యజ్ఞ్యములో ఆరాధించబడే అగ్నిహోత్రముతో సహా అందరూ లేచారు

విదేహస్తానభిప్రేత్య నారాయణపరాయణాన్
ప్రీతః సమ్పూజయాం చక్రే ఆసనస్థాన్యథార్హతః

నారాయణుని యందు మనసు ఉంచిన వారిని చూచి సంతోషించి వారిని అర్ఘ్య పాద్య ఆచమనాలతో ఆదరించారు

తాన్రోచమానాన్స్వరుచా బ్రహ్మపుత్రోపమాన్నవ
పప్రచ్ఛ పరమప్రీతః ప్రశ్రయావనతో నృపః

తన కాంతితో బ్రహ్మ పుత్రులతో సాటి వచ్చే వారిని రాజు, పరమానందాన్ని పొంది, ఇలా అడిగాడు

శ్రీవిదేహ ఉవాచ
మన్యే భగవతః సాక్షాత్పార్షదాన్వో మధుద్విసః
విష్ణోర్భూతాని లోకానాం పావనాయ చరన్తి హి

మీరు పరమాత్మకు సాక్షాత్ ఆంతరంగికులైన సేవకులుగా భావిస్తున్నాము
సకల లోకములను పవిత్రం చేయడానికి పరమాత్మ దాసులు సంచరిస్తూ ఉంటారు.

దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభఙ్గురః
తత్రాపి దుర్లభం మన్యే వైకుణ్ఠప్రియదర్శనమ్

లోకములో ఎంత కష్టపడ్డా దొరకనివి మూడు. మనుష్యత్వం ముముఖత్వం మహా పురుష సంశ్రయం.
జీవులకు ఈ శరీరం క్షణ బంగురం. అటువంటి దేహం దొరకడమే కష్టం. అందులో మనుష్య దేహం లభించుట మహా దుర్లభం. అలాంటి మానవ శరీరం లభించినా పరమాత్మ యందు ప్రీతి ఉన్న భక్తులను చూడగలుగుట మరీ దుర్లభం.

అత ఆత్యన్తికం క్షేమం పృచ్ఛామో భవతోऽనఘాః
సంసారేऽస్మిన్క్షణార్ధోऽపి సత్సఙ్గః శేవధిర్నృణామ్

భగవంతునికి ఇష్టులైన భక్తులను సేవించగలిగినపుడు , వారి అజ్ఞ్యానం తొలగి సంసారం నుండి విముక్తి కలిగించే మార్గాన్ని బోధించమని అడగాలి. దేని వలన క్షేమం మాత్రమే కలుగుతుందో దాని గురించే అడుతున్నాము. ఈ ప్రపంచములో అరక్షణం మంచి వారితో కలసి ఉన్నా సంసారములో ఉన్న మానవులకు అది సంతోషం కలిగిస్తుంది. భగవత్ భక్తుల విషయములో పనికిరాదు అనేది ఉండదు. ఉత్తములతో అరక్షణం స్నేహం చేసినా అది హితమే కలిగిస్తుంది

ధర్మాన్భాగవతాన్బ్రూత యది నః శ్రుతయే క్షమమ్
యైః ప్రసన్నః ప్రపన్నాయ దాస్యత్యాత్మానమప్యజః

మేము వినుటకు యోగ్యులమైతే మాకు భాగవత ధర్మాలను బోధించండి. వాటిని వింటే ప్రసన్నుడైన స్వామి తననే ఇచ్చుకుంటాడు

శ్రీనారద ఉవాచ
ఏవం తే నిమినా పృష్టా వసుదేవ మహత్తమాః
ప్రతిపూజ్యాబ్రువన్ప్రీత్యా ససదస్యర్త్విజం నృపమ్

ఇలా అడిగిన జనకుడిని అభినందించి అందరితో ఇలా మాట్లాడుతున్నారు
భగవత్ తత్వాన్నీ భగవంతున్ని తాము ఎలా అనుభవించారో ఎలా అర్థం చేసుకున్నరో చెప్పడానికి ఉపక్రమించారు

శ్రీకవిరువాచ
మన్యేऽకుతశ్చిద్భయమచ్యుతస్య పాదామ్బుజోపాసనమత్ర నిత్యమ్
ఉద్విగ్నబుద్ధేరసదాత్మభావాద్విశ్వాత్మనా యత్ర నివర్తతే భీః

సర్వ దేశ సర్వ కాల సర్వావస్థలలో పరమాత్మ పాద సేవనమే ఉత్తమం అని నేను భావిస్తున్నాను.
మానవులు నిరంతరం కలత చెందిన బుద్ధి కలిగి ఉంటారు. ప్రతీ ఆనందం ముందూ వెనకా మధ్యా ఉద్వేగం ఉంటుంది. ఆనందం అనుభవిస్తూ కూడా తానననుభవించే ఆనందం ఎంత సేపు ఉంటుందో అన్న భయముతో కలత చెందుతూ ఉంటాడు. శరీరాన్ని ఆత్మగా భావిస్తారు. శరీరం ఎంత అశాశ్వతమో శరీరం వలన వచ్చే ఆనందమూ అంతే. అలాంటి వాడికి సమగ్రముగా భయం తొలగే ఒకే ఒక చర్య పరమాత్మ  పాద సేవనం మాత్రమే.

యే వై భగవతా ప్రోక్తా ఉపాయా హ్యాత్మలబ్ధయే
అఞ్జః పుంసామవిదుషాం విద్ధి భాగవతాన్హి తాన్

పరమాత్మ జ్ఞ్యానానికీ ఆత్మ జ్ఞ్యానానికీ ఉపాయం చెప్పే వారు భాగవతోత్తములు.

యానాస్థాయ నరో రాజన్న ప్రమాద్యేత కర్హిచిత్
ధావన్నిమీల్య వా నేత్రే న స్ఖలేన్న పతేదిహ

భాగవత ధర్మాన్ని ఆచ్రించేవాడు పొరబాటున కూడా పొరబాటు చేయరాదు. వారు పొరబాటే చేయరు.ఏ రకముగానూ  పొరబడడు. కళ్ళు మూసుకుని పరుగెత్తినా జారడూ, కిందబడడు.విషయభోగములకు దాసుడు కాడు, విషయభోగాల యందు ఆస్కతులైన వారితో స్నేహం చేయడు

కాయేన వాచా మనసేన్ద్రియైర్వా బుద్ధ్యాత్మనా వానుసృతస్వభావాత్
కరోతి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేత్తత్

శరీరమూ వాక్కు మనసూ ఇంద్రియం బుద్ధీ ఆత్మతో గానీ సహజమైన స్వభావాన్ని అనుసరించడముతో కానీ,అన్ని రకములుగా ప్రతీ పనిని పరమాత్మకు మాత్రమే అర్పించేవాడు భాగవతోత్తముడు.

భయం ద్వితీయాభినివేశతః స్యాదీశాదపేతస్య విపర్యయోऽస్మృతిః
తన్మాయయాతో బుధ ఆభజేత్తం భక్త్యైకయేశం గురుదేవతాత్మా

భేధ బుద్ధి వలననే భయం సంభవిస్తుంది.ఆత్మ కన్నా భిన్నమైన వస్తువు ఒకటి ఉంది అనుకున్నవారికి భయం. ఆత్మ ఆత్మకు గానీ శరీరం ఆత్మకు కానీ ఆత్మ శరీరానికి గానీ భయం కలిగించదు.రెండవది ఉన్నది అనుకున్నవారికి భయం.
పరమాత్మ కన్నా భిన్నమైనది ఇంకొకటి ఉన్నదే తప్పు
పరమాత్మ సంకల్పముతోనే పండితుడు పరమాత్మను సేవిస్తాడు. పండితుడు కాని వాడు సంసారములో పడతాడు. భగవంతున్నే గురువుగా దేవతగా ఆయన మాయతోనే భజిస్తాడు. ఆయన మాయతోనే ఆయనను మరచిపోతారు

అవిద్యమానోऽప్యవభాతి హి ద్వయో ధ్యాతుర్ధియా స్వప్నమనోరథౌ యథా
తత్కర్మసఙ్కల్పవికల్పకం మనో బుధో నిరున్ధ్యాదభయం తతః స్యాత్

రెండవది ఉన్నట్లు కనపడడం కలలో కనపడే వస్తువుల లాగ. ఇలా లేనిదాన్ని ఉన్నట్లు ధ్యానించేది మనసు. బుద్ధి మంతుడైనవాడు మనసును నిగ్రహించుకుంటే ఉన్నదే కనపడుతుంది.
మనసు సంకల్ప వికల్పాత్మకం.
మనసు నిగ్రహించుకున్నవారికే అభయం

శృణ్వన్సుభద్రాణి రథాఙ్గపాణేర్జన్మాని కర్మాణి చ యాని లోకే
గీతాని నామాని తదర్థకాని గాయన్విలజ్జో విచరేదసఙ్గః

సిగ్గును వదలిపెట్టి పరమాత్మ నామాలనూ గుణాలనూ గీతాలనూ కథలను కర్మలనూ కీర్తిస్తూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన పుట్టుకా ఆయన కర్మలు జీవుల దుఃఖ నివృత్తికే. పరమ మంగళ ప్రదమైన పరమాత్మ కర్మలూ జన్మలూ, గానం చేయాలి. పరమాత్మ జన్మ కర్మలను వివరించే పాటలు.వాటిన్ సిగ్గు విడిచి, సంసారం యందు ఆసక్తి లేకుండా గానం చేయాలి

ఏవంవ్రతః స్వప్రియనామకీర్త్యా జాతానురాగో ద్రుతచిత్త ఉచ్చైః
హసత్యథో రోదితి రౌతి గాయత్యున్మాదవన్నృత్యతి లోకబాహ్యః

ఇలాంటి వ్రతం కలవాడై, పరమాత్మ యందు ప్రేమ పుట్టినవాడై, మనసు గలవాడై, పెద్దగా నవ్వుతాడు పారవ్శ్యముతో ఏడుస్తాడు, అరుస్తాడు పాడతాడు పిచ్చివాడిలా నృత్యం చేస్తాడు.
లౌక్యం తెలియని వాడై లోకబాహ్యుడిగా ఉండాలి

ఖం వాయుమగ్నిం సలిలం మహీం చ జ్యోతీంషి సత్త్వాని దిశో ద్రుమాదీన్
సరిత్సముద్రాంశ్చ హరేః శరీరం యత్కిం చ భూతం ప్రణమేదనన్యః

భూమీ వాయువూ అగ్నీ జలం వాయువూ ఆకాశం ప్రాణులూ దిక్కులూ చెట్లూ గుట్టలూ పర్వతములూ నదులూ అన్నీ పరమాత్మ శరీరాలే
దేన్ని చూస్తున్నామో తలుస్తున్నామో ఉంటున్నామో అదంతా పరమాత్మే
ఏ ప్రాణిని చూచినా భగవత్స్వరూపమే అని అనన్య బుద్ధితో శిరస్సు వంచి నమస్కరించాలి

భక్తిః పరేశానుభవో విరక్తిరన్యత్ర చైష త్రిక ఏకకాలః
ప్రపద్యమానస్య యథాశ్నతః స్యుస్తుష్టిః పుష్టిః క్షుదపాయోऽనుఘాసమ్

భక్తీ, అన్నిటి యందూ పరమాత్మ అనుభవం, వైరాగ్యం, ఈ మూడూ ఒకే సమయములో కలగాలి.
మనం కోరిన దాన్ని తింటున్నప్పుడు సంతోషం కలుగుతుంది, ఆ రసం శరీరములో ప్రవేశించి పుష్టి కలుగుతుంది, ఆకలి కూడా తొలగుతుంది. ఈ మూడూ ఎలా ఒకేసారి కలుగుతాయో, భక్తీ పరేశానుభవం విరక్తీ ఒకే సారి కలగాలి.

ఇత్యచ్యుతాఙ్ఘ్రిం భజతోऽనువృత్త్యా భక్తిర్విరక్తిర్భగవత్ప్రబోధః
భవన్తి వై భాగవతస్య రాజంస్తతః పరాం శాన్తిముపైతి సాక్షాత్

ఈ రీతిలో పరమాత్మ పాద పద్మాలను అనుసరించి సేవించేవారికి భక్తీ, విరక్తీ పరమాత్మ స్వరూప జ్ఞ్యానమూ కలుగుతాయి.
ఆ మూడూ కలిగిన తరువాత జీవుడు శాంతిస్తాడు. ఆ ఉత్తమమైన శాంతి కలుగుతుంది

శ్రీరాజోవాచ
అథ భాగవతం బ్రూత యద్ధర్మో యాదృశో నృణామ్
యథాచరతి యద్బ్రూతే యైర్లిఙ్గైర్భగవత్ప్రియః

భాగవతోత్తముడంటే ఎవరు.వారు ఏ ధర్మాలను ఆచరిస్తాడు, ఎలా ఉంటాడు. దేన్ని చెబుతాడు. ఏ గుర్తులతో కనపడతాడు

శ్రీహవిరువాచ
సర్వభూతేషు యః పశ్యేద్భగవద్భావమాత్మనః
భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః

ఇతరులుగా ఉండే అన్ని ప్రాణులయందూ పరమాత్మ భావాన్ని చూపాలి. అలాంటి వాడిని భాగవతోత్తముడు అంటారు.

ఈస్వరే తదధీనేషు బాలిశేషు ద్విషత్సు చ
ప్రేమమైత్రీకృపోపేక్షా యః కరోతి స మధ్యమః

భగవంతుని భక్తులలో కూడా తారతమ్యం ఉంది. అన్ని ప్రాణులలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మలో అన్ని ప్రాణులూ ఉన్నాయి అని భావించేవాడూ భాగవతోత్తముడు.
భగవంతుని  యందూ భగవంతుని భక్తుల యందూ, జ్ఞ్యానం లేని వారి యందూ, శత్రువుల యందూ వేరు వేరు భావం కలిగి ఉండేవాడు మధ్యముడు.
భగవంతుని యందు ప్రేమ భగవద్ భక్తుల యందు మైత్రీ అజ్ఞ్యానుల యందు కృప శత్రువుల యందు ఉపేక్ష ఉన్న వాడు మధ్యముడు. ఇలా వేరుగా భావిస్తున్నాడు కానీ తాను ఎవరినీ ద్వేషించడు. శత్రువుల  యందు ఉపేక్ష అజ్ఞ్యానుల యందు దయ, భగవద్ భక్తుల యందు మైత్రీ భగవంతుని యందు ప్రేమ చూపుతాడు.

అర్చాయామేవ హరయే పూజాం యః శ్రద్ధయేహతే
న తద్భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకృతః స్మృతః

భగవంతుని విగ్రహం యందు మాత్రమే భగవంతుని బుద్ధి ఉన్నవాడు ప్రాకృత భక్తుడు.విగ్రహములోనే భగవంతుడు ఉన్నాడు అనుకునే వాడు ప్రాకృత భక్తుడు.

గృహీత్వాపీన్ద్రియైరర్థాన్యో న ద్వేష్టి న హృష్యతి
విష్ణోర్మాయామిదం పశ్యన్స వై భాగవతోత్తమః

ఇంద్రియముల చేత విషయములను గ్రహిస్తూ కూడా ఇష్టమైనది లభిస్తే సంతోషించడు, ఇష్టం కానిది లభిస్తే దుఃఖించడు. భగవంతుడు ప్రసాదించిన ఇంద్రియములతో భగవంతుడు సృష్టించిన విషయములను భగవత్ సంకల్పానుసారముగానే జరుగుతుంది అని తెలుసుకునే వాడు  భాగవతోత్తముడు

దేహేన్ద్రియప్రాణమనోధియాం యో జన్మాప్యయక్షుద్భయతర్షకృచ్ఛ్రైః
సంసారధర్మైరవిముహ్యమానః స్మృత్యా హరేర్భాగవతప్రధానః

దేహములూ ఇంద్రియమూ ప్రాణమూ మనసూ బుద్ధీ, ఈ ఐదింటికీ పుట్టడం, తృప్తి, ఆకలి, భయం (కోరిక), ఆశ అనే కష్టములు సంసారం. ఈ సంసార ధర్మం వలన మోహించబడుతూ కూడా భగవంతుని మరచిపోనివాడు భాగవతోత్తముడు. భగవత్స్మరణను మరువని వాడు భాగవత ప్రధానుడు.

న కామకర్మబీజానాం యస్య చేతసి సమ్భవః
వాసుదేవైకనిలయః స వై భాగవతోత్తమః

కోరికలకూ కర్మలకూ బీజములు ఎవరి మనసులో పుట్టవో, ఒక్క పరమాత్మ యందు మాత్రమే ఉండేవాడు భాగవతోత్తముడంటారు.

న యస్య జన్మకర్మభ్యాం న వర్ణాశ్రమజాతిభిః
సజ్జతేऽస్మిన్నహంభావో దేహే వై స హరేః ప్రియః

పుట్టుకతో పనితో వర్ణమూ జాతి, వీటితో అహంకారం కలగని వాడు. అలాంటి వాడు పరమాత్మకు ప్రియుడు.


న యస్య స్వః పర ఇతి విత్తేష్వాత్మని వా భిదా
సర్వభూతసమః శాన్తః స వై భాగవతోత్తమః

నావాడు, ఇతరుడు, ఇది నాది, ఇది ఇంకొకరిది, అనే భేధం శరీరములో  వస్తువులో విత్తాదులలో స్వపర భేధం ఎవరికి కలుగదో, సకల భూతముల యందు సమభావన కలిగిన వాడు భాగవతోత్తముడు

త్రిభువనవిభవహేతవేऽప్యకుణ్ఠ
స్మృతిరజితాత్మసురాదిభిర్విమృగ్యాత్
న చలతి భగవత్పదారవిన్దాల్
లవనిమిషార్ధమపి యః స వైష్ణవాగ్ర్యః

త్రైలోక్య సామ్రాజ్య లభించినా,దేవతలతో గొప్పవారితో పొగడబడే ,  పరమాత్మ యందు మరుపు ఒక్క క్షణం కూడా కలగని వాడు
క్షణములో మూడు వందల ముప్పై రెండవ భాగం లవం. అందులో సగభాగము కూడా పరమాత్మన్ మరువని వాడు భాగవతోత్తముడు

భగవత ఉరువిక్రమాఙ్ఘ్రిశాఖా నఖమణిచన్ద్రికయా నిరస్తతాపే
హృది కథముపసీదతాం పునః స ప్రభవతి చన్ద్ర ఇవోదితేऽర్కతాపః

పరమాత్మ త్రివిక్రమ పాద పద్మముల నఖముల వెన్నెలతో అన్ని పాపాలూ తొలగించబడి, ఒక్కసారి భగవత్ పాద పద్మముల యందు భక్తి కలిగి, స్మరిస్తే, ఆయన పాద నఖ వెలుతురుతో తొలగిన ఆపదలు మళ్ళీ వస్తాయా
చంద్రుడు ఉదయిస్తే ఎండ ఉంటుందా?భగవత్ కృప కలిగితే సంసార తాపం ఎక్కడిది ?

విసృజతి హృదయం న యస్య సాక్షాద్ధరిరవశాభిహితోऽప్యఘౌఘనాశః
ప్రణయరసనయా ధృతాఙ్ఘ్రిపద్మః స భవతి భాగవతప్రధాన ఉక్తః

మనం మన వశములో లేకున్నా, వశములో లేకుండా పరమాత్మ నామాన్ని అనుకున్నా ధ్యానించినా పాప సమూహం నశిస్తుంది. ప్రేమ పాశముతో గట్టిగా పరమాత్మ పాదాలను పట్టుకున్నవాడు భాగవతోత్తముడు. ఎలా ప్రవర్తించిన వాడిని భాగవతోత్తముడని అనాలో వివరించిన అధ్యాయం ఇది

                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts