Followers

Thursday, 22 May 2014

శ్రీమధాగవతం ఏకాదశ స్కంధం పదవ అధ్యాయం

            ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమధాగవతం ఏకాదశ స్కంధం పదవ అధ్యాయం

అవధూత తాను పొందిన జ్ఞ్యానానికి ఇరవై నాలుగు మంది గురువులు కలరు అని బోధించాడు. ప్రపంచములో సంచరించే ప్రాణులు మనకు ఎంతటి ఆధ్యాత్మికమైన తత్వాన్ని ఉపదేశిస్తాయో తెలుసుకోవడానికి అవధూతోపాఖ్యానం ఉపకరిస్తుంది. వాటి ప్రవృత్తి మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో వివరిస్తాడు. అది విన్న యదుమహారాజు అందరి యందూ సమ భావం కలిగి, విన్న దాన్ని ఆచరణలో పెట్టి తరించాడు.

శ్రీభగవానువాచ
మయోదితేష్వవహితః స్వధర్మేషు మదాశ్రయః
వర్ణాశ్రమకులాచారమకామాత్మా సమాచరేత్

నేను ఎవరెవరికి వేటిని ధర్మములుగా బోధించానో వాటిని సావధానముగా విని ఆచరించాలి. అది కూడా కర్తృత్వాభిమానాన్ని వదలిపెట్టి, నేను పెట్టిన ధర్మాలను నన్ను ఆశ్రయించి వర్ణ ఆశ్ర కుల ఆచారన్ని పాటించాలి. నేను చెప్పిన వర్ణ ఆశ్ర కుల ఆచారన్ని సంగం లేకుండా ఆచరించాలి. నన్ను ఆశ్రయించి, కోరికలు లేకుండా ధర్మాలను ఆచరించాలి. ఒక ఫలితాన్ని ఆశించి ఆచరించకూడదు. ధర్మం కాబట్టి ఆచరించాలి.

అన్వీక్షేత విశుద్ధాత్మా దేహినాం విషయాత్మనామ్
గుణేషు తత్త్వధ్యానేన సర్వారమ్భవిపర్యయమ్

కోరికలను ఎందుకు విడిచిపెట్టాలి? కోరికలతో పని చేయడం మొదలుపెడితే అనుకున్న పనులన్నీ త్రలక్రిందులవుతాయి. సుఖం కలగాలని ప్రయత్నిస్తే దుఃఖం కలుగుతుంది. కలుగుతున్న దుఃఖాన్ని సుఖమనుకుని భ్రమిస్తూ ఉంటాము. విషయముల యందు మనసు ఉన్న జీవులు సత్వ రజస్తమోగుణముల యందే సత్వ బుద్ధితో అన్ని ప్రయత్నములూ విపరీత ఫలితములు ఇచ్చుటను పరిశీలించాలి.

సుప్తస్య విషయాలోకో ధ్యాయతో వా మనోరథః
నానాత్మకత్వాద్విఫలస్తథా భేదాత్మధీర్గుణైః

నిదురపోతున్నా విషయాలను మరచిపోవుటలేదు కదా. నిద్రపోతున్నా మనకు కలలు వస్తూ ఉన్నాయి. మనకు వచ్చే కలలు మన కోరికలే. మనం ఒకే విషయాన్ని ధ్యానిస్తే దాని మీద కోరిక పుడుతుంది. మనం పడుకొని ఉండి కూడా విషయములనే చూస్తుంటాము. దేన్ని ధ్యానం చేస్తే అదే కోరికగా మారి, ఏ కోరికైతే ఉందో అదే కలగా వస్తుంది. ఫలానా విషయాలనే అనుభవించాలనుకుంటున్నాను అన్న నియమాన్ని పెట్టగలమా? ఒక రసాన్నే ఒక రూపానే కోరతాము అన్న నియమం లేదు. విషయ్ములూ మనోరథములూ నానాత్మకములే. ఇవి పలురకములు కాబాట్టి కోరికలు గానీ ధ్యానం కానీ విషయ దృష్టి కానీ విఫలం అవుతుంది. ఒక దాని కన్నా వేరొకటి బాగున్నది అనడానికి కారణం ఏమిటి? వస్తువులో మార్పు లేదు. మనం దానిలో భేధాన్ని కల్పించుకున్నందు వలన భేదం కనపడుతుంది

నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్త్యజేత్
జిజ్ఞాసాయాం సమ్ప్రవృత్తో నాద్రియేత్కర్మచోదనామ్

ఎలాంటి కర్మ ఆచరించాలి? నివృత్తమైన కర్మను ఆచరించాలి. ఫల సంగమును వదలి పని చేయాలి.ఒక వేళ ఫలం కావాలి అంటే ప్రవృత్తి కర్మలను నా యందు మనసు ఉంచి ఆచరించు. నా కైంకర్యముగా సకల కర్మలనూ ఆచరించు. వాస్తవమేదో తెలుసుకోవడానికి ప్రవర్తించాలి. ఇది వాస్తవమా? ఇది మనకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందా అని ఆలోచించి వేదం విధించిన కర్మ యందు ఆసక్తి ఉంచకు

యమానభీక్ష్ణం సేవేత నియమాన్మత్పరః క్వచిత్
మదభిజ్ఞం గురుం శాన్తముపాసీత మదాత్మకమ్

యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారా ధారణ సమాధి అనే అష్టాంగములు ఉన్నాయి.
యమములను తప్పక ఆచరించాలి. నియమాచరణ మాత్రం నా యందు మనసు లగ్నం చేసి ఆచరించాలి. నన్ను తెలిపే గురువును, శాంతుడైన గురువును, గుణ త్ర్యములు స్పృశించని గురువునూ, నా రూపముగానే ఆరాధించాలి. నన్ను బోధించే గురువును నా రూపముగానే ఆరాధించాలి

అమాన్యమత్సరో దక్షో నిర్మమో దృఢసౌహృదః
అసత్వరోऽర్థజిజ్ఞాసురనసూయురమోఘవాక్

అభిమానం మాత్సర్యం లేని వాడు, సమర్ధుడు, మమకారం లేని వాడు, నా యందు ప్రీతి కలవాడు, విషయం తెలుసుకోవడములో తొందర పడని వాడు. విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక గలవాడు. దోషములను ఆలోచించని వాడు. (ఎదుటివారి గుణములలో దోషాన్ని ఆరోపించుట అసూయ). సత్యమైన వాక్కు గలవాడు.

జాయాపత్యగృహక్షేత్ర స్వజనద్రవిణాదిషు
ఉదాసీనః సమం పశ్యన్సర్వేష్వర్థమివాత్మనః

భార్యా సంతానమూ ఇల్లూ పొలమూ తనవారూ ధనము యందూ ఉదాసీన భావం కలిగి ఉండాలి. అన్నిటి యందూ సమభావనతో చూడాలి.

విలక్షణః స్థూలసూక్ష్మాద్దేహాదాత్మేక్షితా స్వదృక్
యథాగ్నిర్దారుణో దాహ్యాద్దాహకోऽన్యః ప్రకాశకః

తాను విలక్షణుడు కావాలి. స్థూల దేహం కంటే సూక్ష్మ దేహం కంటే ఆత్మ వేరు. రెంటి కంటే విలక్షణమైన ఆత్మను చూడగలిగిన వాడు. తనలో తాను చూడగలిగే వాడు కావాలి.
ఎలా దేహం కంటే ఆత్మ వేరు? నిప్పు పెట్టినపుడు  మంట కట్టె కన్నా వేరుగా ఉంటుంది. కాల్చేది వేరు కాల్చబడేది వేరు. వెలుతురు అనేది కాల్చబడే దానితో వస్తుందా కాలే దానితోనా? కట్టె వలన వెలుగు రాదు. కట్టెకు ఉన్న మంట వలన వెలుగు వస్తోంది. అలా అని కట్టే వెలుగు ఇస్తోంది అని చెప్పవచ్చా? కట్టే వెలుగు ఇస్తే మంట లేకున్నా వెలుగు ఇవ్వాలి. కట్టెను ఆశ్రయించి ఉన్న అగ్ని, ఆ కట్టెకన్నా విడిగా ఉండి మనకు కావలసిన వెలుగును ఇస్తోంది. అలాగే శరీరాని ఆశ్రయించి ఉన్న ఆత్మ శరీరం కంటే వేరు. ఈ ఆత్మే తనను తాను చూడగలదు గానీ శరీరం చూడలేదు. కట్టె వెలుగు ఇవ్వలేనట్లు శరీరం జ్ఞ్యానం గలది కాదు. శరీరములో ఉన్న ఆత్మే జ్ఞ్యానాధికరణం. ఆత్మ శరీరములో ఉంది కాబట్టి శరీరమే ఆత్మ అనడం సరి కాదు.

నిరోధోత్పత్త్యణుబృహన్ నానాత్వం తత్కృతాన్గుణాన్
అన్తః ప్రవిష్ట ఆధత్త ఏవం దేహగుణాన్పరః

మంట పెడితే ఒక సారి మంట చల్లారిపోతూ, ఆగిపోతూ, పెద్దగా అవుతూ, చిన్నగా అవుతూ ఉంటుంది. ఇవన్నీ అగ్ని గుణాలుకాదు, కట్టెగుణాలు. కట్టె బట్టి మంట ఆకారం ఉంటుంది. కట్టెలు చాలా ఉంటే చాలా మంటలు ఉన్నట్లు ఉంటాయి.అలాగే మనం కూడా పొట్టీ పొడుగూ లావూ సన్నమూ స్త్రీ పురుషుడు అనే భేధాలన్నీ శరీర భేదాలు గానీ ఆత్మ భేదాలు కావు.
ఆత్మ లోపల ప్రవేశించి మనకు వాటిని చూపిస్తుంది. దేహగుణాలనే ఆత్మ తనకు ఉన్నవిగా భావిస్తుంది

యోऽసౌ గుణైర్విరచితో దేహోऽయం పురుషస్య హి
సంసారస్తన్నిబన్ధోऽయం పుంసో విద్యా చ్ఛిదాత్మనః

పురుషుడి యొక్క గుణములతో కల ఈ దేహం, సంసారం అనేది దేహమ వలన ఏర్పడినదే కానీ ఆత్మ వలన ఏర్పడినది కాదు. అసలైన ఆత్మ జ్ఞ్యానస్వరూపము. జ్ఞ్యానాధికరణం. సంసారం శరీరం వలన.

తస్మాజ్జిజ్ఞాసయాత్మానమాత్మస్థం కేవలం పరమ్
సఙ్గమ్య నిరసేదేతద్వస్తుబుద్ధిం యథాక్రమమ్

కాబట్టి జింజ్యాసతో తెలియాలనే కోరికతో, శరీరములో ఆత్మ ఉన్నదనీ శరీరం ఆత్మ కాదు అని తెలుసుకుని శరీరాన్ని శరీర గుణాలనీ త్యజించాలి
ఇది వస్తు బుద్ధి. ఇలా స్పష్టముగా తెలుసుకుని

ఆచార్యోऽరణిరాద్యః స్యాదన్తేవాస్యుత్తరారణిః
తత్సన్ధానం ప్రవచనం విద్యాసన్ధిః సుఖావహః

ఇంతటి దృఢమైన జ్ఞ్యానం ఆచార్యుల వలన కలుగుతుంది. కింద ఉన్న అరణి ఆచార్యుడు. పైన ఉన్నది శిష్యుడు. పైన ఉన్న అరణితో కింద ఉన్న అరణిని మర్దనా చేయాలి. గురువుగారి వద్ద ఉన్న జ్ఞ్యానాన్ని శిష్యుడు మర్దనా చేసి తెలుసుకోవాలి. అపుడు జ్ఞ్యానాగ్ని పుడుతుంది. ఈ అగ్ని పుట్టాలంటే శిష్యుడిలో కూడా జ్ఞ్యాన పుట్టాలంటే గురువుగారు ప్రవచనం చేయాలి. గురువు గారు శిష్యునికి విద్య బోధించాలి. అలా చేయాలంటే శిష్యుడు గురువు గారి మనసులో దయను కలిగించి చెప్పకుండా ఉండలేని స్థితిని కలిగించాలి

వైశారదీ సాతివిశుద్ధబుద్ధిర్ధునోతి మాయాం గుణసమ్ప్రసూతామ్
గునాంశ్చ సన్దహ్య యదాత్మమేతత్స్వయం చ శాంయత్యసమిద్యథాగ్నిః

ఇలా గురువుగారి వలన లభిచిన ఈ జ్ఞ్యానం అతి విశుద్ధమైన బుద్ధి. ఏ దోషమూ లేనిది. సత్వ రజస్తమో గుణములచే ఏర్పడిన మాయను ఇది తొలగిస్తుంది. గుణములను దహింపచేస్తుంది. ఈ జ్ఞ్యానం ప్రకృతి గుణాలను దహింపచేసి, సమిధలైపోయిన తరువాత అగ్ని తనకు తానుగా చల్లారిపోయిన తరువాత ఆ జ్ఞ్యానం కూడా సమిధము లేని అగ్ని లాగ పోతుంది.

అథైషామ్కర్మకర్తౄణాం భోక్తౄణాం సుఖదుఃఖయోః
నానాత్వమథ నిత్యత్వం లోకకాలాగమాత్మనామ్

మనం వేటి వేటిని లోకములో భావిస్తున్నామో అలాంటి భావనలకు ఏమి కారణం? ఇది అనంతం. ఎన్నో ఉన్నాయి. లోకము వలనా కాలం వలనా ఆగమం వలనా ఏర్పడేవి.

మన్యసే సర్వభావానాం సంస్థా హ్యౌత్పత్తికీ యథా
తత్తదాకృతిభేదేన జాయతే భిద్యతే చ ధీః

సకల భావముల యొక్క పుట్టుకా స్థితీ లోకాన్ని కాలాన్ని ఆగమాన్నీ బట్టి  ఉంటుంది. మన బుద్ధి ఒక వస్తువును చూస్తే అందులో ఉన్న ఒక ఆకారాన్ని బట్టి మన బుద్ధి మారుతుంది. దేహం యొక్క భేధాన్ని బట్టి దేహిగా కనపడతాడు కానీ ఆత్మలో భేధం లేదు. ఆత్మకు దేహ సంబంధముతోనే ఇవన్నీ కలుగుతాయి

ఏవమప్యఙ్గ సర్వేషాం దేహినాం దేహయోగతః
కాలావయవతః సన్తి భావా జన్మాదయోऽసకృత్

దేహికి దేహాన్ని బట్టి అవస్థలు వస్తాయి. కాలాన్ని బట్టి దేహాలు ఏర్పడుతూ ఉంటాయి. దేహానికి ఏర్పడే అవస్థలు (బాలుడూ యువకుడూ వృద్ధుడు) కాలం బట్టే ఏర్పడతాయి. దేహాది ఉత్పత్తి కాలాన్ని బట్టి జరుగుతుంది. అలా కలిగే భేధాలను ఆత్మకు ఆపాదించి భ్రమలో పాడుతూ ఉన్నాము. ఆ భేధాలు ఆత్మకు లేవు. ఇవి మాటి మాటికీ కలుగుతూ ఉంటాయి. అనంతమైన పుట్టుకలూ మరణాలూ ఉంటాయి.

తత్రాపి కర్మణాం కర్తురస్వాతన్త్ర్యం చ లక్ష్యతే
భోక్తుశ్చ దుఃఖసుఖయోః కో న్వర్థో వివశం భజేత్

మన చేతిలో ఏదీ లేదనడానికిగా, శరీరం చేస్తోంది అనడానికి బదులు "నేను చేస్తున్నాను" అంటాం. మనమే చేస్తే మనం అనుకున్నట్లుగా చేయగలగాలి. కానీ అలా చేయలేకపోతున్నాము. మనకు ఇష్టం లేని వాటిని బలవంతముగా చేస్తున్నాము. దాని వలన హాని కలుగుతుంది. మనకు ఏ పనిలోనూ స్వాతంత్ర్యం లేదు. అంతా పారతంత్ర్యమే.
దుఃఖం కలగాలని ఎవరినా ఇష్టపూర్తిగా పనులు చేస్తారా?దుఃఖాన్ని కోరకుండా దుఃఖం కలిగించే పనులు చేయడమే పారతంత్ర్యం

న దేహినాం సుఖం కిఞ్చిద్విద్యతే విదుషామపి
తథా చ దుఃఖం మూఢానాం వృథాహఙ్కరణం పరమ్

అలాంటి సంసారములో బుద్ధి ఉన్న వారు, ప్రయోజనం కోరే వారూ ప్రవర్తిస్తారా.
ప్రపంచములైనా పండితుడైనా సరే, జ్ఞ్యాని ఐనా సరే, ఎవరికైనా దేహం అనేది ఉంటే సుఖం అనేది ఉండదు. దుఃఖమైనా సుఖమైనా ఏ  కొంచెమైనా తన ఆధీనముగా ఉండదు. అది ఎపుడు ఉంటుందో ఎపుడు పోతుందో ఎవరికీ తెలీదు. కానీ మూర్ఖులు అది అంతా తాను చేసుకున్నాను అనుకుంటాడు. పండితులు అది అంతా భగవంతుని లీల అని గ్రహిస్తారు. ఇరువురికి సుఖ దుఃఖాల అనుభవం సమానమే.

యది ప్రాప్తిం విఘాతం చ జానన్తి సుఖదుఃఖయోః
తేऽప్యద్ధా న విదుర్యోగం మృత్యుర్న ప్రభవేద్యథా

రావడమూ పోవడమూ, సుఖం కలుగుటా దుఃఖం కలుగుటా రెండూ మనకే తెలిసి ఉంటే మనం సుఖం కలిగే పనే చేస్తాము. సుఖ ప్రాప్తీ దుఃఖం విఘాతం తెలిసిన వాడు దుఃఖం రాకుండానే ప్రవర్తిస్తాడు. మనం అనుకుంటే ఏదీ ఆగదు, మనమనుకుంటే ఏదీ కలగదు.

కోऽన్వర్థః సుఖయత్యేనం కామో వా మృత్యురన్తికే
ఆఘాతం నీయమానస్య వధ్యస్యేవ న తుష్టిదః

మృత్యువు వద్దకు తీసుకు పోయే ఏ అర్థ కామాలు మనకు సుఖాన్ని ఇస్తాయి?  సంసారములో పడవేసే అర్థకామాలు సుఖాన్ని కలిగిస్తాయా? బలికి తీసుకు పోబోయే ముందు జంతువుకు పూల దండలు వేసి చక్కగా ఆహారం పెట్టి తీసుకు వెళతారు. అలాంటి అలంకారాల లాంటివే సంసారములో సుఖ దుఃఖాలు.

శ్రుతం చ దృష్టవద్దుష్టం స్పర్ధాసూయాత్యయవ్యయైః
బహ్వన్తరాయకామత్వాత్కృషివచ్చాపి నిష్ఫలమ్

తప్పించుకుందామంటే, ప్రయత్నంచేద్దామంటే నీవు చేసే ప్రయత్నాలన్ని నిష్ఫలాలే. మనం ఒక దాన్ని విన్నా చూచినా, చూచినా విన్న వస్తువులలో గుణములను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేము. స్పర్థ, అతిశయం, అసూయ, వ్యయం ధ్వంసం ఖర్చూ మొదలైనవి ఉంటాయి. మనకు మనమే మనలోనే ఏర్పరచుకుని చేస్తున్నాము కానీ ఇంకొకరి ప్రమేయం లేదు, చెడుకూ మంచికీ మనమే కర్త్లం అనే భావనతో ఉంటాము. కోరుకున్న కోరికను పొందడానికి ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఈ విఘ్నాలకు కారణాలు స్పర్థా అసూయ ధంసం, వ్యయం మొదలైనవి. ఉదాహరణకు గుడికి వెళ్ళే సమయానికి ఎవరైనా ఇంటికొస్తే గుడికి వెళ్ళాలి అనుకున్న మనమే గుడికి వెళ్ళడం మానుకుంటున్నాము. మనం చేస్తున్న దాని కంటే చేయబోయే దాని వలన కలిగే ఫలితం తక్కువ అని మన చుట్టూ ఉన్నవారే కల్పిస్తే మనమే ఆ పనిని మానుకుంటున్నాము. ఇంక మన స్వాతంత్ర్యమూ ఫలా కాంక్ష ఎక్కడ?

కోరిక అనేది అనేకమైన విఘ్నములు కలిగి ఉంటాయి కాబట్టి నిష్ఫలం. రైతు విత్తనం వేస్తాడు, వర్షం పడితే పంట వస్తుంది. కోతకొచ్చాక వర్షం పడితే? లేదా పంట కోసాక ఇంటిలో పెట్టగా ఇల్లు తగలబడితే? భూమి మీద విత్తు వేసిన దగ్గరనుండీ ఆ ఫలం మన ఇంటిలోకి వచ్చేంతవరకూ ఆపే విఘ్నాలు అనేకం. ఈ విఘ్నాలన్నీ ఎవరు కోరుకుంటే వస్తున్నాయి? అన్ని విఘ్నాలూ నేనే (కృష్ణుడు) పోగడతాను.

అన్తరాయైరవిహితో యది ధర్మః స్వనుష్ఠితః
తేనాపి నిర్జితం స్థానం యథా గచ్ఛతి తచ్ఛృణు

ఎలాంటి విఘ్నాలూ లేకుండా ధర్మం అనుష్ఠించినా, దాని వలన కలిగే ఉత్తమ స్థానం కూడా శాశ్వతముగా ఉండదు.

ఇష్ట్వేహ దేవతా యజ్ఞైః స్వర్లోకం యాతి యాజ్ఞికః
భుఞ్జీత దేవవత్తత్ర భోగాన్దివ్యాన్నిజార్జితాన్

తన ఇష్టమైన దేవతలకు యజ్ఞ్యం చేసి తాను స్వర్గాలకు వెళ్ళి తాను కష్టపడి సంపాదించుకున్న భోగాలను తాను అనుభవిస్తాడు.

స్వపుణ్యోపచితే శుభ్రే విమాన ఉపగీయతే
గన్ధర్వైర్విహరన్మధ్యే దేవీనాం హృద్యవేషధృక్

తన పుణ్యముతో పెరిగిన ఆయా ప్రాంతాలలో ఉత్తమ విమానాలలో గంధర్వులతో కలసి దేవతా స్త్రీలతో అందమైన వేషాలు ధరించి తిరుగుతాడు

స్త్రీభిః కామగయానేన కిఙ్కినీజాలమాలినా
క్రీడన్న వేదాత్మపాతం సురాక్రీడేషు నిర్వృతః

ఇలా విహరిస్తూ ఉంటాడు. సమయం మించిపోతోంది అన్న సంగతి తెలియడు. ఏ సుఖం కావాలని కోరుకుని కర్మలు ఆచరించామో ఆ సుఖం ఐపోగానే మళ్ళీ కిందకు వచ్చి కర్మలు ఆచరించాలి.

తావత్స మోదతే స్వర్గే యావత్పుణ్యం సమాప్యతే
క్షీణపున్యః పతత్యర్వాగనిచ్ఛన్కాలచాలితః

నీవు చేసిన పుణ్యం ముగిసే దాకా నీవు స్వర్గలోకములో ఆనందముగా ఉంటావు. ఆ పుణ్యం క్షీణించడముతో నీవు మళ్ళీ వచ్చి ఇష్టము లేకున్నా భూలోకములో పడే తీరాలి

యద్యధర్మరతః సఙ్గాదసతాం వాజితేన్ద్రియః
కామాత్మా కృపణో లుబ్ధః స్త్రైణో భూతవిహింసకః

అదే అధర్మాన్ని కోరితే, అధర్మాన్ని ఆచరించిన వాడు సంసారములో దుష్ట జనుల సావాసముతో ఇంద్రియ జయము లేకుండా కోరికలు కలిగి లుబ్దుడై స్త్రీ వ్యామోహం కలిగి సకల ప్రాణులనూ హింసించేవాడిగా

పశూనవిధినాలభ్య ప్రేతభూతగణాన్యజన్
నరకానవశో జన్తుర్గత్వా యాత్యుల్బణం తమః

పశువులను శాస్త్ర విధి తప్పి హింసించి ప్రేత భూత పిశాచాలను ఆరాధిస్తూ, తన వశములో లేకుండానే తాను నరకానికి వెళ్ళి కౄరమైన భయంకరమైన నరకాన్ని చేరతాడు

కర్మాణి దుఃఖోదర్కాణి కుర్వన్దేహేన తైః పునః
దేహమాభజతే తత్ర కిం సుఖం మర్త్యధర్మిణః

ఈ శరీరముతో దుఃఖం కలిగించే ఎన్నో పనులు చేసి, ఇక్కడా దుఃఖమే అక్కడా దుఃఖమే పొందుతాడు. ఇంక సుఖమెక్కడిది?

లోకానాం లోకపాలానాం మద్భయం కల్పజీవినామ్
బ్రహ్మణోऽపి భయం మత్తో ద్విపరార్ధపరాయుషః

నీవు అనుకున్న పని అనుకున్నట్లు చేయగలిగినా నీవు అనుకున్న సుఖం అనుకున్న రీతిలో పొందలేవు. ఒక వేళ పొందినా ఆ సుఖం పొందుతున్నపుడే దాని సమయం ముగిసి దుఃఖం కలుగుతుంది. ఇది మనుషులకే కాదు లోకములకూ లోకపాలకులకు కూడా నా భయం ఉంది. బ్రహ్మ కల్ప కాలం బతికే వారికి కూడా ఈ భయం ఉంటుంది. ద్విపరార్థం బతికే బ్రహ్మకు కూడా నా భయం తప్పదు

గుణాః సృజన్తి కర్మాణి గుణోऽనుసృజతే గుణాన్
జీవస్తు గుణసంయుక్తో భుఙ్క్తే కర్మఫలాన్యసౌ

కర్మ గుణాన్నీ, గుణం కర్మనీ సృష్టిస్తుంది. ఈ జీవుడు తాను గుణములతో కలసి కర్మ ఫలాలను అనుభవిస్తున్నాడు

యావత్స్యాద్గుణవైషమ్యం తావన్నానాత్వమాత్మనః
నానాత్వమాత్మనో యావత్పారతన్త్ర్యం తదైవ హి

సత్వ రజసత్మో గుణాల వైషమ్యాన్ని మనం చూస్తున్నంతకాలం, నానాత్వ బుద్ధి కలుగుతుంది. ఎప్పటిదాకా ఆత్మకు నానాత్వ జ్ఞ్యానముంటుందో అప్పటిదాకా ఆత్మకు పారతంత్ర్యం తప్పదు. అంతవరకూ మనం చేసేది వెట్టి చాకిరీ అవుతుంది.

యావదస్యాస్వతన్త్రత్వం తావదీశ్వరతో భయమ్
య ఏతత్సముపాసీరంస్తే ముహ్యన్తి శుచార్పితాః

ఎప్పటి వరకూ మనకు పారతంత్ర్యం ఉంటుందో అప్పటివరకూ మనకు భగవంతుని వలన భయం తప్పదు. ఇలాంటి కర్మ బంధాన్ని ఎవడు సేవిస్తాడో అలాంటి వాడు దుఃఖాన్నీ మోహాన్నీ పొందుతూ ఉంటాడు

కాల ఆత్మాగమో లోకః స్వభావో ధర్మ ఏవ చ
ఇతి మాం బహుధా ప్రాహుర్గుణవ్యతికరే సతి

కాలమూ ఆత్మ ఆగమమూ లోకమూ స్వభావమూ ధర్మమూ, ఇవన్నీ నా పేర్లే. సృష్టి జరిగినపుడు, సంసారం ప్రవర్తించినపుడు, నాకు ఇన్ని పేర్లు.

శ్రీద్ధవ ఉవాచ
గుణేషు వర్తమానోऽపి దేహజేష్వనపావృతః
గుణైర్న బధ్యతే దేహీ బధ్యతే వా కథం విభో

నీవు చెప్పినట్లుగా ప్రకృతికి సంబంధించిన, శరీరము వలన కలిగే గుణములలో ఉంటూ, వాటితో బంధించబడకుండా వాటి స్వభావాన్ని జీవుడు తెలుసుకునే ఉపాయం ఉందా? ఉంటే నాకు వివరించండి

కథం వర్తేత విహరేత్కైర్వా జ్ఞాయేత లక్షణైః
కిం భుఞ్జీతోత విసృజేచ్ఛయీతాసీత యాతి వా

ఎలా ఉండాలి ఏ లక్షణాలతో గుణములతో విహరించాలి. ఏ లక్షణాలను బట్టి మనం దీన్ని తెలుసుకోవాలి. దేన్ని మనం అనుభవించాలి. ఏమి చేయాలి ఎలా ఉండాలి దేనితో ఉండాలి దేన్ని వదలిపెట్టాలి దేన్ని అసహ్యించుకోవాలి దేన్ని తెలుసుకోవాలి ఎలా పడుకోవాలి ఎలా కూర్చోవాలీ ఎలా నడవాలి దేన్ని మానాలి?

ఏతదచ్యుత మే బ్రూహి ప్రశ్నం ప్రశ్నవిదాం వర
నిత్యబద్ధో నిత్యముక్త ఏక ఏవేతి మే భ్రమః

ఎదుటివారు అడిగిన ప్రశ్నలను తెలుసుకుని చక్కగా సమాధానం చెప్పగల మహానుభావా నాకు దీన్ని వివరించవలసినది. నిత్య ముక్తులు కానీ నిత్య బద్ధులు కానీ, ఇద్దరూ ఒకటే అనుకుంటున్నాను.  ఇద్దరూ పరతంత్రులే కదా. దీన్ని వివరించండి.

                                                సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts