Followers

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 13


మ. తమముం బాసినరోహిణీవిభుక్రియన్‌ దర్పించి సంసారదుః
ఖమువీడ్కొన్న నిరక్తచిత్తునిగతి| ంగ్రాహంబుపట్టూడ్చిపా
దము లల్లార్చికరేణుకావిభుడు సౌందర్యంబుతోనొప్పెసం
భ్రమ దాశాకరిణీకరోర్జితసుధాం భస్స్నానవిశ్రాంతుడై.


తా!! నంతట నా గజేంద్రుము మిక్కిలి యానందభరితుడై రాహువు విడిచిన చండ్రునివలె ప్రకాశించుచూ, సంసార భవభందముల నుండి బయటపడిన విరాగివలె మొసలి పట్టునుండి విడివడిన కాళ్ళను విదిలించుకొని తమ కాంతులు (ఆడయేనుగులు) వెదజల్లిన నీటియందు మిక్కిలిగా తడిసి ఆనందముప్పొంగ తన వారిని గూడియుండెను.

*******************************************************************************************  99

శా. పూరించెన్‌ హరి పాంచజన్యము సుధాంభోరాశి సౌజన్యమున్‌
భూరిధ్వానచలాచలీకృతమహాభూత ప్రచైతన్యమున్‌
సారోదార సితప్రభాచకిత పర్జన్యాది రాజన్యముల్‌
దూరీభూతవిపన్నదైన్యమునుని| ర్ధూతద్విషత్సైన్యమున్‌


శ్రీ మహావిష్ణువు అప్పుడు తన భీకరధ్వనితో శత్రువులను భీతి నొందిల్లజేయునదియు, గొప్ప ధవళకాంతితో ప్రకాశించి ఇంద్రాది దేవతలనాశ్చర్య పరుచునదియు, భక్తులను ఆపదల నుంచి కాపాడునదియు, శత్రువులను తుదముట్టించునదియు పాలకడలిలో జన్మించిన పాంచజన్య శంఖమును దిక్కులు పిక్కటిల్లునట్లుగా పూరించెను.

******************************************************************************************   100

మ. మొరసెన్నిర్జరదుందుభుల్‌ జలరుహామోదంబులై వాయువుల్‌
దిరిగెన్‌ బువ్వుల వానజల్లుగురిసెన్‌ దేవాంగనాలాస్యముల్‌
పరగెన్‌ దిక్కులబిక్కటిల్లి జయశబ్దధ్వా నముల్‌ నిండె సా
గర ముప్పొంగె దరంగ చుంబిత నభో గంగాముఖాంభోజమై


తా: శ్రీహరి శంఖమును పూరించగా దేవతలు భేరీ మృదంగములు మ్రోగించిరి. మలయమారుతము తామర వాసనను గుప్పింపజొచ్చెను. పుష్పవానవెల్లి కురిసెను. అప్సరసలు ఆనందముతో నృత్యములు జేసిరి. జయ జయనినాదములు మిన్నుముట్టినవి. సముద్రుడు ఆనందముతో ఆకాశమును ముద్దిడుకొనినట్లు తన ఎత్తైన కెరటములతో మోదమునందెను.

******************************************************************************************   101

క. నిడుదయగు కేల గజమును
మడుపున వెడలంగ దిగిచి మదజలరేఖల్‌
దుడుచుచు మెల్లనన్‌ బుణుకుచు
నుడిపెన్‌ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా.


తా!! ఓ పరీక్షిణ్మహారాజా! శ్రీమహావిష్ణువు తన పొడుగైన బాహువులతో గజేంద్రమును వెలుపలికి దీసి మదజలమును దుడిచి బ్రేమతో వీపునిమిరి దాని భయమును బోగొట్టెను.

*******************************************************************************************  102

క. శ్రీహరి కరసంస్పర్శను
దేహము దాహంబు మాని ధృతి గరణీ సం
దోహమును దాను గజపతి
మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్‌


తా!! శ్రీ మహావిష్ణువు యట్లు గజేంద్రుని భయము బోగొట్టగానే నది తన యాడువారిని గూడి అలసట దీర్చుకొన్నదై మిక్కిలి సంతోషాతిశయంబున వీనులవిందుగా ఘీంకారము జేసెను.

*******************************************************************************************  103

క. కరమున మెల్లన నివురుచు
గర మనురాగమున మెఱసి కలయంబడుచున్‌
గరి హరికతమున బ్రదుకుచు
గరపీడన మాచరించె గరిణులు మఱలన్‌


తా!! శ్రీహరిదయతో గజేంద్రుడు బ్రతికిబయటకు రాగా ఆడయేనుగులన్నియు మహదానందముతో మమతానురాగములతో ఒకరి తొండములనొకటి పెనవేసుకొన్నాయి.

*******************************************************************************************  104

సీ. జననాథ దేవల శాపవిముక్తుడై
పటుతర గ్రాహ రూపంబు మాని
ఘనుడు 'హూ హూ' నామ గంధర్వు డప్పుడు
తనతొంటి నిర్మల తనువు దాల్చి
హరికి నవ్యయునకు నతిభక్తితో మ్రొక్కి
తవిలికీర్తించి గీతములు పాడి
యాదేవు కృపనొంది యందం దమఱియును
వినత శిరస్కుడై వేడ్కతోడ

అ. దళితపాపుడగుచు దనలోకమున కేగె
నపుడు శౌరి కేల| నంటి దడప
హస్తిలోకనాథు డజ్ఞానరహితుడై
విష్ణురూపు డగుచు వెలుగుచుండె


తా!! అంతట నా మొసలి "హూ హూ" యను పేరుగల గంధర్వరూపము తాల్చి దేవల మహర్షి యొసగిన శాపము నుండి విముక్తుడాయెను. (హూహూ యను గంధర్వుడొకనాడు తన ప్రియురాండ్రతో గూడి మాలినీ నదియందు జలవిహారము చేయుచుండగా దేవలుడను మహర్షి స్నాన మొనరింప బోవ తన జలవిహారమునకు ఆటంకము గల్గించినాడని నీటిలోపలకు పోయి మునికాలు బట్టి లాగ జొచ్చెను. ముని వెంటనే తేరుకుని మొసలిగా బ్రతుకుమని శపించెను. హూహూవు బ్రతిమాలగా కొన్ని సంవత్సరముల తర్వాత శ్రీమహావిష్ణువుచే శాపవిముక్తిని బొందగలవని జెప్పి వెడలి పోయాడు).

*******************************************************************************************  105

మ. అవనీనాధ గజేంద్రుడా మకరితో నాలంబు గావించె మున్‌
ద్రవిడాధీశుడతండు పుణ్యతము 'డిం ద్రద్యుమ్న' నాముండువై
ష్ణవముఖ్యుండు గృహీతమౌన నియతిన్‌ సర్వాత్ము నారాయణున్‌
సవిశేషంబుగ బూజసేసెను మహా| శైలాగ్రభాగంబునన్‌


తా!! ఓ పరీక్షిణ్మహారాజా! గజేంద్రుని పూర్వ వృత్తాంతమును గూడ వినుము. గజేంద్రుడు మునుపు ద్రవిడ దేశాధిపతి. మిక్కిలి పుణ్యాత్ముడు. అతని పేరు ఇంద్రద్యుమ్నుడు. పరిశుద్ధాత్ముడు. మీదు మిక్కిలి హరిభక్తుడు. అతడొక కొండ మీద మౌనవ్రతమునుదాల్చి సర్వేశ్వరుండగు శ్రీ మన్నారాయణుని పూజించుచుండెను.

*******************************************************************************************  106

Popular Posts