భృగు మహర్షి కుమారుడు ప్రమతి. ప్రమతి ఘృతాచిని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళకు రురుడు పుట్టాడు. అతను ప్రమద్వరను చేపట్టాడు. వారికి శునకుడు కలిగాడు. అతను గొప్ప తపస్సు చేసి భృగు వంశానికి యశస్సు చేకూర్చాడు. రురుడి చరిత్ర చిత్రంగా వుంటుంది.
ఒకప్పుడు మేనక విశ్వావసుడు అనే గంధర్వుణ్ణి ప్రేమించింది. ఆ ప్రేమ ఫలితంగా ఓ ఆడపిల్లను కన్నది. స్థూలకేశుడి ఆశ్రమ ప్రాంతాన నదీతీరంలో ఆ పాపను విడిచి వెళ్ళింది. స్థూలకేశుడు ఆ బిడ్డను చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకుపోయి అల్లారుముద్దుగా పెంచాడు. ఆశ్రమ ప్రాంతంలోని పిల్లలలో కెల్లా చురుకైనది కావడం వల్ల ఆమెకు ప్రమద్వర అని పేరు పెట్ట్టారు. యుక్తవయస్సు వచ్చేసరికి ఆ అమ్మాయి మరింత అందంగా తయారైంది. రురుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుని తన కోరికను తండ్రికి తెలియబరిచాడు.
ప్రమతి స్థూలకేశుడి ఆశ్రమానికి వెళ్ళి తన కుమారిడి కోరికను విన్నవించాడు. స్థూలకేశుడు సంతోషించి వారిరువురి వివాహానికి శుభముహర్తం నిర్ణయించాడు.
పెళ్ళి ముహుర్తం ఇంకా కొద్దిరోజులు వున్నదనగా ప్రమద్వర ఆశ్రమ సమీపంలో ఆటపాటల్లో వుండి పొరపాటున చెట్టుచాటున నిద్రిస్తున్న పామును తొక్కింది. ఆ పాము ప్రమద్వరను కాటు వేసింది. ఆ పిల్ల కాస్తా ప్రాణాలు విడిచింది. ఈ వార్త రురుడికి తెలిసి అమితంగా దుఃఖ పడ్డాడు. ప్రేయసి అకస్మికంగా మృతి చెందినందువల్ల మనస్సు చెదిరి ఇల్లు పట్టకుండా అరణ్యాలు వెంట తిరగటం మొదలు పెట్టాడు.
"నేను పుణ్యకార్యాలు చేసినవాడినైతే, సజ్జనుడనైతే, తల్లిదండ్రులనూ, గురువులనూ పూజించినవాడినైతే నా ప్రమద్వర పునరుజ్జీవితురాలవుతుంది" అని గట్టిగా అనుకున్నాడు. ఇంతలో ఆకాశం నుంచి అనునయవాక్యాలు వినిపించాయి. "ఓ మునికుమారా! ప్రియురాలి కోసం ఎందుకంతగా దుఃఖిస్తావు? ప్రమద్వర జీవించాలనుకుంటే నీ ఆయుష్షులో సగం తనకివ్వు. ఆమె వెంటనే ప్రాణాలతో లేచి కూర్చుంటుంది".
తన ఆయుర్దాయంలో సగభాగం ప్రమద్వరకు ధారపోసేందుకు రురుడు సంసిద్ధుడయ్యాడు. వెంటనే వెళ్ళి ఈ సంగతి విశ్వావసుడితో చెప్పాడు. ఆయన యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి రురుడి ఆయుష్షులో సగం ప్రమద్వరకు ధారపోస్తాడనీ, కనుక దయతో మళ్ళీ తన కుమార్తెను బ్రతికించమని వేడుకున్నాడు.
ధర్మరాజు అంగీకరించాడు.
ప్రమద్వరకు మళ్ళీ ప్రాణం పోశాడు. తరువాత ప్రమద్వర , రురుల వివాహం జరిగింది. కాని అప్పటినుండి రురుడికి పాములంటే తగని కక్ష ఏర్పడింది. పాములు ఎక్కడ కనిపించినా చంపకుండా వదిలిపెట్టేవాడు కాదు.
ఒకసారి రురుడు అరణ్యంలో 'డుండుభం' అనే పామును చూసాడు. వెంటనే చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు డుండుభం బాధపడుతూ "నీకు నేను ఏమి అపకారం చేశానని నన్ను చంపబోతున్నావ్ ?" అని అడిగింది.
"నా భార్యను ఒకనాడు ఒక నాగు కాటువేసి చంపింది. అప్పటినుంచి కనిపించిన పామునల్లా చంపుతాను నేను" అన్నాడు రురుడు.
"ఎప్పుడో ఒక పాము నీ భార్యను కాటువేసిందని పాములన్నిటినీ చంపాలనుకోవటం ఏమి న్యాయం? ఇకనైనా ఈ పాములవేట విడిచిపెట్టు" అని డుండుభం అంది. మరుక్షణం అది ఒక మునిరూపం ధరించింది. రురుడు ఆశ్చర్యపోయి మునీశ్వరుడికి నమస్కారం చేశాడు.
డుండుభం క్రితం జన్మలో సహస్రపాదుడు. సహస్రపాదుడికి మిత్రుడు భాగముడు. భాగముడు బ్రాహ్మణ కుమారుడు. తపోధనుడు. ఒకనాడు భాగముడు అగ్నిగృహంలో వున్నప్పుడు సహస్రపాదుడు బాల్యచాపల్యంతో గడ్డిపరకను పాము ఆకారంగా చేసి మిత్రుడిపై పడవేసాడు. అది పామే అనుకుని భాగముడు మూర్చపోయాడు. కొంతసేపటికి తేరుకున్నాకా "డుండుభమనే పాముగా మారిపోదువుగాక" అని స్నేహితుణ్ణి శపించాడు.
ఆ శాపానికి సహస్రపాదుడు భయపడిపోయి "తెలీక పొరపాటు పని చేసాను. నన్ను మన్నించు. నీ శాపం మరలించు" అని వేడుకున్నాను.
అప్పుడు భాగముడు జాలిపడి "భృగుమహర్షి కుమారుడు ప్రమతికి రురుడనే కొడుకు పుడతాడు. అతణ్ణి చూడగానే నీ శాపం తీరిపోతుంది. మళ్ళీ అసలు రూపం వస్తుంది" అన్నాడు. ఆ విధంగానే రురుడి దర్శనంతో డుండుభానికి శాపవిముక్తి కలిగింది.