Followers

Saturday, 18 April 2015

గజేంద్రమోక్షము - 4


క. తొండంబుల మదజలవృత
గండంబుల గుంభములను| ఘట్టనసేయం
గొండలు దలక్రిందై పడు
బెండుపడున్‌ దిశలు సూచి| బెగడున్‌ జగముల్‌


తా!! మదగర్వంతో నున్న ఆ యేనుగులు తమ తొండముల తోను, మధోధకముతో గూడిన చెక్కిళ్ళతోనూ కుంభస్థలముల తోనూ పర్వతరాళ్ళను రాచుకొనుచు దిక్కులు పిక్కిటిల్లెటట్లు ఘర్జిస్తూ తమ మదమత్తును వదిలించుకొనబోవ పర్వతములు నుగ్గు నుగ్గయి పోతున్నాయి. మదమత్తేభ తాడనమును జూచి లోకములు గగ్గోలు పడసాగాయి. (మదించిన మత్తేభముల నడవడిక ఎట్లుండునో పోతన కళ్లకు కట్టినట్లు వర్నీంచుట యిందలి విశేషము)

*******************************************************************************************  20

క. ఎక్కడఁ చూచిన లెక్కకు
నెక్కువయై యడవి నడచు| నిభయూథములో
నొక్క కరినాథుఁ డెడ తెగి
చిక్కె నొక కరేణుకోటి! సేవింపంగన్‌


తా: ఎక్కాడ చూచిననూ లెక్కకు మిక్కుటముగా నున్న ఆ గజములు స్వేచ్ఛగా అడవి యందు సంచరించుచున్న సమయమున ఒక గజేంద్రుడు మోహావేశమున తన యాడు గజములతో గూడి విడిపోయి వెనుకబడిబోయాడు.

******************************************************************************************   21

వ. ఇట్లు వెనుక ముందఱ నడుమ నుభయపార్శ్వంబుల
దృష్టార్ధితంబులై నరుగుదెంచు
నేనుంగు గములం గానక తెఱంగు దప్పి తొలంగుడు
యీశ్వరాయత్తం బయినచిత్తంబు సంవిత్తంబుగాకుండుటం
జేసి తానును దనకరేణు సముదయంబును నొక్కతెరువై పోవుచు.


తా!! ఆ గజేంద్రుడు మోహావేశమున ఆలోచించుచూ పరిసరములను గానక, దారి తప్పి తన్ననుసరించి వచ్చిన ఆడ ఏనుగులతో గూడి మరొక దారిని పోవుచుండెను.

*******************************************************************************************  22

సీ. పల్వలంబుల లేఁత| పచ్చిక మచ్చికఁ
జెలుల కందిచ్చు న| చ్చికములేక
నివురు జొంపములఁగ్రొ| వ్వెలయు బూఁగొమ్మలఁ
బ్రాణ వల్లభలకుఁబాలువెట్టు
ఘన దాన శీతల| కర్ణతాళంబుల
దయితల చెమటార్చుఁ| దనువు లరసి
మృదువుగాఁ గొమ్మల| మెల్లన గళములు
నివురుచుఁ బ్రియముతో| నెఱపు గఱపు

క. పిఱుఁదు చక్కట్ల డగ్గఱి| ప్రేమతోడ
డాసి మూర్కొని దివికి దొం| డంబు సాఁపు
వెద వివేకించుఁ గ్రీడించు| విశ్రమించు
మత్తమాతంగ మల్లంబు| మహిమతోడ.


తా!! ఆ మదించిన యేనుగు కడునేర్పుతో నచటి లేలేత పచ్చికను దెచ్చి యిచ్చి, తన ఆడు ఏనుగులను సంతృప్తులను గావించుచూ, తానుగూడా నారగీంచుచుండెను. అలసిన తన ప్రియురాండ్ర శరీరమున బుట్టిన చెమటను తన విసనకర్రలవంటి చెవులతో విసురుతూ, దాకుచూ తనపట్ల మోహావేశము పొందునట్లు చేయుచుండెను. వాటి కంఠములను నివురుచూ ప్రేమతో వాటికి దన పట్ల వేడుకను కలిగించుచుండెను. తొండములతో పుష్పకేతువును వాటి పృష్టభాగములను దాకి తొండంబు బైకెత్తి ప్రేమను వెల్లడిస్తున్నాడు. వాటిని గూడి క్రీడించుచు వన విహార శ్రమను దీర్చుకొనుచున్నాడు.

*******************************************************************************************  23

సీ. తనకుంభముల పూర్ణ| తకు డిగ్గి యువతుల
కుచములు పయ్యెద| కొంగు తీఁగఁ
దనయాన గంభీర| తకుఁజాల కబలల
యానంబు లందెల| నండగొనఁగఁ
దన కరశ్రీఁ గని| తలఁగి బాలల చిఱు
దొడలు మేఖల దీప్తి| దోడుపిలువఁ
దన దంతరుచికి జాలకనోడి| తరుణుల నగవులు
ముఖచంద్ర దీప్తుల| ముసుఁ గు దిగువఁ

తే. దనదు లావణ్యరూపంబు| దలఁచి చూడ
నంజ నాభ్రము కపిలాది| హరిదిభేంద్ర
దయిత లందఱు దనవెంటఁ| దగిలి నడువఁ
గుంభివిభుఁడొ ప్పె నొప్పుల| కుప్పవోలె


తా!! ఆ గజరాజు యొక్క నిండైన కుంభ స్థలమునకు తమ కుచకుంభములు సరిరావని, మరులుగొన్న మగతనమును జూచి మగువలు సిగ్గుపడి తమను బైటకొంగుతో గప్పికొన్నట్లు ఆ యాడు యేనుగులు, అందెలు దాల్చిన అతివల అతి వయ్యారంపు నడకతోనూ, అబలలు తమ ఊరువుల అందాలను ఇనుమడించెందుకు వడ్డాణము మొదలగు యొలనూళ్ళు ధరించి నొప్పారుతున్నట్లు తమ తొండములతోనూ, దంతాలకాంతిని ద్విగుణీకృత మొనర్చు చంద్రకాంతుల వంటి చిఱునవ్వులతో అంజన మొదలైన దిగ్గజేంద్రాంగనలు తమ రూపలావణ్యముతో తన్ను మోహించి వెంబడించే యాడు యేనుగులు వెంటరాగా సౌందర్య రాశితో నొప్పారుచున్నాడు ఆ గజేంద్రుడు.

*******************************************************************************************  24

వ. మఱియు, నానా గహన విహరణ మహిమతో
మదగజేంద్రంబు మార్గంబు దప్పి, పిపాసా పరాయత్త
చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం
దానునుజనిచని


తా!! ఇట్లు ఆ గజేంద్రుడు వన విహారదప్పికగొని దారి తప్పి తానునూ మదించిన ఆడు ఏనుగుల గుంపు అనుసరిస్తూ ఉండగా, సౌందర్యాతిశయమున దారితప్పి దప్పిక దీర్చుకొనుటకై మడుగును వెదకుచు చాలా దూరము పోయినదై

*******************************************************************************************  25.

మ. అట గాంచెం గరిణీవిభుండు నవపు| ల్లాంభోజకళారముల్‌
నటదిందిందిరవారమున్‌ గమఠమీ| నగ్రాహదుర్వారమున్‌
వటహింతాళ రసాలసాల సుమనో| వల్లీకుటీ తీరముం
జుటులోద్ధూతమరాళ చక్రబకసం | చారంబుగాసారమున్‌.


తా!! ఆ గజరాజిట్లు కడుదవ్వేగి, అపుడే పూచిన ఎర్రదామరలతోను, తుమ్మెదలతో గూడియున్న తాజా పుష్పసంయుతమై నొప్పారుచు చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు మొదలగు జంతువులతో యుండి లోపలికి దిగుటకు వీలు లేని, మామిడి, మర్రి, జాజి, మల్లె, మరువక వృక్ష సమూహముతో కూడినదైన హంస, సారస, కారండవాది పక్షులచే నొప్పారుచున్న కొలననొక దానిని కాంచింది.

*******************************************************************************************  26

వ. ఇట్లనన్య పురుష సంచారంబును నిష్కళంకంభైన యప్పం కజాకరంబు బొడగని.


తా!! మనుష్యసంచారము లేనందున ఆ కొలనులో నీరు తేటగా స్వచ్ఛంగా ఉండి తామరపువ్వులతో నిండినదాయెను. గజేంద్రుడట్టి కొలనుగాంచి

*******************************************************************************************  27

Popular Posts