జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తాడు. భాగవత కథల్లో శ్రీకృష్ణుడు బాల్యంలో, ఆ తర్వాత గోపికలతో చేసిన రాసలీలల్లో శ్రీకృష్ణుడు సంతోషించిన తీరుకు, మహాభారతంలో తాను అమితంగా ప్రేమించే పాండవుల్లో బలవంతుడైన భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు కర్ణుడి శక్తికి గురై అర్ధరాత్రి రణరంగంలో మరణించినప్పుడు కృష్ణుడు నవ్విన నవ్వుకు ఎంతో భేదం ఉంది. ద్రోణ పర్వంలో కురుక్షేత్ర రణరంగ ఘట్టంలో శ్రీకృష్ణుడు సంతోషించటానికి ఘటోత్కచుడి మరణం కారణంగా కనిపించింది.
తాము ఎంతో అభిమానంగా, ప్రేమగా చూసుకుంటున్న శౌర్యవంతుడైన ఘటోత్కచుడు కర్ణుడు ప్రయోగించిన శక్తికి గురై మరణించాడు, అప్పుడు పాండవులంతా విపరీతమైన దుఃఖంలో మునిగిపోయారు. కృష్ణుడు మాత్రం తన పక్కనే ఉన్న ఆర్జునుడిని కౌగలించుకొని ఆనందంతో కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. కృష్ణుడు ఇలా ప్రవర్తించిన తీరు అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుండగా అర్జునుడు కృష్ణుడిని ఎందుకిలా ప్రవర్తిస్తున్నవని అడిగాడు
తామంత దుఖిస్తుంటే అది కృష్ణుడికి సంతోషదాయకంగా ఎలా అయిందని ప్రశ్నించాడు. అందుకు బదులుగా కృష్ణుడు తన ముఖంలో నవ్వు చేరగకుండానే అర్జునుడితో ఇలా అన్నాడు.
అర్జునా ఘటోత్కచుడి మరణం నాకు నిజంగానే అమితానందం కలిగిస్తోంది. కర్ణుడు ప్రయోగించిన శక్తి అతడిని మట్టుపెట్టకుండా ఉన్నట్లయితే అది నిన్ను దహించివేసేది. ఆ శక్తి కర్ణుడి దగ్గర ఉన్నంత కాలం కర్ణుడిని ఎదిరించి జయిoచగలవారు మరెవరు ఉండబోరు. ఇంద్రుడు కర్ణుడి దగ్గర ఉన్న కవచకుoడలాలను తెలివిగా స్వీకరించినప్పటికి యుద్ధంలో ఒక వీరపురుషుడిని సంహరించగల శక్తి మాత్రం కర్ణుడి దగ్గరే మిగిలి ఉంది. ఆ శక్తి అతడి దగ్గర ఉన్నంత కాలం అతడికి తిరుగులేదు. కాని ఇప్పుడాశక్తి ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు ఇక కర్ణుడు సులభంగా యుద్ధంలో మరనించేందుకు అవకాశం ఏర్పడింది అలాగే ఘటోత్కచుడు చిరకాలం జీవించతగిన వాడు కూడా కాదు. అతడు భీముడి కుమారుడైనప్పటికీ దుర్మార్గవర్తనుడు. యుద్ధంలో ఘటోత్కచుడు అలంబుషుడు తదితరులను చంపడానికి ఉపయోగపడ్డాడు. అతడి వల్ల ప్రయోజనం అంత వరకే ఉంది.
యజ్ఞాలను ద్వేషించేవాడు, అధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, పాపాత్ముడు అయిన వాడు కనుకనే ఘటోత్కచుడు ఇప్పుడిలా మరణించాడు. వీడి పాపాలను ఇప్పటివరకు ఉపెక్షించింది మిమ్ములను దృష్టిలో ఉంచుకొనే. మీరు వ్యధకు గురవుతారని అలా కావటం మానసిక స్థైర్యాన్ని దిగజార్చి ఉద్దంలో ఇబ్బంది పడతారనే ఘతోత్కచుడిని ఇప్పటి దాకా కాపాడుతూ వచ్చాను. కర్ణుడు నిన్ను చంపటానికి దాచి ఉంచిన శక్తి వాడి మీద పడి నీకు మేలే జరిగింది. అందుకే నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తన సంతోష కారణాన్ని తెలిపాడు. శ్రీకృష్ణుడు భగవత్గితను ఉపదేశిస్తూ ధర్మానికి ఎక్కడ విఘాతం కలుగుతుందో అక్కడ, అప్పుడు తను ఉద్భావిస్తానని ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పిన ధర్మసందేశం ఘటోత్కచుడి మరణ సన్నివేశంలో శ్రీకృష్ణుడు ప్రవర్తన వల్ల రుజువైంది.