దారుకుణ్ణి, బభ్రుణ్ణి వెంటపెట్టుకుని బలరాముడిని వెతుకుతూ బయలుదేరాడు కృష్ణుడు. కొంచం దూరం వెళ్ళేసరికి ఒక చెట్టుకింద అన్న కనిపించాడు.
"దారుకా! నువ్వు వెళ్ళి పాండవులతో యాదవనాశనం గురించి చెప్పి అర్జునుణ్ణి తీసుకురా. బభ్రూ! నువ్వు ఆడవాళ్ళనందర్నీ పట్టణానికి చేర్చి మళ్ళీ రా" అని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. ఇద్దరూ బయలుదేరారు. కనుచూపు మేరలోనే ఒక బోయవాడు బభ్రుణ్ణి తుంగతో మోది చంపాడు.
అది చూసి మునివర్యుల శాపశక్తికి ఆశ్చర్యపడ్డాడు కృష్ణుడు.
బలరాముని దగ్గరకు వెళ్ళి, "అన్నా! నేను ఈ వాహనాలనూ, వనితలనూ మన పురానికి తీసుకువెళ్ళి విడిచి, తండ్రి ఆజ్ఞ తీసుకుని వస్తాను. అందాకా నువ్వు ఇక్కడే వుండు" అని చెప్పి ద్వారకానగరానికి వెళ్ళాడు.
వసుదేవుణ్ణి చూసాడు. "తండ్రీ! ఇంతవరకు కౌరవ నాశనం, ఇప్పుడు యాదవ నాశనం చూశాను. బంధుమిత్రులెవరూ లేని ఈ నగరంలో వుండబుద్ధి కావడం లేదు నాకు. అన్న ఎలాగూ అరణ్యాల్లోనే వున్నాడు. నేను కూడా వెళ్ళి అన్నతోపాటూ తపస్సు చేసుకుంటాను. ఇక అన్ని విషయాలూ మీరే సమర్థించుకోండి. రేపోమాపో అర్జునుడు వస్తాడు. మీ ఆజ్ఞలను పాటిస్తాడు" అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కృష్ణుడు. ఆ వృద్ధమూర్తి మాటలు రాక, చేష్టలు దక్కి మొగబోయాడు.
యాదవస్త్రీలంతా గొల్లున ఏడ్చారు. కృష్ణుడు కరిగిపోయి, " ఇప్పుడే వస్తాడు అర్జునుడు, మీ కష్టాలన్నీ తీరుస్తాడు. ఊరుకోండి" అని వాళ్ళందర్నీ ఉరడించాడు. అందరికీ నచ్చచెప్పి తండ్రి దగ్గర సెలవు తీసుకుని బలరాముడి దగ్గరకు వచ్చాడు కృష్ణుడు.
"అన్నా! తపస్సు చేసుకోవడానికి తండ్రిగారి అనుమతి తీసుకుని వచ్చాను" అన్నాడు.
ఆ సమయంలో బలరాముని ముఖంలోంచి ఒక మహాసర్పం బయటకు వచ్చింది. ఎర్రటి తలలు వెయ్యి వున్నాయి దానికి. పడగలు మణులతో వెలిగిపోతున్నాయి. తెల్లని శరీర చాయ! పర్వతమంతటి దేహం! అలా బలరాముడు మోగబలంతో శరీరం విడిచి తన నిజరూపం ధరించి సముద్రమార్గాన సాగిపోతుండగా సర్పసమూహాలన్నీ వచ్చి భక్తితో సేవించాయి. గంగానది మొదలుగా గల మహానదులన్నీ ఆకారాలు ధరించి వచ్చి ఆయనను ఆరాధించాయి. అదంతా కృష్ణుడు దివ్యదృష్టితో చూస్తుండగానే అనంతుడు తన అంశ అయిన ఆ మహాసర్పాన్ని తనలో లీనం చేసుకున్నాడు.
చత్రమూర్తి తనను విడిచి వెళ్ళగానే కర్తవ్యచింత ఆవహించింది కృష్ణుణ్ణి. భూలోకంలో చెయ్యవలసిన పనులన్నీ అయిపోయాయి. శరీరం విడిచిపెట్టడానికి ఏ కారణం దొరుకుతుందా అని ఆలోచించసాగాడు అచ్యుతుడు. ఒకప్పుడు రుక్మిణీ సహితంగా దుర్వాసుని సేవించిన సందర్భంలో తను ఆయన అరికాలిలో పాయసం రాయకపోవడం, అందువల్ల "నీకు అరికాలి ద్వారా అపాయం కలుగుతుంది" అని ఆ మహర్షి అనడం గుర్తుకు వచ్చాయి. వెంటనే ఒక చెట్టునీడన పవళించి సమాధిగతుడయ్యాడు జలధిశయనుడు.
అప్పుడు జర భయపడుతూ మెల్లమెల్లగా అక్కడికి రాసాగింది. ఆ చుట్టుపక్కల తిరుగుతున్న వేటగాడొకడు కనిపించాడు దానికి. వాడికి కృష్ణుడి పాదం లేడిపిల్ల ముఖంలా భ్రమ గొలిపేటట్టు చేసింది జర. అల్లంతదూరం నుంచి చూసి ఆ వెటగాడు మా మంచి లేడి దొరికిందనుకుంటూ గురి చూసి బాణం విడిచాడు. అది వెళ్ళి హరి అరికాలిలో గుచ్చుకుని పాదం పైనుంచి దూసుకుపోయింది.
ఆ బోయవాడు దగ్గరకు వచ్చి పరమాత్ముణ్ణి చూసి, తన తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. నిరాకరుడూ, నిర్గుణుడూ అయిన వేదమూర్తి వాణ్ణి ఓదార్చి పంపేసి ఆ వంకతో మానవదేహాన్ని విడిచిపెట్టాడు.
ఊర్ధ్వలోకాలకు వెళ్ళగానే అదివిష్ణువుకు ఇంద్రాది దేవతలంతా భక్తితో ప్రణమిల్లారు.
"ఆదిపురుషా! ధర్మరక్షణ కోసం లీలామానుషరూపుడవై పుట్టావు. శత్రువు లందర్నీ చంపావు. ప్రతీ యుగంలోనూ ఇలాగే అవతరించి ధర్మరక్షణ చేస్తూ వుండు" అంటూ ప్రార్థించాడు ఇంద్రుడు. మహావిష్ణువు మీద పుష్పవర్షం కురిసింది. బ్రహ్మదేవుడు హరి పాదాలకు నమస్కరించి వేదవాక్కులతో స్తుతించాడు. వాళ్ళ భక్తికి ప్రీతి పొంది "అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ భావాలు కలిగే సిద్ధిని పొందాను. నా స్థానాన్ని నేను చేరుకుంటాను. మీరు సుఖంగా వుండండి" అని అంతర్హితుడయ్యాడు మహావిష్ణువు.
ఇంద్రియాలకు కనిపించని ఆ పరమాత్ముణ్ణి బుద్ధితో చూస్తూ ఆయన అద్భుత కృత్యాలను వర్ణించుకుంటూ బ్రహ్మాది దేవతలంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు.