కురుపాండవ సంగ్రామం ముగిసిన తరువాత ఆయన భారతగాధ ఆమూలాగ్రం ఊహించాడు.కాని దీనిని గ్రంధస్తం చేసి లోకంలో చదివించడం ఎలా, ఈ కధను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు.
" మహర్షీ!నీకేం కావాలి? " అని బ్రహ్మ అడిగాడు.
వ్యాసమహర్షి పరమేష్థికి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు.అప్పుడు బ్రహ్మ " మహర్షీ! ఈ కధ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు.నీవు సంకల్పించిన గ్రంధం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది " అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్ధించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు.వ్యాసమహర్షి గజాననుడికి నమస్కరించి " లంబోదరా! మహాభారత మహా గ్రంధాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను.అది నేను చెబుతూవుంటే మీరు వ్రాసుకుపోతు వుండాలి.ఏమంటారు స్వామీ " అని అడిగారు.
అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు." నేను వ్రాస్తూ వున్నప్పుడు నా లే్ఖిని క్షణమైనా ఆగడానికి వీలు లేదు.అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా? " అని అడిగాడు.
ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులగా, " దేవా! నేను చెప్పేదాన్ని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతుండాలి. అందుకు తమరు సిద్ధమేనా " అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి.
గణనాధుడు చిరునవ్వు నవ్వి "సరే" అన్నాడు.
ఆ విధంగా వ్యాసుడు చెబుతూవుంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కధ గ్రంధస్ధమై అలరారింది. దానిని మొట్ట మొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కధ చెప్పుకున్నారు.
ఈ కధను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు.గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు శుకయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకధను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసులవారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు.
మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మసూక్ష్మ మంటూ లేదు.ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్ర మన్నారు. ఆధ్యాత్మిక తత్త్త్వవిదులు దీనిని వేదంతసార మన్నారు. నీతికోవిదిలు నీతిశాస్త్రమని, కవి పండితులు మహా కావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ణతిహసికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాషించారు.
విద్యలకు వేలుపు అయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కధ సావధానచిత్తులై వినినవారికి ధర్మార్ధ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి.