చ. పదములు బుట్టినం దలకు| బాటొకయింతయులేక శూరతన్
మదగజవల్లభుఁడు ధృతి| మంతుడు దంతయుగాంత ఘట్టనన్
జెదరగ జిమ్మె నమ్మకరి| చిప్పలు పాదులు దప్ప నొప్పరన్
వదలి జలగ్రహంబు కరివాలము మూలముజీరెగోఱలన్
తా!! అయిననూ గజేంద్రుడు వెఱవక తన ముందటి కాళ్ళను బట్టుకున్న ముసలేంద్రుని వీపుపై బుడుపులు దొలగునట్లు దంతములతో బొడుచుచూ క్రుమ్మగా, ఆ మరరేంద్రుడు భయపడి వెంటనే కరి ముందరి కాల్‌లను విడిచి వేగముగా వెనుకకువచ్చి గజేంద్రుని తోకను దనగోళ్ళతో గీర సాగెను.
******************************************************************************************* 37
క. కరి దిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు| గరకరి బెరయున్
గరికి మకరి మకరికి గరి
భర మనుచును నతల కుతల| భటులదరిపడన్
తా: ఈ విధముగా ఆ కొలనియందు ఒండొరులకు పగహెచ్చి మకరము మత్తేభమును లోనికీడ్చుచుండగా, మత్తేభము మొసలిని గట్టుపై కీడ్చుచుండెను. ఇది చూసి మడుగునందున్న మొసళ్ళు, మరకేంద్రుడే మహోన్నతుడని గట్టుపైనున్న యాడుగజములు గజేంద్రుడే గొప్పవాడని దలపోయసాగినవి.
****************************************************************************************** 38
వ. ఇట్లు కరిమకరంబులు రెండును నొండొంట సముద్ధండ
దండంబులై తలపడి నిఖిలలోకావలోకనభీకరంబులై
యన్యోన్య విజయశ్రీ వశీకరంబులయి సంక్షోభిత కమలా
కరంబులై హరిహరియును గిరిగిరియునుందాకి పిఱుతి
వియక పెనంగు తెఱంబున నీరాటంబైన పోరాటంబు
నంబట్టుచు వెలికి లోనికిందిగుచుచు గొలంకు కలంకం
బొంద గడువడి నిట్టట్టు వడి తడబడక బుడబుడానుకారం
బులై భుగులు భుగుల్లను చప్పుళ్లతో నురువులు గట్టుచు
జలంబు లుప్పరం బున కెగయం జప్పరించుచు, దప్పక వదన గహ్యరం
బుల నప్పళించుచు నిశిత నితాంత దురంత దంతకుంతం
బుల నింతింతలు దునియలయి నెప్పశంబునం బునక
చిప్పలు కుదుళ్ళు దప్పి రక్తంబులు గ్రమ్ముదేఱ హుమ్మని
యొక్కుమ్మడిం జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులం
గదలక పదంబుల మొదలి పట్టువదలక కుదురైయుండుచు
బరిభ్రమణవేగంబున జలంబులందిరుగుచు మకర గమఠకర్కట
గండక మండూకాది సలిల నియమంబుల ప్రాణంబులు
క్షీణంబులుగా నొకటొకటిం దాకు రభసంబున నిక్కలువడ
మ్రక్కన్ ద్రొక్కుచు మెండుచెడి బెండువడి నాచు
గుల్లచిప్ప తండంబులం బరస్పర తాడనంబులకు నడ్డంబుగా
నొడ్డుచు నోలమాస గొనక గెలుపు దలంపులు బెట్టిదం
బులై రెట్టింప నహోరాత్రంబులంబోలె గ్రమక్రమ
విజృంభ మాణంబులై బహుకాల కలహ విహారంబులై
నిర్గతనిద్రాహారంబులై యవక్ర పరాక్రమ ఘోరంబులై
పోరుచున్న సమయంబున
తా!! మత్తేభ మరములు పోరువల్ల భీతిగొల్పే బుగబుగ ధ్వనులతో నీటి యందు నురగలు బుడగల నెగ జిమ్ముచు కొలనుని కలచివేసాయి. గజేంద్రుని దంతపుముక్కలు, మకరి మూపున నున్న పొలుసు ముక్కలతో అచ్చటి కొలని నీరంతయు రక్తసిక్తమై పోయింది. భీకరహుంకార ధ్వనులతో దమతమ స్థానములను వీడక భీకరపోరు జరుపుచుండ, నీటయందలి జలచరములన్నియు నశించిపోవ నిద్రాహారములను విడిచి రేయింబగళ్ళు పౌరుషముతో నిర్భయముగా పోరు సాగించచున్న సమయమున
******************************************************************************************* 39
క. జవమును జలమును బలమును
వివిధములుగ బోరుకరటి| వీరతకు భువిన్
దివి మకర మీన కర్కట
నివహము లొక్కటన మిత్ర| నిలయము బొందెన్
తా!! బహువేగముతోను, పట్టుదలతోనూ మిక్కిలి బలవంతులై పలుతెఱంగుల పోరు సల్పుచుండగా భయపడిన భూమ్యాకాశములందున్న మకర, మీన, కర్కటములు తమ మిత్రుల గలియజూచెను.
******************************************************************************************* 40
శా. అటోపంబున జిమ్ము ఱొమ్మగల వజ్రాభీలదంతంబులన్
దాటించున్ మెడజుట్టిపట్టిహరిదో| ర్దండాభశుండాహతిన్
నీటిన్ మాటకిమాటికిన్ దిగువగా| నీరాటమున్ నీటి పో
రాటం దోటమిపాటుజూపుట కర| ణ్యాటంబువాచాటమై
తా!! ఆ మకరేంద్రుడు పలు తెఱంగుల గజరాజును లోనికి ఈడ్వబోవ, గజేంద్రము ఘీంకరించి ఒక్కపెట్టున ఆ మకరమును వజ్రాయుధం వంటి తన దంతములతో పొడుచుచూ మకరేంద్రుని రొమ్ము పగులనట్లు కుమ్మసాగెను. నీటి యుద్ధమందుకూడ గజేంద్రుడు వెఱువక, మొసలిని హింసించుచునే ఉండెను., తొండముతో దాని నడుమును చుట్టి కొట్ట సాగెను. (కాని మొసలికి నీటిదెబ్బ తక్కువగానే యుండెను)
******************************************************************************************* 41
వ. అప్పుడు
తా!! గజరాజా విధంగా మకరితో పోరుసల్పు సమయమున
******************************************************************************************* 42
ఆ. మకరితోడ బోరు| మాతంగవిభుని నొ
క్కరుని విడిచి పోవ| గాళ్ళు రాక
కోరి చూచుచుండె| గుంజరీయూథంబు
మగలు తగులు గారె| మగువలకును
తా!! ఆతని ప్రియురాండ్రయిన ఆడఏనుగులన్నియు, తమ నాధుడే జయమునొందవలనని కోరుచూ, అచ్చటనే ఉన్నవి. లోకములో భార్యలు భర్తలగెలుపు కోరుట సహజమేకదా. తమ భర్తలను మరొకరు తూలనాడుటయు సహింపరనుట సహజమేకదా.
******************************************************************************************* 43
వ. అంత
ఆ. జీవనంబు దనకు| జీవనం బైయుంట
నలవు చలమునంత| కంత కెక్కి
మకర ముప్పె డస్సె| మత్తేభ మల్లంబు
బహుళపక్ష శీత| భాను పగిది
తా!!అంత స్థానబలిమి వలన ఆ మకరమునకు రాను రాను బలము, ఉత్సాహము పెరుగజొచ్చెను. అనగా స్థానబలిమిచే మకరము మహోన్నతమగుచుండ, గజేంద్రునికది, అలవి గాని స్థలము మగుటచే మకరముతో పోరాడజాలక, కృష్ణపక్ష చంద్రుని వలె నానాటికి అలసిపోజొచ్చెను.
******************************************************************************************* 44,45
మ. ఉఱుకుం గుంభయుగంబు పై హరిక్రియన్ హుమ్మంచు బాదంబులం
దిఱుకుం గంఠము వెన్ను దన్ను నెగయున్| హేలాగతి న్వాలమున్
జఱచు న్నుగ్గుగ దాకు ముంచు మునుగున్|శల్యంబులుం దంతముల్
విఱుగన్ వ్రేయుచు బొంచి పొంచి కదియున్| వేదండయూథోత్తమున్
తా!! హెచ్చిన స్థానబలముతో మకరేంద్రుడు గజేంద్రుని, కుంభస్థలము మీదికి, సింహమువలె, నెగిరి దుముకుచు, ఏనుగు పాదములను, భీకరముగా పట్టుకొని నీటిలోనికి లాగుచూ, మెడమీదను, వీపుమీదను గొట్టుచూ బాదుచూ హింసించుచు నీళ్ళల్లోముంచుతూ, దానును మునుగుచు, గజేంద్రుని ఎములకను, దంతములను విరగగొట్టుచూ, గట్టుమీదకు పోయే గజేంద్రుని కాళ్ళుపట్టి లోపలికి ఈడ్చుచూ నానావిధముల బాధించుచుండెను.
******************************************************************************************* 46