భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేద వేదాంగాలన్నీ అభ్యసించాడు. ధనుర్విద్య ఆసాంతం నేర్చుకున్నాడు. పాంచాలదేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా ద్రోణుడితోపాటూ చిన్నప్పుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. దానితో వారిద్దరికీ గాఢ స్నేహం కుదిరింది. ఆ స్నేహం కొద్దీ, తాను రాజ్యం చేపట్టిన వెంటనే తన రాజ్యంలో సగభాగం ఇస్తానని ద్రుపదుడు ద్రోణుడికి మాట ఇచ్చాడు.
ఆశ్రమవాసం పూర్తి అయిన తరువాత ద్రోణుడు కృపాచార్యుడి చెల్లెలిని పెళ్ళి చేసుకున్నాడు. అశ్వత్ధామ అనే కుమారుణ్ణి కన్నాడు. ద్రోణుడికి భార్య అన్నా, కొడుకు అన్నా అపరిమితమైన ప్రేమ. కాని బీదరికం వల్ల వాళ్ళను సుఖపెట్టలేక పోయాడు. అందువల్ల ఏదో ఒక విధంగా ధనం సంపాదించి వాళ్ళను సంతోషపెట్టాలనే ఆశ ద్రోణుడ్ని పీడిస్తూ వుండేది. పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని తెలిసింది. కొండంత ఆశతో ఆయన దగ్గరకు వెళ్ళాడు. కాని అంతకు కొంచెం ముందే పరశురాముడు తన దానధర్మాలన్నీ పూర్తి చేసి అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోణుడ్ని చూసి, "స్వామీ! నాకున్నదంతా అయిపోయింది. ఇక మిగిలిందల్లా ఈ శరీరమూ,నేను నేర్చిన అస్త్రవిద్యలూ మాత్రమే. ఆ విద్యలు నేర్పమంటారా?" అని అడిగాడు.
"ఆ అస్త్ర విద్యలు చాలు, అవే బోధించండి నాకు"అన్నాడు ద్రోణుడు.
పరశురాముడు సమస్త విద్యలూ ద్రోణుడికి నేర్పాడు.
కొంతకాలానికి పాంచాల దేశపు రాజు పరమపదించాడు. ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు పట్టరాని ఆనందంతో ద్రుపదరాజు ఆస్తానానికి వెళ్ళి తనను తాను ఫలానా అని పరిచయం చేసుకున్నాడు. ద్రుపదుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఐశ్వార్య మదంతో కన్నూ మిన్నూ గానక ద్రోణుడ్ని ఏవగించుకున్నాడు. " నువ్వెవరో నాకు తెలీదు. అయినా ఏమిటి సాహసం? నీకూ నాకూ స్నేహమంటున్నావు. సింహాసనం ఎక్కిన మహారాజుకూ, అదృష్టం, ఐశ్వర్యం లేని అష్టదరిద్రుడికీ స్నేహమంటే ఎవరైనా నమ్ముతారా? ఏదో చెప్పి నా జట్టు కలవాలని చూస్తున్నావు. దరిద్రుడికీ, ధనికుడికీ, మూర్ఖుడికీ విద్వాంసుడికీ, పిరికివాడికీ వీరుడికీ ఎలా మైత్రి కుదురుతుందనుకున్నావు?" అన్నాడు.
ద్రోణుడు పరాభవంతో వెనక్కి వెళ్ళాడు.
ఇలా వుండగా హస్తినాపురంలో ఒకనాడు రాకుమారులు నగరం వెలుపల ఉద్యానవనంలో బంతి ఆట ఆడుకుంటున్నారు. ఆటలో బంతి వెళ్ళి అక్కడున్న బావిలో పడింది. దానితో పాటూ ధర్మరాజు వేలి ఉంగరం కూడా పడిపోయింది. అందరూ బావి చుట్టూ చేరారు. ఇంతలో ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు వచ్చడు అక్కడికి. " రాకుమారులారా! మీరు క్షత్రియులు కదా! నీళ్ళలోపడిన బంతిని పైకి తీయలేకపోతున్నారే! నేను ఒకే ఒక్క బాణంతో ఆ బంతిని పైకి తీస్తాను. మరి నాకేమిస్తారు?" అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు.
" కృపాచార్యుల వారింట్లో మీకు షడ్రసోపేతమైన భోజనం పెట్టిస్తాం" అన్నారు.
బ్రాహ్మణుడు నవ్వుతూ ఒక పుల్ల తీసుకుని మంత్రించి నీళ్ళలో వున్న బంతిని గురిపెట్టి విసిరాడు. అది బాణంలా రివ్వున వెళ్ళి బంతిని కొట్టుకుంది. అలా ఒకదానికొకటి గుచ్చినట్టు పుల్లలను విసిరేటప్పటికి అది తాడులా తయారైంది. దాన్ని పట్టుకుని పైకిలాగి బంతిని రాకుమారులకిచ్చాడు. రాకుమారులందరూ ఆశ్చర్యపోయారు.
ఉంగరం కూడా తీసిపెట్టమని బ్రతిమాలారు.
అప్పుడు ఆయన ఒక బాణాన్ని నీళ్ళలోకి వేసేటప్పటికి అది సూటిగా వెళ్ళి ఉంగరానికి గుచ్చుకుని పైకి తేలివచ్చింది. రాకుమారులు ఈ విచిత్రం చూసి విస్తుపోయారు. "స్వామీ! మీరెవరు? మా వల్ల కాదగిన ఉపకారం ఏదైనా వుంటే చెప్పండి చేస్తాం" అన్నారు.
" భీష్ముణ్ణి అడగండి. నేనెవరో ఆయనకు తెలుసు." అని పిల్లల్ని పంపించేశాడు.
రాకుమారులు చెప్పిన లక్షణాల్ని బట్టి ఆ బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడని గుర్తించిన భీష్ముడు ఆయనను సకల మర్యాదలతో రప్పించాడు. తన నూట అయిదుగురు మనవళ్ళకూ అస్త్రవిద్యలు నేర్పమని కోరాడు. అలా ద్రోణాచార్యుడి వద్ద కౌరవ పాండవులు అస్త్రవిద్యలన్నీ నేర్చుకున్నారు. చివరికి గురువుగారు దక్షిణ కోరుతూ ద్రుపదరాజును ప్రాణాలతో పట్టితెచ్చి అప్పగించవలసినదని కర్ణుణ్ణీ,ధుర్యోధనుణ్ణీ పంపారు. కాని వాళ్ళ వల్ల ఆ పని కాలేదు. తరువాత ద్రోణుడు అర్జునుడ్ని పంపాడు. అతను ద్రుపదరాజుని మంత్రితో సహా కట్టితెచ్చి ఆచార్యుల వారిముందు నిలబెట్టాడు.
"ద్రుపదరాజా! నీ ప్రాణాలకేమీ మంప్పు లేదు,భయపడకు. చిన్నతనంలో నాతో ఎంతో స్నేహంగా ఉన్నావు. తరువాత రాజ్యాధికారం రాగానే నన్ను అవమానించావు. రాజుతో స్నేహం చెయ్యడానికి రాజే కావాలన్నావు. కయ్యానికైనా వియ్యానికైనా సమాన హోదా ఉండాలన్నావు. ఆ కారణం వల్లనే ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని మళ్ళీ నేను నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను. నేను నీతో స్నేహం చెయ్యాలంటే నువ్వు అష్ట దరిద్రుడుగా ఉండటానికి వీల్లేదు. అందుకని నీ దగ్గర గెలుచుకున్నదాంట్లో సగం రాజ్యం ఇస్తాను తీసుకో" అన్నాడు ద్రోణుడు.
ద్రుపదరాజు అవమానంతో తల దించుకున్నాడు. చేసిన పరాభవం చాలనుకుని ద్రోణుడు అతడిని ఉచితరీతిన సత్కరించి సాగనంపాడు