ద్రోణుడు పరుశురాముడి శిష్యుడు. ఆయన దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. భీష్ములవారు ద్రోణాచార్యుడి ధనుర్విద్యాశక్తిని గురించి విని ఆయనను పిలిపించి కురుపాండవులకు శిక్షణ ఇప్పించాడు.
హస్తినాపురంలో ద్రోణాచార్యులు ధనుర్విద్య నేర్పుతున్న సంగతి ఆ నోటా ఆ నొటా అందరికీ తెలిసింది. కర్ణుడు కూడా విద్యాభ్యాసం కోసం వచ్చాడు.
అందరూ ఎంతో శ్రమపడి విద్య నేర్చుకుంటున్నా, అందరికంటే దీక్షగా అర్జునుడు చేసే సాధన ఆచార్యునికి సంతోషం కలిగించింది. అందుకని మరింత ఓపికతో, ప్రేమతో అతనికి పాఠాలు చెప్పావారు. ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయింది. అయినా అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం ఆరంభించాడు. నిద్రపోతున్న గురువుగారు అర్జునుడి ధనుష్ఠంకారం విని లేచాడు. శిష్యుడి ఏకాగ్రతకు, దీక్షకు పరవశించి గాఢాలింగనం చేసుకుని " అస్త్రవిద్యలో నీ అంతటివాడు వండడు" అని వెన్ను తట్టారు.
రోజులు గడుస్తున్నాయి.
కురుపాండవుల విలువిద్యాశక్తిని పరిశీలించేందుకు ద్రోణాచార్యులవారు ఒకనాడు ఓ పరీక్ష పెట్టారు.ఒక పిట్ట బొమ్మని తయారు చేయించి దానిని ఒక చెట్టు చిటారుకొమ్మకు కట్టి శిష్యులందరినీ పిలిపించారు. ముందుగా ధర్మరాజును పిలిచి "చిటారుకొమ్మన పక్షిని చూశావా? నేనూ, నీ సోదరులూ, చెట్టూ కనిపిస్తున్నాయా?" అని అడిగారు.
అన్నీ చూస్తున్నానన్నాడు ధర్మరాజు.
అలాగే దుర్యోధనాదులందరినీ పిలిచి అడిగాడు.
అందరూ గొప్పగా తలలూపారు.
చివరికి అర్జునుడ్ని పిలిచి అడిగితే "ఆచార్యా! పక్షి తప్ప మరేమీ కనిపించడం లేదు నాకు" అన్నాడు.
"ఆ పక్షి అవయవాలు ఎలా వున్నాయి?" గురువుగారు మరో ప్రశ్న వేశారు.
"దాని శిరస్సు తప్ప మరే అవయవమూ నా దృష్టిలో లేదు" అన్నాడు అర్జునుడు.
దాని శిరస్సు పడగొట్టమన్నాడు ద్రోణుడు.
అనటమే ఆలస్యం- అర్జునుడి ధనస్సు నుండి బాణం దూసుకుపోయింది. పక్షి తల నేల రాలింది.
ద్రోణుడు శిష్యుడ్ని గాఢాలింగనం చేసుకున్నాడు.
అర్జునుడు గురువుగారికి పాదాభివందనం చేశాడు.
అయితే, ఆ రోజుల్లోనే అర్జునుడికి దీటైనవాడు మరొకడు ధనుర్విద్యలో ఆరితేరాడు. అతను హిరణ్యధన్వుడనే ఎలుకరాజు కుమారుడు ఏకలవ్యుడు. అతను ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యులవారిని బ్రతిమాలితే ఆయన తిరస్కరించాడు. అయినా బాధపడక గురువుగారి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాకా ద్రోణుని విగ్రహం ఎదుట వుంచుకుని, ఆ ప్రతిమనే గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్య అభ్యసించటం మొదలు పెట్టాడు.
ఒకనాడు కురుపాండవులు వేటకు వెళ్ళి అడవి జంతువులను సంహరిస్తుండగా వారి వేటకుక్క ఏకలవ్యుడ్ని చూసి మొరిగింది. అది నోరు తెరచి మొరుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు ఒకేసారి దాని నోట్లోకి ఏడు బాణాలు వదిలాడు.
అది అలాగే పాండవుల దగ్గరికి వెళ్ళింది.
పాండవులకు ఆశ్చర్యం కలిగింది.
అంతటి విలుకాడెవరా అని వెదికి వెదికి చివరకు ఏకలవ్యుడని తెలుసుకున్నారు. కుతూహలం చంపుకోలేక "నీ గురువు పేరేమిటి?" అని అడిగారు పాండవులు. "ద్రోణాచార్యులు" అని వినయంగా సమాధానం చెప్పాడు అతను. అతను కూడా ద్రోణుని శిష్యుడే అని తెలియగానే హస్తినాపురం వస్తూనే అర్జునుడు నేరుగా గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. "ఆర్యా! మీ శిష్యులలో నన్ను మించినవాడు లేడన్నారు. కాని మీ శిష్యుడు ఏకలవ్యుడు విలువిద్యలో నాకంటే ఆరితేరాడు" అనగా, ద్రోణుడు అర్జునుడితో అడవికి వచ్చి ఏకలవ్యుణ్ణి చూశాడు. ఆ వీరుడు ద్రోణుడికి నమస్కరించి గురుదక్షిణగా ఏం కావాలన్నా యిస్తానన్నాడు. వెంటనే కుడిచేతి బొటనవేలు కోసి యిమ్మన్నాడు. ఏకలవ్యుడు సంతోషంగా గురువు కోరిన ప్రకారం దక్షిణ అర్పించాడు.
"నిన్ను మించిన విలుకాడు ఉండటానికి వీల్లేదు" అని ద్రోణుడు అర్జునుడికి చేసిన వాగ్ధానం కోసం ఏకలవ్యుని అంగుష్ఠం గ్రహించి తిరిగి వచ్చాడు.