ధర్మరాజు దివ్యాస్త్రాలు సంపాదించుకురమ్మని అర్జునుణ్ణి హిమగిరి ప్రాంతాలకు పంపాడు. అర్జునుడు దక్షిణదిశగా వెళ్ళి ఇంద్రలోక పర్వతం మీద తపస్సు చేసాడు. ఇంద్రుడు సంతోషించి కోరినన్ని వరాలు ఇచ్చాడు. అటు తరువాత యమధర్మరాజు దండాస్త్రాన్నీ, వరుణుడు పాశాన్నీ, కుబేరుడు అంతర్ధానాస్త్రాన్నీ ఇచ్చారు. అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాలు సంపాదించడం ఇంద్రుడికి నిజంగా ప్రీతి కలిగించింది. తన రథ సారథి మాతలిని పిలిచి అర్జునుణ్ణి దేవలోకానికి తీసుకురావల్సిందిగా ఆజ్ఞాపించాడు.
మాతలి సరేనని వెళ్ళాడు.
మాతలి సారథ్యంలోని రథం బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా వుంది. వాయువేగంతో పరుగులు తీసే గుర్రాలు ఆ రథానికి పూంచి వున్నాయి. అవి మహాఘోషతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళాయి.
మాతలి అర్జునుడి దగ్గరకు వెళ్ళి, "అర్జునా! అమరనాథుడు నిన్ను స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. దేవ, ముని, గంధర్వ, అప్సరసలతో కొలువుతీర్చి దేవేంద్రుడు నీ రాకకై ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ళు అక్కడే అమర సుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి వెళ్లవచ్చని ఇంద్రుడు నీతో చెప్పమన్నాడు" అన్నాడు.
అది విని అర్జునుడు మహదానందపడ్డాడు. దేవరథం అధిరోహించాడు. తక్షణం అది దివ్యపథం పట్టింది.
అమరావతీనగర మొగసాలలో ఆగింది. రథం దిగి లోకానికి నడిచాడు. అక్కడ దేవేంద్రుడు కొలువుతీరి ఉన్నాడు.
సవ్యసాచి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇంద్రుడు అర్జునుణ్ణి కౌగలించుకుని ఆప్యాయంగా శిరస్సు నిమిరాడు. నారదుడు ఆశీర్వదించాడు. తుంబురుడు పాట పాడాడు. అప్సరసలు నృత్యం చేశారు.
పార్థుడు అమరలోకంలో కొన్నాళ్ళుండి భూలోకంలో లేని సంగీత నృత్యగానాలూ, విలువిద్యలో మెళకువలూ తెలుసుకున్నాడు.
అర్జునుడి అందానికీ, ఠీవికీ, శక్తియుక్తులకీ దేవలోకంలోని అప్సరస్త్రీలు సమ్మొహితులయ్యారు. పాండవ మధ్యముడికి తన ప్రేమను అర్పించాలని సౌందర్యరాశి ఊర్వశి తహతహలాడసాగింది. అర్జునుడితో తన ప్రేమ సఫలమయ్యేట్టు చూడమని ఇంద్రుణ్ణి ప్రార్థించింది.
పార్థుడికి తన కోరిక తెలియపరచమని పరిచారిక చిత్రసేనను వేడుకుంది.
చిత్రసేన వెళ్ళి "మన్మథాకారా! అప్సరకన్య మా ఊర్వశి నిన్ను మోహించింది. నీవు లేకుండా క్షణమైనా గడపలేనంటోంది. కనుక ఆమెను చేపట్టి సుఖాలు అనుభవించు" అని అర్జునుడితో చెప్పింది.
అది విని ధనుంజయుడు చెవులు మూసుకున్నాడు. "ఆమె నాకు తల్లితో సమానం. పూజ్యురాలు. మా వంశానికి మూల పురుషుడైన పురూరవుణ్ణి ఆమె వరించింది. కనుక ఇలాంటి చెడు ఆలోచన ఆమె మనస్సులో రావటం మంచిది కాదని చెప్పు " అని బదులు చెప్పాడు.
చిత్రసేన వెళ్ళి ఆ సంగతి ఊర్వశితో చెప్పింది.
జగదేకసుందరి ఊర్వశి చిరుకోపం తెచ్చుకుని అందెలు ఘల్లుఘల్లున మోగుతుండగా తానే బయలుదేరి పార్థుడి మందిరానికి వెళ్ళింది.
"మేము అప్సరకాంతలం. భూలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వచ్చిన మహనీయులను సంతోషపెట్టటం మా విధి. పూరు వంశంలో జన్మించిన ఎందరో రాజులు స్వర్గానికి వచ్చి నాతో సౌఖ్యం అనుభవించారు. కాబట్టి నీవూ సంశయించక నాతో సుఖాలు అనుభవించు" అని చెప్పింది.
"తల్లీ! నీవు చెప్పింది నిజమే కావచ్చు. పెద్దలూ మహనీయులూ ఏమీ చేసినా ఒప్పే. కాని నా వంటి వాడికి అది తగని పని. ఈ అనుచితకార్యానికి నా మనస్సు అంగీకరించదు. నన్ను మన్నించు" అన్నాడు పార్థుడు.
అర్జునుడు అలా తిరస్కరించేసరికి ఊర్వశి కోపం పట్టలేకపోయింది. "పార్థా! నేను స్త్రీని. పైగా నా అంతట నేను వలచి వచ్చినందుకు నన్ను చులకన చేశావు. పరాభవించావు. కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నీవు మానరహితుడవై ఆడపిల్లలకు ఆట పాటలు నేర్పుతూ స్త్రీ, పురుష జాతికి దేనికీ చెందకుండా వుందువు గాక!" అని తీవ్రంగా పలికి వెను దిరిగి వెళ్లి పోయింది.
ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. నాయనా! ఊర్వశి శాపానికి భయపడకు. నీకు ఒక ఏడాది అజ్ఞాత వాసం ఎలాగో చెయ్య వలసి ఉంది. ఆ సమయంలో ఇతరులు నిన్ను ఎవరూ పోల్చు కోకుండా ఉండేందుకు ఈ శాపం బాగా ఉపకరిస్తుంది. అజ్ఞాత వాసం పూర్తయ్యాక నీ అసలు రూపం నీకు వస్తుంది" అని దీవించాడు.
అర్జునుడు సంతుష్టుడైనాడు.