చెడంటూ ఎవరికీ జరగదు. ఎన్నో జరుగుతుంటాయి. నచ్చని వాటిని మీరు చెడు అనుకుంటారు. చూడండి...ఈ రోజు పెళ్లనుకుందాం. మీరు వీధిలో ఊరేగింపుగా వెళదామనుకున్నారు. కానీ ఈ రోజు పెద్ద వాన పడింది. అంతా తడిసి ముద్దయ్యారు. అది మీకు చెడు. కానీ ఇంకొకరు ఈ వర్షం కోసం ప్రార్ధిస్తున్నారు. అతనికి వర్షం పడుతోందని చాలా ఆనందం. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అన్నది కేవలం మీ ఇష్టాయిష్టాల మీదే ఆధారపడుతుంది, అవునా? కాబట్టి మనం జీవితాన్ని మంచీ చెడులని వేర్వేరుగా చూడొద్దు.
ఎందుకంటే మీరంతా దేవుణ్ణి నమ్ముతున్నారు, అవునా? మీరు దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయనే అన్నీ సృష్టించాడని నమ్ముతున్నప్పుడు ఇక మంచీ చెడూ ఎక్కడ? ఇదంతా మీకు అవసరమేనేమో? అందుకే ఆయన ఇలా చేస్తున్నాడేమో అనుకోవాలి. కాదంటే మీ దేవునిపై మీ నమ్మకం అసలైనది కాదని అర్థం. అవునా? మీరు దేవుణ్ణి నమ్మితే, అతను చేసేవన్నీ సరైనవై ఉండాలి. అవునా? లేదంటే అసలు దేవుణ్ణే తొలగించాలి! తాను చేసేది అతనికే తెలియకుంటే, అతనిని ఆ ఉద్యోగం నుంచి తప్పించాలి. అతను అంతా తెలిసే చేస్తుంటే మనం ఇక ఫిర్యాదు చేయకూడదు