Followers

Saturday, 16 March 2013

రామాయణం-మహాభారతం (Ramayanam-MahaBharatham))



రామాయణం-మహాభారతం


"మన ప్రవర్తన ఎలా ఉండాలి?" అనే ప్రశ్నకు సమాధానం రామాయణమైతే "లోకం పోకడ ఎలా ఉంది?" అనే ప్రశ్నకు సమాధానం మహాభారతం.

మన ప్రవర్తన ఎలా ఉండాలో రామాయణంలోని పాత్రలు చెబుతాయి:

అన్నదమ్ముల అనుబంధం: రామ-లక్ష్మణులు
స్నేహం: సుగ్రీవమైత్రి
తండ్రీకొడుకుల అనుబంధం: దశరథ-రాములు
యజమాని-సేవకులు: రామ-హనుమ
పాలకుడు-ప్రజలు: రాముడు-అయోధ్య ప్రజలు

ఐతే భార్యాభర్తల అనుబంధమెలా ఉండాలో తెలుసుకోవడానికి మాత్రం రామాయణంలో వెదక్కండి. ఒక ఆదర్శవంతుడైన పాలకుడిగా ఉండాలో, లేక ఒక మంచి భర్తగా ఉండాలో నిర్ణయించుకోవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు రాముడు ఒక మంచి పాలకుడిగా ఉండడానికే నిశ్చయించుకున్నాడు. ఎటుతిరిగీ తన తప్పేమీ లేకుండా ఆ నిర్ణయానికి బలైపోయింది మాత్రం సీత. (సీత-ద్రౌపదుల గురించి వివరంగా ఇంకొకసారి)

ఇక మహాభారతం విషయానికొస్తే అది అన్నదమ్ముల బిడ్డల (దాయాదుల) మధ్య ఆస్థి (రాజ్యం) కోసం జరిగిన గొడవ. ఇలాంటి గొడవ రామాయణంలో వాలి-సుగ్రీవుల మధ్య జరిగినట్లనిపించినా అక్కడి పరిస్థితులు వేరు. సుగ్రీవుడు తనను చంపడానికి కుట్ర పన్నాడని వాలి బలంగా నమ్మాడు. సుగ్రీవుడి సదుద్దేశాన్ని ఋజువుచేసే ఆధారాలేమీ లేవు. పైగా వాలి తిరిగొచ్చేటప్పటికి సుగ్రీవుడు వాలి భార్యతో ఉంటూ, వాలి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందుకే వాలి సుగ్రీవుడి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇక తను చెప్పేది ఏ మాత్రమూ నమ్మక వాలి నేరుగా తనను చంపవస్తే పారిపోవడమో ఎదురు తిరగడమో తప్ప సుగ్రీవుడికి గత్యంతరం లేదు.

మహాభారతంలో నాకు కౌరవులు-పాండవుల మధ్య మౌలికంగా ఎటువంటి తేడా కనబడలేదు. వాళ్ళు చేసింది అధర్మమైతే వీళ్ళూ తక్కువేమీ చెయ్యలేదు. వీళ్ళు వీరులైతే వాళ్ళ వైపు అంతకంటే గొప్ప వీరులున్నారు. ధర్మరాజుగా పిలవబడే యుధిష్ఠిరుడు జూదం ఆడేటప్పుడు ఎంతటి హీనస్థితికైనా దిగజారుతాడని ఒకసారి కాదు రెండుసార్లు ఋజువైంది. ఇతర విషయాల్లో కూడా అతడి ప్రవర్తన నాకేమీ ఉదాత్తంగా అనిపించలేదు. అతడికి ధర్మం తెలుసు. కానీ తనకు తెలిసిన ధర్మాన్ని అతడు పాటించడంలోనే వచ్చింది తేడా.

జూదం సప్తవ్యసనాల్లో ఒకటి. తప్పుడుపని అన్న తర్వాత ఎవరుచేసినా తప్పే. జూదం యుధిష్ఠిరుడి అతిపెద్ద బలహీనత - తనతోబాటు తోడబుట్టినవాళ్ళను, కట్టుకున్న పెళ్ళాన్ని సైతం తాకట్టు పెట్టేంత. (అందులోనూ అతడు పందెంగా ఒడ్డిన ద్రౌపది అతడొక్కడికే భార్య కాదు! ఆమెను ఒడ్డేముందు ఆమె ఆమోదం, ఆమె ఇతర భర్తల అంగీకారం తీసుకోవాలనే కనీస బాధ్యత కూడా మరిచిపోయేటంతగా ఆ వ్యసనానికి బానిసైనాడు). దీన్ని ఎవరైనా ఏ రకంగా సమర్థిస్తారో నాకర్థం కాదు. అందులోనూ ఇవే పందాలు ఒడ్డి ఓడిపోవడం వెంటవెంటనే రెండుసార్లు జరిగింది. మొదటిసారి ఓడిపోయినప్పుడు ద్రౌపదికి ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలతో దాస్యవిముక్తి పొందిన వాడు, మళ్ళీ వెంటనే గుడ్డిగా జూదానికి సిద్ధపడ్డమేమిటో! బలహీనతలున్నవాళ్ళు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండతగరు. కేవలం దృష్టి లోపం వల్ల ధృతరాష్ట్రుడు రాజ్యపాలనకు అనర్హుడైతే, వ్యసనపరుడు కాబట్టి యుధిష్ఠిరుడూ అనర్హుడే కావాలి.

ఇక అందరికీ తెలిసినా గుర్తించడానికి ఇష్టపడని, కుంటిసాకులు చెప్పే విషయాలు(చారిత్రక దృక్పథంతో చూసినప్పుడు కృష్ణుడు భగవదవతారమనే విషయాన్ని కాసేపు మరిచిపోదాం):

భీష్ముడి చావు: యుద్ధభూమిలో రాత్రిపూట శతృశిబిరానికి వెళ్ళి "బాబ్బాబు! నువ్వు చచ్చిపో! లేదా కనీసం నిన్నెలా చంపాలో నువ్వే చెప్పు." అని దేబిరించినవాడు యుధిష్ఠిరుడు.

ద్రోణుడి చావు: 'మిన్ను విరిగి మీదపడినా సరే వీడు అబద్ధమాడడు' అని నమ్మించి అతిఘోరమైన అబద్ధంతో గురువు ప్రాణాలనే బలిగొన్నవాడు యుధిష్ఠిరుడు. (యుద్ధంలో గెలవాలంటే గురువును చంపక తప్పదని ముందే తెలుసు. కానీ చంపించడానికి అవలంబించిన పద్ధతే అనైతికం.)

అది అనైతికం కాదనే వాళ్ళు ఒక్కసారి నిష్పాక్షికంగా ఆలోచించండి: ద్రోణుడికి వినబడేలా చెప్పదలచుకున్నదేమో పచ్చి అబద్ధం. ఆ అబద్ధాన్ని కూడా ధైర్యంగా చెప్పలేని పిరికివాడు, అబద్ధాన్ని నిజంలా భ్రమింపజేయడానికి మరింత కుటిలత్వానికి పాల్పడినవాడు యుధిష్ఠిరుడు.

ఇక కర్ణుడి చావులోనూ, దుర్యోధనుడి చావులోనూ జరిగింది అధర్మమే. "నిరాయుధుల మీద ఆయుధాన్ని ప్రయోగించరాదు." ఇది యుద్ధనీతి. భీష్ముణ్ణీ, ద్రోణుణ్ణీ ఆయుధం ప్రయోగించలేని స్థితిలోకి నెట్టీ, కర్ణుణ్ణి నిరాయుధుడుగా ఉన్నప్పుడూ చంపడం జరిగింది. వాళ్ళలో ఏ ఒక్కరు చనిపోకపోయినా యుద్ధఫలితం తారుమారై ఉండేది.

ఇక గదాయుద్ధంలో ప్రథమ నియమం: గదను నాభి క్రిందిభాగంలో ప్రయోగించరాదు. దుర్యోధనుణ్ణి చంపిందేమో గదతో తొడలు విరగ్గొట్టి. చిన్నప్పుడు భీముణ్ణీ, పెద్దయ్యాక లక్క ఇంట్లో పాండవులందరినీ చంపబూనడం, మాయాజూదం కౌరవులు చేసిన నేరాలైతే, వాటిని సాకులుగా చూపి పాండవులు చేసిన తప్పుడు పనులు అంతకంటే ఎక్కువే. యుద్ధం ధర్మబద్ధంగా జరిగి ఉన్నట్లైతే పాండవులు తుక్కుతుక్కుగా ఓడిపోయుండేవాళ్ళు.

మహాభారతయుద్ధం చరిత్రే. అందులో అనుమానం లేదు. ఐతే స్వర్గారోహణపర్వం లాంటివి కేవలం కవుల కల్పన. "ఒక్క విజయం వంద తప్పుల్ని కప్పేస్తుంది." అన్నట్లు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పొందిన అంతిమ విజయం వారిలోని లోటుపాట్లను కప్పేసి వారిని హీరోలను చేసింది.

Popular Posts