Followers

Wednesday, 5 February 2014

సృష్టి విధానం - 1

మూల ప్రకృతి అనేది బిందు రూపములో ఉంటుంది. ఇది మహా సూక్ష్మం. స్వరూప స్వభావమేదీ తెలియదు.  తరువాత ఉండీ ఉండనట్లు ఉండేది అవ్యక్తము. తరువాత "ఇది లేకపోతే ఏ పని జరగదు " అని అనిపిస్తుంది. అది ప్రధానం. తరువాత పరమాత్మ గుణములు కూర్చుటతో ఒక స్వభావానికి వస్తుంది. ఇది ప్రకృతి. అపుడు ఆ గుణమయి అయిన ప్రకృతిలోకి పరమాత్మ ప్రవేశించి క్షోభింపచేస్తాడు. "దారాలను ముట్టుకోకుండా వస్త్రాన్ని ముట్టుకున్నట్టు" పరమాత్మ గుణత్రయముతో ఉన్న ప్రకృతిలో ఆ గుణాలని తాకకుండా ప్రవేశిస్తాడు. అహంకార సృష్టి ఏర్పడే వరకూ ప్రకృతిలో గుణములు బయటకి తెలియబడవు. ప్రకృతిని క్షోభింపచేసిన తరువాత, ప్రకృతిని నుండి మహత్ తత్వం ఆవిర్భవిస్తే. వాటి నుండి అహంకారం వస్తే, ఆ అహంకారములో త్రిగుణాలు ఆవిష్కరింపబడతాయి. అహంకారములోకి ప్రకృతి తత్వములో ఉన్న గుణాలు ప్రవేశింపచేస్తాడు. ఇటువంటి పరమాశ్చర్య కరములైన కర్మలు పరమాత్మ చేస్తాడు. ఇది నిర్విశేషం. పృధివ్యాదులు లేనిది, గుణవ్యతికరము లేనిది.
అన్నిటికీ కారణమైన ఆ మూల ప్రకృతిని అనాయాసముగా లీలగా సృష్టించాడు.

సకల చరాచర జగత్తు ఆ పద్మములో నిలిచి ఉంది. ఒకటిగా ఉన్న పద్మము, ఏమీ కనపడని స్థితి, అందులో తాను ప్రవేశించి, అందులో దాగి ఉన్న అన్ని లోకములనూ, పరమాత్మ తన సంకల్పముతో, ఎవరికీ కనపడని కాలముతో వేరు వేరు చేసాడు. ప్రతీ వస్తువులోనూ పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు. పురుషరూపములో లోపలా, కాల రూపములో బయట. లోపల ఉన్నవాడు సంకల్ప వికల్పాలు కలిగిస్తాడు. బయట ఉన్న వాడు ఆ సంకల్పము కలిగేట్టు ప్రోత్సహిస్తాడు (శాసిస్తాడు).

మనకు ఇప్పుడు ఏది ఎలా కనపడుతున్నదో ఇలాంటిదే అంతకు ముందు ఉన్నాది, ఇకముందు కూడా ఉంటుంది.

Popular Posts