Followers

Wednesday, 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంథం పదహారవ అధ్యాయం

బ్రహ్మోవాచ
ఇతి తద్గృణతాం తేషాం మునీనాం యోగధర్మిణామ్
ప్రతినన్ద్య జగాదేదం వికుణ్ఠనిలయో విభుః

ఈ ప్రకారముగా పలుకుచున్న యోగధర్ములైన ఆ మునులు పలికిన మాటలకు అభినందించి ఇలా మాట్లాడాడు

శ్రీభగవానువాచ
ఏతౌ తౌ పార్షదౌ మహ్యం జయో విజయ ఏవ చ
కదర్థీకృత్య మాం యద్వో బహ్వక్రాతామతిక్రమమ్

వీరిద్దరూ నా ద్వారపాలకులు. నా అభిప్రాయాన్ని కాదని మిమ్ము అవమానించారు.

యస్త్వేతయోర్ధృతో దణ్డో భవద్భిర్మామనువ్రతైః
స ఏవానుమతోऽస్మాభిర్మునయో దేవహేలనాత్

నా భావాన్ని అనుసరించే మీరు వీరిని దండించారు. ఆ దండాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. దైవాన్ని అవమానించిన వీరు చేసిన తప్పుకు మీరు విధించిన శిక్ష నాకు అంగీకారము

తద్వః ప్రసాదయామ్యద్య బ్రహ్మ దైవం పరం హి మే
తద్ధీత్యాత్మకృతం మన్యే యత్స్వపుమ్భిరసత్కృతాః

అయినా నేను ప్రార్థిస్తున్నాను. బ్రాహ్మణులు నాకు దైవం. మా వారితో అవమానింపబడ్డారు మీరు. అది నా తప్పుగా నేను భావిస్తున్నాను.

యన్నామాని చ గృహ్ణాతి లోకో భృత్యే కృతాగసి
సోऽసాధువాదస్తత్కీర్తిం హన్తి త్వచమివామయః

ఒక వ్యక్తి యొక్క తప్పు చెప్పేప్పుడు తప్పు చేసిన వాడితో బాటు, వాడి యజమాని పేరు కూడ చెబితే దాని వలన అపకీర్తి వచ్చేది ఆ సేవకుని కాదు. అలాంటి సేవకున్ని పనిలో పెట్టుకున్న యజమానిది. మన చర్మరోగం మనకు తెలియకుండా లోలోపల ఎలా హాని చేస్తుందో, యజమాని స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించే సేవకులు కూడా చర్మవ్యాధిలాంటి వారు.

యస్యామృతామలయశఃశ్రవణావగాహః
సద్యః పునాతి జగదాశ్వపచాద్వికుణ్ఠః
సోऽహం భవద్భ్య ఉపలబ్ధసుతీర్థకీర్తిశ్
ఛిన్ద్యాం స్వబాహుమపి వః ప్రతికూలవృత్తిమ్

నా కీర్తి చెవిలో పడిన వెంటనే అత్యంత నీచ జాతి నుంచీ, ఉత్తమ జాతి వరకూ ప్రపంచమంతా పవిత్రమవుతుందిఓ, ఆ కీర్తి మీ వంటి వారు ప్రచారము చేయడం వలననే లోకానికి తెలిసింది. ఉపలబ్ధ అనే పదానికి పొందబడినది అనీ, నిందించబడినదీ అన్న రెండు అర్థాలు ఉన్నాయి. మీచేత పొందబడిన కీర్తి అని అర్థం వస్తుంది. మీ చేత నిందించబడిన కీర్తి గలవాడిని అని కూడా అర్థం వస్తుంది. నా కీర్తి పెరిగినా తగ్గినా మీ వల్లనే.మీకు వ్యతిరేకముగా ప్రవర్తించే వారు నాకు అనిష్టులే. పొరబాటున నా బాహువు మీకు ప్రతికూలముగా ప్రవర్తిస్తే, నా బాహువును కూడా నరికేసుకుంటాను.

యత్సేవయా చరణపద్మపవిత్రరేణుం
సద్యః క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలమ్
న శ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః
ప్రేక్షాలవార్థ ఇతరే నియమాన్వహన్తి

నాకొచ్చిన బిరుదులన్నీ మీ సేవచేతనే వచ్చాయి. మీ సేవ వలన నా పాదపరాగము అందరినీ పవిత్రము చేస్తున్నది. సేవించిన వెంటనే అన్ని పాపాలు పోగొడుతుంది, పిలిచిన వెంటనే స్వామి కాపాడుతాడు, ఎన్ని తప్పులనైనా పరమాత్మ క్షమిస్తాడు, అనే ఈ పేర్లు మీ సేవ వలనే వచ్చింది. ఏ మహానుభావురాలి కడగంటి చూపు కోసం లక్షల కోట్ల సంవత్సరాలు తపస్సు చేతారో, ఆమె నన్ను విడిచిపెట్టి వెళ్ళదు. అదీ మీ సేవ వలననే,

నాహం తథాద్మి యజమానహవిర్వితానే
శ్చ్యోతద్ఘృతప్లుతమదన్హుతభుఙ్ముఖేన
యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతోऽనుఘాసం
తుష్టస్య మయ్యవహితైర్నిజకర్మపాకైః

యజ్ఞ్య యాగాదులతో ఆచరిస్తూ, నిరంతరమూ నేయి వేస్తూ నన్ను అర్చిస్తే నేను అంతగా తృప్తి పొందను. తాను ఆచరించిన కర్మల వలన తనకు లభించిన ఫలితముతో తృప్తి పొందే బ్రాహ్మణోత్తములు (నిజకర్మపాకైః సంతుష్టస్య) భుజించే దానితో నేను తృప్తి పొందుతున్నాను.
(తృప్తి పొందిన క్షత్రియుల వలే తృప్తి పొందని బ్రాహ్మణుడు నశిస్తాడు. తృప్తి పొందిన వేశ్య వలే, తృప్తి పొందని గృహిణి నశిస్తుంది). ఆ బ్రాహ్మణుడు నోటితో తింటున్నదానితో నేను తృప్తి పొందుతాను.

యేషాం బిభర్మ్యహమఖణ్డవికుణ్ఠయోగ
మాయావిభూతిరమలాఙ్ఘ్రిరజః కిరీటైః
విప్రాంస్తు కో న విషహేత యదర్హణామ్భః
సద్యః పునాతి సహచన్ద్రలలామలోకాన్

నేను పరమ బ్రాహ్మణోత్తముల పాద పరాగాన్ని శిరస్సున వహిస్తాను. అందుకే నా పాదమునుండి ఉద్భవించిన గంగనూ, శంకరుడినీ పవిత్రం చేసింది. గంగ నాపాదమునుండి పుట్టడానికి కారణం మీవంటి వారి పాద పరగాన్ని శిరస్సున వహించడమే. నేనే మీ వంటి బ్రాహ్మణోత్తముల పాద పరగాన్ని శిరస్సున ధరిస్తున్నప్పుడు, ఎవరు మీ వంటి వారిని సహించరు? గోవులూ, బ్రాహ్మణులు నా శరీరం.

యే మే తనూర్ద్విజవరాన్దుహతీర్మదీయా
భూతాన్యలబ్ధశరణాని చ భేదబుద్ధ్యా
ద్రక్ష్యన్త్యఘక్షతదృశో హ్యహిమన్యవస్తాన్
గృధ్రా రుషా మమ కుషన్త్యధిదణ్డనేతుః

బ్రాహ్మణులూ గోవులూ అన్ని ప్రాణులూ నా శరీరమే. జగత్తు మొత్తం నా స్వరూపం కాదనీ, నా కన్న భిన్నమైంది వేరే ఉంది అనుకొనే వారు నా వారు కాదు. పరమాత్మ వేరు ప్రపంచం వేరు అన్న బుద్ధితో ప్రాణులకు రక్షణ కల్పించని వారినీ, ఆదరించని వారిని, దీనులనూ దరిద్రులను చూస్తే పాపము చేత మలినమైన వారి చూపుతో బుస కొడతారు. వారు లోభం కలవారు (గృధ్రా - లోభి తరువాత జన్మలో గ్రద్దగా పుడతారు అని శాస్త్రం), నేను సంపాదించినదంతా నాకే దక్కాలి అనుకొనేవారు, అంచేత దీనులని ఆదరించని వారు, అలాంటి వారిని నావాడు (యముడు) దండిస్తాడు. దీనులకీ దిక్కులేని వారికి సహాయం అందించే వారితో నేను తృప్తి పొందుతాను.

యే బ్రాహ్మణాన్మయి ధియా క్షిపతోऽర్చయన్తస్
తుష్యద్ధృదః స్మితసుధోక్షితపద్మవక్త్రాః
వాణ్యానురాగకలయాత్మజవద్గృణన్తః
సమ్బోధయన్త్యహమివాహముపాహృతస్తైః

మనల్ని నిన్దిస్తున్నవారిని కూడా పూజ చేసే వారు. సంతోషమునిండిన హృదయముతో బ్రాహ్మణఉలను పూజించే వారు. మనసంతా సంతోషం నిండి ఉన్నట్లు తెలుపుతూ ముఖము కూడా చిరునవ్వులు చిందిస్తూ  పద్మ వక్త్రము కలవారు కావాలి. ఆ బ్రాహ్మణోత్తములను తన పుత్రులతో ఎలా మాట్లాడతారో అంత ప్రేమగా మాట్లాడి, నన్ను ఎలా పిలుస్తారో ఎలా ఆదరిస్తారో అలా ఆదరిస్తే, వారి చేత గౌరవించబడేది ఆ బ్రాహ్మణోత్తములు కాదు, నేనే. నేనే వారి చేత గౌరవింపబడుతున్నా అని తెలుసుకోండి.

తన్మే స్వభర్తురవసాయమలక్షమాణౌ
యుష్మద్వ్యతిక్రమగతిం ప్రతిపద్య సద్యః
భూయో మమాన్తికమితాం తదనుగ్రహో మే
యత్కల్పతామచిరతో భృతయోర్వివాసః

ఈ జయ విజయులు సరిగ్గ వ్యవహరించలేదు. తమ యజమాని స్వభావాన్ని గుర్తించలేకపోయారు. మీకు వ్యతిరేకముగా ప్రవర్తించి మీ శిక్షను పొందారు. దానికి నన్ను అనుగ్రహించి మీరు ఆమోదిస్తే దానికి చిన్న సవరణ చేస్తాను. వీరు నానుంచి ఎక్కువ కాలం దూరముగా ఉండకుండా త్వరలో నా దగ్గరకు వచ్చేలా అనుగ్రహించండి. అలా ఒప్పుకుంటే మీర్ నన్ను అనుగ్రహించినట్లే.

బ్రహ్మోవాచ
అథ తస్యోశతీం దేవీమృషికుల్యాం సరస్వతీమ్
నాస్వాద్య మన్యుదష్టానాం తేషామాత్మాప్యతృప్యత

వేదములా ఉన్న, పరమ పావనమైన పరమాత్మ మాటలు విని కోపమనే పాము కరిచిన వారి మనసు తృప్తి పొందింది


సతీం వ్యాదాయ శృణ్వన్తో లఘ్వీం గుర్వర్థగహ్వరామ్
విగాహ్యాగాధగమ్భీరాం న విదుస్తచ్చికీర్షితమ్

పెద్ద అర్థము గల, లోతు తెలియని సముద్రములా గంభీరమైన అర్థము గల చిన్న చిన్న మాటలతో కూడిన స్వామి వాక్కు విన్న వారికి పరమాత్మ ఏమి చేయాలనుకుంటున్నాడో అర్థం కాలేదు.

తే యోగమాయయారబ్ధ పారమేష్ఠ్యమహోదయమ్
ప్రోచుః ప్రాఞ్జలయో విప్రాః ప్రహృష్టాః క్షుభితత్వచః

జగత్తులో అణువు నుండీ బ్రహ్మగారి వరకూ లభించిన పదవులన్నీ ఈయన కడగంటి చూపుతో లభించినవే, ఆయన చూపు చేతనే బ్రహ్మ పదవి పొందారు, తమకు కూడా అయన దయ చేతనే ప్రాజాపత్య పదవి లభించింది. పరమాత్మ మాటలు విని ఆనందముతో పరమ సంతోషముతో చేతులు జోడించి, ఉప్పొంగిపోయి, అలాగే ఆ మాటలు అర్థం కాకపోవడం దు@ఖముతో ఇలా అన్నారు

ఋషయ ఊచుః
న వయం భగవన్విద్మస్తవ దేవ చికీర్షితమ్
కృతో మేऽనుగ్రహశ్చేతి యదధ్యక్షః ప్రభాషసే

నీవేమి చేయాలనుకుంటున్నావో మాకు తెలియుట లేదు. "మీరు ఒప్పుకుంటే నన్ను అనుగ్రహించినట్లే" అన్నారు. మీరు అధ్యక్షులు - అక్షం అంటే ఇంద్రియం. అక్షములకు అధి , అంటే అవతల ఉన్నారు.

బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణాః కిల తే ప్రభో
విప్రాణాం దేవదేవానాం భగవానాత్మదైవతమ్

బ్రాహ్మణుల యందు అత్యంత ప్రీతి కలవాడివి నీవు. బ్రాహ్మణులకు నీవే ఆరాధనీయుడివి.

త్వత్తః సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ
ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్మతః

సనాతన ధర్మాన్ని రక్షించడానికి నీవు అవతరిస్తావు. నీ అవతరాలతో కాపాడతావు. ఎలాంటి వికారములు లేని నీవే ధర్మములకు పరమ స్వరూపుడువు. అవమానమును గానీ సమ్మానమును గానీ ఒకే విధముగా చూడగలిగిన నిర్వికార స్వరూపము గలవాడవు.

తరన్తి హ్యఞ్జసా మృత్యుం నివృత్తా యదనుగ్రహాత్
యోగినః స భవాన్కిం స్విదనుగృహ్యేత యత్పరైః

ఎవరి అనుగ్రహ్ముతో యోగులూ మునులూ భక్తులూ సంసారాన్ని అజ్ఞ్యానాన్ని సులభంగా దాటుతారో, అలాంటి నీవు వారి చేత అనుగ్రహించబడే వాడివా

యం వై విభూతిరుపయాత్యనువేలమన్యైర్
అర్థార్థిభిః స్వశిరసా ధృతపాదరేణుః
ధన్యార్పితాఙ్ఘ్రితులసీనవదామధామ్నో
లోకం మధువ్రతపతేరివ కామయానా

ఎవరిని వెతుక్కుంటూ హద్దు దాటి అమ్మ వారు చేరుకుంటుందో, ఆ అమ్మవారి పాద రేణువుని అర్థార్తులు తమ శిరస్సున ధరిస్తారు. అలాంటి అమ్మవారు నీ కటాక్షం పొందటానికి నిత్యం నిన్ను అనుసరించి ఆశ్రయించి అర్థించి ఉంటుంది. కొత్తగా తులసీ దళాలు తెచ్చి కట్టిన మాలకు నివాసమైన వక్షస్థలాన్ని తన నివాసముగా ఉంచుకున్న అమ్మవారి పాద పరాగమును అర్థార్థులు తమ శిరస్సున ధరిస్తారు. తుమ్మెదలు మకరందాన్ని ఎంత తహ తహగా కోరుకుంటాయో, అమ్మవారు నిన్ను అలా కోరుకుని నిన్ను ఆశ్రయించి ఉంటుంది.

యస్తాం వివిక్తచరితైరనువర్తమానాం
నాత్యాద్రియత్పరమభాగవతప్రసఙ్గః
స త్వం ద్విజానుపథపుణ్యరజఃపునీతః
శ్రీవత్సలక్ష్మ కిమగా భగభాజనస్త్వమ్

పరిశుద్ధమైన చరిత్ర గలవారి చేత సేవింపబడే అమ్మవారు మిమ్ములని ఆశ్రయిస్తే, ఆమెను మీరు ఎక్కువగా ఆదరించుటలేదు ఎందుకంటే మీరు నిరంతరం భాగవత పోషణలో మునిగి ఉంటారు. అలాంటి నీవు బ్రాహ్మణుల పాద పరాగముతో పవిత్రమయ్యావా? దాని వలన మీ శ్రీ వత్సమో కౌస్తుభమో, మీరో బ్రాహ్మణ పాద పరాగముచే పవిత్రమవుతున్నారా? లోకానికి ఆదర్శం చూపడానికి మీరు ఇలా అన్నారు.

ధర్మస్య తే భగవతస్త్రియుగ త్రిభిః స్వైః
పద్భిశ్చరాచరమిదం ద్విజదేవతార్థమ్
నూనం భృతం తదభిఘాతి రజస్తమశ్చ
సత్త్వేన నో వరదయా తనువా నిరస్య

త్రియుగ: మూడు జంటలు కలవాడివి నీవు (జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు), ధర్మము మూడు పాదలతో నడుస్తుంద్ (దానము దయా తపస్సు),  అలా మూడు పాదాలతో ఉన్న ధర్మాన్ని మూడు జనటలున్న నీవు నిలబెడుతున్నావు. రజో తమో గుణముతో వ్యాపించిన భావలని ప్రక్రియలనీ సత్వ గుణముతో కూడిన దేహాన్ని ధరించి తొలగిస్తావు. అలా ఈ ధర్మాన్ని పోషింపచేస్తున్నావు.

న త్వం ద్విజోత్తమకులం యది హాత్మగోపం
గోప్తా వృషః స్వర్హణేన ససూనృతేన
తర్హ్యేవ నఙ్క్ష్యతి శివస్తవ దేవ పన్థా
లోకోऽగ్రహీష్యదృషభస్య హి తత్ప్రమాణమ్

ధర్మముని నీవు కాపాడుతున్నావా, లేక నీవే ధర్మ రూపముతో జగత్తుని కాపాడుతున్నావా. ధర్మము నిలిస్తేనే జగత్తు నిలిస్తుంది. ధర్మము కాపాడబడకుంటే, బ్రాహ్మణులు ఆరాధింపబడకుంటే నీవు ఏర్పరచిన మార్గం నశిస్తుంది. సకల లోకమూ ఉత్తముడు ఆచరించిన దానినే ప్రమాణముగా స్వీకరిస్తుంది.

తత్తేऽనభీష్టమివ సత్త్వనిధేర్విధిత్సోః
క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారేః
నైతావతా త్ర్యధిపతేర్బత విశ్వభర్తుస్
తేజః క్షతం త్వవనతస్య స తే వినోదః

సకల జగత్తు క్షేమం కోసం మీ శక్తులతో శత్రువులను సంహరిస్తారు. సకల జగత్తునీ నీ శాసనములో ఉంచుకునే నీ తేజ్స్సౌ మాకు నమస్కరించినంతన తక్కువ కాదు

యం వానయోర్దమమధీశ భవాన్విధత్తే
వృత్తిం ను వా తదనుమన్మహి నిర్వ్యలీకమ్
అస్మాసు వా య ఉచితో ధ్రియతాం స దణ్డో
యేऽనాగసౌ వయమయుఙ్క్ష్మహి కిల్బిషేణ

జగన్నాయకా, ఈ ఇద్దరికీ ఏ శిక్షను కల్పిస్తున్నారో, లేక ఇక్కడే ఉండటానికి అంగీకరిస్తారో, మీఏమి చేసినా మాకు ఆమోదమే .ం ఆకు త్రికరణ శుద్ధిగా ఆమోదమే. మేము కూడా తప్పు చేసాము. మాకు ఎలాంటి శిక్ష ఉచితమో అది విధించండి. ఏ తప్పు చేయని వారిని మేము శపించాము.

శ్రీభగవానువాచ
ఏతౌ సురేతరగతిం ప్రతిపద్య సద్యః
సంరమ్భసమ్భృతసమాధ్యనుబద్ధయోగౌ
భూయః సకాశముపయాస్యత ఆశు యో వః
శాపో మయైవ నిమితస్తదవేత విప్రాః

ఈ ద్వారపాలకులు రాక్షసత్వాన్ని వెంటనే పొంది, పుట్టినప్పటినుంచే నా మీద కోపం పెంచుకొని నన్ను ద్వేషిస్తారు. కోపము చేతా బాగా పెరిగిన సమాధిచేత, నా యందే సంబంధం నిరంతరం కలిగి ఉండి, త్వరగా నా దగ్గరకు వీరు చేరతారు. వీరిని శపించామని మీరు బాధపడకండి. అది నా సంకల్పం ప్రకారమే జరిగింది. నేనే శాపం ఇచ్చాను. ఆ శాప ఫలితాన్ని నేనే వచ్చి తగ్గించాను.

బ్రహ్మోవాచ
అథ తే మునయో దృష్ట్వా నయనానన్దభాజనమ్
వైకుణ్ఠం తదధిష్ఠానం వికుణ్ఠం చ స్వయంప్రభమ్

ఇలా పరమాత్మ అన్న తరువాత సనకాదులు, కనులకు ఆనదం కలిగించే వైకుంఠనగరాన్ని (ఎక్కడైతే సూర్య చంద్రులు నక్షత్రాలు ప్రాకాశించవో, పరమాత్మ ప్రకాశముతో ప్రకాశించే వైకుంఠం)చూచి,

భగవన్తం పరిక్రమ్య ప్రణిపత్యానుమాన్య చ
ప్రతిజగ్ముః ప్రముదితాః శంసన్తో వైష్ణవీం శ్రియమ్

లక్ష్మీ నారాయణులకి ప్రదక్షిణం చేసి, వారి అనుమతిపొంది, నారయణుని కీర్తిని కీర్తిస్తూ తిరిగి వెళ్ళారు

భగవాననుగావాహ యాతం మా భైష్టమస్తు శమ్
బ్రహ్మతేజః సమర్థోऽపి హన్తుం నేచ్ఛే మతం తు మే

తన అనుచరులతో పరమాత్మ "మీరు భయపడకండి, మీకు శుభం కలుగుతుంది. బ్రాహ్మణులు పెట్టిన శాపం నేను తొలగించగలను, కానీ తొలగించను. ఎందుకంటే అది నా సంకల్పమే కాబట్టి"

ఏతత్పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా
పురాపవారితా ద్వారి విశన్తీ మయ్యుపారతే

ఇది ముందే నిర్ణయించబడినది. కోపించిన లక్ష్మీ అమ్మవారు అప్పుడే చెప్పారు. మీరు లోపలకు వస్తున్న అమ్మవారిని ఆపారు.

మయి సంరమ్భయోగేన నిస్తీర్య బ్రహ్మహేలనమ్
ప్రత్యేష్యతం నికాశం మే కాలేనాల్పీయసా పునః

ఈ నాలుగురోజులు నా మీద ద్వేషాన్ని నింపుకుని, ఈ ద్వేష యోగముతో బ్రాహ్మణ అపచారం దాటి వేసి త్వరగా నా దగ్గరకు వస్తారు.

ద్వాఃస్థావాదిశ్య భగవాన్విమానశ్రేణిభూషణమ్
సర్వాతిశయయా లక్ష్మ్యా జుష్టం స్వం ధిష్ణ్యమావిశత్

ఈ రీతిలో పరమాత్మ ద్వారపాలకులను ఆజ్ఞ్యాపించి, అన్ని భవనాలకన్నా ఉత్తమముగా ఉన్న, అన్ని కాంతులతో విరాజిల్లే తన భవనానికి చేరుకున్నాడు.

తౌ తు గీర్వాణఋషభౌ దుస్తరాద్ధరిలోకతః
హతశ్రియౌ బ్రహ్మశాపాదభూతాం విగతస్మయౌ

ఎలాంటివారికైనా పొందశక్యము కాని,ఎవరూ చేరశక్యముకాని, ఒకసారి పొందితే మరలా వెనక్కు పోలేని శ్రీ వైకుంఠము నుంచి వారిద్దరూ బ్రాహ్మణ శాపముతో శొభ పోయి, గర్వము తొలగింది

తదా వికుణ్ఠధిషణాత్తయోర్నిపతమానయోః
హాహాకారో మహానాసీద్విమానాగ్ర్యేషు పుత్రకాః

ఇలా వారు పడిపోతూ ఉంటే,  విమానాలలో ఉన్నవారందరూ హాహాకారాలు చేసారు

తావేవ హ్యధునా ప్రాప్తౌ పార్షదప్రవరౌ హరేః
దితేర్జఠరనిర్విష్టం కాశ్యపం తేజ ఉల్బణమ్

ఆ ఇద్దరే దితి గర్భములో ఉన్నారు. ఇది కాశ్యప మహర్షి తేజస్సు

తయోరసురయోరద్య తేజసా యమయోర్హి వః
ఆక్షిప్తం తేజ ఏతర్హి భగవాంస్తద్విధిత్సతి

అలాంటి వారి దివ్య తేజస్సుతో మీ అందరి తేజస్సు కప్పిపుచ్చబడింది. భగవానుడు ఏమి చేయాలో ఆ పని చేస్తడు. ఆయనకన్నీ తెలుసు

విశ్వస్య యః స్థితిలయోద్భవహేతురాద్యో
యోగేశ్వరైరపి దురత్యయయోగమాయః
క్షేమం విధాస్యతి స నో భగవాంస్త్ర్యధీశస్
తత్రాస్మదీయవిమృశేన కియానిహార్థః

సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు చేసేవాడు, యోగులు కూడా అర్థం చేసుకోలేని మాయా బలం కలవాడు. త్రిగుణాధిపతి త్రివేదాదిపతి అయిన పరమాత్మే మనకు క్షేమాన్ని కలిగిస్తాడు. దాని గురించి మనం ఆలోచించి కూడా ఏమీ చేయలేము.

Popular Posts