Followers

Friday, 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంథం ఎనిమిదవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
సనకాద్యా నారదశ్చ ఋభుర్హంసోऽరుణిర్యతిః
నైతే గృహాన్బ్రహ్మసుతా హ్యావసన్నూర్ధ్వరేతసః

సనకాదులూ, నారదుడూ, ఋభు హంస అరుణి యతి మొదలైన బ్రహ్మ పుత్రులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు.  జితేంద్రియులై బ్రహ్మచారులుగా ఉన్నారు.

మృషాధర్మస్య భార్యాసీద్దమ్భం మాయాం చ శత్రుహన్
అసూత మిథునం తత్తు నిరృతిర్జగృహేऽప్రజః

ఆ వంశములోనే   అధర్ముడు, అతని భార్య మృష (అసత్యం), వీరికి ధంభం మాయ అని పుట్టారు. కృతయుగములో అబ్బాయీ అమ్మాయీ కవలలుగా పుడితే వారికి వివాహం చేయడం ఆచారం. కానీ వీరి వివాహ సమయానికి ఆ ధర్మం లేదు. అయినా అధర్ముడు కాబట్టి, ఆ ఆచారం లేకపోయినా దానికి విరుద్ధమ్ముగా పెళ్ళి చేసుకున్నారు. సంతానం లేని నిరృతి తన సంతానముగా స్వీకరించాడు. వీరికి లోభము నికృతి అనే సంతానం. వీరికి క్రోధా హింసా అని కలిగారు. వీరికి దురుక్తి అని చెల్లి. దురుక్తికి కలి కలిగాడు

తయోః సమభవల్లోభో నికృతిశ్చ మహామతే
తాభ్యాం క్రోధశ్చ హింసా చ యద్దురుక్తిః స్వసా కలిః

దురుక్తౌ కలిరాధత్త భయం మృత్యుం చ సత్తమ
తయోశ్చ మిథునం జజ్ఞే యాతనా నిరయస్తథా

మృత్యువూ భయమూ వారి సంతానం. వీరికి కూడా యాతనా నిరయం (నరకం) అనే కవలలు పుట్టారు. ఇదే అధర్మ సృష్టి. ఇదే ప్రతి సర్గం (సర్గశ్చ, ప్రతిసర్గశ్చ...)

సఙ్గ్రహేణ మయాఖ్యాతః ప్రతిసర్గస్తవానఘ
త్రిః శ్రుత్వైతత్పుమాన్పుణ్యం విధునోత్యాత్మనో మలమ్

దీన్ని విన్నా మానవుడు తన పాపాన్ని పోగొట్టుకుంటాడు. దీన్ని మూడు సార్లు వింటే అన్ని పాపాలు తొలగిత్పోతాయి.

అథాతః కీర్తయే వంశం పుణ్యకీర్తేః కురూద్వహ
స్వాయమ్భువస్యాపి మనోర్హరేరంశాంశజన్మనః

హరి యొక్క అంశ బ్రహ్మ, అతని అంశ మనువు. బ్రహ్మ వలన పుట్టిన మనువు వలన పుట్టినవారు ప్రియవ్రత ఉత్తానపాదులు.

ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతేః సుతౌ
వాసుదేవస్య కలయా రక్షాయాం జగతః స్థితౌ

స్వాయంభువ శతరూపలకు ప్రియవ్రతుడూ, ఉత్తానపాదుడు అని కుమారులు. వీరు పరమాత్మ యొక్క అంశతోటే జగద్రక్షణకు అవతరించారు.

జాయే ఉత్తానపాదస్య సునీతిః సురుచిస్తయోః
సురుచిః ప్రేయసీ పత్యుర్నేతరా యత్సుతో ధ్రువః

ఉత్తానపాదుడికి ఒక భార్య సునీతి, ఇంకో భార్య సురుచి. సురుచి యందు ఎక్కువ ప్రీతి ఉత్తానపాదుడికి. సునీతి సంతానమే ధ్రువుడు. సురుచి సంతానం ఉత్తముడు

ఏకదా సురుచేః పుత్రమఙ్కమారోప్య లాలయన్
ఉత్తమం నారురుక్షన్తం ధ్రువం రాజాభ్యనన్దత

ఒక సారి సురుచి పుత్రుడు రాజు గారి ఒడిలో కూర్చున్నాడు. రాజుగారు ఆనందముగా స్వీకరించారు. ధ్రువుడు కూడా కూర్చోబోయాడు. అప్పుడు రాజు అభినందించలేదు

తథా చికీర్షమాణం తం సపత్న్యాస్తనయం ధ్రువమ్
సురుచిః శృణ్వతో రాజ్ఞః సేర్ష్యమాహాతిగర్వితా

భర్తయొక్క భావాన్ని గ్రహించిన సురుచి

న వత్స నృపతేర్ధిష్ణ్యం భవానారోఢుమర్హతి
న గృహీతో మయా యత్త్వం కుక్షావపి నృపాత్మజః

రాజుగారి వడిని నీవు చేరలేవు. నీకు ఆ అర్హత లేదు. నీవు రాజుగారి పుత్రుడవే గానీ నా పుత్రుడవు కావు.

బాలోऽసి బత నాత్మానమన్యస్త్రీగర్భసమ్భృతమ్
నూనం వేద భవాన్యస్య దుర్లభేऽర్థే మనోరథః

పిల్లవాడవి కాబట్టి నీకీ విషయం తెలీదు. పొందలేని దానిని కోరకు

తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే
గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనమ్

పరమాత్మను తపసుతో ఆరాధించి ఆయన అనుగ్రహముతో ఆ కడుపులో పుడితే నీకు ఆ అవకాశం వస్తుంది.

మైత్రేయ ఉవాచ
మాతుః సపత్న్యాః స దురుక్తివిద్ధః శ్వసన్రుషా దణ్డహతో యథాహిః
హిత్వా మిషన్తం పితరం సన్నవాచం జగామ మాతుః ప్రరుదన్సకాశమ్

సవతి తల్లి దుర్భాషలతో కొట్టబడిన వాడై కోపముతో బుసలు కొడుతూ, కట్టెతో కొట్టబడిన సర్పములాగ, నిట్టూర్పు విడిచాడు. చూస్తూ ఊరుకున్న తండ్రిని వదిలి వచ్చాడు. ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళాడు.

తం నిఃశ్వసన్తం స్ఫురితాధరోష్ఠం సునీతిరుత్సఙ్గ ఉదూహ్య బాలమ్
నిశమ్య తత్పౌరముఖాన్నితాన్తం సా వివ్యథే యద్గదితం సపత్న్యా

కోపముతో బుసలు కొడుతూ, పెదవి అదురుతూ ఉన్న కొడుకును దగ్గరకు తీసుకుంది.పౌరుల వలన ఆ వారత విని. సవతి మాటలు ఆమెను కూడా బాధించాయి.

సోత్సృజ్య ధైర్యం విలలాప శోక దావాగ్నినా దావలతేవ బాలా
వాక్యం సపత్న్యాః స్మరతీ సరోజ శ్రియా దృశా బాష్పకలామువాహ

బాగా ధు@ఖిస్తూ పద్మము వంటి కనులలో నీరు నిండగా నిట్టూర్పు విడుస్తూ దుఃఖం యొక్క అంతం ఎప్పుడొస్తుందో తెలియనిదై

దీర్ఘం శ్వసన్తీ వృజినస్య పారమపశ్యతీ బాలకమాహ బాలా
మామఙ్గలం తాత పరేషు మంస్థా భుఙ్క్తే జనో యత్పరదుఃఖదస్తత్

నీ పిన తల్లి మాట్లాడిన మాటలకు నాకు కూడా బాధ కలిగింది. అంతమాత్రముచేత ఇలాంటి బాధ వారికి కూడా కలగాలను కోరరాదు. ఇతరుల విషయములో అశుభాన్ని కలిగించాలని భావించకు. మానవుడు ఇతరులకు ఎలాంటి దుఃఖాన్ని ఇస్తాడో, తాను అలాంటి దుఃఖాన్ని పొందుతాడు.

సత్యం సురుచ్యాభిహితం భవాన్మే యద్దుర్భగాయా ఉదరే గృహీతః
స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతి వా వోఢుమిడస్పతిర్మామ్

ఎలా అన్నా సురుచి ఉన్న మాటే అన్నది. దౌర్భాగ్యురాలైన నా కడుపున నీవు పుట్టినందుకే నీకు రాజుగారి వడిలో కూర్చునే భాగ్యం రాలేదు. రాజు నన్ను భార్య అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాడు. అలాంటి నా గర్భములో పుట్టి నా పాలతో పెరిగావు.

ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వముక్తం సమాత్రాపి యదవ్యలీకమ్
ఆరాధయాధోక్షజపాదపద్మం యదీచ్ఛసేऽధ్యాసనముత్తమో యథా

సవతి తల్లి అయినా (సమాత్రాపి) మంచి మాటే చెప్పింది, కపటము లేని మాటే చెప్పింది. ఏ దుఃఖం వచ్చినా పోగొట్టేది ఆ శ్రీమన్నారాయణుడే. పరమాత్మ యొక్క పాదపద్మాలనే ఆశ్రయించు. ఉత్తముడిలా నీవు కూడా ఉన్నత స్థానాన్ని కోరుకుంటే ఆమె చెప్పినట్లు పరమాత్మ పాదాలనే ఆశ్రయించు.

యస్యాఙ్ఘ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనాయాత్తగుణాభిపత్తేః
అజోऽధ్యతిష్ఠత్ఖలు పారమేష్ఠ్యం పదం జితాత్మశ్వసనాభివన్ద్యమ్

ఇప్పటివరకూ ఉన్న వారిలో ఎవరెవరు గొప్పవారిగా పేరు పొందారో వారందరూ ఆయనను ఆరాధించిన వారే. సకల జగత్తునూ కాపాడటానికి అనంతమైన కళ్యాణ గుణములు కలిగిన ఆయన పాదాలను ఆశ్రయించి బ్రహ్మగారు పారమేష్ఠ్యం పొందారు. మనసునూ వాయువునూ గెలిచిన వారే ఆరాధించే ఉత్తమమైన బ్రహ్మలోకాన్ని చతుర్ముఖ బ్రహ్మ ఎవరి ఆరాధన వలన పొందాడో ఆయననే ఆరాధించు

తథా మనుర్వో భగవాన్పితామహో యమేకమత్యా పురుదక్షిణైర్మఖైః
ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతో భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యమ్

మీ తాతగారైన స్వాయంభువమనువు గొప్ప దక్షిణలు ఇచ్చి ఎన్నో యజ్ఞ్యాలతో ఈయనను ఆరాధించాడు. ఇతరులెవ్వరూ పొందలేని భూలోక సుఖమూ మోక్షమూ పొందడానికి ఆయన ఆరాధనమే మార్గము.

తమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్యపదాబ్జపద్ధతిమ్
అనన్యభావే నిజధర్మభావితే మనస్యవస్థాప్య భజస్వ పూరుషమ్

నీవూ ఆ పరమాత్మను ఆరాధించు. ఆయనకు తన భక్తుల యందు అమితమైన వాత్సల్యం ఉంది. మోక్షం కావాలని కోరుకున్న వారందరూ అతని పాదపద్మములనే అన్వేషిస్తూ ఉంటారు. పరమాత్మను ఆరాధించడానికి ఇది ప్రధానమైన సాధనం. అన్ని భావములూ ఆయన యందే ఉంచాలి. అన్యములందు ఉంచకూడదు. అనన్యభావే. మనసులో ఈ ధర్మం (శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే) పెట్టుకుని ఆయననే సేవించు.

నాన్యం తతః పద్మపలాశలోచనాద్దుఃఖచ్ఛిదం తే మృగయామి కఞ్చన
యో మృగ్యతే హస్తగృహీతపద్మయా శ్రియేతరైరఙ్గ విమృగ్యమాణయా

నీ దుఃఖాన్ని పోగొట్టాలంటే పుండరీకాక్షుని కంటే ఇంకెవరూ లేరు. ఆయన కోసం ఎప్పుడూ చేతిలో పద్మము పట్టుకుని వెతుకుతూ ఉంటుంది. దేవతలందరూ అమ్మవారిని వెతుకుతూ ఉంటారు. ఎవరి చేతిలో లక్ష్మి ఉంటుందో ఆయనే జగన్నాధుడు.

మైత్రేయ ఉవాచ
ఏవం సఞ్జల్పితం మాతురాకర్ణ్యార్థాగమం వచః
సన్నియమ్యాత్మనాత్మానం నిశ్చక్రామ పితుః పురాత్

తల్లి పలిక్లిన అర్థవంతములైన మాటలు విని ఆత్మతో మనసు నిగ్రహించుకుని తండ్రి నగరం నుంచి బయలు దేరాడు

నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితమ్
స్పృష్ట్వా మూర్ధన్యఘఘ్నేన పాణినా ప్రాహ విస్మితః

ఇది తెలుసుకున్న నారదుడు అన్ని పాపాలు పోగెట్టే తన హస్తుముతో పిల్లవాడిని స్పృశించి ఆశ్చర్యముతో అన్నాడు

అహో తేజః క్షత్రియాణాం మానభఙ్గమమృష్యతామ్
బాలోऽప్యయం హృదా ధత్తే యత్సమాతురసద్వచః

క్షత్రియులు చాలా గొప్పవారు. అవమానాన్ని సహించని వీరి తేజస్సు చాలా గొప్పది. పిల్లవాడై కూడా సవతి తల్లి మాటలను మనసులో పెట్టుకుని బయలుదేరాడు

నారద ఉవాచ
నాధునాప్యవమానం తే సమ్మానం వాపి పుత్రక
లక్షయామః కుమారస్య సక్తస్య క్రీడనాదిషు

నీవు ఐదేళ్ళ పిల్లవాడు. నీకు అవమానం ఏమిటి. ఆట పాటలలో ఉండాలి. అవమానం, సమ్మానం అనే వాటిని పట్టించుకునే వయసు కాదు

వికల్పే విద్యమానేऽపి న హ్యసన్తోషహేతవః
పుంసో మోహమృతే భిన్నా యల్లోకే నిజకర్మభిః

నీకు మొత్తం విషయం తెలుసూ అనుకుందామా, అవమానం అంటే అది నీవు పూర్వము చేసుకున్న కర్మే కాబట్టి బాధపడకూడదు. జ్ఞ్యానివైనా ఇవి పట్టించుకోకూడదు. చిన్న పిల్లవాడివైనా పట్టించుకోకూడదు. అన్ని దుఃఖాలకు మోహము కారణం. మనమాచరించిన సుకృత దుష్కృతములు అతి సూక్షముగా ఉంటాయి. వాటి వలననే మనకు కలిగేవన్నీ కలుగుతాయి. ఇలాంటీ మోహం మనకు కర్మలవలనే వస్తుంది. కర్మలతో మోహం, మోహం వలన బాధలు కలుగుతాయి.

పరితుష్యేత్తతస్తాత తావన్మాత్రేణ పూరుషః
దైవోపసాదితం యావద్వీక్ష్యేశ్వరగతిం బుధః

నిజమైన బుద్ధిమంతుడు పరమాత్మ ప్రసాదించినవాటితోనే తృప్తి పడతాడు. పరమాత్మ ఎంత ప్రసాదించాడో దానితోనే తృప్తిపడాలి. ఇదంతా మనం చేసేది కాదు. మన ప్రయత్నముతో మనం పొందేది కాదు. ఇదంతా ఈశ్వరస్య గతి. పరమాత్మ ప్రసాదమే ఇది. దొరకని దానికోసం ఏడ్వవద్దు, దొరికిందని సంతోషించకు.

అథ మాత్రోపదిష్టేన యోగేనావరురుత్ససి
యత్ప్రసాదం స వై పుంసాం దురారాధ్యో మతో మమ

తల్లి చెప్పింది కదా అని అనుకున్నా ఇది పిల్లలు చేయగలిగినదా? పరమాత్మ అనుగ్రహం పొందాలనుకుంటున్నావు. ఆయన మనలాంటి వారిచేత ఆరాధించగలిగిన వాడేనా? ఈయన దురారాధ్యుడు. సనకాదులకి కూడా అందని వాడు.

మునయః పదవీం యస్య నిఃసఙ్గేనోరుజన్మభిః
న విదుర్మృగయన్తోऽపి తీవ్రయోగసమాధినా

అన్నిటియందూ సంగం వదిలిన వారు ఎన్నో జన్మలలో ప్రయత్నించి కూడా, గొప్ప సమాధిలో కూడా తెలుసుకోలేకపోయారు.

అతో నివర్తతామేష నిర్బన్ధస్తవ నిష్ఫలః
యతిష్యతి భవాన్కాలే శ్రేయసాం సముపస్థితే

ఇది అయ్యే పని కాదు. ఈ ప్రయత్నం నిష్ఫలం. వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళు. పెద్దవాడివయ్యాక పరమాత్మ నీకు సహకరిస్తాడు. అప్పుడు ప్రయత్నించు

యస్య యద్దైవవిహితం స తేన సుఖదుఃఖయోః
ఆత్మానం తోషయన్దేహీ తమసః పారమృచ్ఛతి

పరమాత్మ ఎవరికి ఎప్పుడు ఎలాంటి సుఖ దుఃఖాలు ఇస్తాడో వాటితో తృప్తి పడితే వాడు సంసారాన్ని దాటుతాడు. "ఇది చాలదు" అనుకుంటే కొత్తది రాదు. ఉన్నదీ పోతుంది. సంసారాన్ని దాటాలి అనుకుంటే భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడడం నేర్చుకోవాలి.

గుణాధికాన్ముదం లిప్సేదనుక్రోశం గుణాధమాత్
మైత్రీం సమానాదన్విచ్ఛేన్న తాపైరభిభూయతే

నీకన్నా గొప్పవారిని చూచి సంతోషించడం నేర్చుకో. నీ కన్నా తక్కువ వాడిని చూచి జాలిపడు. సమానుడితో స్నేహం చేయి. మనకి తాపములు అంటకుండా ఉండాలంటే ఈ మూడు పనులూ చేయడం నేర్చుకోవాలి

ధ్రువ ఉవాచ
సోऽయం శమో భగవతా సుఖదుఃఖహతాత్మనామ్
దర్శితః కృపయా పుంసాం దుర్దర్శోऽస్మద్విధైస్తు యః

మీరు చాలా మంచి మాటలు చెప్పారు. సుఖమూ దుఃఖమూ అని కొట్టుమిట్టే వారికొరకు మీరు చెప్పిన మాట బాగుంది గానీ అలాంటివి మాలాంటి వారు చేయలేరు.

అథాపి మేऽవినీతస్య క్షాత్త్రం ఘోరముపేయుషః
సురుచ్యా దుర్వచోబాణైర్న భిన్నే శ్రయతే హృది

క్షత్రియున్నైన నాకు గర్వం ఉంది. సురుచి అన్న మాటలకు చీలిన హృదయం అతకదు.

పదం త్రిభువనోత్కృష్టం జిగీషోః సాధు వర్త్మ మే
బ్రూహ్యస్మత్పితృభిర్బ్రహ్మన్నన్యైరప్యనధిష్ఠితమ్

మూడు లోకాల కన్నా ఉన్నత స్థానం అడగబోవుతున్నను. ఏమి చేస్తే అది పొందగలుగుతానో అది చెప్పండి. నాన్న ఒడిని కాదు నేను కోరేది. ఎవరూ పొందని ఉత్తమ స్థానం నాకు కావాలి.

నూనం భవాన్భగవతో యోऽఙ్గజః పరమేష్ఠినః
వితుదన్నటతే వీణాం హితాయ జగతోऽర్కవత్

నీవు పరమాత్మ నుండి పుట్టిన బ్రహ్మగారి యందు పుట్టిన వాడివి. వీణను మీటుతూ మీరు లోక హితము కోరి జగత్తంతా సూర్యునిలాగ తిరుగుతారు.

మైత్రేయ ఉవాచ
ఇత్యుదాహృతమాకర్ణ్య భగవాన్నారదస్తదా
ప్రీతః ప్రత్యాహ తం బాలం సద్వాక్యమనుకమ్పయా

పిల్లవాడి పట్టుదల చూచి ఈ సద్వాక్యాన్ని చెప్పాడు

నారద ఉవాచ
జనన్యాభిహితః పన్థాః స వై నిఃశ్రేయసస్య తే
భగవాన్వాసుదేవస్తం భజ తం ప్రవణాత్మనా

ధర్మార్థకామమోక్షాఖ్యం య ఇచ్ఛేచ్ఛ్రేయ ఆత్మనః
ఏకం హ్యేవ హరేస్తత్ర కారణం పాదసేవనమ్

నీ తల్లి చెప్పినదే ఉత్తమమైన మార్గము. పరమాత్మ  యందే మనసు ఉంచి పక్కకు పోనీయకుండా ఆయనను సేవిస్తూ ఉండటమే అన్ని లోకాలలో ఉన్న అన్ని ప్రాణులకూ ఏ పురుషార్థం కావాలన్నా మార్గము.

తత్తాత గచ్ఛ భద్రం తే యమునాయాస్తటం శుచి
పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేః

యమునా తీరానికి చేరు. అది పరంపవిత్రమైనది. యమునా తీరములో మధువనం ఉంది. (అదే తరువాత మధురా, సిద్ధాశ్రమం).  అక్కడ ఎప్పుడూ పరమాత్మ ఉంటాడు

స్నాత్వానుసవనం తస్మిన్కాలిన్ద్యాః సలిలే శివే
కృత్వోచితాని నివసన్నాత్మనః కల్పితాసనః

ఆ పవిత్రమైన నదిలో ప్రతీ సంధ్యలో స్నాన సంధ్యలు చేస్తూ మనసుని ప్రశాంతము చేసుకుని

ప్రాణాయామేన త్రివృతా ప్రాణేన్ద్రియమనోమలమ్
శనైర్వ్యుదస్యాభిధ్యాయేన్మనసా గురుణా గురుమ్

ఓంకారముతో ప్రాణాయామము చేసి. ఓంకారములో ఉన్న "అ" "ఉ" "మ" తో ప్రాణాయామం చేయి. కుంభకానికి కొన్ని సార్లు, రేచకాన్ని కొన్నిసార్లు పూరాన్ని కొన్ని సార్లు ఓంకారముతో చేస్తూ ప్రాణ ఇంద్రియ మనో మలాన్ని పోగోట్టుకో. మనసుని ఏకాగ్రముగా పరమాత్మ వైపు తిప్పాలి. మొదట గురువుగారిని ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. పరమాత్మని బోధించే మంత్రాన్ని జపించాలంటే మొదలు మంత్రం బోధించిన గురువుని ధ్యానించాలి. గురువు ద్వారానే పరమాత్మని ధ్యానం చేయాలి.

ప్రసాదాభిముఖం శశ్వత్ప్రసన్నవదనేక్షణమ్
సునాసం సుభ్రువం చారు కపోలం సురసున్దరమ్

నిరంతరం అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్న ప్రసన్నమైన ముఖమూ ప్రసన్నమైన చూపు కలవాడు. చక్కని ముఖము గలవాడు. దేవతలకు కూడా ఈయన సుందరుడు

తరుణం రమణీయాఙ్గమరుణోష్ఠేక్షణాధరమ్
ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణార్ణవమ్

నవ యువకుడు, సుందరమైన అవయములు కలవాడు. కిందిపెదవి పైపెదవి కన్నుల కొనలూ ఎర్రగా ఉన్నవాడు. అరచేతులు అరికాళ్ళు కనులూ పెదవులూ ఎర్రగా ఉండడం చతుర్ తామ్రం. గోళ్ళ కొనలు కూడా ఎర్రగా ఉంటే పంచతామ్రం.

శ్రీవత్సాఙ్కం ఘనశ్యామం పురుషం వనమాలినమ్
శఙ్ఖచక్రగదాపద్మైరభివ్యక్తచతుర్భుజమ్

శ్రీవత్సమనే పుట్టుమచ్చా, మెడలో వనమాల ఉన్నవాడు. నాలుగు భుజాలూ, శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నవాడు.

కిరీటినం కుణ్డలినం కేయూరవలయాన్వితమ్
కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససమ్

కేయూరములూ, పట్టు వస్త్రములూ,

కాఞ్చీకలాపపర్యస్తం లసత్కాఞ్చననూపురమ్
దర్శనీయతమం శాన్తం మనోనయనవర్ధనమ్

బంగారు మొలతాడు, ఎన్ని సార్లు చూచినా మళ్ళీ చూడాలనిపించేవాడు, ప్రశాంతముగా ఉన్నవాడు, మనసునీ చూపునీ ఉద్ధరించే రూపం

పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతామ్
హృత్పద్మకర్ణికాధిష్ణ్యమాక్రమ్యాత్మన్యవస్థితమ్

మణులతో అలంకరించబడిన పాదాలు. హృదయములో మధ్య స్థానములో ఉండి, అక్కడినుంచి పైకెక్కి ఆత్మలో చేరుతాడు.

స్మయమానమభిధ్యాయేత్సానురాగావలోకనమ్
నియతేనైకభూతేన మనసా వరదర్షభమ్

స్నానం చేసి యమ నియమాదులని చేసి ఈ రూపాన్ని ధ్యానం చేయి. ఆయన కనపడితేనే కళ్ళు తెరు. ఆయన కనులలో చూపులలో ప్రీతి ఉంటుంది. నియమముగా ఒకే విధానముతో మనసుతో ధ్యానం చేయి

ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః
నిర్వృత్యా పరయా తూర్ణం సమ్పన్నం న నివర్తతే

పరమ మంగళ ప్రదమైన ఈ రూపాన్ని ధ్యానం చేస్తున్న మనసుని ఆయనదగ్గరకు పంపు. ఇలాంటి పరమానందం పొందిన మనసు అక్కడి నుండి మళ్ళీ రాదు.

జపశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ
యం సప్తరాత్రం ప్రపఠన్పుమాన్పశ్యతి ఖేచరాన్

నన్ను ఆశ్రయించావు కాబట్టి పరమ రహస్యమైన మంత్రాన్ని చెబుతున్నాను, దీన్ని ఏడు రోజులు జపము చేస్తే ఆకాశములో సంచరించే యక్ష రాక్షస భూత ప్రేత పిశాచ దేవ సిద్ధ మొదలైన వారిని చూడవచ్చు. ఏడు రోజులు జపిస్తే అంతరిక్ష చారులు కనిపిస్తారు.

ఓం నమో భగవతే వాసుదేవాయ
మన్త్రేణానేన దేవస్య కుర్యాద్ద్రవ్యమయీం బుధః
సపర్యాం వివిధైర్ద్రవ్యైర్దేశకాలవిభాగవిత్

ద్రవ్యారాధన ఈ మంత్రముతోనే చేయాలి ( పుష్పం సమర్పయామి ...) దేశ కాలానికి అనుగుణముగా అర్చనను ఆచరించాలి.

సలిలైః శుచిభిర్మాల్యైర్వన్యైర్మూలఫలాదిభిః
శస్తాఙ్కురాంశుకైశ్చార్చేత్తులస్యా ప్రియయా ప్రభుమ్

పవిత్ర జలమూ మాలలూ మొదలైన వాటితోనూ, తులసీ మొదలైన వాటితోనూ అర్చన చేయాలి

లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం క్షిత్యమ్బ్వాదిషు వార్చయేత్
ఆభృతాత్మా మునిః శాన్తో యతవాఙ్మితవన్యభుక్

పరమాత్మ విగ్రహం ఉంటే అది పెట్టుకుని చేయి లేకపోతే భూమిలో జలములో సూర్యునిలో పెట్టుకుని, ముఖ్యమైంది మనసు పరమాత్మ యందు ఉంచి చేయాలి. మౌనం వహించి చేయాలి. ఆహారం మితముగా తీసుకోవాలి.

స్వేచ్ఛావతారచరితైరచిన్త్యనిజమాయయా
కరిష్యత్యుత్తమశ్లోకస్తద్ధ్యాయేద్ధృదయఙ్గమమ్

పరమాత్మ అవతారాలతో చరిత్రతో మాయతో సకలలోకాలకు మంగళాన్నిస్తున్నా, ప్రతీ వారి హృదయములో ఉన్న స్వామిని ధ్యానం చేయాలి.

పరిచర్యా భగవతో యావత్యః పూర్వసేవితాః
తా మన్త్రహృదయేనైవ ప్రయుఞ్జ్యాన్మన్త్రమూర్తయే

ఇంతకు ముందు ఉన్న ఋషులు ఎలాంటి పరిచర్యలు చేసారో నీవూ అలాంటి పరిచర్యలే చేయాలి. అన్ని పరిచర్యలూ మంత్రముతోటే (ఓంకారముతో) చేయాలి. పరమాత్మ కూడా మంత్ర మూర్తే. మంత్ర మూర్తి అయిన పరమాత్మకు మంత్ర హృదయమైన ఓంకారముతో చేయాలి

ఏవం కాయేన మనసా వచసా చ మనోగతమ్
పరిచర్యమాణో భగవాన్భక్తిమత్పరిచర్యయా

త్రికరణములతో మనసులో ఉన్న పరమాత్మను సేవించాలి. పరమాత్మ యందు భక్తి కలిగిన సేవతో

పుంసామమాయినాం సమ్యగ్భజతాం భావవర్ధనః
శ్రేయో దిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినామ్

చక్కగా సేవించే వారికి మనసులో భక్తి భావాన్ని పెంచుతాడు, మాయ,కపటమూ లేని వారికి. మనం కోరుకున్న ధర్మార్థ కామ మోక్షాలలో ఏది మనకు శ్రేయస్సో దాన్ని మనకు ప్రసాదిస్తాడు

విరక్తశ్చేన్ద్రియరతౌ భక్తియోగేన భూయసా
తం నిరన్తరభావేన భజేతాద్ధా విముక్తయే

మొదట ఇంద్రియాలకు వైరాగ్యాన్ని నేర్పాలి.

ఇత్యుక్తస్తం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భకః
యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణచర్చితమ్

ఇలా నారదుడు చెప్పగానే ఆయనకు నమస్కరించి ప్రదక్షిణ చేసి పరమాత్మ పాదములచే నలగబడిన మధువనానికి వెళ్ళాడు

తపోవనం గతే తస్మిన్ప్రవిష్టోऽన్తఃపురం మునిః
అర్హితార్హణకో రాజ్ఞా సుఖాసీన ఉవాచ తమ్

ఇలా పిల్లవానిని తపోవనానికి పంపి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. నారదుడు సుఖాసీనుడైన తరువాత తండ్రితో ఇలా అన్నాడు

నారద ఉవాచ
రాజన్కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యతా
కిం వా న రిష్యతే కామో ధర్మో వార్థేన సంయుతః

నీవు ఏమి దీర్ఘముగా ఆలోచిస్తున్నావు. నీ ముఖము వాడిపోయింది. అర్థముతో కామముతో కూడుకుని ఉన్న ధర్మం నశించకుండా ఉందా?

రాజోవాచ
సుతో మే బాలకో బ్రహ్మన్స్త్రైణేనాకరుణాత్మనా
నిర్వాసితః పఞ్చవర్షః సహ మాత్రా మహాన్కవిః

బ్రహ్మన్, నా కుమారుడు చిన్నపిల్లవాడు. నగరము నుంచి అరణ్యములోకి వెళ్ళగొట్టబడ్డాడు. స్త్రీమీద వ్యామోహముతో దయను విడిచిపెట్టి తల్లినీ పిల్లవాడినీ దూరము చేసుకున్నాను. అర్భకుడైన పిల్లవాడిని మృగాలు హాని చేయగలవు

అప్యనాథం వనే బ్రహ్మన్మా స్మాదన్త్యర్భకం వృకాః
శ్రాన్తం శయానం క్షుధితం పరిమ్లానముఖామ్బుజమ్

నిద్రపోయినపుడో అలసి ఉన్నపుడో ఆకలిగొన్నప్పుడో ఏమరపాటుగా ఉన్నప్పుడు మృగాలు భక్షిస్తే ఎంత అనర్థం

అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ
యోऽఙ్కం ప్రేమ్ణారురుక్షన్తం నాభ్యనన్దమసత్తమః

స్త్రీ చేత ఓడింపబడ్డాను. పిల్లవాడు ఒడిలో కూర్చోబోతుంటే నేను అభినందించలేదు. నేను అభినందించి ఉంటే ఆమె అలా మాట్లాడి ఉండేది కాదు
ఆడవారికి మగవారికంటే 16 రెట్లు తెలివి 32 రెట్లు ఆకలి కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటాయి. వారి బుద్ధి ఎక్కువ ఉంది కాబట్టి బుద్ధి తక్కువ ఉన్నట్లు మరిపిస్తుంది.

నారద ఉవాచ
మా మా శుచః స్వతనయం దేవగుప్తం విశామ్పతే
తత్ప్రభావమవిజ్ఞాయ ప్రావృఙ్క్తే యద్యశో జగత్

అప్పుడు నారదుడు, నీవు నీ కుమారుని గురించి ఏ మాత్రమూ విచారించవలసిన పనిలేదు. ఆయనను మీరు కాపాడాల్సిన పని లేదు. అతనిని భగవానుడే కాపాడుతున్నాడు, దేవతలు కాపాడుతున్నారు. నీకు నీ కుమారుని ప్రభావం తెలియదు. కొద్ది రోజుల్లో అతని కీర్తిని ప్రపంచం మొత్తం వ్యాపింపచేస్తావు

సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభుః
ఐష్యత్యచిరతో రాజన్యశో విపులయంస్తవ

అష్ట దిగ్పాలకులు కూడా చేయలేని కార్యం చేసి ఇక్కడికి వస్తాడు. అతను చేసే  పని వలన నీకు పేరు వస్తుంది. త్వరలోనే అతను నగరానికి వస్తాడు

మైత్రేయ ఉవాచ
ఇతి దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతీపతిః
రాజలక్ష్మీమనాదృత్య పుత్రమేవాన్వచిన్తయత్

ఇది విన్నాక మహారాజుకు మరికాస్త ప్రేమ పెరిగింది. రాజ్య సంపదలు పక్కకు నెట్టివేసి పిల్లవాని కొరకు ఎదురుచూస్తున్నాడు

తత్రాభిషిక్తః ప్రయతస్తాముపోష్య విభావరీమ్
సమాహితః పర్యచరదృష్యాదేశేన పూరుషమ్

నారదుని చేత మంత్రోపదేశం పొంది యమునా నదికి వెళ్ళి నిశ్చయమైన మనసు గలవాడై, ఆ రాత్రి ఉపవాసముండి సావధానముతో నారదుడు చెప్పినది చెప్పినట్లుగా స్వామిని ఆరాధించాడు

త్రిరాత్రాన్తే త్రిరాత్రాన్తే కపిత్థబదరాశనః
ఆత్మవృత్త్యనుసారేణ మాసం నిన్యేऽర్చయన్హరిమ్

మనసుని నియమించాలంటే వాయువునూ ఆహారాన్ని గెలవాలి. ఒక నెల రోజులపాటు ప్రతీ మూడు రోజులకూ కపిథ్థ (బదరీ) లేక రేగు పళ్ళనూ, తన శరీరములో ప్రాణం ఉండేట్లుగా చూసుకుని తినేవాడు. శరీరములోంచి జీవుడు బయటకు వెళ్ళకుండా ఉండేందుకు ఆహారం తీసుకోవాలి
తన శరీరములో ప్రాణం ఉండటానికి అనుగుణముగా తింటూ హరిని అర్చిస్తూ గడిపాడు

ద్వితీయం చ తథా మాసం షష్ఠే షష్ఠేऽర్భకో దినే
తృణపర్ణాదిభిః శీర్ణైః కృతాన్నోऽభ్యర్చయన్విభుమ్


తరువాత ఆరు రోజులకొకసారి చెట్లకు రాలిన ఆకులని తింటూ , మూడవ నెల వచ్చేసరికి తొమ్మిది రోజులకొకసారి జలం మాత్రం ఆహారం తీసుకుంటూ సమాధిలో ఉండి పరమాత్మను ఆరాధించాడు,

తృతీయం చానయన్మాసం నవమే నవమేऽహని
అబ్భక్ష ఉత్తమశ్లోకముపాధావత్సమాధినా


చతుర్థమపి వై మాసం ద్వాదశే ద్వాదశేऽహని
వాయుభక్షో జితశ్వాసో ధ్యాయన్దేవమధారయత్


నాలగవ నెలలో పన్నెండు రోజులకొకసారి వాయువును ఆహారముగా తీసుకుని ప్రాణాయామముతో పరమాత్మని ధ్యానం చేస్తూ

పఞ్చమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజః
ధ్యాయన్బ్రహ్మ పదైకేన తస్థౌ స్థాణురివాచలః

ఐదవ నెలలో వాయువును కూడా మానేసి, నిలబడి ఒంటికాలిమీద, ఒక రాయిలాగ గడిపాడు

సర్వతో మన ఆకృష్య హృది భూతేన్ద్రియాశయమ్
ధ్యాయన్భగవతో రూపం నాద్రాక్షీత్కిఞ్చనాపరమ్

పంచభూతములూ, జ్ఞ్యానేంద్రియములూ కర్మేంద్రియములూ మనసు బుద్ధీ చిత్తమూ అంతఃకరణం అహంకారం ఈ ఇరవై ఒకటినీ తీసుకుని ఒకచోట ఉంచి, దాన్ని ఆత్మలో ఉంచి, ఆ ఆత్మను పరమాత్మలో లగ్నం చేసాడు. మనసునికి అన్నిటి నుండీ ఆకర్షించి (సర్వతో మన ఆకృష్య) విషయములనుండీ భూతముల నుండీ తన్మాత్రముల నుండీఇ ఆకర్షించి, నారదుడు చెప్పిన స్వామియొక్క సుందరమైన రూపం యందు ఉంచి పరమాత్మ రూపం కంటే ఇంక మరి దేన్నీ చూడలేదు. ఏ కొంచెం కూడా చూడలేదు

ఆధారం మహదాదీనాం ప్రధానపురుషేశ్వరమ్
బ్రహ్మ ధారయమాణస్య త్రయో లోకాశ్చకమ్పిరే

ప్రకృతీ మహత్తు అహంకారమూ అన్నిటికీ ఆధారమైనా, ప్రకృతి పురుషులకు అధిపతి ఐనా,  స్థూల సూక్ష్మములకు ఈశ్వరుడైన వానిని హృదయములో ఉంచుకున్నాడు. ప్రకృతి పురుషులకు వేరైన పరమాత్మ, ప్రకృతి పురుషులకు మూలమైన పరమాత్మ, ప్రకృతి పురుషులతో కలిసి ఉన్న పరమాత్మను హృదయములో ఉంచుకుని ధ్యానం చేస్తూ ఉంటే లోకాలన్నీ వణికిపోయాయి.

యదైకపాదేన స పార్థివార్భకస్తస్థౌ తదఙ్గుష్ఠనిపీడితా మహీ
ననామ తత్రార్ధమిభేన్ద్రధిష్ఠితా తరీవ సవ్యేతరతః పదే పదే

దృవుడు మొత్తం శరీరాన్ని కుడికాలి బొటన వేలిపై పెట్టి భూమిపై నిలబడ్డాడు. ఏనుగు నిలబడిన పడవలాగ ఒక భాగం భూమి వంగిపోయింది. ధృవుని ఒంటి కాలి బొటని వేలుపడితే భూమి కూడా ఆ భాగం అలా వంగిపోయింది

తస్మిన్నభిధ్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుధ్యాసుమనన్యయా ధియా
లోకా నిరుచ్ఛ్వాసనిపీడితా భృశం సలోకపాలాః శరణం యయుర్హరిమ్

అనన్యభావముతో ధ్యానం చేస్తున్నాడు. లోకములో అందరికీ ప్రాణ వాయువు ఆగిపోయింది. ప్రాణవాయువైన పరమాత్మను తనలో కట్టివేసాడు, తన ప్రాణ వాయువును ఆపాడు.దీనితో లోకాలలో ఎవరికీ ప్రాణ వాయువు అందలేదు

దేవా ఊచుః
నైవం విదామో భగవన్ప్రాణరోధం చరాచరస్యాఖిలసత్త్వధామ్నః
విధేహి తన్నో వృజినాద్విమోక్షం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యమ్

ఎందరో భక్తులను చూచాము గానీ ఇలాంటి ప్రాణ నిరోధం ఇంతవరకూ తెలియము. సకల చరాచర ప్రాణులందరికీ ఓజస్సు బలమూ సహః నీవు. మాకు కలిగిన ఈ ఆపద నుండి రక్షించు

శ్రీభగవానువాచ
మా భైష్ట బాలం తపసో దురత్యయాన్నివర్తయిష్యే ప్రతియాత స్వధామ
యతో హి వః ప్రాణనిరోధ ఆసీదౌత్తానపాదిర్మయి సఙ్గతాత్మా

ఏమి భయపడకండి. ఇదివరకు ఎవరూ చేయని ఘోరతపస్సు చేస్తున్న పిల్లవాడి తపసును నేను ఆపుతాను. మీరు మీఇళ్ళకు వెళ్ళండి. ధృవుడు తన ప్రాణాన్ని నాలో నిలిపాడు. అతను నాయందు మనసు లగ్నం చేసి ఉన్నాడు.

Popular Posts